
సాక్షి, హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ప్రధాని వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్ రాశారు. మోదీ ట్వీట్‌పై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ వంతుగా తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్, కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అందిరి బాధ్యత అని.. సరైన నాయకుడిని ఎన్నుకొని దేశాభివృద్ధిలో భాగం కావాలని ట్విటర్ వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా ఐపీఎల్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని అశ్విన్ కోరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ సందర్భంగా తమ రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగే సమయంలో తాము అక్కడే ఉండొచ్చు.. ఉండకపోవచ్చని, దీంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతున్నామని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబందనలు సవరించి ఐపీఎల్ ఆటగాళ్లు ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని మోదీకి అశ్విన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment