సాక్షి, చీరాల అర్బన్ (ప్రకాశం): ఓట్ల పండగ దగ్గరలోనే ఉంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూరు ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయాణం కడుతున్నారు. అయితే ఊరికి వచ్చేందుకు హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఖాళీ లేవు. ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్దామంటే ధర రెండింతలు పెంచేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని ఉన్నా రవాణా సౌకర్యం లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ, ఉన్నత చదువులు, వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు సొంత ఊరు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ, రైళ్లలో సీట్లు ఫుల్ కావడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ఉండటంతో 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇదే సరైన సమయంగా చూసుకుని ప్రైవేటు ఆపరేటర్లు 10, 14న టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు.
ఒక్క చీరాలకే 10 వేల మంది రాక
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు చీరాలకు చెందిన సుమారు 10 వేల మంది ఓటర్లు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. చీరాల, వేటపాలెం మండలాలకు చెందిన ఎక్కువ మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, విద్య, వ్యాపారం రీత్యా స్థిరపడిన వారు ఉన్నారు. ఓటు మాత్రం నియోజకవర్గంలో ఉండటంతో ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి చీరాలకు రోజు వారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు సర్వీసులు నడుపుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. 14వ తేదీన తిరుగు ప్రయాణంలోనూ ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం రోజువారీ సర్వీసులతో పాటు మరో ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ కె.గంగాధరరావు తెలిపారు.
ప్రయాణికులపై ప్రై‘వేటు’
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లుకు తిరుగు ప్రయాణం చుక్కలు చూపించనుంది. 10వ తేదీన వచ్చిన వారు 14వ తేదీకి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వేషన్లు చేయించుకునేందుకు వెళ్తే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఎన్నికల సమయాన్ని అదనుగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. మామూలు రోజుల్లో చీరాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ టిక్కెట్ రూ.560 వరకు ఉంటే ఎన్నికల సందర్భంగా ఆ టిక్కెట్‌ను అమాంతంగా రూ.1500లకు పెంచేశారు. మరికొన్ని ట్రావెల్స్ అయితే టిక్కెట్ రూ.2 వేల వరకు పెంచేశాయి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులకు టిక్కెట్లు ధరలు పెంచేసింది.
వలస ఓటర్ల్లపై ప్రత్యేక దృష్టి
చీరాల నియోజకవర్గంలో స్థానికులై ఉండి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టిసారించాయి. స్థానిక ఓటర్లకన్నా ఎన్నికల్లో వలస ఓటరుదారులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఎక్కువగా ప్రభావితం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రసన్నం చేసుకుంటున్నాయి. మరికొందరైతే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ నాయకులు ఓటర్లుకు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఉంటే వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం
ఎన్నికల నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రోజువారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు బస్సులను 10వ తేదీ, 14న తిప్పేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ప్రయాణికుల రద్దీని గమనించి ఇంకా ఎక్కువ బస్సులు తిప్పుతాం. ఓటర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- కె.గంగాధరరావు, మేనేజర్, చీరాల డిపో
Comments
Please login to add a commentAdd a comment