వారణాసిలో బీజేపీ కార్యకర్తలతో భేటీలో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, యూపీ సీఎం యోగి
వారణాసి/ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టేలా ఎన్నికల గణితం (అర్థమెటిక్)పై కెమిస్ట్రీ గెలుపు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గణాంకాలన్నిటినీ మించిన కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ఒకటి ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆ కెమిస్ట్రీయే గణాంకాలపై విజయం సాధించింది’ అని మోదీ వివరించారు. ‘నేను దేశానికి ప్రధానమంత్రిని. కానీ మీకు ఎంపీని. మీ సేవకుడిని’ అని ప్రధాని అన్నారు.
పార్టీ కార్యకర్తలు ఎన్నికల పరీక్షను డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణులయ్యారన్నారు. వరసగా రెండో సారి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేసేందుకు సోమవారం ఆయన వారణాసి సందర్శించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలుచేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు రోడ్ షోను తలపిస్తూ నగరంలోని పలు వీధుల గుండా భారీ బందోబస్తు మధ్య ఆయన వాహనశ్రేణి ముందుకుసాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్లపై బారులు తీరి నిలబడ్డారు. దాబాలపై నుంచి గులాబీ రేకులు విసిరారు.
అదో దురభిప్రాయం
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ అనేది ఒక దురభిప్రాయంగా మోదీ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పండితులు బీజేపీని ఇప్పటికీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా పరిగణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ఆలోచనా విధానం, తార్కికత 20వ శతాబ్దానిదనే విషయం వారికి తెలియదన్నారు.
బీజేపీ ఓట్ల శాతం పెరగని ప్రాంతమే దేశంలో లేదన్నారు. ‘అసోంలో మన ప్రభుత్వం ఉంది. లడఖ్‌లో గెలుస్తున్నాం. అయినా రాజకీయ పండితులు మనవి హిందీ ప్రాంత రాజకీయాలంటారు. ఈ విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారు’ అని మోదీ చెప్పారు. అబద్ధాలు, తప్పుడు తార్కికతతో ఈ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారన్నారు. ‘ఇలాంటి తప్పుడు అవగాహన కారణంగానే ప్రజలు మనతో ఉండేందుకు ఇష్టపడరు. కానీ పారదర్శకత, కఠోర శ్రమతో అలాంటి తప్పుడు, చెడు అవగాహన కల్పించేవారిని ఓడించవచ్చు’ అని అన్నారు.
రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది..
బీజేపీ రాజకీయ అస్పృశ్యత, రాజకీయ హింస వంటి ముప్పులను ఎలా ఎదుర్కొందో మోదీ చెప్పారు. ‘కేరళ, కశ్మీర్, బెంగాల్ లేదా త్రిపురలకు సంబంధించిన కేసులు చూడండి. త్రిపురలో కార్యకర్తలను ఉరి తీశారు. బెంగాల్లో హత్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కూడా. నాకు తెలిసి దేశంలో ఒకేఒక్క రాజకీయ పార్టీ హత్యలకు గురయ్యింది. హింసను చట్టబద్ధం చేశారు. ఇది మన ముందున్న ఒక ప్రమాదం’ అని చెప్పారు. ‘ అంబేడ్కర్, గాంధీజీ అస్పృశ్యతను రూపుమాపారు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది.
బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ నేత హత్య, బెంగాల్‌లో కార్యకర్త కాల్చివేతలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణంలో కూడా బీజేపీ.. ‘అందిరితో, అందరి వికాసం కోసం..’ అనే నినాదానికే కట్టుబడి ఉందని చెప్పారు. మిగతా పార్టీల్లాగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పోరాడిన తన ప్రత్యర్థులకు కూడా తాను రుణపడి ఉంటానన్నారు.
ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రాధాన్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ఇతరులు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష ఛాయలే ఉండవన్నారు. ‘కానీ త్రిపురలో చూడండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అదే సమయంలో మంచి విపక్షం ఉంది. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే, పార్టీ వ్యూహాలకు రూపకల్పన చేస్తుందన్నారు.
ప్రభుత్వం, పార్టీ వ్యవస్థల మధ్య ఉండే సమన్వయం ఒక గొప్ప శక్తిలాంటిదని, బీజేపీ ఈ విషయం తెలుసుకుందని మోదీ అన్నారు. శ్రమ, శ్రామికులు అద్భుతాలు సృష్టిస్తాయన్నారు. తన గెలుపునకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కిందిస్థాయి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల కఠోరశ్రమకు, అంకిత భావానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ అభివృద్ధి అంటే ఏమిటో కొద్దిగానే చూపించారని, వచ్చే ఐదేళ్లలో కాశీ అత్యద్భుతమైన నగరంగా మారుతుందని చెప్పారు.
నెహ్రూకి నివాళి
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘పండిట్ జవహర్‌లాల్ నెహ్రూజీకి నివాళులు. జాతి నిర్మాణానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు బీజేపీ నేతలు నెహ్రూకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment