గుజరాత్‌లో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్‌పై బీజేపీ కన్ను
కనీస పోటీ కూడా ఇవ్వలేక కాంగ్రెస్ ఆపసోపాలు
ఏ ఆటగాడైనా సొంత పిచ్‌పై బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. మరి అలాంటిది దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో స్కెచ్ గీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది! వార్ వన్‌సైడే! గుజరాత్‌లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్షరాలా అదే జరిగింది.
రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలకు ఒక్కటీ దక్కకుండా క్లీన్‌బౌల్డ్ చేశారు మోదీ, అమిత్ షా. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టున్న ఈ పశ్చిమ రాష్ట్రం మోదీ రాకతో పూర్తిగా కమలనాథుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈసారీ క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కాషాయదళాన్ని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం...
స్టేట్‌స్కాన్
గుజరాత్‌లో ఎన్నికలేవైనా బీజేపీ దెబ్బకు పారీ్టలన్నీ చుక్కలు లెక్కబెడుతున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం సీట్లు తమ ఖాతాలో వేసేసుకుంది. 2009లో 11 సీట్లు గెలిచి బీజేపీకి గట్టి పోటీ ఇచి్చన హస్తానికి ఆ తర్వాత రాష్ట్రం నుంచి లోక్‌సభలో పదేళ్లుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లోనైతే ఇరు పారీ్టల ఓట్ల శాతంలో ఏకంగా 30 శాతానికి పైగా అంతరముండటం విశేషం. బీజేపీకి 62.21 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.11 దక్కాయి మిగతా పారీ్టలేవీ ఇక్కడ పెద్దగా సోదిలో లేవు. గత ఎన్నికల్లో 25 చోట్ల పోటీ చేసిన బీఎస్పీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి!
కాంగ్రెస్.. ‘ఇండియా’ పోటీనిచ్చేనా!
గుజరాత్‌లో ఎంతో కొంత పుంజుకోవడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతూనే ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 60 సీట్లు కోల్పోయి 17కు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 చోట్ల పోటీ చేస్తుండగా భావనగర్, బారుచ్ స్థానాల్లో ఆప్ బరిలో ఉంది.
రైతులు, యువత, మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలపై ఇండియా కూటమి హామీల వర్షం కురిపిస్తోంది. వాటినే ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ వాటికే పెద్దపీట వేయడం తెలిసిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం చుక్కలనంటాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. పేదల పొట్టగొట్టి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం గుజరాత్‌లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విపక్షాలపై బీజేపీ కక్షగట్టి నేతలను వరుసగా జైలుపాలు చేస్తోందన్న ఇండియా కూటమి ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నుంచి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆప్ తరఫున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆప్ కీలక నేతలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు కూడా రంగంలోకి దిగారు.
కమలం బోణీ!
గుజరాత్‌లో ఇంకా పోలింగైనా జరగకుండానే తొలి ‘కమలం’ విరబూసింది! కాషాయదళం బోణీ కొట్టేసింది. సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో తేడా ఉండటంతో నామినేషన్ తిరస్కరణకు గురవడమే ఇందుకు కారణం.
కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్ పడ్సాలా నామినేషన్ కూడా పలు కారణాలతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతర పారీ్టల అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో ముకేశ్ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. సర్వేలన్నీ కమలం వైపే దాదాపు అన్ని సర్వేలూ బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా మొత్తం సీట్లను చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేయడం విశేషం.
బీజేపీ సమరోత్సాహం...
గుజరాత్‌లో రాజకీయం మోదీకి ముందు, తర్వాత అన్నట్టుగా మారిపోయింది. బీజేపీ దిగ్గజ నేత కేశూభాయ్ పటేల్ అనారోగ్యం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో 2001 అక్టోబర్‌లో మోదీ అనూహ్యంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఏడాదికే 2002 నాటి గోద్రా రైలు దహనంలో 60 మంది కరసేవకుల మరణం మతకల్లోలాలకు దారి తీసి రాష్ట్రాన్ని కుదిపేసింది. సీఎంగా వాటి అదుపులో మోదీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీశాయి. అయితే హిందుత్వ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు మోదీ.
ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి కేంద్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగినా గుజరాత్‌లో మోదీ పీఠాన్ని మాత్రం కదపలేకపోయింది. అద్వానీకి ప్రత్యామ్నాయంగా 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యరి్థగా మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతో పాటు వ్యూహాత్మకంగా యూపీలోని వారణాసి నుంచీ పోటీ చేసి రెండింటా ఘనవిజయం సాధించారు. బీజేపీకి ఒంటి చేత్తో మెజారిటీ దక్కించి ప్రధాని పగ్గాలు చేపట్టారు.
మోదీకి సేనాపతిగా పేరొందిన అమిత్ షా కూడా గుజరాత్‌లో బీజేపీ పాతుకుపోవడంలో కీలకంగా నిలిచారు. 2001 నుంచి 2014 దాకా గుజరాత్ సీఎంగా చక్రం తిప్పిన మోదీ ప్రధానిగా కూడా రాష్ట్రాభివృద్ధిపై బాగా దృష్టి పెట్టారు. దాంతో గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసింది. అయినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. కానీ 2022 ఎన్నికల్లో మళ్లీ చతికిలపడింది. 182 సీట్లకు బీజేపీ ఏకంగా 156 స్థానాలతో దుమ్మురేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు అభివృద్ధి అజెండాతో పాటు అయోధ్య రామమందిర సాకారం తదితర అంశాలను బలంగా ప్రచారం చేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment