నల్లగొండ ఎంపీ స్థానంలో 5,59,906 ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి
తెలంగాణలో ఇంతకుముందు అత్యధిక మెజారిటీ కేసీఆర్ పేరిట..
2014లో మెదక్ ఎంపీగా 3,97,029 ఓట్ల మెజారిటీ సాధించిన బీఆర్‌ఎస్ అధినేత
ఉమ్మడి రాష్ట్రంలో 1991లో నాటి ప్రధాని పీవీకి అత్యధికంగా 5,80,297 ఓట్ల మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు నమోదైంది. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డికి 7,84,337 ఓట్లురాగా.. సమీప బీజే పీ అభ్యర్థి సైదిరెడ్డికి 2,24,431 ఓట్లు వచ్చాయి. అంటే రఘువీర్‌రెడ్డి 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ. ఇంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు 3,97,029 ఓట్ల మెజారిటీ లభించింది.
అయి తే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ గెలిచిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక అదే ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (బీఆర్‌ఎస్) 3,92,574 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా విజ యం సాధించిన పసునూరి దయాకర్‌కు 3,50,298 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ రఘువీర్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ..
ఉమ్మడి రాష్ట్రంలో పరిశీలిస్తే.. అత్యధిక మెజారిటీ మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నర్సింహారావు పేరిట ఉంది. 1991 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీచేసి 5,80,297 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత 2011 కడప లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment