Vote right
-
గుజరాత్ ఎన్నికలు: తల్లి ఆశీస్సులు అందుకున్న మోదీ
అహ్మదాబాద్: గుజరాత్ రెండో(తుది) విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన అహ్మదాబాద్‌కు వెళ్లారు. అయితే నేరుగా గాంధీనగర్ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సుమారు 45 నిమిషాలు అక్కడే గడిపారు. ఆపై గాంధీనగర్‌లోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అహ్మదాబాద్ రనిప్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారన్‌పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలోని కేంద్రంలో ఓటేయనున్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా 63.31శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON — ANI (@ANI) December 4, 2022 -
న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు
వెల్లింగ్టన్: ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. దేశ సుప్రీంకోర్టు కూడా 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో సోమవారం ఆమె ఈ ప్రకటన చేశారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్‌లోని 75% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో ‘16 ఏళ్లకే ఓటు’ ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. కాగా, 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ ఉన్నాయి. -
జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది కాలంగా జమ్ము రీజియన్ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట. అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. గులాం నబీ ఆజాద్.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటర్ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్ లోకల్స్‌ను సైతం ఓటర్ లిస్ట్‌లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంచనా వేస్తున్నారు. -
మూడో బిడ్డ పుడితే పథకాలు వద్దు
హరిద్వార్: జనాభాను తగ్గించే చర్యల్లో భాగంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టే మూడవ, లేదా ఆ తర్వాతి సంతానానికి, ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ సేవలు, పథకాలు, ఓటు హక్కును నిలిపివేయడం వంటివి చేయాలని యోగాగురు బాబా రాందేవ్ ఆదివారం అన్నారు. మతాలకు అతీతంగా, దేశంలోని ప్రజలందరికీ ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు. హరిద్వార్‌లో రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటన సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా లేదు. 150 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభాను దేశం భరించలేదు. ఎవరైనా మూడో బిడ్డను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే, ఆ జంటకు అలాగే మూడో లేదా ఆ తర్వాతి సంతానానికి ప్రభుత్వ సేవలను నిలిపివేయాలి. వివిధ పథకాలకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదు. ఓటు హక్కును ఇవ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలి’ అని అన్నారు. -
అమ్మను కోల్పోయినా బాధ్యత మరచిపోలేదు
మధ్య ప్రదేశ్‌లోని సత్నా... ఐదో దశలో అక్కడ పోలింగు జరిగింది. అందరిలాగే సత్నా మాజీ కార్పొరేటర్ అశోక్ గుప్తా కుటుంబీకులు కూడా ఓటు వేసేందుకు పోలింగు కేంద్రానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు.అయితే, అంతలోనే అనుకోని విషాదం... కార్పొరేటర్ తల్లి అకస్మాత్తుగా కన్ను మూసింది. కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు.ఒకవైపు తల్లి అంత్యక్రియలు నిర్వహించాలి. మరోవైపు ఓటు వేసి రావాలి. అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చాక ఓటు వేయడానికి సమయం ఉంటుందో...ఉండదో... అశోక్ గుప్తా కుటుంబ సభ్యులంతా దీనిపై చాలా సేపు మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ముందు ఓటు వేసి వచ్చి ఆ తర్వాత అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఒకవైపు ఆ ఏర్పాట్లు చూస్తోంటే ఓటు అర్హత కలిగిన 19 మంది పొద్దున్నే వెళ్లి ఓటు వేసి వచ్చారు. మృతురాలి భర్త కూడా కొడుకు సాయంతో పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వచ్చారు.‘ఎన్నికలు ఐదేళ్లకొకసారి వస్తాయి. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత కాబట్టి ముందు ఓటు వేసి రావాలని నిర్ణయించుకున్నాం’అన్నారు మృతురాలి మనవడు కైలాష్ గుప్తా. ఓటు వేసి వచ్చాక అందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
పట్టించిన సిరా గుర్తు
కర్ణాటక, బనశంకరి : లోకసభ ఎన్నికల నేపథ్యంలో మొదట విడత పోలింగ్ జరిగిన వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం రెండో విడత పోలింగ్‌లో బెంగళూరు నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి యత్నించి కొందరు పట్టుబడ్డారు. యలహంక, యశవంతపుర, రాజరాజేశ్వరినగర తదితర ప్రాంతాల్లో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఉద్యోగాల నిమిత్తం బెంగళూరు నగరంలో స్ధిరపడిన చాలామంది ఓటర్లు ఈనెల 11 తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మొదటవిడత ఎన్నికల్లో తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుని బెంగళూరు నగరానికి చేరుకున్నారు. గురువారం బెంగళూరు నగరంలో జరుగుతున్న రెండో విడత పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పటికే వారి చేతి వేలికి వేసిన సిరా గుర్తును గమనించిన ఎన్నికల అధికారులు రెండో ఓటుహక్కు వినియోగించుకోవడానికి నిరాకరించారు. యలహంకలో ఇలాంటి కేసులు చోటుచేసుకోగా సుమారు 13 మంది ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించగా వారి ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా 11 మంది పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తాము చేనేత కార్మికులుగా పనిచేస్తున్నామని 11న జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నామని తెలిపారు. బెంగళూరు ఓటరు జాబితాలో తమ పేరు ఉండటంతో దీంతో ఇక్కడ కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యలో ఇలాంటి గందరగోళ సంఘటనలు తలెత్తాయి. మొదటి దశ పోలింగ్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లు మరోసారి నగరంలో ఓటుహక్కు వినియోగించడానికి యత్నించి పట్టుబడిపోయారు. ఆంధ్రప్రదేశ్. అరుణాచల్‌ప్రదేశ్. అస్సాం, బీహర్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, ఒడిస్సా, సిక్కిం, తెలంగాణా, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లోని చాలామంది ఉద్యోగాల నిమిత్తం కర్ణాటకలో స్ధిరపడ్డారు. అక్కడ తమ ఓటుహక్కు వినియోగించుకుని ఇక్కడ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల అధికారులు ముందుజాగ్రత్తగా అధికారులకు సూచించారు. దీంతో రెండోసారి ఓటుహక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకున్నారు. -
తాళికట్టు శుభవేళ.. వేలికి సిరా గుర్తు
సాక్షి, బెంగళూరు: ఎన్నికల రోజున పలు చోట్ల పెళ్లిళ్లు జరిగాయి. ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని కొత్త దంపతులు కొందరు పెళ్లికి ముందే ఓటేస్తే, మరికొందరు తాళి కట్టి బయల్దేరారు. ⇔ దక్షిణ కన్నడ జిల్లాలోని విట్లాలో ఉదయాన్నే వధువు శ్రుతి పెళ్లి మంటపానికి వెళ్లకముందు పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి ఓటేశారు. ⇔ అదే జిల్లా పుత్తూరులో వధువు హేమలత, బెళ్తంగడి తాలూకాలో తణ్ణీరుపంథలో పెళ్లికూతుళ్లు అశ్విని, అక్షత ఓటు వేశారు. ⇔ బంట్వాళలో నవజంట సుమిత్ పూజారి, ప్రతిజ్ఞ మొదట ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఆ తర్వాత పోళలి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. -
పోస్టల్ బ్యా‘లేట్’!
ఒక్కఓటు చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలు తారుమారు కావడానికి. అందుకే ప్రతి ఓటు విలువైనదంటారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని, అందరూ రాజాంగం కల్పించిన హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ తపన పడుతుంటుంది. నూరు శాతం పోలింగ్ కోసం వందలాది కోట్లు ఖర్చు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తోంది. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సాధారణ ప్రజల మాట పక్కనపెడితే.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందే ఓటు హక్కు వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఉదాసీన వైఖరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికలకు సంబంధించి చాలామంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పోస్టల్ బ్యా లెట్లు అందకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలిసింది. అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు లేదనే విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో 4058 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సెక్టోరల్ ఆఫీసర్లు 399, రూట్ ఆఫీసర్లు 399, పోలింగ్ ఆఫీసర్లు 4553, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 4553, అదనపు పోలింగ్ ఆఫీసర్లు 13,663, మైక్రో అబ్జర్వర్లు 2130 మంది చొప్పున 25,697 మంది సిబ్బంది పాల్గొన్నారు. మరో 12వేల మంది వరకు వివిధ స్థాయిల్లో పోలీస్ సి బ్బంది పాల్గొన్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు ఎంత తక్కువ లెక్కేసుకున్నా మరో వెయ్యి మంది వరకు పని చేశారు. ఇలా పోలింగ్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ వేసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిది. ఎన్నికల్లో ప్రతిసారి శిక్షణ సమయంలోనే వీరికి ఓటు హక్కు వినియోగించుకునే వెలుసుబాటు కల్పిస్తారు. కానీ ఈసారి ఆ అవకాశం కల్పించలేదు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఆ మేరకు కనీస ప్రచారం కూడా కల్పించలేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చాలా తక్కువనే చెప్పాలి. ఓటు వేసినవారు కేవలం 4,189 మందే.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 25,697 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 7వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. దీంతో 14,250 మంది మాత్రమే ఫారం–12 కోసం దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటి వరకు వీరిలో కేవలం 2,300 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. వీరిలో 1693 మంది పోలింగ్ ముందురోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిలో సిటీ పరిధిలో 1700 మంది పోలీసులకు కేవలం 1100 మంది మాత్రమే 2వ తేదీన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా 190 ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు కూడా వచ్చాయి. విశాఖ రీజియన్ పరిధిలో 690 మందిసిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటే 550 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 140 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వేయలేకపోయారు. ఇక ఆర్మడ్ రిజర్వుడు సిబ్బంది 398 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారిలో 239 మంది ఓటు హక్కు వేశారు. రెండు ఓట్లు వేసిన వారు తక్కువే కాగా ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారిలో కనీసం సగం మంది కూడా రెండు ఓట్లు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిలో సగానికి పైగా అసెంబ్లీ బ్యాలెట్ అందితే.. పార్లమెంటుబ్యాలెట్ అందలేదు. పార్లమెంట్ బ్యాలెట్ అందితే అసెంబ్లీ బ్యాలెట్ అందని అయోమయ పరిస్థితి నెలకొంది. కనీసం దరఖాస్తు చేసుకున్న వారికైనా పూర్తిస్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు అందాయా అంటే అదీ కన్పించడం లేదు. ఇప్పటికీ వందలాది మంది టీచర్లు, వివిధ స్థాయిల్లో పనిచేసిన పోలింగ్ సిబ్బంది తమకు పోస్టల్‌బ్యాలెట్ ఇంకా రాలేదు? ఎప్పుడు వస్తుందంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారు కూడా తమకు అసెంబ్లీ బ్యాలెట్ రాలేదని కొందరు..పార్లమెంట్ బ్యాలెట్ రాలేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. జాప్యం వెనుక పెద్దల ఒతిళ్లే కారణమా? ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశం కల్పించడంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు కూడా బలంగా పని చేస్తున్నాయని విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్టీసీ కార్మికులు ఇలా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల విసిగి వేసారిపోయారు. దీంతో వీరంతా మార్పు కోరుకుంటున్నట్టుగా స్పష్టం కావడంతో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇస్తే పడే ప్రతి ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడుతుందన్న భావనతో కావాలనే పోస్టల్ బ్యాలెట్ అందకుండా జాప్యం చేస్తున్నారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలిసి ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ అందే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ భాస్కర్ హామీ ఇచ్చారు. ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ జిల్లాలో 14 వేలకు పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే కేవలం 2వేల మందికే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వకపోవడానికి గల కారణమేంటని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఆర్టీసీ, అంగన్వాడీ, ఆశవర్కర్లకు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు వేసుకోవడాని తక్షణమే పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఆశవర్కర్లతో పాటు అంగన్వాడీ ఉద్యోగులను దూరంగా ఎన్నికల విధులకు పంపించారని, వారు పోస్టల్ బ్యాలెట్లు అడిగితే మీకు ఓట్లు లేవని అంటున్నారని కలెక్టర్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో లేని నియమాలు విశాఖ జిల్లాకే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఓటు వేసుకునే హక్కు రాజ్యంగబద్దంగా అందరికీ ఉందని, దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు రాలేదని, ఈ ఎన్నికల్లోనే ఎందుకు ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే పోస్టల్బ్యాలెట్లు ఇవ్వడం లేదని ఉద్యోగుల ఆరోపిస్తున్నారన్నారు. ఒక పౌరుడిగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఎందుకు కాలరాస్తున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి భీశెట్టి సత్యవతి, సీనియర్‌నేత కుంభా రవిబాబు, అనకాపల్లి ఎన్నికల పరిశీలకుడు దాడి రత్నాకర్, అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, సీనియర్‌నేత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు కోల్పోయారు
జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో అనేక కేడర్లలో పనిచేస్తున్న 18వేల మందిని ఓపీవీలుగా నియమించారు. వారిలో 4,800 మంది వరకు అంగన్ వాడీ వర్కర్లు, స్వీపర్లు, ఆశావర్కర్లు ఉన్నారు. ఎన్నికల విధులకు వినియోగించే ఉద్యోగులకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ను అందజేయాల్సి ఉంటుంది. అయితే 4,800 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుండా ఓటు వేసే వారి ప్రాథమిక హక్కును కాలరాశారు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది. ఓటు విలువను తెలియజేసే జిల్లా యంత్రాం గమే ఇలా చేయడంపై పలువురు ఈ ఘటనను ఈసీ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. చిత్తూరు కలెక్టరేట్ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. ఎన్నికలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించాల్సిన జిల్లా యంత్రాంగం 4,800 మంది ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పి వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరం చేసింది. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ హక్కును కల్పి స్తారు. ఆ హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లాలోని ప్రతి ఊరిలో ప్రచారం కల్పిం చిన జిల్లా యంత్రాంగమే తప్పు చేయడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించడానికి 1+5 చొప్పున పీఓ, ఏపీఓ, ఓపీఓలను నియమించారు. జిల్లావ్యాప్తంగా 3,800 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి 27,189 మందిని నియమించారు. పోలింగ్ బాధ్యతలు అప్పజెప్పే వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ అందజేయాల్సి ఉంది. పోలింగ్ ప్రక్రియ కసరత్తులో నిర్లక్ష్యం వహించడం వల్ల ఓపీఓల నియామకాల్లో తప్పిదాలు చేశారు. ఓపీఓ కేడర్‌లో విధులు నిర్వహించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్ వారిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో అలా చేయకుండా అంగన్వాడీ వర్కర్లను, స్వీపర్లను, ఆశా వర్కర్లకు విధులు అప్పగించారు. పోతేపోనీ అనుకుంటే వారి ఓటు హక్కుకు భంగం కలిగించడం ఎంతవరకు న్యాయమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక కుట్రేనా? అంగన్వాడీ వర్కర్లను, స్వీపర్లను, ఆశావర్కర్లను విధులకు కేటాయించి వారి ఓటు హక్కును కాలరాయడం అధికారికంలో ఉన్న పాలకులు చేయించిన కుట్రే అని అనుమానాలు వస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అధికారంలో ఉన్న పాలకులకు ఓట్లు వేయరని, వారి ఓట్లు మరొకరికి పడకూడదనే కుట్రతో ఇలాంటి పనులను అధికారులతో చేయించారని తెలుస్తోంది. అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న అధికారులు కొందరు ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శలు వస్తున్నాయి. బాధ్యులు ఎవరు? తాము ఓటు హక్కు కోల్పోవడంపై ఎవరు బాధ్యత వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఓపీఓ విధులపై కనీస అవగాహన లేని వారిని విధులకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని వామపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో ఓపీఓలుగా 18వేల మందిని నియమించిన వారిలో 30 శాతం మందిని పోలింగ్ రోజున రిజర్వులో ఉంచారు. శిక్షణ తీసుకున్న ఓపీఓ కేడర్ ఉద్యోగులను రిజర్వ్‌లో పెట్టి, శిక్షణ పొందని అంగనవాడీ, ఆశా వర్కర్లను, హెల్పర్లకు పోలింగ్‌లో ఓపీఓలుగా విధులను అప్పజెప్పారు. విధుల కేటాయింపులో అధికార పార్టీ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం చేసిన తప్పు వల్ల ఓటు హక్కు కోల్పోయేలా చేసినందుకు బాధ్యత ఎవరు వహిస్తారని రాజకీయపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది. ముమ్మాటికీ అధికారిక కుట్రే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగం ప్రచారం చేసింది. ప్రతి ఒక్కరూ వారి ప్రాథమిక హక్కు అయిన ఓటును కచ్చితంగా వినియోగించుకోవాలి. జిల్లాలో ఓపీఓలుగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వీపర్లను విధులకు కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమే. ఓటు హక్కు కోల్పోయిన వారికి కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. – నాగరాజన్, సీపీఐ, జిల్లా కార్యదర్శి -
79.64 శాతం ఓటింగ్
సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 78.41 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా.. గురువారం నాటి ఎన్నికల్లో 79.64 శాతం మేరకు ఓట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకుగాను 2.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశంజిల్లాలో 85.98 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి 89.82 శాతంతో అత్యధిక ఓటింగ్ జరిగిన నియోజకవర్గంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట 89.64 శాతం, ప్రకాశం జిల్లా దర్శి 89.62 శాతం ఓట్ల పోలింగ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
తెలంగాణ టు ఆంధ్ర..!
దంతాలపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినయోగించుకోవడానికి తెలంగాణలో ఉపాధికి వచ్చిన ఆంధ్ర ఓటర్లు బుధవారం తరలివెళ్లారు. నర్సింహులపేట మండల కేంద్రానికి సుమారు పది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వచ్చిన ఒంగోలువాసులు మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తుండగా సాక్షి వారిని పలకరించగా తమది ఒంగోలు జిల్లా కనిగిరి అని ఎన్నికల్లో ఓటు వేయడం బాధ్యతగా భావించి వెళ్తున్నామని తెలిపారు. -
ఓటుపై వేటు!
సాక్షి, దర్శి (ప్రకాశం): తమ ఓటు హక్కును పథకం ప్రకారం కోల్పోయేలా చేశారని ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు ఆర్వో కృష్ణవేణి ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం తమకు ఎన్నికల డ్యూటీలు వేశారని, బ్యాలెట్ల కోసం ముందస్తు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుంటే డ్యూటీలకు రామన్న అనుమానంతో దర్శిలో పోస్టల్ బాలెట్లు ఇస్తారని అబద్దాలు చెప్పి డ్యూటీకి పంపారని డ్రైవర్లు మండిపడుతున్నారు. ఇక్కడ ఆర్వోను పోస్టల్ బ్యాలెట్లు అడగగా తనకు సంబంధం లేదని సమాధానం చెప్పారని వాపోయారు. ఎన్నకల విధులకు వెళ్లే తాము ఇప్పడు ఓటు ఎలా వేయాలని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని లక్షలు ఖర్చు చేసి ప్రకటనలు చేస్తున్నా తమ గోడు మాత్రం వినడం లేదని మండిపడ్డారు. ఇలా చేయడం దారుణం ఓటు హక్కు లేకుండా చేయడం మనిషిని చంపడంతో సమానం. గతంలో ఇంత దారుణంగా వ్యవహరించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఓటు హక్కును హరిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం లేదు. - ఎం.మల్లికార్జునరావు ఇది మంచి పద్ధతి కాదు అధికారులు వ్యవహార శైలి బాగాలేదు. మాకు ఓటు హక్కు కల్పించాల్సిందే . లేదంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి కుట్రలు చేసే వారికి ఉద్యోగులందరూ సరైన బుద్ధి చెప్పండి. ఎన్నికల కమిషన్ మామొర ఆలకించాలి. - బి.రమణయ్య, ఆర్టీసీ డ్రైవర్ నిలువునా మోసగించారు ముందు పోస్టల్ బ్యాలెట్ ఇస్తామన్నారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పడు అడిగితే సమాధానం లేదు. ముందే ఇలా చేస్తారని చెప్తే డ్యూటీలకు వచ్చే వాళ్లం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఓటు హక్కు హరించేలా ఎన్నికల అధికారులు కుట్రలు చేస్తే ఎన్నికలు పెట్టడం ఎందుకు. - కేవీ రెడ్డి, ప్రైవేటు స్కూల్ బస్ డ్రైవర్ -
ఓటేస్తే చికెన్‌పై రూ.50 రాయితీ
టీ.నగర్: పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తికి చికెన్ ధరలో రూ.50 రాయితీ అందజేస్తూ చెన్నై ఐనావరంలోని ఒక దుకాణ యజమాని ప్రకటించాడు. ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌కు ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. అలాగే పలువురు 100 శాతం పోలింగ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా ఉండగా చెన్నై ఐనావరం మార్కెట్ సమీపంలోని చికెన్ సెంటర్ యజమాని మురళీబాబు వంద శాతం పోలింగ్‌పై అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. పోలింగ్ జరిగే 18వ తేదీన ఓటేసి వచ్చిన ఓటరుకు కోడిమాంసంలో ప్రత్యేక రాయితీ ప్రకటించాడు. ఓటేసినట్లు సిరాతో ఉన్న గుర్తును చూపితే కోడి మాంసం కిలో ధరలో రూ.50 తగ్గింపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈయన నిర్ణయానికి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. -
గర్వంగా సిరా చుక్క చూపాలి
సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి గర్వంగా సిరా మార్క్‌ను చూపాలని మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అధికారి, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. ఓట వేయడం బాధ్యతగా భావించాలన్నారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లరలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వెయ్యి వాహనాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిబ్బంది బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారని చెప్పారు. నియోజకవర్గంలో గుర్తించిన 258 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీటికి మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. నియోజకవర్గంలోని 2,960 పోలింగ్ కేంద్రాలను 259 సెక్టార్లుగా విభజించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 20వేల మంది సిబ్బంది సహా పోలీసులు పాల్గొంటున్నారన్నా రు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థికి 9వాహనాలు.. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థి లేదా సంబంధిత ఏజెంట్లు 9 వాహనాలు మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఒక్కొ వాహనంలో డ్రైవర్ సహా నలుగురు మాత్రమే వెళ్లాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6గంటల లోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలోనే గంటసేపు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రిసైడింగ్ అధికారికి మినహా మరెవరికీ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్దేశించిన డీఆర్సీ సెంటర్లకు ఈవీఎంలు తరలిస్తామన్నారు. అక్కడి నుంచి అదే రాత్రి కీసరలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తామన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లను అభ్యర్థులు సహా వారి ఏజెంట్లు ఎప్పుడైనా పరిశీలించడానికి అవకాశం ఇస్తామన్నారు. ఎవరైనా అభ్యర్థి స్ట్రాంగ్‌రూమ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుకర్‌రెడ్డి, నోడల్ అధికారులు కౌటిల్య, సౌమ్య, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఓటున్నా.. వృథా అయింది..!
సాక్షి, ఒంగోలు, చీరాల అర్బన్: అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల యంత్రాంగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అయితే ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేకపోవడానికి గల కారణాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఆర్టీసీ డ్రైవర్లు 600 మంది జిల్లా వ్యాప్తంగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనడం దారుణం. జరిగింది ఇదీ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 600 బస్సులు కావాలని జిల్లా ఎన్నికల అధికారి వాడరేవు వినయ్‌చంద్ ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. ఇందుకు ఆర్ఎం జి.విజయగీత గత నెల 25వ తేదీనే పోస్టల్ బ్యాలెట్లకు అర్హత ఉన్నవారు తమ ఫారం–12, ఐడీ కార్డు ప్రతులను అధికారులకు అందజేయాలని, గజిటెడ్ అధికారి వాటిని ధ్రువీకరించి రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీలో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఎన్నికల కమిషన్ అంగీకారం తెలిపింది. దీంతో ప్రతి ఏటా తాము ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామన్న ఆవేదన స్థానంలో అంతులేని ఆనందం నెలకొంది. అయితే 10,11 తేదీల్లో ఎన్నికల డ్యూటీకి కేటాయిస్తున్న బస్సులకు డ్రైవర్లుగా ఎవరెవరిని పంపాలనే అంశంలో డిపో మేనేజర్లు సరైన నిర్ణయం తీసుకోవడంలో వైఫల్యం చెందారు. దీంతో వారు ఈనెల 7వ తేదీ వరకు సిబ్బందికి డ్యూటీలు కేటాయిస్తూ వచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నంలోగా ఫారం 12, గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. దీంతో విధులకు నియమితులైన డ్రైవర్లు తమతమ పత్రాలను అధికారులకు అందించారు. ఏం ప్రయోజనం.. ఇలా అన్ని డిపోల్లో వచ్చిన ఫారం 12ను తీసుకొని రిటర్నింగ్ అధికారులకు అందజేసి పోస్టల్ బ్యాలెట్లను సిబ్బందికి ఇప్పించే ప్రక్రియను మంగళవారం ఆర్టీసీ అధికారులు చేపట్టారు. అందులో భాగంగా వారు రిటర్నింగ్ ఆఫీసర్ల వద్దకు వెళ్లగా పోస్టల్ బ్యాలెట్లకు ఈనెల 4వ తేదీతోనే గడువు ముగిసిందని, అందువల్ల ఇప్పుడు ఫారాలు తీసుకోవడం సాధ్యం కాదంటూ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆర్టీసీ అధికారులు ఏం చేయాలో తెలియక చివరకు చావు కబురు చల్లగా సిబ్బందికి చెప్పారు. గడువు ముగిసిందని అందువల్ల పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కావని స్పష్టం చేశారు. దీంతో తొలిసారిగా ఓటు వినియోగించుకునేందుకు అవకాశం చేతివరకు వచ్చినా బటన్ నొక్కే అవకాశం మాత్రం లేకుండా చేశారనే వాదన వినిపిస్తోంది. దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తొలుత భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి విరమించారు. పరిశ్రమలు, షాపులు, సంస్థల్లో పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవును తీసుకుంటుండగా తమకు మాత్రం కనీసం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సైతం అవకాశం లేకుండా పోతుందని, కనీసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొంతమందికైనా అవకాశం దక్కుతుందని భావిస్తే అది కూడా నిరాశను మిగిల్చిందంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ దూరం.. ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఎన్నికల రోజున విధుల్లో ఉన్న సిబ్బందంతా ఓటుకు దూరమవుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కును వీరంతా కోల్పోతున్నారు. ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని ముందురోజే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తారు. దీంతో వీరంతా రెండు రోజులు పాటు తమ ఓటు హక్కు ఉన్నా.. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతాలైన విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, షాపూరు బస్సుల్లో ఉన్న సిబ్బంది ఎన్నికల రోజున ఓటు హక్కు వేయలేని పరిస్థితి నెలకొంది. తెలియక పోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారీ ఓటు హక్కును ఆర్టీసీ కార్మికులు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా తమకు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను తొలిసారిగా అందించారు. అయితే డ్యూటీ చార్టులు వేయించుకునే కార్మికులు ఎవరనేది తేలియకపోవడంతో సిబ్బంది వినియోగించుకోలేదు. దీంతో ఈసారి కూడా ఓటుకు దూరమయ్యాం. బి.రవి, ఈయూ రీజియన్ కార్యదర్శి అవగాహన లోపంతోనే వినియోగించుకోలేదు ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులకు పోస్టల్ బ్యాలెట్‌ను గత నెల 28న అందించాం. రీజియన్‌లోని డిపోలకు సర్క్యులర్ పంపాం. అయితే పోలింగ్ రోజున డ్యూటీలు ఎవరికి కేటాయిస్తారో తెలియక పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోలేదు. కార్మికులు అవగాహన లేకపోవడంతో పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోలేదు. - విజయగీత, ఆర్టీసీ ఆర్ఎం -
ఓట్లకు రావాలంటే.. నోట్లు వదలాల్సిందే!
సాక్షి, చీరాల అర్బన్ (ప్రకాశం): ఓట్ల పండగ దగ్గరలోనే ఉంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూరు ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయాణం కడుతున్నారు. అయితే ఊరికి వచ్చేందుకు హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఖాళీ లేవు. ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్దామంటే ధర రెండింతలు పెంచేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని ఉన్నా రవాణా సౌకర్యం లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ, ఉన్నత చదువులు, వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు సొంత ఊరు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ, రైళ్లలో సీట్లు ఫుల్ కావడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ఉండటంతో 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇదే సరైన సమయంగా చూసుకుని ప్రైవేటు ఆపరేటర్లు 10, 14న టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఒక్క చీరాలకే 10 వేల మంది రాక సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు చీరాలకు చెందిన సుమారు 10 వేల మంది ఓటర్లు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. చీరాల, వేటపాలెం మండలాలకు చెందిన ఎక్కువ మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, విద్య, వ్యాపారం రీత్యా స్థిరపడిన వారు ఉన్నారు. ఓటు మాత్రం నియోజకవర్గంలో ఉండటంతో ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి చీరాలకు రోజు వారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు సర్వీసులు నడుపుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. 14వ తేదీన తిరుగు ప్రయాణంలోనూ ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం రోజువారీ సర్వీసులతో పాటు మరో ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ కె.గంగాధరరావు తెలిపారు. ప్రయాణికులపై ప్రై‘వేటు’ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లుకు తిరుగు ప్రయాణం చుక్కలు చూపించనుంది. 10వ తేదీన వచ్చిన వారు 14వ తేదీకి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వేషన్లు చేయించుకునేందుకు వెళ్తే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఎన్నికల సమయాన్ని అదనుగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. మామూలు రోజుల్లో చీరాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ టిక్కెట్ రూ.560 వరకు ఉంటే ఎన్నికల సందర్భంగా ఆ టిక్కెట్‌ను అమాంతంగా రూ.1500లకు పెంచేశారు. మరికొన్ని ట్రావెల్స్ అయితే టిక్కెట్ రూ.2 వేల వరకు పెంచేశాయి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులకు టిక్కెట్లు ధరలు పెంచేసింది. వలస ఓటర్ల్లపై ప్రత్యేక దృష్టి చీరాల నియోజకవర్గంలో స్థానికులై ఉండి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టిసారించాయి. స్థానిక ఓటర్లకన్నా ఎన్నికల్లో వలస ఓటరుదారులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఎక్కువగా ప్రభావితం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రసన్నం చేసుకుంటున్నాయి. మరికొందరైతే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ నాయకులు ఓటర్లుకు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఉంటే వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం ఎన్నికల నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రోజువారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు బస్సులను 10వ తేదీ, 14న తిప్పేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ప్రయాణికుల రద్దీని గమనించి ఇంకా ఎక్కువ బస్సులు తిప్పుతాం. ఓటర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కె.గంగాధరరావు, మేనేజర్, చీరాల డిపో -
11 రకాల గుర్తింపు కార్డులు
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఓటర్ కార్డు లేనివారు ఎన్నికల సంఘం నిర్ణయించిన 11 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 35,78,458 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపా రు. ఓటర్ కార్డు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటును వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫొటో కూడిన ఓటర్ స్లిప్ గుర్తింపు కార్డు కిందకు రాదని, అది కేవలం పోలింగ్ కేంద్రాల్లో ఓటు నంబర్ తెలుసుకునేందుకే మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో 3,43,619 మం దికి ఓటర్ కార్డులను పంపిణీ చేశామన్నారు. మరో 80 వేల ఓటరు కార్డులు సోమవారం నాటికి జిల్లాకు రానున్నాయన్నారు. వాటిని మం గళ, బుధవారాల్లో పంపి ణీ చేస్తామని వివరిం చారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాలైన అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. పోలింగ్ సమయం ముగిసేప్పటికి ఎంత మంది లైన్లో ఉంటారో వారందరికీ స్లిప్స్ ఇచ్చి పోలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తామని, తదుపరి వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. గుర్తులతో ఉన్న స్లిప్‌లు పంపిణీచేయరాదు ప్రభుత్వం ఫొటోతో కూడిన ఓటర స్లిప్‌లను బీపీఎల్ ద్వారా పంపిణీ జరుగుతోంది. అయితే పార్టీలు సొంతంగా పంపిణీ చేయాలని భావిస్తే పార్టీ గుర్తులు లేని స్లిప్పులను మాత్రమే అందించాలన్నారు. అలా కాకుండా గుర్తులతో ఉన్న వాటిని ఎక్కడైనా పంపిణీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాల గుర్తింపు:ఎస్పీ బాబూజీ జిల్లా ఎస్పీ బాబూజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2,207 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిలో 256 సమస్యాత్మక, 83 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో 469 పోలింగ్ కేంద్రాల్లో ఎల్.డబ్ల్యూ.ఈ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించినట్టు వివరించారు. ఆంధ్రా, ఒడిశా పోలీసుల సహకారంతో ఈ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రేహౌండ్, సెంట్ర ల్ పారా మిలటరీ, స్టేట్ ప్రత్యేక దళాల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 19 కేంద్రాలకు హెలికాఫ్టర్లలో సిబ్బంది తరలింపు గిరిజన ప్రాంతాలతోపాటు రోడ్డు మార్గంలోని 19 పోలింగ్ కేంద్రాలకు హెలికాఫ్టర్ ద్వారా సిబ్బందిని, పోలింగ్ సామగ్రిన్ని తరలించనున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల్లో తొలిసారిగా డ్రోన్లను వినియోగించి పటిష్టమైన నిఘా పెడుతున్నామన్నారు. శరవేగంగా ఓటర్ కార్డు, స్లిప్స్ పంపిణీ ఎన్నికల మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఓటర్లకు అవసరమైన ఓటర్ కార్డులు, ఓటర్ స్లిప్స్‌ను అధికారులు శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,71,520 నూతన కార్డు జారీ చేయగా.. ఇప్పటి వరకు 3,43,619 కార్డులను పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 35,78,458 ఓటర్ స్లిప్పులను జారీ చేయగా ఇప్పటి వరకు 26,94,821 స్లిప్పులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,286 మంది బ్లైండ్ ఓటర్లకు బ్రైయిలీ స్లిప్స్ జారీ చేయగా ఇప్పటి వరకు 6,563 పంపిణీ చేశారు. కొత్తగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4052 పోలింగ్ కేంద్రాలు ఉండగ వాటికి అదనంగా మరో 6 కేంద్రాలకు ఎన్నికల కమిషన్ అనుమతి జారీ చేసింది. దీనితో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4058 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక పోలింగ్ కేంద్రంలో 1600 ఓటర్లు దాటి ఉన్న 39 పోలింగ్ కేంద్రాలను విభజించాలని ఎన్నికల కమిషన్‌ను కోరగా.. అందులో కేవలం 6 కేంద్రాలకు కమిషన్ అనుమతి జారీ చేసింది. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం నంబరు 54, 157ను, భీమిలి నియోజకవర్గంలో 224, 255, 289, 311 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ గుర్తుంపు కార్డులతో ఓటు వేయవచ్చు ♦ ఆధార్ కార్డు ♦ పాస్‌పోర్ట్ ♦ డ్రైవింగ్ లైసెన్స్ ♦ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు(ఫొటోతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డు) ♦ ఫొటోతో కూడిన బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్ ♦ పాన్ కార్డు ♦ ఎన్ఆర్సీ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డులు ♦ ఉపాధి హామీ జాబ్‌కార్డు ♦ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్ ఇన్యూరెన్స్ స్మార్ట్ కార్డు ♦ ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ ♦ ఎంపీ, ఎమ్మెల్యేలకు జారీ చేయబడిన అఫిషీయల్ ఐడీ కార్డు అదనంగా వీవీప్యాట్లు కావాలి: కలెక్టర్ ఈవీఎంలకు సంబంధించి అదనంగా వీవీ ప్యాట్లు అవసరం ఉందని, వాటిని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్ కోరారు. ఆదివారం సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. ఈ సమావేశంలో నగర్ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, ఎస్పీ బాబూజీ పాల్గొన్నారు. శాంతి, భద్రతలకు పటిష్ట ఏర్పాట్లు పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఎన్నికల నేపథ్యంలో శాంతి, భద్రతలు పటిష్టంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విశాఖ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. సిటీ పరిధిలో 333 కేసులకు సంబంధించి 3,393 మందిని బైండోవర్ చేశామని, ఎంసీసీ అతిక్రమించినందుకు 64 కేసులను బుక్ చేశామన్నారు. 819 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మొత్తం 5 వేల 922 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. -
ఓటు అంటేనే భయం.. భయం..
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్, అధికార యంత్రాంగం, పోలీసు బందోబస్తు, అత్యాధునిక టెక్నాలజీ, మీడియా వంటివన్నీ ఉన్నాగానీ, ఓ చిన్న గ్రామంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భయపడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలతో కొన్నేళ్లుగా ఇష్ట్రపకారం ఓటు వేయలేకపోతున్నారు. బెదిరింపులకు భయపడి ఇష్టంలేని వ్యక్తులకు ఓటేస్తున్నారు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ పంచాయతీలో నెలకొన్న ఈ పరిస్థితి ఎన్నికల కమిషన్, అధికారులు, పోలీసుల పనితీరుకు సవాల్ విసురుతోంది. చిన్నపాటి గ్రామమైన గొట్టిపడియలో 1,541 ఓట్లు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఫ్యాక్షన్ విలేజ్‌గా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఆ గ్రామంలో కొన్నేళ్లుగా వర్గపోరు జరుగుతోంది. ఎన్నికలు వస్తే ఒక వర్గానికి చెందిన ప్రజలు భయం, ఆందోళనకు గురవుతుంటారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వేసుకోలేని పరిస్థితి. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు గత ఎన్నికల్లో కొంతమంది దళితులు, మరికొంతమంది బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఓటు వేసేది తమకు చూపించాలని బెదిరించారు. దీంతో కొంత మంది గ్రామస్తులు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో తామంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల కమిషన్‌తో పాటు మార్కాపురం ఆర్డీఓ, డీఎస్పీకి వినతిపత్రాలు పంపారు. టీడీపీ నేతలు తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, చర్చికి వచ్చి బైబిల్ పట్టుకుని తాము చెప్పినట్లుగా ఓటు వేస్తామని ప్రమాణం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలువురు దళితులు ఆరోపిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని 85, 86 పోలింగ్ బూత్‌లు గొట్టిపడియ పంచాయతీలోకి వస్తాయి. ఈ గ్రామంలో గొట్టిపడియతో పాటు అక్కచెరువు తండా ఉంది. పోలింగ్‌బూత్ 85లో 783, 86లో 755 ఓట్లు ఉన్నాయి. ఇటీవల మరో 25 ఓట్లు అదనంగా చేరాయి. ఆ వివరాలను ఓటర్ల జాబితాలో ప్రచురించాల్సి ఉంది. 20 ఏళ్లుగా స్వేచ్ఛ లేదు... గొట్టిపడియలోని బూత్ నంబర్ 85, 86లో ఓటింగ్ ప్రక్రియ స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన తుమ్మా వెంకటరెడ్డి, గాలెయ్య, సుబ్బారెడ్డి, పుప్పాల దావీదు, నాగూర్, ఏసు, వెంకటేశ్వరరెడ్డి, కాశయ్య, రాజారావుతో పాటు మొత్తం 42 మంది గ్రామస్తులు సంతకాలు చేసి కలెక్టర్, ఈసీకి పంపారు. గత 20 ఏళ్ల నుంచి తామంతా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలను, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీకి చెందిన బూత్ ఏజెంట్లే తమ ఓట్లు వేస్తున్నారన్నారు. అదేంటని ప్రశ్నిస్తే మా ఇష్టమని బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. మిగిలిన వారు కూడా ఎవరికి ఓటు వేసేది పోలింగ్ కేంద్రంలో కూర్చున్న అధికారపార్టీ ఏజెంట్లకు చూపించి వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు కాకుండా వేరే పార్టీ వారికి ఓటు వేసి బయటకు వస్తే తమపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. అప్పట్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదన్నారు. వివాదాస్పద బూత్ ఏజెంట్లను నియమించవద్దని కోరారు. పోలింగ్ కేంద్రానికి ఆనుకుని టీడీపీ కార్యాలయం ఉందని, పోలింగ్ జరిగే రోజు అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు ఉండకుండా 100 మీటర్ల దూరం వరకూ నిలువరించాలని గ్రామస్తులు రాసిన లేఖలో కోరారు. ఓటింగ్ ప్రక్రియను సీసీ కెమేరాలతో రికార్డు చేయాలని, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలి గొట్టిపడియ, అక్కచెరువు తండాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నా.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలన్నా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేదంటే అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా మేము ఓటు వేయాల్సిందే. మాకు అదనంగా రక్షణ కల్పించాలి. – మేఘావత్ రాములు నాయక్, అక్కచెరువుతండా అదనపు పోలీసులను నియమించాలి 85, 86 పోలింగ్ బూత్‌లలో ప్రశాంతంగా ఓటు వేసుకునే పరిస్థితి ఉండాలంటే అదనంగా పోలీసులను నియమించాలి. లేదంటే గత ఎన్నికల్లోలాగే మేము భయంతో ఇష్టంలేని వారికే ఓటు వేయాల్సి వస్తుంది. ఈసారి అటువంటి పరిస్థితి మాకు వద్దు. మా ఇష్టం వచ్చిన వారికి మేము ఓటు వేసుకోవాలి. – ఎం.బాలునాయక్, అక్కచెరువుతండా బెదిరింపులు ఆపాలి ఎన్నికలంటే మా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంటుంది. మా ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోలేని పరిస్థితి మాది. దీనికి వ్యతిరేకంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ నేతల బెదిరింపులు లేకుండా చూడాలి. గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి మాలో ధైర్యం నింపాలి. – కుందురు నడిపి కొండారెడ్డి, గొట్టిపడియ ప్రశాంతంగా ఓటు వేసుకోనివ్వాలి మా గ్రామంలో మమ్మల్ని ప్రశాంతంగా ఓటు వేసుకోనిచ్చే పరిస్థితి కల్పించాలి. గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు ఓటర్లు భయపడుతున్నారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి. – తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ -
ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈనెల 11న జరగనున్న ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో విద్యుత్, ఫర్నీచర్, తాగునీటి వసతి, గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వికలాంగులు ఓటు వేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక ర్యాంప్‌లు నిర్మించారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు ఇదివరకే గ్రామాలు, పట్టణంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. బీఎల్ఓలు, వీఆర్ఓలు, సూపర్వైజర్ల ద్వారా విస్తృతంగా ఓటుహక్కు ప్రాముఖ్యతపై వివరించిన అధికారులు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.26లక్షల మంది ఓటర్లు మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 2,26,399 మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2,12,851 మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుతం 13,548 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,13,248 మంది పురుషులు, 1,13,143 మంది మహిళలు, 8 మంది ఇతరులతో కలిపి మొత్తం 2,26,399 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 263 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు 268పోలింగ్ కేంద్రాలకు పెంచారు. గతంతో పోల్చితే ఈసారి 5కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ అర్బన్‌లో 184, మహబూబ్‌నగర్ రూరల్‌లో 37, హన్వాడ మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వసతులు దివ్యాంగుల ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వారి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ర్యాంపులతో పాటు వీల్చైర్లను సమకూర్చనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు అదే తరహాలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా వికలాంగులను గుర్తించి వారికి అవవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించి ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిఘా అదేవిధంగా, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పారా మిలటరీ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించిన అధికారులు ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వికలాంగుల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌ల ఏర్పాటుతో పాటు వీల్చైర్లను సమకూర్చుతున్నాం. పోలింగ్ సిబ్బందికి కూడా అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అధికారులకు సహకరించాలి. – వెంకటేశం, తహసీల్దార్, మహబూబ్‌నగర్ అర్బన్ -
మేము ఓటేసేదెలా..?
సాక్షి, దర్శి టౌన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ విధుల్లో అధికారులు, సిబ్బందిని నియమించే విషయంలో హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా వైద్యారోగ్య సిబ్బందిని, డాక్టర్లను పోలింగ్ విధులకు కేటాయించినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. జిల్లాలో 14 సీహెచ్‌సీలు, 90 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న దాదాపు 2,973 మంది ఆశా కార్యకర్తలు, ఎంపీహెచ్ఈఓలు, హెచ్‌ఎస్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిని మార్చి 26న పోలింగ్ విధులకు నియమించారు. వీరందరికీ పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారు. అయితే, మరో 309 మంది ఆరోగ్య కార్యకర్తలు, హెచ్‌ఈఓలు, హెచ్‌ఎస్‌లను రెండు రోజుల క్రితం (గత నెల 31వ తేదీ) పోలింగ్ బూత్‌లలో విధులకు నియమించారు. ఏప్రిల్ 1వ తేదీ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మరో 1,500 మంది ఆరోగ్య సిబ్బందిని, 150 మంది వైద్యాధికారులను పోలింగ్ బూత్‌ల వద్ద అత్యవసర సేవలు అందించడానికి నియమించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని పోలింగ్ బూత్‌ల వద్ద డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్లు విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ, వీరెవరికీ పోస్టల్ బ్యాలెట్లు కేటాయించలేదు. దీంతో మొత్తం 1959 మంది డాక్టర్లు, సిబ్బంది తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవా లంటూ ఆందోళన చెందుతున్నారు. స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఇబ్బందే... వైద్యాధికారులు, సిబ్బంది ఎక్కడెక్కడో పనిచేస్తుండగా, వారిలో పనిచేసే ప్రాంతంలో కాకుండా ఎక్కడెక్కడో స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి పోలింగ్ విధుల కారణంగా ఓటేయడం ఇబ్బందిగా మారే పరిస్థితి నెలకొంది. వైద్యాధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండటం లేదు. సమీపంలోని పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ పనిచేసే ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారంతా ఉదయాన్నే వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, స్వస్థలాల్లో ఓటు హక్కును వినియోగించుకుని అనంతరం పోలింగ్ విధులకు హాజరుకావాలి. అలా చేయాలంటే సమయానికి పోలింగ్ విధులకు హాజరవడం జరగని పని. పోలింగ్ విధులకు సకాలంలో హాజరు కావాలంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో పోలింగ్ విధులకు నియమించిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఓటు వేసి వెంటనే విధులకు హాజరుకావాలి పోలింగ్ విధులకు నియమించడి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది అందరూ తొలుత వారి ఓటు వేసి ఆ వెంటనే పోలింగ్ బూత్‌ల వద్ద విధులకు హాజరుకావాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజ్యలక్ష్మి తెలిపారు. దూరప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, పోలింగ్ విధులకు మాత్రం కచ్చితంగా అందరూ హాజరుకావాల్సిందేని స్పష్టం చేశారు. - డీఎంఅండ్‌హెచ్‌ఓ -
ప్రధానికి క్రికెటర్ అశ్విన్ ట్వీట్
ఈ నెలతో పాటు మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలో తాము ఎక్కడ ఉంటే అక్కడే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని క్రికెట్ ఆట గాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అశ్విన్ ప్రధానికి ట్వీట్ చేశాడు. ఎన్నికలు జరిగే సమయంలో ఐపీఎల్ జరుగుతోంది. దానిలో భాగంగా భారత జట్టు దేశంలోని వివిధ నగరాల్లో ఆడవలసి వస్తుంది. ఈ పోటీలు జరిగే సమయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు తాను నివసించే పట్టణంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల క్రికెటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదు. అయితే, తాము ఓటు తప్పని సరిగా వేయాలని, అందుకోసం తామున్న చోటే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని అశ్విన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. -
అందరి ‘నోటా’ వింటున్న మాట
సాక్షి, శ్రీకాకుళం: మాటలు మార్చేవారు కొందరు... ప్రలోభాలు పెట్టేవారు ఇంకొందరు... నేర చరిత్ర కలిగినవారు మరికొందరు... ఇటువంటి లక్షణాలు కలిగిన రాజకీయ పార్టీల నేతలను ఓటర్లు నోటా రూపంలో తిరస్కరిస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకుగాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8,998 ఓట్లు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 6,133 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈ విధానం తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు, అక్కడ ఓడిన అభ్యర్థుల తలరాతను మార్చేసింది. ఈ దఫా నోటా ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగైతే పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిత నోటా ఓటుపై ఆధారపడి ఉంది. ► ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే, ఓటు ఎవ్వరికి వేయాలన్న సందిగ్ధంలో చాలా మంది పోలింగ్ కేంద్రానికి రావడం మానేస్తున్నారు. ఆ సందేహాన్ని వీడుతూ అందర్ని పోలింగ్ కేంద్రానికి రప్పించేందుకు 2014లో ఎన్నికల సంఘం ఈవీఎంల్లో కొత్తగా ఒక బటన్‌ను పరిచయం చేసింది. దాని పేరు నోటా. అంటే ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (పై వారిలో ఎవ్వరూ లేరు) ఈవీఎంలో చివరి బటన్‌ను నోటాకు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు లేరని ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు నోటా మీటను ఉపయోగించుకుంటున్నారు. పరిచయమైన తొలి సంవత్సరం ఎన్నికల్లోనే నోటాను లక్షల మంది ఓటర్లు వినియోగించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాల వారీగా పడిన నోటా ఓట్లు అసెంబ్లీ స్థానం నోటా ఓట్లు ఇచ్ఛాపురం 951 పలాస 934 టెక్కలి 770 పాతపట్నం 928 శ్రీకాకుళం 1,106 ఆమదాలవలస 665 ఎచ్చెర్ల 749 నరసన్నపేట 819 రాజాం 694 పాలకొండ 1,382 2009 ఎన్నికల్లోనే అనుకున్నా... వాస్తవానికి 2009 ఎన్నికల్లోనే నోటాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం తొలిసారి సుప్రీం కోర్టుకు వివరించింది. అప్పటి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా, పౌరహక్కుల సంస్థ, పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో నోటాను అమలులోకి తీసుకురావాలంటూ 2013 పెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా బటన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం అంటే 60 లక్షల మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఆ తర్వాత పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో నోటాకు ఓటే వేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు కలవరం ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో ఓడిన, గెలిచిన అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్లు తేడా కంటే నోటా ఓట్లు ఎక్కువగా పోలవుతుండటం గమనార్హం. పక్కనే తెలంగాణాలో నోటా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1.25 లక్షల మంది నోటా ఓట్లు పోలవ్వగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటింగ్ శాతంలో నోటా ఏడో స్థానంలో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓటు జిల్లాలో పడింది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిశీలిస్తే, నోటాకు 0.54 శాతం ఓట్లు పడ్డాయి. అంటే పోలైన ఓట్లలో నోటాకు 6,133 ఓట్లు పడ్డాయి. నోటాకి ఎందుకు వేయాలి.. ఆలోచించండి నోటాను విలువైన ఓటుగా పరిగణిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. అభ్యర్థుల ఓట్లు కంటే ఎక్కువ నోటాకి వస్తే, తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. కాని అభ్యర్థుల కంటే నోటా ఓట్లు ఎక్కువ పోలైతే, మరోసారి ఎన్నికలు నిర్వహించి, ఆ అభ్యర్థులు కాకుండా వేరే వారిని నిలపాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆ ఎన్నికల ఖర్చంతా ఆ రాజకీయ పార్టీలే భరించేలా చట్టాన్నీ చేయాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత పోలైన ఓట్ల జాబితాల్లో నోటాని చేర్చి ఎన్నికల సంఘానికి ఆయా జిల్లాల నుంచి పంపించారు. అయితే నోటా విలువైన ఓటు కాదని ఆ వివరాలు విడిగా పంపించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘాల కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు సమాచారం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు నోటాను ఒక విలువైన ఓటుగా భావించిన ఓటరు కంగుతిన్నారు. దీనిపై నిరసన వ్యాఖ్యలు వినిపించాయి. అందుకే ఓటుహక్కును ఏ విధంగాను దుర్వినియోగం చేయకుండా ఉన్న అభ్యర్థుల్లో మంచి అభ్యర్థికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవాలి. ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ సమర్థుల్లో.. మంచివారో.. ప్రజలకు మేలు చేసేవారెవరు వంటి గుణగణాలు పరిశీలించాలి. ఇవేమీ నచ్చకుంటే నోటాకు ఓటు వేయొచ్చు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విధానం కేవలం వ్యతిరేకత చూపించడానికే పనికొస్తుంది. ప్రజాస్వామ్యంతో ఓటుతోనే ప్రగతి సాధించాలి. అందుకే ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. – కూన అచ్యుతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఆర్‌ఏయూ -
ఓటెత్తాలి చైతన్యం
ఓటుహక్కు వినియోగించుకోవడంలో సిటీజనులు కాసింత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎన్నిక వేళ ఓటు వేయడం పౌరులుగా తమ ప్రథమ కర్తవ్యమనే విషయానికి ప్రాధాన్యమివ్వడంలేదు. దీంతో ప్రతి ఎన్నికల్లో ఆశించినంత పోలింగ్ శాతం ఉండటంలేదు. గ్రేటర్ పరిధిలో 4 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్,మల్కాజిగిరి, చేవెళ్ల. ఇందులో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్ల పోలింగ్ శాతం మెరుగ్గా ఉన్నట్లుగణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల 11న జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మహానగర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగాతరలివచ్చి ఓటెత్తేందుకుచైతన్యవంతం కావాల్సినఅవసరముంది. సికింద్రాబాద్‌లో దుస్థితి ఇలా.. సికింద్రాబాద్‌లోనూ ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ శాతం తగ్గుముఖం పడుతోంది. గతంలో జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 1.87 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలో సుమారు 80 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపేనని గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బల్దియా ఎన్నికలు నిరూపించాయి. పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర అసంఘటిత రంగాల ఉద్యోగులు, వేతన జీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటుండడంతో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని సమాజంలో మార్పును తీసుకొచ్చే గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఈసారి ఓటర్లలో చైతన్యం నింపి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ పలు యాప్‌లను, చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. మహానగరం పరిధిలో గతంలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో నమోదైన ఓట్ల శాతం ఇలా ఉంది. విస్తృత ప్రచారం.. ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు నగర వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఇటీవల శ్రీకారం చుట్టాయి. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. ఓటర్లుగా నమోదైన వారు పోలింగ్ జరిగే ఏప్రిల్ 11న విధిగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. మల్కాజిగిరిలో పరిస్థితి ఇదీ.. మినీ ఇండియాగా పేరొందిన దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో గతంలో నమోదైన పోలింగ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. గతంలో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్ 51 శాతం దాటకపోవడం గమనార్హం. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 0.41 శాతం పోలింగ్ తగ్గడం గమనార్హం. 2009లో మొత్తం ఓట్లు: 23,43,050 ఓటేసినవారు: 12,05,714 2014లో మొత్తం ఓట్లు: 31,83,083 ఓటేసిన వారు: 16,24,859 (51.05శాతం) సికింద్రాబాద్‌లో దుస్థితి ఇలా.. సికింద్రాబాద్‌లోనూ ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ శాతం తగ్గుముఖం పడుతోంది. గతంలో జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 1.87 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. 