సుదీర్ఘకాలం తర్వాతఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం.. అక్కడా ఇక్కడాఓటు హక్కు ఉన్నవారు ఈసారివారి ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోను న్నారా..అది ఎవరికి అనుకూలం.. మరెవరికి ప్రతికూలం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలకు అంతుచిక్కనిప్రశ్నగా ఉంది.
మేడికొండ కోటిరెడ్డి, సాక్షి, అమరావతి :కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబరు–6లో ఓటు ఉన్న మహిళకే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్–112లోనూ ఉంది. తెలంగాణలోనూ, ఏపీలో ఒకే రోజు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమె ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటుందో..?
తూర్పుగోదావరి జిల్లా తుని అసెంబ్లీ నియోజక వర్గంలోని పోలింగ్ బూత్–152లో ఓటున్న వ్యక్తికే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోనూ ఓటు ఉంది. అతడు ఈ ఎన్నికల్లో ఎక్కడ తన ఓటు హక్కు వినియోగించుకుంటాడో..?
♦ వాళ్లద్దరే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటున్న దాదాపు 18.50 లక్షల మంది ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు? ఈ అంశం ఇప్పుడు ఏ నియోజకవర్గ ఫలితాలను మార్చబోతుంది? ఏ అభ్యర్థి అదృష్టాన్ని వెక్కిరించబోతుంది? ఇప్పుడు.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలను ఈ అంశమే ముప్పుతిప్పలు పెడుతోంది.
గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి !
ఐదేళ్ల క్రితం వరకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగిన నేపథ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు లక్షల మంది విద్య, ఉపాధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండే హైదరాబాద్‌కు వెళ్లి నివాసం ఉన్న ఉదంతాలున్నాయి. ఇలాంటివారిలో 18,50,511 మందికి 2019 జనవరికి ముందు ఎన్నికల సంఘం వద్ద సమాచారం మేరకు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని ఒక స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలోనూ, ఉపాధి కోసం వెళ్లి నివాసం ఉంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండుచోట్లా ఓటు నమోదు చేసుకున్నారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అయితే, గత 20 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఒక్కటే అయినప్పటికీ, ప్రాంతాలవారీగా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగాయి. 2004, 2009లో తెలంగాణ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి ఒకసారి, ఆంధ్రలో మిగిలిన ప్రాంతం రాయలసీమ జిల్లాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ జిల్లాలకు ఎన్నికలు జరిగిన వారం రోజుల తర్వాత ఆంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఎన్నికలు జరిగాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో కూడా ఓటు హక్కు ఉన్నవారు మొదట తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుని, తర్వాత ఆ ఓటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా ఉంది. అయితే, ఈసారి 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలోనూ మొత్తం 42 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గతంలో రెండుచోట్ల ఓటు హక్కు వినియోగించుకునే వారు ఇప్పుడు ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడో ఒకచోటనే ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలవారే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారిలో ఎక్కువ మంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వారేనని ఓ అంచనా ఉంది. 2006లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ సెగ్మెంట్స్ తగ్గి.. ఆ మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాయి. విజయనగరం, రాయలసీమ ప్రాంతాల వారు హైదరాబాద్‌లో ఉంటు న్నప్పటికీ, వారిలో ఎక్కువమంది తమ పుట్టిన ప్రాంతమైన రాయలసీమ, విజయనగరం జిల్లాల్లో ఒక్కచోట మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారని అంచనా ఉంది. అయితే, గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి తాత్కాలిక లేదా శాశ్వత నివాసం ఏర్పరచుకున్నప్పటికీ వారందరూ హైదరాబాద్‌తో పాటు తమ సొంత ఊరిలో కూడా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువని అంచనా ఉంది.
ఏపీలోనే ఓటు వేస్తే ప్రభావం ఏంటో..?
తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అక్కడ ప్రస్తుతం లోక్‌సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారిలో ఎక్కువమంది ఈసారి ఏపీలో ఓటు వినియో గించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రెండుచోట్ల ఓటు ఉన్నవారిలో ఎక్కువమంది హైదరాబాద్‌లో ప్రత్యేకించి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, సనత్‌నగర్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లోనే ఉన్నారన్నది సమాచారం. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నవారు ఏపీలో
ఓటుహక్కు వినియోగించుకుంటే..
అది టీడీపీకి వ్యతిరేక ప్రభావం చూపవచ్చంటున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. గ్యారంటీగా గెలుపుపై ఆశలు పెట్టుకున్న కూకట్‌పల్లి వంటి చోట కూడా టీడీపీ ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment