పశ్చిమాన ఫ్యాన్‌ హోరు | YSRCP Won in Prakasam | Sakshi
Sakshi News home page

పశ్చిమాన ఫ్యాన్‌ హోరు

Published Sat, May 25 2019 1:20 PM | Last Updated on Sat, May 25 2019 1:20 PM

YSRCP Won in Prakasam - Sakshi

కనిగిరి: బుర్రా మధుసూదన్‌యాదవ్‌ విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం కనిగిరిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

పశ్చిమ ప్రకాశంలో ఫ్యాన్‌ గాలి ప్రభంజనంలా వీచింది. ఫ్యాన్‌ హోరుకు సైకిల్‌ విలవిల్లాడింది. మెజారిటీల్లోనూ వైఎస్సార్‌ సీపీ రికార్డులు సృష్టించింది. 2014 ఎన్నికల్లో వెనుకబడిన కనిగిరి, దర్శి నియోజవకర్గాల్లోనూ ఈ సారి విజయదుందుభి మోగించింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీ క్యాడర్‌ సైతం సంబరాల్లో మునిగిపోయారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి ఆదరణ చాటారు. ఆ పార్టీ అభ్యర్థులను రికార్డు మెజార్టీలతో గెలిపించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు  ప్రధాన నీటి వనరైన వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ప్రాజెక్టును పూర్తి చేయక పోవడంతో ఈ ప్రాంతవాసులు సాగునీటితో పాటు తాగునీటికి అల్లాడి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్‌ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 70 శాతం పనులను పూర్తి చేశారు. ఆయన మరణంతోనే ప్రాజెక్టు పనులు దాదాపు ఆగి పోయాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని జిల్లా నేతలతో పాటు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. జగన్‌ సీఎం అయితే వెలిగొండ పూర్తి అవుతుందని జనం నమ్మారు. తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని భావించారు. జగన్‌ను సీఎం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఫ్యాను గుర్తుకు జనం

ప్రభంజనంలా ఓట్లేశారు జగన్‌ను నమ్మిన జనం..
ప్రధానంగా జగన్‌మోహనరెడ్డి తాను అధికారంలోకి వస్తే చేయబోయే నవరత్నాల పథకాలు, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం, స్థానిక అభివృద్ధి, యువత భవిష్యత్‌కు భరోసా  తదితర అంశాలతో పాటు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు పశ్చిమ ప్రకాశాన్ని నిర్లక్ష్యంగా చూడటం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆశించిన రీతిలో నిధులు కేటాయించక పోవటం, వెలిగొండ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించటంతో ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో చూపించారు. జగనన్న గెలిస్తే తమ జీవితాలకు భరోసా ఉంటుందని జనం నమ్మడంతో పాటు స్థానికంగా ఆ పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో మంచి పేరు ఉండటం కలిసొచ్చింది.
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి, కందుకూరు నియోజకవర్గాలు ఉన్నాయి.
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఆదిమూలపు సురేష్, టీడీపీ తరుపున అజితారావులు ఈ ఎన్నికల్లో పోటీ పడగా 56.34 శాతం ఓట్లు సాధించిన సురేష్‌ 31632 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డికి,  టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డికి మధ్య జరిగిన పోటీలో 52.11 శాతం ఓట్లు  పొందిన నాగార్జునరెడ్డి టీడీపీ అభ్యర్థిపై 18,667 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.
ఇక గిద్దలూరు నియోజకవర్గంలో  వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబుకు టీడీపీ అభ్యర్థి ముత్తముల అశోక్‌రెడ్డికి మధ్య జరిగిన పోటీలో 67.9శాతం ఓట్లు సాధించిన అన్నా 81,035 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు.
కనిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డికి మధ్య నెలకొన్న పోటీలో 58.48 శాతం ఓట్లు తెచ్చుకున్న బుర్రాకు ఉగ్రపై 40,903 ఓట్లు ఆధిక్యం లభించింది.
దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మద్ధిశెట్టి వేణుగోపాల్‌కు టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుకు మధ్య పోటీలో 57.29 శాతం ఓట్లు సాధించిన మద్దిశెట్టి 39,057 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
హాకందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి 51.69 శాతం ఓట్లు సాధించి, టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుపై 14,936 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
 మొత్తంగా పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ లభించింది. గిద్దలూరులో అన్నా వెంకటరాంబాబుకు 80 వేల పై చిలుకు ఓట్ల రికార్డు మెజార్టీ లభించడం గమనార్హం. పశ్చిమ ప్రాంత వాసులు వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా మద్దతు పలికినట్లు స్పష్టమైంది. ఇక జిల్లాలోని మిగిలిన ప్రాంతాలోని జనం వైఎస్సార్‌సీపీకి వెల్లువలా ఓట్లేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement