మోదీకి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలుకుతున్న వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మాల్దీవుల్లో తొలి పర్యటన..
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం.
వెంకయ్య ఇంటికి మోదీ
కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment