సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నుంచి నామినేషన్లస్వీకరణ పర్వం ప్రారంభమైంది. దీంతో ఎన్నికలవేడి రాజుకుంది. ఎక్కడ చూసినా ఓట్ల గురించిన చర్చే సాగుతోంది. రాజకీయ నాయకులతో పాటు పౌరుల నాలుకలపైనా ఓటు అనే పదం నానుతోంది. అసలీ ఓటు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంగ్లేయుల పాలనలో మొదలు..
ఓటు వేయడమనేది ఆంగ్లేయుల పాలనా కాలంలోనే మొదలైనా ఆ తర్వాత అది ఓ రూపాన్ని సంతరించుకుంది. మన దేశంలో బ్రిటిష్ వారి పాలనలో భారతీయులకు పరిమితంగానే కల్పించిన ఓటుహక్కును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కలసాకారమైంది.
భారత పౌరులందరికీ ఓటు..
1907లో ఏర్పడిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటుహక్కు వచ్చింది. 1919 కౌన్సిల్ చట్టం ఓటుహక్కును కొంత మేర విస్తృతపరిచింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటుహక్కు దేశ జనాభాలో 10.5 శాతానికి పెరిగింది. 1947లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా దీనిని 28.5 శాతానికి పెంచారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు.
21 నుంచి 18 ఏళ్లకు..
1952లో సాధరణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 21 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటుహక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ప్రజాసామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒక వ్యక్తికి ఒక ఓటును మాత్రమే కల్పించారు. ఆర్టికల్ 325 ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంత, లింగభేదాలు వంటి తేడాలతో ఏ వ్యక్తికీ ఓటుహక్కునునిరాకరించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment