అందరూ మంచిగున్నరా.. నేను మీ మల్లేశాన్ని. గీ రెండ్రోజులు సర్ది జేసింది గందుకే రాలేకపోయిన. గిన్ని దినాలూ మీతో ముచ్చటబెట్టుడు మంచిగుండె. సూసిండ్రా గీ ఎలచ్చన్ల ప్రచారం జరిగినన్నాల్లు ఎన్ని సెప్పిండ్రు.. ఎంతగనం తిరిగిండ్రు.. కాల్లకి సెక్రాలు కట్కొని ఊరూరు.. గల్లి గల్లీ చుట్టేసిండ్రు. కూటమోల్లని కారోల్లు.. కారోల్లని కూటమోల్లు.. గీల్లిదర్నీ గా కమలమోల్లు.. ఆల్లని ఈల్లందరూ ఎంత తిట్టుకుండ్రో మీకు జెప్పిన. నీల్లిస్తాం.. కొల్వులిస్తం.. అప్పులు మాఫీ జేస్తం.. గది జేస్తం గిది జేస్తం అని ఊదరగొట్టిండ్రు! మీరు గెలిపించండి సాలు.. సొర్గం మీ గుమ్మం కాడ దించుతం.. అని ఆశపెట్టిండ్రు.
పార్టీలు మార్చినోల్లు.. పురాన దోస్తుల్ని దుష్మల్నని మీటింగుల్ల తిట్టినోల్లు.. ఆల్లకి ఓటేస్తే మీ బతుకు బర్బాద్ అయినట్లే.. తెలంగాన ఎనకయినట్లే అన్నోల్లు.. ఈల్లకి ఓటేస్తే అభివృద్ధి ఖతం మీయిస్టం మల్ల అన్నోల్లు.. ఇయన్నీ ఇన్కొని యాస్టకొచ్చింది గాదె. మా కాకా అయితే.. గిదేందిర మల్లేసు గిప్పుడే గీల్లు గిట్ల కొట్లాడుతుండ్రు.. ఈల్లని దీస్కెల్లి గా కుర్సీల కూర్సోబెడ్తే ఇంకేమైన ఉందా అన్నడు. నిజమే కాకా ఏం జేస్తం మల్ల మనం కూడ జరంత జూసుకోవాలె. ఎవరు మంచిగుండ్రు.. ఎవరు మన తెలంగానకు మంచి జేస్తరు అని దిమాక్ పెట్టి ఆలోచించాలె. గాల్లకె ఓటెయ్యాలె.. అని చెప్పిన. గంతె గదా.
అయినా ఎంత గత్తర జేసిండ్రు! దావత్ ఇస్తమని.. నాస్టా పెట్టిస్తమని.. ట్రిప్పుల్కి పంపిస్తమని. మన ఎంకటేసుల్ని అడుగుండ్రి మల్ల ఈల్ల జాత్కాలన్ని ఇప్తడు. ఇయన్ని బేకార్ గానీ వదిలేయుండ్రి. మీ మల్లేశాన్ని నేను జెప్తున్న.. మీరు యేసే ఓటు తెలంగానని ముందుకు దీస్కెల్లాలె. అని అనుకున్నరు. కొంచెం గడబిడ అయినమంటె సాల్.. ఇగ ఐదేల్లు బర్బాద్ అయినట్లె! ఆయన జెప్పిండు.. ఈయన జెప్పిండు.. గివన్నీ జాన్తానై! అందుకే సెబ్తున్న ఇయ్యాల మంచిగ తయారై పోలింగ్‌బూత్‌కి పోండి. మనసుకు నచ్చినోల్లకి.. మనల్ని మన తెలంగానని ముందుకు దీస్కెల్లేటోల్లకి బరాబర్ ఓటు వేయుండ్రి. ఏలికి సుక్క పెట్టించ్కుని నవ్వుతూ ఇంటికెల్లుండ్రి! మన ఓటు.. మన ఇజ్జత్.. మనం భద్రంగా కాపాడుకోవాలె.. మంచోల్లకి మంచిగా వెయాలె! వస్తా మల్ల.. గిన్నాల్లు గీ సిల్లీ మల్లేశం ముచ్చట్లు ఇన్నరు. నవ్వుకున్నరు. అరె బై గిట్లనా అనుకున్నరు! ఏదైతేనేం నాల్గు మంచి మాటలు జెప్పిన. మల్లీ ఈలున్నప్డు వస్త. అందాక బై!! – రామదుర్గం మధుసూదనరావు
Comments
Please login to add a commentAdd a comment