సాక్షి, ఒంగోలు, చీరాల అర్బన్: అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల యంత్రాంగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అయితే ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేకపోవడానికి గల కారణాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఆర్టీసీ డ్రైవర్లు 600 మంది జిల్లా వ్యాప్తంగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనడం దారుణం.
జరిగింది ఇదీ
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 600 బస్సులు కావాలని జిల్లా ఎన్నికల అధికారి వాడరేవు వినయ్‌చంద్ ఆర్టీసీ ఆర్‌ఎంను ఆదేశించారు. ఇందుకు ఆర్‌ఎం జి.విజయగీత గత నెల 25వ తేదీనే పోస్టల్ బ్యాలెట్లకు అర్హత ఉన్నవారు తమ ఫారం–12, ఐడీ కార్డు ప్రతులను అధికారులకు అందజేయాలని, గజిటెడ్ అధికారి వాటిని ధ్రువీకరించి రిటర్నింగ్ ఆఫీసర్‌లకు అందజేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీలో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఎన్నికల కమిషన్ అంగీకారం తెలిపింది.
దీంతో ప్రతి ఏటా తాము ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామన్న ఆవేదన స్థానంలో అంతులేని ఆనందం నెలకొంది. అయితే 10,11 తేదీల్లో ఎన్నికల డ్యూటీకి కేటాయిస్తున్న బస్సులకు డ్రైవర్లుగా ఎవరెవరిని పంపాలనే అంశంలో డిపో మేనేజర్లు సరైన నిర్ణయం తీసుకోవడంలో వైఫల్యం చెందారు. దీంతో వారు ఈనెల 7వ తేదీ వరకు సిబ్బందికి డ్యూటీలు కేటాయిస్తూ వచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నంలోగా ఫారం 12, గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. దీంతో విధులకు నియమితులైన డ్రైవర్లు తమతమ పత్రాలను అధికారులకు అందించారు.
ఏం ప్రయోజనం..
ఇలా అన్ని డిపోల్లో వచ్చిన ఫారం 12ను తీసుకొని రిటర్నింగ్ అధికారులకు అందజేసి పోస్టల్ బ్యాలెట్లను సిబ్బందికి ఇప్పించే ప్రక్రియను మంగళవారం ఆర్టీసీ అధికారులు చేపట్టారు. అందులో భాగంగా వారు రిటర్నింగ్ ఆఫీసర్ల వద్దకు వెళ్లగా పోస్టల్ బ్యాలెట్లకు ఈనెల 4వ తేదీతోనే గడువు ముగిసిందని, అందువల్ల ఇప్పుడు ఫారాలు తీసుకోవడం సాధ్యం కాదంటూ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆర్టీసీ అధికారులు ఏం చేయాలో తెలియక చివరకు చావు కబురు చల్లగా సిబ్బందికి చెప్పారు. గడువు ముగిసిందని అందువల్ల పోస్టల్ బ్యాలెట్‌లు మంజూరు కావని స్పష్టం చేశారు. దీంతో తొలిసారిగా ఓటు వినియోగించుకునేందుకు అవకాశం చేతివరకు వచ్చినా బటన్ నొక్కే అవకాశం మాత్రం లేకుండా చేశారనే వాదన వినిపిస్తోంది.
దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తొలుత భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి విరమించారు. పరిశ్రమలు, షాపులు, సంస్థల్లో పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవును తీసుకుంటుండగా తమకు మాత్రం కనీసం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సైతం అవకాశం లేకుండా పోతుందని, కనీసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొంతమందికైనా అవకాశం దక్కుతుందని భావిస్తే అది కూడా నిరాశను మిగిల్చిందంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఎన్నికల్లోనూ దూరం..
ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఎన్నికల రోజున విధుల్లో ఉన్న సిబ్బందంతా ఓటుకు దూరమవుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కును వీరంతా కోల్పోతున్నారు. ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని ముందురోజే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తారు. దీంతో వీరంతా రెండు రోజులు పాటు తమ ఓటు హక్కు ఉన్నా.. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతాలైన విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, షాపూరు బస్సుల్లో ఉన్న సిబ్బంది ఎన్నికల రోజున ఓటు హక్కు వేయలేని పరిస్థితి నెలకొంది.
తెలియక పోవడంతో
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారీ ఓటు హక్కును ఆర్టీసీ కార్మికులు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా తమకు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను తొలిసారిగా అందించారు. అయితే డ్యూటీ చార్టులు వేయించుకునే కార్మికులు ఎవరనేది తేలియకపోవడంతో సిబ్బంది వినియోగించుకోలేదు. దీంతో ఈసారి కూడా ఓటుకు దూరమయ్యాం.
బి.రవి, ఈయూ రీజియన్ కార్యదర్శి
అవగాహన లోపంతోనే వినియోగించుకోలేదు
ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులకు పోస్టల్ బ్యాలెట్‌ను గత నెల 28న అందించాం. రీజియన్‌లోని డిపోలకు సర్క్యులర్ పంపాం. అయితే పోలింగ్ రోజున డ్యూటీలు ఎవరికి కేటాయిస్తారో తెలియక పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోలేదు. కార్మికులు అవగాహన లేకపోవడంతో పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోలేదు.
- విజయగీత, ఆర్టీసీ ఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment