సాక్షి, నల్లగొండ: శాసనమండలి నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు కోసం షెడ్యూల్ ప్రకటించడంతో అన్ని పార్టీలు కార్యాచరణ మొదలు పెట్టాయి. అధికార టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో మాట్లాడారని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికిప్పుడు తమ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం తెలుస్తోంది. మరోవైపు సీపీఐ, ఇతర పార్టీలు ఈ నెలాఖరుకల్లా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని చెబుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), యువ తెలంగాణ పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి.
పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీపీఎం వర్గాలు అంటున్నాయి. ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా..? ఎవరికైనా మద్దతు ఇస్తుందా అన్న విషయం ఇంకా తేలలేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు దాదాపు డజన్ మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆ పార్టీ కూడా పోటీలో ఉంటుందా ..? లేదా ..? అన్న విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేశారు. 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్ 1వ తేదీనుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
కార్యక్రమాలు మొదలుపెట్టిన పార్టీలు
శాసనమండలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారంతా తమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. పార్టీలు సోషల్ మీడి యా వేదికగా ఓటు నమోదుపై ప్రచారం చేయడం.. పనిలో పనిగా తమ అభ్యర్థులకూ ప్రచారం కల్పించడమనే ద్విము ఖ వ్యూహంతో కదులుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు ఎత్తులు వేస్తోంది. చివరి నిమిషం దాకా తమ అభ్యర్థి ఎవరనే విషయాన్ని గోప్యంగానే ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా.. ఈ సారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే తమ అభ్యర్థిగా బరిలోకి దింపే వీలుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి, యువ తెలంగాణ పార్టీ లు ఇప్పటికే ఎన్నికల ముందస్తు కార్యాచరణలోకి దిగాయి.
జిల్లాకే చెందిన ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తాను పోటీ చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 30 వ తేదీన యువ తెలంగాణ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుందని చెబుతున్నారు. ఈ పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జర్నలిస్టు రాణి రుద్రమను పోటీకి పెట్టనున్నారని సమాచారం. ఇంకో వైపు సీపీఐ కూడా ఈ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించుకుని క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. సీపీఐ కూడా ఈనెల 30వ తేదీన తమ అభ్యర్థి పేరును ప్రకటించనుందని అంటున్నారు.
జర్నలిస్ట్ విజయ సారథిని తమ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే వీలుందని పార్టీ వర్గాల సమాచారం. ఆ పార్టీ శనివారం కూడా కొత్తగూడంలో సన్నాహక సమావేశం నిర్వహించింది. సీపీఎం హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గం తమ అభ్యర్థిని పోటీకి పెట్టే అవకాశం ఉండడంతో ఈ నియోజవర్గంలో పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక్కడ ఎవరికి అవకాశం ఇస్తారన్న విషయం తేలలేదు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి ఆయా పార్టీల మద్దతు కూడగడుతున్నారని అంటున్నారు.
అంతా నమోదు చేసుకోవాల్సిందే !
వచ్చే ఏడాది మార్చిలో నల్లగొండ –ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల శాసనమండలి స్థానం ఖాళీ కానుంది. ఈ నియోజకవర్గానికి 2015లో ఎన్నిక జరగగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో మార్చి నెలాఖరుకు ముగియనుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ముందస్తు కార్యాచరణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు పట్టభద్రుల ఓట్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది.
వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ ఈ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరిలోనే ఎన్నిక జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో కీలకమైన ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై ఎవరికి వారు దృష్టి పెట్టారు. 2015 నాటి ఓటర్ల జాబితా ఇప్పుడు చెల్లుబాటులో ఉండదని ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రులంతా కొత్తగా తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ అంశానికి ఎక్కువ ప్రచారం కల్పించేందుకు, తద్వారా ఎక్కువ మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యేందుకు ఆయా పార్టీలతో పాటు స్వతంత్రంగా బరిలోకి దిగాలనుకుంటున్న వారూ రంగంలోకి దిగనున్నారు. ఈ నియోజకవర్గంలో 2015లో 2.81 లక్షల ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు ఈ జాబితా రద్దు కావడంతో వీరితోపాటు కొత్తవారూ తమ ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment