మేజిక్‌ రిపీట్‌! | Modi's hopes on the image on this elections | Sakshi
Sakshi News home page

మేజిక్‌ రిపీట్‌!

Published Tue, Apr 23 2019 5:00 AM | Last Updated on Tue, Apr 23 2019 5:00 AM

Modi's hopes on the image on this elections - Sakshi

కిందటి పార్లమెంటు ఎన్నికల్లో (2014) బీజేపీ మొత్తం 26 సీట్లూ గెలుచుకున్న రాష్ట్రం గుజరాత్‌. 1995 అసెంబ్లీ ఎన్నికల నుంచి కాషాయ పక్షానికి కంచుకోటగా మారింది ఈ రాష్ట్రం. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మధ్యలో రెండున్నరేళ్లు మినహా ఇప్పటి వరకు అధికారంలో బీజేపీయే కొనసాగుతోంది. పదో లోక్‌సభ (1991) ఎన్నికల నుంచి 2014 వరకూ జరిగిన ఏడు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గుజరాత్‌లోనే గెలుచుకుంది. 1989 ఎన్నికల్లో సైతం బీజేపీ 12 సీట్లు కైవసం చేసుకుంది.

పన్నెండున్నరేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ.. 2014 మేలో ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని పదవి చేపట్టిన మూడున్నర సంవత్సరాల తరువాత జరిగిన 2017 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీతో అధికారంలోకి రావడం ఆయన ‘ఇమేజ్‌’కు స్వల్పంగా దెబ్బ తగిలింది. తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రెండున్నరేళ్లకే పదవికి రాజీనామా చేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న మొదటి గుజరాతీ ప్రధాని మోదీ పదవిలో ఉండగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కారణంగా మరోసారి అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.


అసెంబ్లీలో 99కి తగ్గిన బీజేపీ బలం
మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115కి పైగా సీట్లు సాధించగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం 120 నుంచి 99 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్‌ తన బలాన్ని 57 నుంచి 78 సీట్లకు పెంచుకోగలిగింది. బీజేపీ, కాంగ్రెస్‌ వరుసగా 49.1 శాతం, 41.4 శాతం ఓట్లు సంపాదించాయి. అసెం బ్లీ ఎన్నికల ఫలితాలు, ఇతర పరిణామాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం నాలుగు నుంచి ఏడు వరకు గెలుచుకునే అవకాశాలున్నాయని ఎన్నికల పండితులు అంచనా వేస్తున్నారు. తాము 12 సీట్ల వరకూ గెలుచుకోగలమని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. ఈ నెల మొదట్లో ప్రకటించిన టైమ్స్‌నౌ–వీఎంఆర్‌ ఎన్నికల సర్వే మాత్రం బీజేపీకి 22, కాంగ్రెస్‌కు నాలుగు లోక్‌సభ సీట్లు దక్కే అవకాశం ఉందని జోస్యం చెప్పింది. పొరుగు రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే గుజరాత్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ముఖాముఖి పోటీ జరుగుతోంది. మొత్తం 26 సీట్లకు ఈ నెల 23 (మంగళవారం)న పోలింగ్‌ జరగనుంది.

40 శాతానికి పైగా పట్టణాల్లోనే..
దాదాపు ఆరున్నర కోట్ల జనాభా ఉన్న గుజరాత్‌లో 42.6 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. 57.4% జనం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నా రు. జాతీయ సగటుకు మించి రాష్ట్రంలో అక్షరాస్యత (80%) సాధించారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న తేడాల కారణంగా ఎన్నికల ఫలితాలపై కచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. పత్తి అధికంగా పండే ఈ రాష్ట్రంలో వేరుశనగ, జీలకర్ర విస్తారంగా పండిస్తున్నారు. సౌరాష్ట్ర ప్రాంతంలోనే ఈ పంటలు బాగా వేస్తారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల కోర్కె.. యువకులకు ఉద్యోగాలు కావాలన్న డిమాండ్‌ కారణంగా పెద్దగా వినిపించడం లేదు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ బాగా వినిపించింది. ఈ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌లో చేరి రాష్ట్రంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నా.. ఈ కోటా సంగతి ఎవరూ మాట్లాడట్లేదు. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం స్పల్పంగానైనా ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం, గ్రామీణ ప్రాంత సమస్యల వల్ల 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్రలో కాంగ్రెస్‌ బాగా పుంజుకుంది.

అడ్వాణీ అడ్డాలో అమిత్‌షా
బీజేపీ అగ్రనేతలు మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి ఒకసారి, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.అడ్వాణీ ఆరుసార్లు గెలిచిన గాంధీనగర్‌ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బరిలో దిగారు. గతంలో గుజరాత్‌ అసెంబ్లీకి, రాజ్యసభకు ఎన్నికైన షా పార్లమెంటుకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయనపై కాంగ్రెస్‌ తరఫున సీజే చావ్డా పోటీకి దిగారు. 1999 ఎన్నికల్లో అడ్వాణీపై కాంగ్రెస్‌ టికెట్‌పై మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ పోటీ చేసి ఓడిపోయారు. 1996లో ఇక్కడి నుంచి గెలిచాక వాజ్‌పేయి రాజీనామా వల్ల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన బాలీవుడ్‌ నటుడు రాజేశ్‌ ఖన్నా ఓడిపోయారు.

అడ్వాణీకి టికెట్‌ ఇవ్వరన్న విషయం తెలిశాక తనకు ఈ ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి లేదని ఆయన ప్రకటించారు. 2017 చివర్లో అమిత్‌షా గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే గాంధీనగర్‌లోనే అత్యధికంగా 19 లక్షల 21 వేలకు పైగా ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వాటిలో ఐదు పట్టణ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మిగిలిన రెండు సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఉత్తర గాంధీనగర్‌ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి సీజే చావ్డా ఠాకూర్‌ క్షత్రియ వర్గానికి చెందిన పశు వైద్యుడు. అయితే రాజకీయాల్లోకి రాక ముందు ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు.

‘ఇది అమిత్‌షాకు, సీజే చావ్డాకు మధ్య పోరాటం కాదు. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోరు. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్‌షా సురక్షిత స్థానాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? తీవ్ర పోటీ ఉండే సీటు నుంచి పోటీకి దిగవచ్చుకదా!’ అని చావ్డా వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాజ్‌పేయి, అడ్వాణీ గెలిచిన గాంధీనగర్‌లో స్థానికుడినైన తాను పోటీ చేయడం ఎంతో గర్వంగా ఉందని అమిత్‌షా చెప్పారు. అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు ముందు సర్ఖేజ్‌ నుంచి నాలుగుసార్లు, తర్వాత నారాన్‌పురా నుంచి ఒకసారి షా ఎన్నికయ్యారు. గాంధీనగర్‌ నుంచి షా పోటీ చేస్తారనే విషయం తెలియగానే బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ ప్రయత్నించింది. పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ను ఇక్కడ బరిలోకి దింపాలన్న ఆలోచనకు కోర్టు ఆదేశంతో అడ్డుకట్ట పడింది.

ప్రభావం చూపని పాటీదార్ల ఆందోళన
ఉత్తరాది హిందీ రాష్ట్రాలైన యూపీ, బిహార్‌తో పోలిస్తే గుజరాత్‌ రాజకీయంగా అంత సంక్లిష్టమైన రాష్ట్రం కాదు. ఇక్కడ రాజకీయ సుస్థిరత ఎక్కువ. ఈ రెండు హిందీ రాష్ట్రాల్లో మాదిరిగా మతం ప్రభావం ఎన్నికల్లో ఉంది. కానీ, కులం సూటిగా కాకుండా పరోక్షంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. రాష్ట్రంలో ఆధిపత్య, అభివృద్ధి చెందిన సామాజికవర్గంగా భావించే పాటీదార్లు (పటేళ్లు) 2016లో తమను బీసీల్లో చేర్చి రిజర్వేషన్‌ కల్పించాలంటూ ఉద్యమించిన ఫలితంగా వారు పాలక పక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా మారారనే అభిప్రాయం కలిగింది. ఏడాది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం పాటీదార్లలో కొంత మందే కాంగ్రెస్‌ వైపు మళ్లారని బీజేపీకి వచ్చిన సీట్లు, ఓట్ల శాతం సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కొంత మేరకు
జనాదరణ కోల్పోయినా పాటీదార్లందరూ బీజేపీకి దూరం కాలేదు.

దక్షిణ గుజరాత్‌లో బీజేపీ హవా
దక్షిణ గుజరాత్‌ బీజేపీ బలం చెక్కుచెదరకపోవడంతో కాంగ్రెస్‌ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటికి మారిన రాజకీయ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని అత్యధిక సీట్లలో పాలక పక్షం నుంచి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. దక్షిణ గుజరాత్‌లో బీజేపీ దాదాపు అన్ని సీట్లూ కైవసం చేసుకునే వీలుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతంలో భరూచ్, బార్డోలీ, సూరత్, నవాసారి, వల్సాద్‌ లోక్‌సభ సీట్లున్నాయి. ఈ ఐదింటిలో సూరత్, నవాసారి, భరూచ్‌లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమే. మిగిలిన రెండు స్థానాల్లోనే కాంగ్రెస్‌ మోస్తరు పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.
     1989 నుంచీ సూరత్‌ను వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోంది. 2014లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి దర్శనా జర్దోష్‌ 5 లక్షల 33 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఈసారి ఆమె తనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి, సౌరాష్ట్రకు చెందిన పాటీదార్‌ అశోక్‌ అధేవడాపై సునాయాసంగా గెలుస్తారని అంచనా. అయితే బీజేపీ మెజారిటీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని స్థానిక కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.
     నవాసారిలో కిందటిసారి బీజేపీ అభ్యర్థి సీఆర్‌ పాటిల్‌ 5 లక్షల 58 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సూరత్‌ నగరంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు నవాసారి పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ బీజేపీకి బలమైన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న కోలీ వర్గం (మత్స్యకారులు) నేత ధర్మేష్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. అయినా బీజేపీ గెలుపు తేలికేనని అంటున్నారు.

భరూచ్‌లో త్రిముఖ పోటీ
భరూచ్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరుగుతోంది. ఈ సీటును బీజేపీ 1989 నుంచీ వరుసగా తొమ్మిదిసార్లు గెలిచింది. ఇక్కడా బీజేపీకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. ఐదుసార్లు వరుసగా గెలిచిన మన్సుఖ్‌ వాసవాను బీజేపీ మరోసారి ఇక్కడ నిలబెట్టింది. యువజన కాంగ్రెస్‌ నాయకుడు షేర్‌ఖాన్‌ పఠాన్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. అయితే, ఎమ్మెల్యే, బీటీపీ నేత చోటూ వాసవా ఇక్కడ నామినేషన్‌ వేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీతో తనకు ముఖాముఖి పోటీ జరిగేలా చూడడానికి వాసవా కాంగ్రెస్‌ మద్దతు కోరారు. కాంగ్రెస్‌ అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన బీటీపీ నేత.. ఆదివాసీ జనాభా ఉన్న మరి కొన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపారు.

మధ్య, దక్షిణ గుజరాత్‌ బీజేపీ కంచుకోట..
గుజరాత్‌ మధ్య, దక్షిణ ప్రాంతాలు బీజేపీకి బలమైన కేంద్రాలు. కాంగ్రెస్‌కు సౌరాష్ట్ర, కఛ్‌ ప్రాంతాల్లో మంచి జనాదరణ ఉంది. కాంగ్రెస్‌కు తిరుగులేని పట్టు ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రజలను గత పాతికేళ్లలో గణనీయ సంఖ్యలో బీజేపీ ఆకట్టుకోగలిగింది. పాటీదార్ల ఆందోళనకు కేంద్ర స్థానమైన ఉత్తర గుజరాత్‌లో మాత్రం కాషాయపక్షం బలహీనపడింది. మళ్లీ ఇక్కడ బలం పుంజుకోవడానికి వెనుకబడిన తరగతుల నేత అల్పేష్‌ ఠాకూర్‌ మద్దతు కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఆయన ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇంకా ఎవరికీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించలేదు. ఆదివాసీలు ఎక్కువ మంది ఉన్న ఉత్తర గుజరాత్‌లో నాలుగు సీట్లు ఎస్టీలకు, రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు చేశారు.

బార్డోలీలో కాంగ్రెస్‌కు గట్టి పోటీ
ఆదివాసీలకు రిజర్వు చేసిన బార్డోలీలో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి తుషార్‌ చౌధరి తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రభు వాసవా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్‌ సభ్యుడైన వాసవా 2014లో చౌధరిని లక్షా 24 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ అభ్యర్థి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాని, తన విజయం ఖాయమని చౌధరి నమ్ముతున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బార్డోలీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని 12 వేల ఓట్లకు తగ్గించగలిగామని కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు చెప్పారు. స్థానిక నేతలతో తుషార్‌ చౌధరికి మంచి సంబంధాలు లేకపోవడం వల్ల బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది.

వల్సాద్‌.. ఎవరో వస్తాద్‌?
వల్సాద్‌ (ఎస్టీ) సీటులో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు కేసీ పటేల్‌పై కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా సీనియర్‌ ఎమ్మెల్యే జీతూ చౌధరిని నిలబెట్టింది. ఇక్కడ గెలిచే పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయనే నమ్మకం ఆనవాయితీగా ఉంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో పటేల్‌ రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీతూ చౌధరి కప్రాదా స్థానంలో కేవలం 170 ఓట్లతో గట్టెక్కారు. వల్సాద్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ మెజారిటీ లక్షా 39 వేలకు పడిపోయింది. ఇంతటి భారీ ఆధిక్యం బీజేపీకి ఉన్నా జీతూ చౌధరి జనాదరణ ఉన్న ఆదివాసీ నాయకుడు కావడంతో ఆయనకు విజయావకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

పోటీలో కోటీశ్వరులు
తూర్పు అహ్మదాబాద్‌ నియోజకవర్గం బరిలో ఉన్న  26 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్టు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి సోమాభాయ్‌ పటేల్‌కు 7.46 కోట్లుండగా, బీఎస్పీ అభ్యర్థి గణేశ్‌ వాఘేలాకు రూ.7 కోట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి గీతా పటేల్‌కు రూ.4 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పోటీ చేస్తున్న గాం ధీనగర్‌లో ఐదుగురు కోటీశ్వరులున్నారు. షా తనకు రూ.40 కోట్లకు పైగా ఆస్తులున్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సీజే చావ్డాకు రూ.12 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి.


చోటు వాసవా, అమిత్‌ చావ్డా,అమిత్‌ షా


హార్దిక్, గీతా  పటేల్, దర్శనా జర్దోష్, సీజే చావ్డా


షేర్‌ఖాన్, ప్రభు వాసవా, మాన్‌సుఖ్‌ వాసవా, కేసీ పటేల్‌


తుషార్‌ చౌధరి, సోమాభాయ్‌ పటేల్‌


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement