గాంధీనగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత పాలకులు వైఫల్యాల కారణంగా దేశం ఎంతో వెనుకబడి పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని కరౌలీ ప్రాంతంలో పర్యటించిన మోదీ.. కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పిదాల కారణంగా దేశం ఎంతో నష్టపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించే సత్తాలేక ఇతర దేశానికి తరలించారని మోదీ ధ్వజమెత్తారు.
ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘శాంతి భద్రతలు కాపాడడంలో యూపీఏ పాలకులు తీవ్రంగా విఫలమయ్యారు. దాని కారణంగానే 2009, 2014 ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర దేశాలకు తరలించారు. ఆ సమయంలో దేశంలో ఎన్నికలు ఉన్నందున రెండిటినీ నిర్వహించే దమ్ము కాంగ్రెస్‌కు లేకపోయింది. దాని కారణంగా అత్యంత అదరణ కలిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం మన యువత కోల్పోయింది’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక వైపు ఎన్నికలను, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తమదేనని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాక నవరాత్రి, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వంటి ఉత్సవాలను సైతం ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు.
పదేళ్ల యూపీఏ పాలనలో ఏదీ కూడా ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. కాగా 2009లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరుతున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని, మ్యాచ్‌లను ఇతర దేశానికి తరలించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఏడాది ఐపీఎల్‌ను దక్షిణాఫ్రీకాలో నిర్వహించారు. ఇదే కారణంతో 2014 ఎన్నికల సమయంలో కూడా కొన్ని మ్యాచ్‌లను తరలించాల్సి వచ్చింది. ఎన్నికల కారణంగా ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ను తరలిస్తారని ప్రచారం జరిగినా.. ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్‌లను ఒకేసారి నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment