
సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 78.41 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా.. గురువారం నాటి ఎన్నికల్లో 79.64 శాతం మేరకు ఓట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకుగాను 2.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటేశారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశంజిల్లాలో 85.98 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి 89.82 శాతంతో అత్యధిక ఓటింగ్ జరిగిన నియోజకవర్గంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట 89.64 శాతం, ప్రకాశం జిల్లా దర్శి 89.62 శాతం ఓట్ల పోలింగ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment