
సాక్షి, ప్రకాశం: మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో మంత్రి ఒంగోలు నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి, మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 1,863 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
మహిళలకు సంబంధించి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు. ఈ నెల 11వ తేదీన డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ పథకం కింద 6, 200 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద జిల్లాలోని దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల పరిధిలోని 248 అంగన్‌వాడి కేంద్రాల ద్వారా 3, 980 మంది తల్లులు, 14, 650 మంది చిన్నారులు ప్రయోజనం పొందనున్నారన్నారు. అంతేగాక సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలోని 53 మండలాల్లో 3,996 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 46 వేల మంది తల్లులు, 7 నెలల నుండి 6 ఏళ్ళ లోపు ఉన్న లక్షా ఇరవై వేల మంది చిన్నారులు లబ్ధి పొందునున్నారన్నారు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment