Record majority
-
రఘువీర్‌రెడ్డి రికార్డు మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు నమోదైంది. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డికి 7,84,337 ఓట్లురాగా.. సమీప బీజే పీ అభ్యర్థి సైదిరెడ్డికి 2,24,431 ఓట్లు వచ్చాయి. అంటే రఘువీర్‌రెడ్డి 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ. ఇంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు 3,97,029 ఓట్ల మెజారిటీ లభించింది. అయి తే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ గెలిచిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక అదే ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (బీఆర్ఎస్) 3,92,574 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా విజ యం సాధించిన పసునూరి దయాకర్‌కు 3,50,298 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ రఘువీర్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ.. ఉమ్మడి రాష్ట్రంలో పరిశీలిస్తే.. అత్యధిక మెజారిటీ మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నర్సింహారావు పేరిట ఉంది. 1991 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీచేసి 5,80,297 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత 2011 కడప లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 5,45,672 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. -
పంచాయతీ ఎన్నికలు; ‘అనంత’లో రికార్డ్ మెజారిటీ
సాక్షి, గోరంట్ల: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లాలో భారీ మెజారిటీ నమోదైంది. గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన సరోజ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ పరిధిలో గోరంట్ల, సింగిరెడ్డిపల్లి, గుమ్మయ్యగారిపల్లి, కసిరెడ్డిపల్లి, తిరగంవాండ్లపల్లి గ్రామాలు, 20 వార్డులు న్నాయి. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్సీపీ మద్దతుతో సరోజ బరిలో నిలవగా.. టీడీపీ మద్దతుతో రంగమ్మ పోటీపడ్డారు. ఇక్కడ మొత్తం 19,616 మంది ఓటర్లుండగా.. 13,565 మంది (69.03 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరోజ 5,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెళ్లి పీటల నుంచి పోలింగ్ కేంద్రానికి.. మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని చందకచెర్లు ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరువపల్లి గ్రామానికి చెందిన కోటానాయక్, కొత్తలం తండాకు చెందిన లావణ్యబాయికి ఆదివారం పావగడలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని నవ దంపతులు చెప్పారు. అలాగే అనంతపురం జిల్లా పరిగికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు వినయ్‌రెడ్డి, శ్రావణిల వివాహం ఆదివారం జరిగింది. మాంగల్యధారణ తర్వాత నూతన వధూవరులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం -
కలిసి పనిచేయాలని ఉంది
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. రెండు దేశాల ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఉందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధన కోసం హింస, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పాల్సి ఉందని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలపడంతోపాటు దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధనకు మోదీతో కలిసి పనిచేయాలని ఉందంటూ ప్రధాని ఇమ్రాన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ తెలిపారు. ఇరు దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారన్నారు. అయితే, ప్రధాని ఇమ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ...ఈ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద, హింసా రహిత వాతావరణం నెలకొనాలని, పరస్పరం విశ్వాసం పెంపొందాలని పేర్కొన్నారు. మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల నేతల అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ప్రపంచ శక్తిగా భారత్
అహ్మదాబాద్: భారత్ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు. నన్ను వేళాకోళం చేశారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయని మోదీ అన్నారు. ‘ఆరో విడత ఎన్నికల చ్రారంలో భాగంగా ఎన్డీయేకు 300కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని నేను చెప్పగానే చాలామంది వేళాకోళం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీచేయడం లేదు.. ప్రజలే పోటీ చేస్తున్నారు అని నేను చెప్పాను. బీజేపీని మరోసారి అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు’ అని మోదీ వెల్లడించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సూరత్ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు చనిపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రథయాత్రలకూ ఇబ్బంది పడ్డారు: అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, రాష్ట్రంలో గూండాయిజాన్ని, అవినీతిని అంతమొందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ‘ప్రజలు నరేంద్ర భాయ్‌ను అమితంగా అభిమానించడానికి ఓ కారణం ఉంది. ఆయన చాలాగ్రామాల్లో పర్యటించారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గుజరాత్‌ను బీజేపీకి కంచుకోటగా తీర్చిదిద్దారు’ అని షా ప్రశంసించారు. -
మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), అన్నాడీఎంకే పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తుకు ప్రతిఫలంగా మోదీ మంత్రివర్గంలో జేడీయూకు 1–2 మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మే 30న ప్రధాని మోదీతో కలిసి వీరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దీంతో పాటు పశ్చిమబెంగాల్లో ఈసారి 18 లోక్‌సభ సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడులో పట్టుకోసం బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో ఒకే సీటు దక్కించుకున్న అన్నాడీఎంకేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో 6 స్థానాలు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు మరోసారి మంత్రి పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. గాంధీనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు కీలక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించేందుకు షా నిరాకరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటుతో సరిపుచ్చుకున్న బీజేపీ, ఈసారి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందనీ, కాబట్టి తెలంగాణ నుంచి కేబినెట్లో ఒకరికి చోటు దక్కే అవకాశముందంటున్నారు. -
మే 30, రాత్రి 7 గంటలు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మాల్దీవుల్లో తొలి పర్యటన.. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం. వెంకయ్య ఇంటికి మోదీ కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. -
టార్గెట్ @ 125
లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ తన తదుపరి గురి రాజ్యసభపై పెట్టింది. పెద్దల సభలో మెజార్టీ సాధించడమే ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల ముందున్న లక్ష్యం. గత కొద్ది కాలంలో ఎన్డీయే ప్రతిపాదించిన కీలక బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందకుండా ఆగిపోయాయి. ట్రిపుల్ తలాక్, మోటార్ వాహన చట్టం, పౌర చట్టాలకు సవరణ బిల్లులు ఎన్డీయేకి తగినంత బలం లేని కారణంగా పెద్దల సభలో ఆమోదం పొందలేకపోయాయి. ఇటీవల కాలంలో అదే ఎన్డీయేకి అడ్డంకిగా మారింది. దానిని అధిగమించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం 101 ఎంపీల బలం గత ఏడాది పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని మించి రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకుంది. 245 సీట్లు ఉన్న సభలో ఎన్డీయే ఎంపీల సంఖ్య 101కి చేరుకుంది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు స్వప్న దాస్‌గుప్తా, మేరీకోమ్, నరేంద్ర యాదవ్‌ల మద్దతు కూడా బీజేపీకే ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుతో కలిపి ఎన్డీయే బలం 107కి చేరుకుంది. ఆరేళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సభ్యులందరి ఎన్నికలు ఒకేసారి జరగవు. విడతల వారీగా సభ్యులు పదవీ విరమణ చేసినప్పుడల్లా కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలి. దేశవ్యాప్తంగా ఎన్డీయేకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభకు ఎక్కువ మంది ఎంపీలను పంపగలదు. విపక్షాల ప్రమేయం లేకుండా పెద్దల సభలో బిల్లులు పాస్ కావాలంటే ఎన్డీయేకి 123 మంది ఎంపీలు కావాలి. 2020 నవంబర్ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. అసోం నుంచి మూడు, రాజస్తాన్ నుంచి రెండు, ఒడిశా నుంచి ఒకటి సభ్యులతో ఎన్డీయే బలం వచ్చే ఏడాదికి పెరగనుంది. రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేయగలిగితే రాజ్యసభలో బలం కూడా పెరుగుతుంది. ఇప్పట్నుంచి నవంబర్ 20 మధ్య కాలంలో కొత్తగా పెద్దల సభకు 75 మంది సభ్యులు వెళతారు. ఎన్డీయే తన మార్కు పరిపాలన చూపించాలన్నా, కొత్త సంస్కరణలకు తెరతీయాలన్నా రాజ్యసభలో మెజార్టీ కూడా అత్యంత అవసరం. -
ముస్లిం చిన్నారికి ‘నరేంద్ర మోదీ’ పేరు
గోండా(యూపీ): ప్రధాని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన నవజాత శిశువుకి ‘నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడి పర్సాపూర్ మహరార్ గ్రామానికి చెందిన మైనాజ్ బేగం లోక్‌సభ ఫలితాలు వెల్లడై నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలిచిన రోజే తన బిడ్డకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచనకు వచ్చింది. ‘మేమందరం ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించాం. కానీ ఆమె తన ఆలోచనను అస్సలు మార్చుకోలేదు. ఇదే విషయాన్ని దుబాయిలో ఉన్న తన భర్త ముస్తాక్ అహ్మద్‌కు తెలుపగా ఆయన కూడా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఎంతకీ వినకపోవడంతో చివరికి ఆమె కోరిక మేరకే పేరు పెట్టేందుకు ఒప్పుకున్నాడు’అని మైనాజ్ బేగం మామ ఐద్రీస్ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడి పేరుతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ పొందడానికి ఆ జిల్లా మెజిస్ట్రేట్‌లో అఫిడవిట్ దాఖలు చేసి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (పంచాయతీ) ఘనశ్యామ్ పాండేకు సమర్పించారు. -
నేలకొరిగిన హేమాహేమీలు..
‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానమే లభించలేదు. మహాకూటమిగా పోటీచేసి మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించాలనీ, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చాలాచోట్ల బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. దీనికితోడు ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లో సయోధ్య విషయంలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం, పలుచోట్ల త్రిముఖ పోరు ఏర్పడ టంతో ఎన్డీయే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 352 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పనిచేయని ‘చౌకీదార్’ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆరోపించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌకీదార్ చోర్ హై(కాపలాదారు దొంగగా మారాడు) అని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనివల్లే బీసీలు, ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్న చాలాప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్స్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి ఈసారి రాహుల్ పోటీచేశారు. ఒకవేళ రెండుచోట్ల రాహుల్ విజయం సాధిస్తే ఆయన వయనాడ్‌ను ఎంచుకుంటారని అమేథీలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. అదే సమయంలో మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక బరిలోకి దిగుతారని కవ్వించి, చివరికి అజయ్‌రాయ్‌ను అభ్యర్థిగా నిలపడం కూడా పార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు ఢిల్లీలో ఆప్, యూపీలో ఎస్పీ–బీఎస్పీ, పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఆ పార్టీ పాలిట శరాఘాతంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బెంగాల్లో 2 సీట్లకు పరిమితమైంది. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన సోనియాగాంధీ పార్టీ పరువును నిలిపారు. నేలకొరిగిన హేమాహేమీలు.. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ సునామీకి పలువురు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలకు ఓటమి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, మహారాష్ట్రలో అశోక్ చవాన్, మిలింద్దేవ్రా, సుశీల్‌కుమార్ షిండే, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, ఢిల్లీలో షీలా దీక్షిత్ వంటి హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మోదీని సాగనంపుతామని బీరాలు పలికిన మమతా బెనర్జీకి పశ్చిమబెంగాల్లో షాక్ తగిలింది. 2014లో 36 సీట్లను దక్కించుకున్న మమత.. ఈసారి 22 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ ఏకంగా 18 చోట్ల విజయం సాధించింది. ఇక యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నెహ్రూ బాటలో నడిస్తేనే.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దివంగత జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతోంది. వాస్తవానికి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్ బలహీనపడటం మొదలుపెట్టింది. 2004లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, 2009లో మరోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చాక భజనపరులు చుట్టూ చేరారు. పార్టీని సైద్ధాంతికంగా బలపర్చడం పక్కనపెట్టి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమై 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓటమిని చవిచూసింది. ఇప్పటికైనా పార్టీలో భజనపరులను పక్కనపెట్టి, సైద్ధాంతికంగా నెహ్రూ బాటలో నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా మళ్లీ పాయే.. 130 ఏళ్ల చరిత్ర.. ఎందరో ప్రధానమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం. కానీ, కాలం కలిసిరాకపోతే ఏమవుతుందో పదేళ్లుగా ప్రత్యక్షంగా అనుభవిస్తోంది ఆ పార్టీ. 2014 ఎన్నికల్లో మోదీ హవాలో చచ్చీచెడీ 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది తెలిసిందే. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నా... ఆయనకు ప్రతిపక్ష నేత హోదా మాత్రం దక్కలేదు. అయితే ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో ఖర్గే లోక్‌సభ, సీబీఐ డైరెక్టర్, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లలో సత్తువ కూడగట్టుకుని ఈ హోదాకు కావాల్సిన పదింట ఒకవంతు స్థాయి సీట్లయినా గెలుస్తుందని చాలామంది ఆశించారు. అయితే, తాజా ఎన్నికల్లో 50 సీట్లకు అటూఇటుగా పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు ఈసారీ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండాపోయాయి. -
కొనసాగుతున్న ర్యాలీ 2.0
నరేంద్ర మోదీ ఘన విజయ సంబరాలు స్టాక్మార్కెట్లో శుక్రవారం కూడా కొనసాగాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,800 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ కారణంగా గురువారం నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొనుగోళ్లతో కళకళలాడింది. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 623 పాయింట్లు లాభపడి 39,435 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో ఈ నెల 20న నెలకొల్పిన క్లోజింగ్ రికార్డ్లను సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం బ్రేక్ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెంటిమెంట్‌కు జోష్... ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఘన విజయం దక్కిన కారణంగా కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మక నిర్ణయాలు తీసుకోగలదనే అంచనాలు పెరిగాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. ఇది బిజినెస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో పెట్టుబడులకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు.. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని నిపుణులంటున్నారు. అంతకంతకూ పెరిగిన లాభాలు... ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఉదయం పదిగంటల సమయంలో లాభాలు తగ్గాయి. ఆ తర్వాత అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు... ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. వచ్చే నెల మొదటి వారంలో జరిగే మోనేటరీ పాలసీలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించనున్నదని, కొత్త ప్రభుత్వం మరిన్ని మూలధన నిధులను అందించనున్నదని, బలహీన బ్యాంక్‌లను బలమైన బ్యాంక్‌ల్లో విలీనం చేసే ప్రక్రియ మరింత వేగవంతం కాగలదన్న అంచనాలు బ్యాంక్ షేర్లను లాభాల బాట నడిపిస్తున్నాయి. మరిన్ని విశేషాలు.... ► 31 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభపడగా, 4 షేర్లు–ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్ నష్టపోయాయి. నిఫ్టీ 50లో 44 షేర్లు లాభాల్లో, 6 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం లాభంతో రూ.432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.434ను తాకింది. ఈ షేర్‌తో పాలు 20కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆర్తి ఇండస్ట్రీస్, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, కల్పతరు పవర్, మణప్పురం ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వాటా కొనుగోళ్ల విషయమై హిందుజా గ్రూప్, ఇతిహాద్ ఎయిర్‌వేస్‌ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 5 శాతం నష్టంతో రూ.148 వద్ద ముగిసింది. ► రూ.616 కోట్ల ఆర్డర్లు రావడంతో జేఎమ్‌సీ ప్రాజెక్ట్స్ షేర్ 14 శాతం లాభంతో రూ.135 వద్దకు చేరింది. ► గతంలోలాగానే ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక రంగంపై మరిన్ని నిధులు ఖర్చు చేయగలదనే అంచనాలతో సిమెంట్ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో హెడెల్‌బర్గ్ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, జేకే సిమెంట్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 3–11 శాతం రేంజ్లో ఎగిశాయి. ► 170కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. దిలిప్ బిల్డ్‌కాన్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, అమృతాంజన్ హెల్త్‌కేర్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, జేఎమ్‌టీ ఆటో షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 5 రోజుల్లో.. రూ. 6 లక్షల కోట్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.2.54 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,53,830 కోట్లు పెరిగి రూ.1,52,71,407 కోట్లకు చేరింది. ఇక ఈ వారం 5 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది. చరిత్రాత్మక వారం... వారంపరంగా చూస్తే, సెన్సెక్స్ 1,503 పాయిం ట్లు, నిఫ్టీ 437 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇరు సూచీలు దాదాపు 4% ఎగిశాయి. ఈ ఏడాది ఈ సూచీలు అత్యధికంగా లాభపడింది ఈ వారమే. ఈ వారంలోనే సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం ఆల్‌టైమ్ హై వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా జీవిత కాల గరిష్టానికి ఎగసింది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 6% లాభపడింది. మరోవైపు ఇన్వెస్టర్ల భయా న్ని ప్రతిబింబించే ఇండియా ఓలటాలిటీ ఇం డెక్స్ ఈ వారంలో 41 శాతం క్షీణించింది. ఈ వారంలో ఈ సూచీ 44 నెలల గరిష్ట స్థాయి, 30.18కు ఎగసినా, ఎన్నికల ఫలితాల కారణంగా 16.54 స్థాయికి దిగివచ్చింది. -
వికటించిన గట్బంధన్
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించాలనుకున్న ప్రతిపక్షాలకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి 64 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీకి చెక్ పెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన మహాకూటమి(గట్బంధన్) కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ కూటమి వేర్వేరుగా పోటీచేయడంతో కమలనాధుల విజయం సులువైందని విశ్లేషకులు చెబుతున్నారు. సోనియా ప్రయత్నాలకు చెక్.. యూపీలో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడం ద్వారా ప్రధాని మోదీని నిలువరించాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ భావించారు. ఇందుకు అనుగుణంగానే మహాకూటమిలో చేరేందుకు ముందుకొచ్చారు. యూపీలో తమకు కేవలం 15 లోక్‌సభ స్థానాలు ఇస్తే చాలన్నారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే విజయావకాశాలు దెబ్బతింటాయన్న అనుమానంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. # కంచుకోట అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఓటమి చవిచూడగా, సోనియా రాయ్‌బరేలీలో గెలిచి పరువు కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలో లాభపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది బీఎస్పీ చీఫ్ మాయావతియే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి మొత్తం 15 సీట్లురాగా, వీటిలో బీఎస్పీనే 10 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీకి 5 లోక్‌సభ సీట్లు దక్కగా, మరో మిత్రపక్షం ఆర్ఎల్డీ ఖాతానే తెరవలేదు. సమాజ్‌వాదీ పార్టీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగలింది. -
కమలం @ 303
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే (44) ఈసారి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచాయి. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు 22 చొప్పున, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. యూపీలో బీజేపీ దాని మిత్రపక్షం మొత్తం 80కి గాను 64 సీట్లలో గెలుపొందగా ఎస్పీ, బీఎస్పీల కూటమి దాదాపుగా చతికిలబడిపోయింది. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. 2014లో ఈ పార్టీలు 10 సీట్లు దక్కించుకున్నాయి. కమలదళం జోరు ఇతర రాష్ట్రాల్లో ప్రభావాన్ని పెంచుకున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో మొత్తం 65 సీట్లకు గాను ఏకంగా 61 సీట్లలో విజయదుందుభి మోగించింది. ఆరు నెలల క్రితం ఈ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 28 లోక్‌సభా స్థానాలకు గాను 25 సీట్లలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ ప్రభంజనంలో తుముకూరు నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ కూడా ఓటమి చవిచూశారు. ఒడిశాలో గత ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ ఈసారి 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాళీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణ వంటి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అరుణాచల్‌ప్రదేశ్, దాదర్ అండ్ నాగర్‌హవేలీ, డామన్ అండ్ డయు, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూక శ్మీర్, లక్షద్వీప్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం చెప్పారు. బెంగాల్లో కమల వికాసం 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ పశ్చిమబెంగాల్లో పాగా వేయాలన్న ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ప్రయత్నాలు ఫలించాయి. సై అంటే సై అంటూ సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ తొలి సారి సత్తా చాటింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 చోట్ల ఘనవిజయం సాధించింది. మరో 22 చోట్ల రెండోస్థానంలో నిలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు గుబులు పుట్టించింది. మరోవైపు టీఎంసీ 22 స్థానాలతో తొలిస్థానంలో నిలిచింది. కాగా, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్షాలు ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి 43.3 శాతం ఓట్లు పోల్‌కాగా, బీజేపీకి 40.25 శాతం ఓట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిసారించిన బీజేపీ ఉత్తరబెంగాల్లోని జంగల్ మహల్ ప్రాంతంలో క్లీన్‌స్వీప్ చేసింది. జాఘ్రామ్, మేదినిపురి, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ సీట్లను గెలుచుకుంది. అయితే దక్షిణబెంగాల్‌లో మమత పట్టును నిలుపుకున్నారు. -
మోదీ మంత్ర
భారతావని కమలవనమయ్యింది. చౌకీదార్ ప్రభంజనం సృష్టించాడు. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. పార్టీకి మరో ఐదేళ్ల అధికారాన్ని కానుకగా ఇచ్చారు. పైకి కన్పించని, నిశ్శబ్ద తరంగంలా వీచిన మోదీ గాలి హిందీ రాష్ట్రాలతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలనూ కుదిపేసింది. నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బలనుంచి పుంజుకుని.. 2016 నవంబర్‌లో మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రూ.1,000, రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు జనం పరుగులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బే పడింది. వేరే నాయకులెవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కూడా దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ నిర్ణయానికి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మోదీ వీటన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొన్నారు. తర్వాత అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతులకు ఆదాయ కల్పన, భారీ ఆరోగ్య బీమా పథకం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు, హామీలు తిరిగి మోదీ పుంజుకునేలా చేశాయి. అవినీతిని అరికట్టే క్రమంలో దేశానికి తాను కాపలాదారు (చౌకీదార్)నని కూడా మోదీ చెప్పుకున్నారు. రాహుల్ వైఫల్యం ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కాంగ్రెస్‌లో కొత్త ఆశలు నింపింది. ఈ నేపథ్యంలో మోదీ లక్ష్యంగా చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అనే నినాదాన్ని, రఫేల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. పదే పదే ఇవే అంశాలను వల్లెవేశారు. రఫేల్ కేసులో సుప్రీం క్లీన్చిట్ ఇచ్చినా తీర్పును ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి తప్పుగా ఆపాదించి చివరకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. ఈ నినాదాలు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను తప్ప మిగతావారిని ఆకర్షించలేక పోయాయి. మరోవైపు రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. ఇదే సమయంలో యూపీఏ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు కూడా కాంగ్రెస్ వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తామూ ప్రధాని రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా స్పష్టంగా ప్రకటించలేని కాంగ్రెస్ నిస్సహాయత బీజేపీకి కలిసొచ్చింది. మా వైపు మోదీ.. మీ వైపు ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా బీజేపీ విజయం సాధించింది. అలాగే పొత్తుల విషయంలో కూడా మోదీ పరిణతితో వ్యవహరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూస్తే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది. అలాగే బీజేపీతో ముఖాముఖి పోరు జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఆమెను ఒక అతిథి నటి మాదిరిగానే పరిగణించింది తప్ప పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధిస్తే చాలన్నట్టుగా వ్యవహరించి దెబ్బతింది. ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి వైఫల్యం కూడా బీజేపీకి లబ్ధి చేకూరేలా చేసింది. రెండుసార్లు ఘన విజయం.. 1984లో లోక్‌సభలో కేవలం రెండు సీట్లు కలిగిన బీజేపీ 2 సార్వత్రిక ఎన్నిక ల్లో ఘన విజయం సాధించడం ద్వా రా భారత రాజకీయాల్లో కాంగ్రెస్ ను తప్పించి సెంటర్ స్టేజిని ఆక్రమించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో 1996లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పడు 13 రోజులపాటు మొద టిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1998లో 13 నెలల పాలన తర్వాత లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ వాజ్‌పేయి నాయకత్వం.. పార్టీపై ఉన్న అస్పృశ్యత ముద్ర పోయి కొత్త కూటముల ఏర్పాటుకు దోహదపడింది. అది ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పా టుకు దారితీసింది. 2014లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. అమిత్ షా బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ–షా 18 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికల్లో సైతం 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి దేశంలోనే బలమైన రాజకీయపార్టీగా బీజేపీ అవతరించేలా కృషి చేసింది. దేశభద్రత ప్రధాన అస్త్రంగా.. ఓట్ల లెక్కింపు జరుగుతూ ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతుంటే ఈ అంశాలతో పాటు మోదీ తన ప్రధానాస్త్రంగా చేసుకున్న దేశ భద్రత, జాతీయవాదం దేశవ్యాప్తంగా ఓటర్లను ఏవిధంగా ఆయనవైపు తిప్పాయో స్పష్టమైంది. కొన్ని కీలక రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. భారత్ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని పలు సూచీలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్ దాడిలో 40 మంది సైనికులు ప్రా ణాలు కోల్పోవడం, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రశిక్షణ శిబిరంపై ఐఏఎఫ్ బాంబుల వర్షం (సర్జికల్ స్ట్రైక్స్) కురిపించిన తర్వాత జాతీయవాదం, దేశ భద్రతను, దేశభక్తిని మోదీ ఎన్నికల అస్త్రాలుగా చేసుకున్నారు. పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటూ ఉగ్రవాదుల శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో సమానమని చెప్పారు. రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. -
ఎగ్జిట్ పోల్‌నిజమెంత?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్డీయే విజయాన్ని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు దాదాపుగా వెల్లడి అయ్యాయి. దీంతో ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి, ఎంత ఖచ్చితత్వంతో వాస్తవ రూపం దాల్చాయని పరిశీలించేందుకు అవకాశం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఆధిక్యాలను పరిశీలిస్తే.. ఎన్డీయే 347, యూపీఏ 90, ఇతరులు 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే ఇండియా టుడే–మై ఆక్సిస్, చాణక్య–న్యూస్24 అంచనాలు చాలావరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఎన్డీయేకి 339 నుంచి 365 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే యూపీఏకి 77–108, ఇతరులకు 69–95 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. కానీ చాణక్య సరిగ్గా అంచనా వేసింది. ఎన్డీయేకి 350, యూపీఏకి 95, ఇతరులకు 97 వస్తాయని స్పష్టమైన అంకెలు ఇచ్చింది. ఒకవేళ ఆధిక్యతలే కనుక య«థాతథంగా ఫలితాలుగా మారినట్టయితే చాణక్యకి, ఎన్డీయే సంఖ్య (350)కి మధ్య కేవలం మూడు సీట్ల తేడాయే ఉంటుంది. అలాగే యూపీఏ సంఖ్య (95)కు 5, ఇతరుల సంఖ్య (97)కు 8 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఎన్డీయే, యూపీఏ ట్యాలీలు రెండూ కూడా ఇండియా టుడే అంచనా వేసిన సీట్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. గత ఎన్నికలను పరిశీలిస్తే.. ► 2004లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పూర్తిగా తల్లకిందులయ్యాయి. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధించింది. ► 2009లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేపై యూపీఏకి స్వల్ప మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కానీ ఆయా సంస్థల అంచనాలు మరోసారి తప్పయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 100కు పైగా సీట్ల మెజారిటీ సాధించింది. ► 2014లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని ఊహించాయి. అయితే టుడేస్ చాణక్య మినహా ఏదీ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపడుతుందని చెప్పలేకపోయాయి. అసలు ఫలితాలు వచ్చేశాయి.. మరి వివిధ చానళ్లలో ప్రసారమైన ఎగ్జిట్ పోల్స్‌లో ఏది నిజమయ్యాయి? ఏది తప్పాయి? జనం మూడ్‌ను అవి పసికట్టగలిగాయా. -
బీజేపీ చేతికి ఉత్తరం
పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిని బీజేపీ ఊపేసింది. అనేక అంచనాలకు, సర్వేల ఫలితాలను మించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాదిరే ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ప్రభంజనం కాషాయ పక్షానికి ఊహించని విజయాలను అందించింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధికారం కోల్పోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అంతలోనే దాదాపు మొత్తం లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యధిక సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ– ఎస్పీ మహా కూటమిగా ఏర్పడి విసిరిన సవాలును తేలిగ్గా తిప్పికొట్టేసింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో 60 సీట్ల వరకూ నిలబెట్టుకుంది. ఈ మహాకూటమి నుంచి ఎదురయ్యే పోటీ వల్ల బీజేపీ 40 సీట్లు గెలిస్తే గొప్పేనన్న అంచనాలు తప్పని కమలదళం రుజువు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా జమ్మూకశ్మీర్‌లో కిందటిసారి గెలిచిన 3 సీట్లను బీజేపీ నిలబెట్టుకుంది. చిన్న రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం సీట్లను మోదీ ప్రభంజనంతో బీజేపీ కైవసం చేసుకుంది. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 90% సీట్లు సొంతం చేసుకుంది. మొత్తంమీద బీజేపీ బలం లోక్‌సభలో 300 సీట్లు దాటడానికి ఉత్తరాది రాష్ట్రాలు తమ వంతు తోడ్పాటునిచ్చాయి. యూపీలో 11 సీట్లు కోల్పోయిన ఎన్డీఏ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) రెండు సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్డీఏ స్కోరు ఇక్కడ 64 సీట్లకు చేరుకుంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 73 సీట్లు కైవసం చేసుకోవటం గమనార్హం. 2007– 2017 మధ్య పదేళ్లు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీలు ఈసారి ఆరెల్డీతో కలిసి మహాకూటమి పేరుతో పోటీచేసి 15 సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ బీజేపీ బలం ఈసారి కాస్త తగ్గింది. వేర్వేరు సామాజికవర్గాల మద్దతు ఉన్న ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోరాడడంతో తమ ఉనికిని కాపాడుకోగలిగాయి. మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ 10, మరో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో గతంలో మూడుసార్లు గెలిచి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం సంచలనం. రాయ్‌బరేలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ విజయంతో యూపీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కింది. ఓటేసింది యోగిని చూసి కాదు: 2017 యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత అనూహ్యంగా సీఎం అయిన యోగీ ఆదిత్యనాథ్ పాలన బాగోకున్నా ప్రధాని సాధించిన విజయాలకు మెచ్చి బీజేపీకి ఓటేస్తున్నామని ఎన్నికల ముందు సర్వేల్లో ప్రజలు చెప్పారు. అలాగే దాదాపు 10 శాతం జనాభా ఉన్న బీజేపీ పునాది వర్గం బ్రాహ్మణులు యోగి పాలనపై అసంతృప్తి ఉన్నా ఈసారికి మోదీ కోసమే బీజేపీని సమర్థిస్తున్నామన్నారు. ఓ సీటు పెరిగింది మధ్యప్రదేశ్‌లో కాషాయం స్వీప్ 29 సీట్లున్న బీజేపీ కంచుకోట మధ్యప్రదేశ్‌లో... కాషాయపక్షం ఈసారి 29 స్థానాలకుగాను 28 స్థానాలు కైవసం చేసుకుంది. కిందటిసారి ఎన్నికలతో పోల్చితే ఒక సీటు పెరిగింది. 1993– 2018 మధ్య రాష్ట్రాన్ని పదిహేడు సంవత్సరాలు పాలించాక బీజేపీ 2018 డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని సర్కారు ఐదు నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇంతటి భారీ విజయం సొంతం చేసుకుంటుందని రాజకీయ పండితులెవరూ ఊహించలేకపోయారు. రైతు రుణమాఫీ హామీని కాంగ్రెస్ సర్కారు సక్రమంగా అమలు చేయకపోవడం, ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి బీజేపీ విజయానికి కారణమైంది. 2014లో కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఒకటైన గుణాలో గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబసభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ భోపాల్ నుంచి పోటీచేసి ‘హిందుత్వ’ ప్రతినిధి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు. ప్రగ్యకు టికెట్ ఇవ్వడం, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి నష్టం జరగకపోగా మేలే జరిగిందని ఫలితాలు నిరూపించాయి. హిందుత్వ కాషాయ రాజకీయాలకు పునాది అయిన మధ్యప్రదేశ్ మోదీ మళ్లీ ప్రధాని కావడానికి తన వంతు సాయమందించింది. పంజాబ్‌లో కాంగ్రెస్ నిలదొక్కుకుంది పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలో పాలకపక్షమైన కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకొని ఆధిక్యం నిలబెట్టుకుంది. రెండేళ్ల క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రాజకీయ అనుభవం ఉన్న కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పనితీరుతోపాటు అకాలీదళ్–బీజేపీ కూటమిని చాకచక్యంగా ఎదుర్కొంది. 2017 ఎన్నికలకు ముందు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఈ కూటమికి ఉన్న చెడ్డపేరు కూడా కాంగ్రెస్ విజయానికి తోడ్పడింది. కిందటిసారి 4 సీట్లు గెలుచుకున్న ‘ఆప్’.. ఈసారి ఒక సీటే గెలుచుకోగా అకాలీదళ్, బీజేపీలు చెరో రెండు సీట్లు సాధించాయి. పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో బీజేపీ జాతీయవాదం పనిచేయలేదు. హరియాణాలో క్లీన్‌స్వీప్ కిందటి సారి బీజేపీకి ఏడు సీట్లు అందించిన హరియాణాలోని మొత్తం పది లోక్‌సభ సీట్లనూ కాషాయపక్షం కైవసం చేసుకుంది. బీజేపీ తొలి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో జాట్ల ఆధిపత్యం ఎక్కువ. పంజాబీ ఖత్రీ అయిన ఖట్టర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన బీజేపీ ఈసారి లోక్‌సభ టికెట్ల కేటాయింపులో కులాలవారీ పద్ధతికి స్వస్తి చెప్పింది. కొత్త ప్రయోగాలతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కొన్ని దశాబ్దాలపాటు బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్ కుటుంబాల ఆధిపత్యంలో మగ్గిన హరియాణాలో బీజేపీ పది లోక్‌సభ సీట్లు దక్కించుకోవడం అసాధారణ విజయంగా భావించవచ్చు. మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హూడా, ఆయన కొడుకు దీపేందర్ ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ ‘షాక్’ కిందటి డిసెంబర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల పాలన తర్వాత ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆరు నెలలు తిరగకుండానే మొత్తం 11 సీట్లలో 9 కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. మిగిలిన రెండు సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పరువు కాపాడుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతోందని తేలింది. ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదం, హిందుత్వ ప్రభావం లేని కారణంగా బీజేపీకి మూడు నాలుగు సీట్లొస్తే గొప్పేనన్న రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. కశ్మీర్.. నిలబడిన బీజేపీ బలం జమ్మూ కశ్మీర్లో 2014 ఎన్నికల్లో జమ్మూ,, లద్దాఖ్‌లోని మూడు సీట్లు మొదటిసారి గెలిచిన బీజేపీ ఈసారి ఈ స్థానాలు నిలబెట్టుకుంది. కిందటిసారి మిగిలిన మూడు సీట్లు సాధించిన జేకే పీడీపీ ఈసారి కశ్మీర్ లోయలోని ఆ సీట్లను కోల్పోయింది. ఈ స్థానాలను ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం ఆధిపత్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కైవసం చేసుకుంది. పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కిందటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కారు కొన్నాళ్లు నడిపింది. చివరికి బీజేపీ వైదొలగడంతో ఆమె ప్రభుత్వం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పీడీపీకి జనాదరణ తగ్గి నేషనల్ కాన్ఫరెన్స్ మళ్లీ పుంజుకోగలిగింది. ఉత్తరాఖండ్‌లో మళ్లీ ఐదూ బీజేపీకే హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ మొత్తం ఐదు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక త్రివేంద్రసింగ్ రావత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో ఈసారి హిందుత్వ, జాతీయవాదం ప్రభావం పనిచేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ రెండో విజయం కిందటి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన సినీ నటి కిరణ్ ఖేర్ రెండోసారి గెలిచారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించినా ఆమె టికెట్ సాధించి మరీ విజయం సాధించారు. హిమాచల్.. పాత ఫలితాలే పునరావృతం.. బీజేపీకి బలమైన పునాదులున్న మరో హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా కాషాయపక్షం వరుసగా రెండోసారి మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంది. 2017 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జైరాం ఠాకూర్ సీఎం అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్రాం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వస్తాయన్న అంచనా తప్పయింది. ఢిల్లీలో బీజేపీకి మళ్లీ ఏడు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. 2014 మోదీ ప్రభంజనంలో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఆప్, కాంగ్రెస్ మొదట పొత్తుకు ప్రయత్నించి విఫలంకావడం బీజేపీ విజయానికి ఒక కారణం. -
28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..
న్యూఢిల్లీ: 41 మంది సిట్టింగ్ మహిళా ఎంపీల్లో 28 మంది మహిళా ఎంపీలు ముందంజలో ఉన్నారు. సోనియా గాంధీ, హేమ మాలిని, కిరణ్ ఖేర్ వం టి సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని పదిల పరచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే స్మృతీ ఇరానీ, ప్రజ్ఞా ఠాకూర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాయ్ బరేలి నుంచి కాంగ్రె స్ ఎంపీ సోనియా గాంధీ, పిలిభిత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ మేనకా గాంధీ, మధుర బీజేపీ ఎంపీ మాలిని, చంఢీగఢ్ బీజేపీ అభ్యర్థి ఖేర్, కనౌజ్ ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి వంటి ప్రముఖులు ముందంజ లో ఉన్నారు. కాగా, అసన్సోల్ నుంచి బంకుర టీఎమ్సీ ఎంపీ మున్ మున్ సేన్, కాంగ్రెస్ సిల్చర్ ఎంపీ సుస్మితా దేవ్, సుపాల్ కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్, బర్ధమాన్–దుర్గాపూర్ టీఎంసీ అభ్యర్థి మమ్తాజ్ సంఘమిత్ర, హూగ్లీ టీఎంసీ ఎంపీ అభ్యర్థి రత్న డే, లాల్గంజ్ ఎంపీ నీలం సోన్కార్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ నుంచి లీడింగ్‌లో ఉన్న మహిళా సిట్టింగ్ ఎంపీలు 16 మంది కాగా, కాంగ్రెస్ నుంచి కేవలం సోనియా గాంధీ మాత్రమే లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలా భావించే అమేథీలో స్మృతి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ రాహుల్ గాంధీపై చారిత్రక విజయాన్ని నమోదు చేయనున్నారు. కాగా భోపాల్ వివాదాస్పద బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా తన ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ముందంజలో ఉన్నారు. అలాగే తూత్తుకూడి డీఎంకే అభ్యర్థి కనిమొళి కరుణానిధి, ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ గెలుపుబాటలో ఉన్నారు. టీఎంసీ తరపున పోటీ పడుతున్న బెంగాళీ నటి లాకెట్ చటర్జీ హూగ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 54 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 53 మంది మహిళలు పోటీపడ్డారు. యూపీ నుంచి అత్యధికంగా 104 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఈసారి రికార్డు 6.89 లక్షలు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సీఆర్ పాటిల్ గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో రికార్డు మెజారిటీకి చేరువగా వచ్చారు. గుజరాత్‌లోని నవ్సారీ లోక్‌సభ స్థానంనుంచి ఆయన 6.89 లక్షల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. 2014లో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపినాథ్ ముండే మరణంతో ఖాళీ అయిన బీడ్ స్థానంనుంచి ప్రీతమ్‌ముండే 6.96 లక్షల మెజారిటీ సాధించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు మెజారిటీగా ఉంది. సీఆర్‌పాటిల్‌తో పాటు బీజేపీ నుంచి ఆరు లక్షల మెజారిటీ క్లబ్లో సంజయ్ భాటియా, క్రిష్ణపాల్, సుభాష్‌చంద్ర బెహరియా కూడా ఉన్నారు. మరో డజనుపైగా ఎంపీలు ఐదులక్షలకు మించి మెజారిటీ సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల మెజారిటీ సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసి 5.57 లక్షల మెజారిటీ సాధించారు. గతంలో ఇదే స్థానంలో పార్టీ సీనియర్ నేత అద్వానీ 4.83 లక్షల ఓట్లు సాధించారు. ఇక హర్యానాలోని కర్నాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంజయ్‌భాటియా 6.56 లక్షల ఓట్లు సాధించారు. అదే పార్టీకి చెందిన ఫరీదాబాద్ అభ్యర్థి క్రిష్ణపాల్ 6.38 లక్షల ఓట్లు సాధించడం విశేషం. అత్యల్ప ‘రికార్డులు’ఇవే 181 ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి భోలేనాథ్ తన ప్రత్యర్థి, బీఎస్పీకి చెందిన త్రిభువన్‌రామ్‌పై 181 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇక లక్షద్వీప్ నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ఫైజల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హమీదుల్లా సయీద్‌పై 823 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అండమాన్ నికోబాల్ స్థానం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌కు చెందిన కుల్దీప్‌రాయ్‌శర్మ, తన ప్రత్యర్థి, బీజేపీ చెందిన విశాల్ జోషిపై 1,407 ఓట్లతో విజయం సాధించారు. బిహార్‌లోని జనహాబాద్ స్థానం నుంచి జేడీ (యూ) నుంచి విజయం సాధించిన చండేశ్వర్ ప్రసాద్, ఆర్జే డీ నుంచి పోటీ చేసిన సురేంద్ర ప్రసాద్ యాదవ్‌పై 1,075 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. -
రుణపడి ఉంటా
పులివెందుల, న్యూస్‌లైన్ : సుమారు 75వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించిన పులివెందుల ఓటర్లకు వందనం.. రాష్ట్రస్థాయిలో రికార్డు మెజార్టీతో మరోమారు పులివెందుల పేరును చరిత్రలో నిలిపినందుకు ధన్యవాదాలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సీఎల్పీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి పులివెందులలోని బాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. పులివెందుల ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉద్వేగభరితంగా అన్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల ప్రజలు అండగా ఉంటున్నార న్నారు. ఉదయం నుంచి తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. కొందరిని పేర్లతో పిలుస్తూ.. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డిలతో వైఎస్ జగన్ చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు : పులివెందులలోని స్వగృహంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ శాసనసభ పక్షనేత వైఎస్ జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికాార్జునరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తదితరులు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల సమస్యలతోపాటు పార్టీకి సంబంధించిన అంశాలపై వారు చర్చించుకున్నారు. కమలాపురం నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డిలు వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. అభినందనలు తెలిపిన స్థానికులు : క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పులివెందులకు చెందిన కార్యకర్తలు, నాయకులు, స్థానికులు వచ్చి అభినందనలు తెలియజేశారు. సుమారు 75వేలపైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అభినందనలతో ముంచెత్తారు. పులివెందులోని దినేష్ మెడికల్ సెంటర్లో స్పెషలిస్ట్ డాక్టర్లుగా పనిచేస్తున్న రణధీర్‌రెడ్డి, జ్యోతి, సూపర్వైజర్ కనకరత్నమ్మ, ఆనంద్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌కు పుష్ప గుచ్చాలతోపాటు పూల బొకేలను అందించి అభినందనలు తెలియజేశారు. మండలాల నాయకులతో మాటామంతి : ఈ మధ్యనే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియటంతో ఏడు మండలాల్లోని జెడ్పీటీసీలు, ఎంపీపీలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పులివెందుల మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు వైఎస్ జగన్‌ను కలిశారు. సింహాద్రిపురం మండల కన్వీనర్ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, వేముల, పులివెందుల, లింగాల మండలాల కన్వీనర్లు, పరిశీలకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, వేల్పుల రాము, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, బలరామిరెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి తదితరులు వచ్చి వైఎస్ జగన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు వరప్రసాద్, చిన్నప్ప, కోడి రమణ, నూరుల్లా, సాతుపాటి వెంకటపతి, రామ లలిత, హేమలత, అ రుణకుమారి, కోళ్ల భాస్కర్, రామనాథ్ తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు. చర్చిలో వివాహానికి హాజరైన వైఎస్ జగన్ : పులివెందులలోని నగరిగుట్టకు చెందిన దేవదానం(దానమయ్య) వివాహ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో వివాహం జరుగుతున్న నేపథ్యంలో ఇడుపులపాయ నుంచి గురువారం మధ్యాహ్నం నేరుగా చర్చికి చేరుకుని నూతన వధూవరులు దేవదానం, కెజియాలను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీ వించారు. అనంతరం చర్చి బయట వైఎస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు జనాలు ఆరాటపడ్డారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా పులివెందుల అర్బన్, రూర ల్ సీఐలు భాస్కర్, మహేశ్వరరెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భారీగా వచ్చిన జనం : వైఎస్ జగన్‌ను కలిసేందుకు గురువారం వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలి వచ్చిన జనాలతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. అభిమాన నేతను కలుసుకునేందుకు తరలి వచ్చిన జనాలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.