అహ్మదాబాద్ : పోలింగ్ బూత్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ కెమెరాలు అమర్చారంటూ గుజరాత్ ఎమ్మెల్యే రమేష్ కటారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాహోద్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి జశ్వంత్ సిన్హా భాబోర్ తరఫున మంగళవారం ఆయన ఓ ప్రచార కార్యకమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ఈవీఎంపై జశ్వంత్ సిన్హా, కమలం గుర్తు కనిపించే మీటనే నొక్కాలి. అలా కాకుండా వేరే విధంగా జరగడానికి ఏమాత్రం వీల్లేదు. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలుసుకోవడానికి మోదీజీ ఈసారి కెమెరాలు అమర్చారు. తద్వారా మీరు బీజేపీకి ఓటేశారా లేదా కాంగ్రెస్‌కు ఓటేశారా అనేది తెలిసిపోతుంది. ఆధార్ కార్డుల్లో ఉన్న మీ ఫొటోలతో పోల్చి చూసినపుడు బీజేపీకి ఓటెయ్యని వారిని గుర్తిస్తాం. ఇక అప్పుడు మీరు ఉద్యోగాలు పొందలేరు’అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు.
కాగా రమేష్ కటారా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘ నిస్సహాయులైన ప్రజల గొంతుకలను నొక్కి తమకే ఓటు వేయాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపుతాయి’ అంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. యోగి, మేనక, మాయ మతవిద్వేష వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేత జయప్రద వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఆజంఖాన్ మాట్లాడారు. విద్వేష వ్యాఖ్యల అంశంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఈసీ చీవాట్లు పెట్టింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment