బంజారాహిల్స్: ‘‘ప్రజాస్వామ్యం మనకు ఒక గౌరవం, హక్కును కల్పించింది. అలాంటప్పుడు ఆలోచించి ఓటేయాలి కదా..! నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు రోజంతా దుకాణాలు తిరుగుతాం. అలాంటిది అయిదేళ్లు పాలించే ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలంటే ఎంతగా ఆలోచించాలి..? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఆలోచించండి.. ‘ఓటు వేయడం అవసరమా’ అనే భావన చాలా మందిలో ఉంది. ఆ భావనను వీడనాడండి. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం’’ అంటున్నారు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఓటరుగా నమోదు చేసుకోగానే సరిపోదని, దాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలంటున్న ఆయన తన ‘ఓటు’ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు సందీప్ మాటల్లోనే...
ఇది మూడోసారి..
ఇప్పటి దాకా నేను రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇప్పుటి ఎన్నికల్లో మూడోసారి ఓటు వేయబోతున్నాను. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా ఓటు వేస్తారు. మేం ఉదయం 7.30 గంటలకే మాదాపూర్‌లోని మా పోలింగ్ కేంద్రానికి వెళ్తాం. తప్పనిసరిగా క్యూ పద్ధతి పాటిస్తాం. ఓటు వేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చూసుకుంటాం.
వేలి మీద ఇంకు చూడగానే..
నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు వేలి మీద ఇంకును చూసినప్పుడల్లా ఎంతో గర్వంగా ఫీలయ్యాను. మొదటిసారి నేను దేశం కోసం ఉపయోగపడుతున్నానని గర్వపడ్డాను. తొలిసారి పోలింగ్‌లో పాల్గొన్న తర్వాత ఓటు ప్రాముఖ్యత కూడా తెలిసి వచ్చింది. అప్పుడు గర్వంగా, హాయిగా అనిపించింది. ఆ ఇంకు గుర్తును వరుసగా నాలుగైదు రోజులు చూసుకున్నాను. ఆ గుర్తు పోకుండా ఉంటే బాగుండు అనిపించింది.
చిన్నప్పుడు నాన్నతో కలిసి..
నా చిన్నతనంలో మా నాన్న ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు నన్ను వెంట తీసుకెళ్లువారు. పోలింగ్ కేంద్రం బయట నన్ను నిలబెట్టి ఆయన ఓటు వేసి వచ్చిన తర్వాత వేలిపై ఇంకు ముద్ర చూపించేవారు. అది చూసినప్పుడు నాకు ఎంతో ఆసక్తి కలిగింది. నా వేలిపై ఎప్పుడు ఇలా ఇంకు ముద్రను చూపిస్తానా.. అని అనుకునేవాడిని మొత్తానికి నాక్కూడా ఆ అవకాశం వచ్చింది.
హైదరాబాద్ అద్భుత నగరం
నేను తిరిగిన, చూసిన నగరాల్లో హైదరాబాద్ అద్భుతమైన నగరం. ఇక్కడున్నంత సౌకర్యం, ఆహ్లాదం, ఆనందం నాకెక్కడా దొరకలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో పెద్దగా చేయాల్సింది ఏమీ లేదనిపిస్తుంది. మెట్రో రైలు, రోడ్లు ఇలాంటి పనులు ఇంకా తొందరగా అయిపోతే బాగుండనిపిస్తుంది.
అభ్యర్థుల గతం చాలా అవసరం
ఉన్నవారిలో 70 శాతం మంది ఓటు వేసి.. 30 శాతం మంది వేయకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మన కోసం మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేసే ముందు అభ్యర్థుల గతం చూడాలి. గతంలో వారు చేసిన పనులను ఆకళింపు చేసుకోవాలి. మనకు ఎవరు సరైన వారో నిర్థారించుకోవాలి. కులమతాలు కాకుండా.. మనిషి గుణగణాలు చూసి వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment