సాక్షి, హన్మకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. బరిలో 22 మంది అభ్యర్థులు నిలవగా, జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 1,04,364 ఉన్నారుు. వీరిలో పురుషులు 76,873, మహిళా ఓటర్లు 27,487 కాగా ఇతర కేటగిరీలో నలుగురు ఓటర్లు ఉన్నారు. వీరు 144 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇందులో జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1000 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మరో 45 చోట్ల అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేందుకు వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల అనువైన పరిస్థితి లేదు.
ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల నిర్వాహణలో పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి 1000 మంది వరకు ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగనున్న దృష్ట్యా శనివారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, జనగామ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సూక్ష్మ పరిశీలకులుగా, పోలింగ్ పార్టీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు అవసరాన్ని బట్టి పోలింగ్ సరళి, ఇతర సమాచారాలను నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు సమాచారం ఇస్తారు.
జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్నింటిలో 1000 లోపు ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలో కూడా ఆలస్యం కాకుండా 800లోపు ఓట్లు ఉన్నట్లయితే రెండు ఓటింగ్ కంపార్టుమెంట్లు, ఆపైన ఓటర్లు ఉన్నట్లయితే మూడు ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బ్యాక్స్‌లు కూడా ఒక్కో బూత్‌లో రెండుకన్నా తక్కువ కాకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రాంతాన్ని 27 రూట్లు, 27 జోన్లుగా విభజించారు. వాటికి ప్రత్యేక ఇన్‌చార్జీలను నియమించారు. పోలింగ్ పూర్తరుున వెంటనే బ్యాలెట్ బాక్సులను డివిజన్ ప్రధాన కేంద్రాలు చేరుస్తారు. అన్ని బాక్సులు వచ్చినతర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్గొండకు తరలిస్తారు.
స్థానికులనే ఏజెంట్లుగా నియమించుకోవాలి..
నియోజకర్గ పరిధిలోని వ్యక్తినే పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలి. ఏజెంటుగా నియమితులైన వారు ఉదయం 7:00 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు
వరంగల్ క్రైం : ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అర్బన్ పరిధిలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 35 మంది ఎస్సైలు, 400 కానిస్టేబుళ్లతో పాటు ఒక కంపెనీ సీఐఎస్‌ఎఫ్ బలగా లు పో లింగ్ నిర్వహణలో సేవలందించనున్నాయి. కాగా, రూరల్ పరిధిలో 20 మంది సీఐలు, 56 మంది ఎస్సై లు, 83 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 కానిస్టేబుళ్లు, 67 మహిళా కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది కానిస్టేబుళ్లు, 34 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక కంపెనీ సీఐఎస్‌ఎఫ్ బలగాలను బందోబస్తు కోసం నియమించారు.