2009లో సికింద్రాబాద్‌లో మొత్తం ఓట్లు: 15,74,818 పోలైన ఓట్లు: 8,65,038 (54.53 శాతం) 2014లో మొత్తం ఓట్లు: 18,93,741 ఓటేసిన వారు: 10,04,763 (53.30 శాతం) హైదరాబాద్‌లోనూ అత్యల్పమే.. హైదరాబాద్ నగరంలో సగం మంది ఓటర్లు పోలింగ్ రోజున ఇళ్లకు పరిమితమవడం, లేదా సెలవురోజు కావడంతో విహార యాత్రకు వెళుతుండడంతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో 0.81 శాతం మేర పోలింగ్ స్వల్పంగా పెరగడం గుడ్డిలో మెల్ల. 2009లో మొత్తం ఓట్లు: 13,93,242 ఓటేసినవారు: 7,31,348(52.49 శాతం) 2014లో మొత్తం ఓట్లు: 18,23,217 ఓటేసిన వారు: 9,71,770(53.50 శాతం) చేవెళ్లలో చాలా నయం.. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నగరంలోని 3 లోక్‌సభ స్థానాల కంటే మెరుగ్గా నమోదవడం విశేషం. గతంలో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో పోలింగ్ 60 శాతానికి పైగానే నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 4.01 శాతం మేర పోలింగ్ తగ్గడం గమనార్హం. 2009లో మొత్తం ఓటర్లు: 16,81,664 పోలైన ఓట్లు: 10,85,000 (64.52 శాతం) 2014లో మొత్తం ఓట్లు: 21,85,164 పోలైన ఓట్లు: 13,22,312(60.51 శాతం) పోలింగ్ పెంపునకు చర్యలివీ.. వాదా యాప్: అంధులు, వృద్ధులు, గర్భిణులు రద్దీగా ఉండే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్‌ను ఈ యాప్ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేయడంతోపాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్ సిబ్బంది సహకరించనున్నారు. నమూనా పోలింగ్ కేంద్రాలు: జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి.. వీవీప్యాట్ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. సీ విజిల్: ఎన్నికల్లో అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్‌ను ప్రారంభించారు. ఫోటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలు తథ్యం. సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అవసరమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
వారి ఓటు ఏపీకా తెలంగాణకా
సుదీర్ఘకాలం తర్వాతఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం.. అక్కడా ఇక్కడాఓటు హక్కు ఉన్నవారు ఈసారివారి ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోను న్నారా..అది ఎవరికి అనుకూలం.. మరెవరికి ప్రతికూలం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు అంతుచిక్కనిప్రశ్నగా ఉంది. మేడికొండ కోటిరెడ్డి, సాక్షి, అమరావతి :కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబరు–6లో ఓటు ఉన్న మహిళకే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్–112లోనూ ఉంది. తెలంగాణలోనూ, ఏపీలో ఒకే రోజు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమె ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటుందో..? తూర్పుగోదావరి జిల్లా తుని అసెంబ్లీ నియోజక వర్గంలోని పోలింగ్ బూత్–152లో ఓటున్న వ్యక్తికే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోనూ ఓటు ఉంది. అతడు ఈ ఎన్నికల్లో ఎక్కడ తన ఓటు హక్కు వినియోగించుకుంటాడో..? ♦ వాళ్లద్దరే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటున్న దాదాపు 18.50 లక్షల మంది ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు? ఈ అంశం ఇప్పుడు ఏ నియోజకవర్గ ఫలితాలను మార్చబోతుంది? ఏ అభ్యర్థి అదృష్టాన్ని వెక్కిరించబోతుంది? ఇప్పుడు.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలను ఈ అంశమే ముప్పుతిప్పలు పెడుతోంది. గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి ! ఐదేళ్ల క్రితం వరకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగిన నేపథ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు లక్షల మంది విద్య, ఉపాధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండే హైదరాబాద్‌కు వెళ్లి నివాసం ఉన్న ఉదంతాలున్నాయి. ఇలాంటివారిలో 18,50,511 మందికి 2019 జనవరికి ముందు ఎన్నికల సంఘం వద్ద సమాచారం మేరకు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని ఒక స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలోనూ, ఉపాధి కోసం వెళ్లి నివాసం ఉంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండుచోట్లా ఓటు నమోదు చేసుకున్నారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అయితే, గత 20 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఒక్కటే అయినప్పటికీ, ప్రాంతాలవారీగా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగాయి. 2004, 2009లో తెలంగాణ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి ఒకసారి, ఆంధ్రలో మిగిలిన ప్రాంతం రాయలసీమ జిల్లాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ జిల్లాలకు ఎన్నికలు జరిగిన వారం రోజుల తర్వాత ఆంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఎన్నికలు జరిగాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో కూడా ఓటు హక్కు ఉన్నవారు మొదట తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుని, తర్వాత ఆ ఓటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా ఉంది. అయితే, ఈసారి 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలోనూ మొత్తం 42 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గతంలో రెండుచోట్ల ఓటు హక్కు వినియోగించుకునే వారు ఇప్పుడు ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడో ఒకచోటనే ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలవారే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారిలో ఎక్కువ మంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వారేనని ఓ అంచనా ఉంది. 2006లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ సెగ్మెంట్స్ తగ్గి.. ఆ మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాయి. విజయనగరం, రాయలసీమ ప్రాంతాల వారు హైదరాబాద్‌లో ఉంటు న్నప్పటికీ, వారిలో ఎక్కువమంది తమ పుట్టిన ప్రాంతమైన రాయలసీమ, విజయనగరం జిల్లాల్లో ఒక్కచోట మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారని అంచనా ఉంది. అయితే, గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి తాత్కాలిక లేదా శాశ్వత నివాసం ఏర్పరచుకున్నప్పటికీ వారందరూ హైదరాబాద్‌తో పాటు తమ సొంత ఊరిలో కూడా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువని అంచనా ఉంది. ఏపీలోనే ఓటు వేస్తే ప్రభావం ఏంటో..? తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అక్కడ ప్రస్తుతం లోక్‌సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారిలో ఎక్కువమంది ఈసారి ఏపీలో ఓటు వినియో గించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రెండుచోట్ల ఓటు ఉన్నవారిలో ఎక్కువమంది హైదరాబాద్‌లో ప్రత్యేకించి కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, సనత్‌నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోనే ఉన్నారన్నది సమాచారం. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నవారు ఏపీలో ఓటుహక్కు వినియోగించుకుంటే.. అది టీడీపీకి వ్యతిరేక ప్రభావం చూపవచ్చంటున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. గ్యారంటీగా గెలుపుపై ఆశలు పెట్టుకున్న కూకట్పల్లి వంటి చోట కూడా టీడీపీ ఓటమి పాలైంది. -
మీ ఓటు వేరొకరు వేసినట్లు గుర్తిస్తే..
సాక్షి, సిటీబ్యూరో: పోలింగ్ ప్రక్రియలో చాలెంజ్ ఓటు అని ఒకటి ఉంది. ఓటరు జాబితాలో పేరుండి.. పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన తర్వాత ఆ ఓటు వేరొకరు వేసినట్లు గుర్తిస్తే సదరు ఓటరు వెనుదిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటును చాలెంజ్ చేయవచ్చు. మొదటగా ఓటరు గుర్తింపును చాలెంజ్ చేసి ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు, వయసు తదితర వివరాలు సరిచూడాలి. ఇలా ఒక్కో అంశాన్ని చాలెంజ్ చేయవచ్చు. ప్రతి చాలెంజ్‌కు రూ.2 చెల్లించాలి. అధికారులు ప్రతి చాలెంజ్‌ను వరుస క్రమం పరిశీలిస్తారు. సదరు ఓటరు అన్ని ఆధారాలు చూపితే చాలెంజ్‌లో నెగ్గినట్లుగా భావించి ఓటు వేయడానికి అనుమతిస్తారు. చాలెంజ్ ఓటర్ల ఫాంలో ఓటరు వివరాలు నమోదు చేసి సంతకం తీసుకుంటారు. చాలెంజ్ చేసిన వ్యక్తి సరైన ఆధారాలతో రుజువు చేసుకోలేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఓటర్లను ప్రలోభపెడితే ఐదేళ్ల జైలు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా కులం, ధనం, బహుమానాల పేరుతో రాజకీయ పార్టీలు ప్రలోభపెడుతుంటాయి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలని బెదిరించడం, బలవంతంగా ఓటు వేయించడం, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాలకు చెందిన ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని పేర్కొంది. ఓటర్లను ప్రలోభానికి చేస్తే గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా తప్పదు.