మాట్లాడుతున్న మల్కాజిగిరి ఎన్నికల అధికారి ఎంవీ రెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి గర్వంగా సిరా మార్క్‌ను చూపాలని మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అధికారి, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. ఓట వేయడం బాధ్యతగా భావించాలన్నారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లరలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వెయ్యి వాహనాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిబ్బంది బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారని చెప్పారు. నియోజకవర్గంలో గుర్తించిన 258 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీటికి మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. నియోజకవర్గంలోని 2,960 పోలింగ్ కేంద్రాలను 259 సెక్టార్లుగా విభజించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 20వేల మంది సిబ్బంది సహా పోలీసులు పాల్గొంటున్నారన్నా రు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
అభ్యర్థికి 9వాహనాలు..
పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థి లేదా సంబంధిత ఏజెంట్లు 9 వాహనాలు మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఒక్కొ వాహనంలో డ్రైవర్ సహా నలుగురు మాత్రమే వెళ్లాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6గంటల లోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలోనే గంటసేపు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రిసైడింగ్ అధికారికి మినహా మరెవరికీ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్దేశించిన డీఆర్‌సీ సెంటర్లకు ఈవీఎంలు తరలిస్తామన్నారు. అక్కడి నుంచి అదే రాత్రి కీసరలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలిస్తామన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లను అభ్యర్థులు సహా వారి ఏజెంట్లు ఎప్పుడైనా పరిశీలించడానికి అవకాశం ఇస్తామన్నారు. ఎవరైనా అభ్యర్థి స్ట్రాంగ్‌రూమ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, నోడల్ అధికారులు కౌటిల్య, సౌమ్య, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment