ఎవరి ధీమా వారిదే!  | Tomorrow Telangana Lok Sabha Elections Results | Sakshi
Sakshi News home page

ఎవరి ధీమా వారిదే! 

Published Wed, May 22 2019 10:12 AM | Last Updated on Wed, May 22 2019 10:12 AM

Tomorrow Telangana Lok Sabha Elections Results - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: నలభై రోజులకు పైగా ఎదురుచూసిన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ నాయకులతోపాటు సామాన్యుల్లో కూడా ఉత్కంఠ పెరిగిపోతోంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రధానంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, కరీంనగర్‌ స్థానంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశంలో తుది విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలే అందుకు ప్రధాన కారణం. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశాలున్న స్థానాల్లో కరీంనగర్‌ ఒకటని పేర్కొనడంతో ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితంపై ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా భావించే కరీంనగర్‌ జిల్లాలో బీజేపీ పాగా వేస్తుందా? సర్వే ఫలితాలు నిజమవుతాయా? అనే టెన్షన్‌ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రెండు  పార్టీల నేతలు తమ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతోపాటు నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించారు.

ఎవరి ధీమా వారిదే
లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ కరీంనగర్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ, కేసీఆర్‌ సన్నిహితుడు బి.వినోద్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగగా, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సమరానికి కాలు దువ్వారు. హిందుత్వ నినాదాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్న బండి సంజయ్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగినప్పటికీ, పోలింగ్‌ నాటి సరళి టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు విజయంపై ధీమాను పెంచింది. కారు గుర్తు, కేసీఆర్‌ ఛరిష్మా, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వినోద్‌కుమార్‌ పూర్తి విశ్వాసంతో ఉండగా, ఈసారి హిందుత్వ ఎజెండాతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి తనకు ఉపయోగపడుతుందని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల ఓటర్లు మొగ్గు చూపారనే ధీమాతో సంజయ్‌ ఉన్నారు. అదే సమయంలో కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా మిగతా ఆరింట టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఓట్లు లభిస్తాయని వినోద్‌కుమార్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేశారు. ఈ రెండు పార్టీలతోపాటు సైలెంట్‌ ఓటింగ్‌ మీద కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, టీఆర్‌ఎస్‌ పట్ల ఉన్న వ్యతిరేకత తనకు లాభించాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతో మూడు పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది

సర్వే ఫలితాలతో బెట్టింగ్‌ల జోరు
జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లలో కరీంనగర్‌ను చేర్చడంతో గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు తారాస్థాయిలో సాగుతున్నాయి. బీజేపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ స్థానంపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ వంటి చోట్ల కూడా భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో కూడా గెలుపుపై భారీ అంచనాలు ఉండడంతో ఫలితం ఆసక్తిని రేపుతోంది. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు మాత్రం గెలుపుపై ధీమాతో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

పెద్దపల్లి ఫలితంపై టీఆర్‌ఎస్‌ ధీమా
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకగా టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌కే మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌ నేత గెలుపు కోసం అలుపెరుగని కృషి సాగించారు. అయితే సింగరేణి కోల్‌బెల్ట్‌లో కాంగ్రెస్‌కు కొంత అనుకూల వాతావారణం ఉన్నట్లు పోలింగ్‌ సరళిలో కనిపించినా, దాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు. సామాజిక సమీకరణల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ కన్నా వెంకటేష్‌ నేతకే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఆపార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు పోలయ్యాయని, తమ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ లోక్‌సభ ఓట్ల లెక్కింపు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరుగనుండగా, పెద్దపల్లి ఓట్ల లెక్కింపు మంథని జెఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement