టీడీగుట్ట పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకుడు సంజయ్‌గుప్తా (ఫైల్)
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈనెల 11న జరగనున్న ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో విద్యుత్, ఫర్నీచర్, తాగునీటి వసతి, గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వికలాంగులు ఓటు వేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక ర్యాంప్‌లు నిర్మించారు.
స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు ఇదివరకే గ్రామాలు, పట్టణంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. బీఎల్‌ఓలు, వీఆర్‌ఓలు, సూపర్‌వైజర్ల ద్వారా విస్తృతంగా ఓటుహక్కు ప్రాముఖ్యతపై వివరించిన అధికారులు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.26లక్షల మంది ఓటర్లు
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 2,26,399 మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2,12,851 మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుతం 13,548 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,13,248 మంది పురుషులు, 1,13,143 మంది మహిళలు, 8 మంది ఇతరులతో కలిపి మొత్తం 2,26,399 మంది ఓటర్లు ఉన్నారు.
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 263 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు 268పోలింగ్ కేంద్రాలకు పెంచారు. గతంతో పోల్చితే ఈసారి 5కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ అర్బన్‌లో 184, మహబూబ్‌నగర్ రూరల్‌లో 37, హన్వాడ మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
దివ్యాంగులకు ప్రత్యేక వసతులు
దివ్యాంగుల ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వారి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ర్యాంపులతో పాటు వీల్‌చైర్‌లను సమకూర్చనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు అదే తరహాలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా వికలాంగులను గుర్తించి వారికి అవవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించి ఏర్పాట్లు చేస్తున్నారు.
సమస్యాత్మక గ్రామాలపై నిఘా
అదేవిధంగా, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పారా మిలటరీ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించిన అధికారులు ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వికలాంగుల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్‌ల ఏర్పాటుతో పాటు వీల్‌చైర్లను సమకూర్చుతున్నాం. పోలింగ్ సిబ్బందికి కూడా అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అధికారులకు సహకరించాలి.
– వెంకటేశం, తహసీల్దార్, మహబూబ్‌నగర్ అర్బన్
Comments
Please login to add a commentAdd a comment