బీజేపీ చేతికి ఉత్తరం | bjp clean sweep in north india | Sakshi
Sakshi News home page

బీజేపీ చేతికి ఉత్తరం

Published Fri, May 24 2019 6:10 AM | Last Updated on Fri, May 24 2019 6:10 AM

bjp clean sweep in north india - Sakshi

పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిని బీజేపీ ఊపేసింది. అనేక అంచనాలకు, సర్వేల ఫలితాలను మించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాదిరే ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ప్రభంజనం కాషాయ పక్షానికి ఊహించని విజయాలను అందించింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధికారం కోల్పోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అంతలోనే దాదాపు మొత్తం లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యధిక సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ– ఎస్పీ మహా కూటమిగా ఏర్పడి విసిరిన సవాలును తేలిగ్గా తిప్పికొట్టేసింది.

యూపీలోని మొత్తం 80 సీట్లలో 60 సీట్ల వరకూ నిలబెట్టుకుంది. ఈ మహాకూటమి నుంచి ఎదురయ్యే పోటీ వల్ల బీజేపీ 40 సీట్లు గెలిస్తే గొప్పేనన్న అంచనాలు తప్పని కమలదళం రుజువు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా జమ్మూకశ్మీర్‌లో కిందటిసారి గెలిచిన 3 సీట్లను బీజేపీ నిలబెట్టుకుంది. చిన్న రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం సీట్లను మోదీ ప్రభంజనంతో బీజేపీ కైవసం చేసుకుంది. డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 90% సీట్లు సొంతం చేసుకుంది. మొత్తంమీద బీజేపీ బలం లోక్‌సభలో 300 సీట్లు దాటడానికి ఉత్తరాది రాష్ట్రాలు తమ వంతు తోడ్పాటునిచ్చాయి.

యూపీలో 11 సీట్లు కోల్పోయిన ఎన్డీఏ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం అప్నాదళ్‌ (ఎస్‌) రెండు సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్‌డీఏ స్కోరు ఇక్కడ 64 సీట్లకు చేరుకుంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 73 సీట్లు కైవసం చేసుకోవటం గమనార్హం. 2007– 2017 మధ్య పదేళ్లు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీలు ఈసారి ఆరెల్డీతో కలిసి మహాకూటమి పేరుతో పోటీచేసి 15 సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ బీజేపీ బలం ఈసారి కాస్త తగ్గింది.

వేర్వేరు సామాజికవర్గాల మద్దతు ఉన్న ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోరాడడంతో తమ ఉనికిని కాపాడుకోగలిగాయి. మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ 10, మరో మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో గతంలో మూడుసార్లు గెలిచి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం సంచలనం. రాయ్‌బరేలీలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ విజయంతో యూపీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కింది.
 
ఓటేసింది యోగిని చూసి కాదు:
2017 యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత అనూహ్యంగా సీఎం అయిన యోగీ ఆదిత్యనాథ్‌ పాలన బాగోకున్నా ప్రధాని సాధించిన విజయాలకు మెచ్చి బీజేపీకి ఓటేస్తున్నామని ఎన్నికల ముందు సర్వేల్లో ప్రజలు చెప్పారు. అలాగే దాదాపు 10 శాతం జనాభా ఉన్న బీజేపీ పునాది వర్గం బ్రాహ్మణులు యోగి పాలనపై అసంతృప్తి ఉన్నా ఈసారికి మోదీ కోసమే బీజేపీని సమర్థిస్తున్నామన్నారు.

ఓ సీటు పెరిగింది
మధ్యప్రదేశ్‌లో కాషాయం స్వీప్‌
29 సీట్లున్న బీజేపీ కంచుకోట మధ్యప్రదేశ్‌లో... కాషాయపక్షం ఈసారి 29 స్థానాలకుగాను 28 స్థానాలు కైవసం చేసుకుంది. కిందటిసారి ఎన్నికలతో పోల్చితే ఒక సీటు పెరిగింది. 1993– 2018 మధ్య రాష్ట్రాన్ని
పదిహేడు సంవత్సరాలు పాలించాక బీజేపీ 2018 డిసెంబర్‌ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సారథ్యంలోని సర్కారు ఐదు నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇంతటి భారీ విజయం సొంతం చేసుకుంటుందని రాజకీయ పండితులెవరూ ఊహించలేకపోయారు. రైతు  రుణమాఫీ హామీని కాంగ్రెస్‌ సర్కారు సక్రమంగా అమలు చేయకపోవడం, ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి బీజేపీ విజయానికి కారణమైంది. 2014లో కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో ఒకటైన గుణాలో గ్వాలియర్‌ మాజీ సంస్థానాధీశుల కుటుంబసభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ భోపాల్‌ నుంచి పోటీచేసి ‘హిందుత్వ’ ప్రతినిధి సాధ్వీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ చేతిలో ఓడిపోయారు. ప్రగ్యకు టికెట్‌ ఇవ్వడం, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి నష్టం జరగకపోగా మేలే జరిగిందని ఫలితాలు నిరూపించాయి. హిందుత్వ కాషాయ రాజకీయాలకు పునాది అయిన మధ్యప్రదేశ్‌ మోదీ మళ్లీ ప్రధాని కావడానికి తన వంతు సాయమందించింది.
పంజాబ్‌లో కాంగ్రెస్‌ నిలదొక్కుకుంది
పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలో పాలకపక్షమైన కాంగ్రెస్‌ 8 సీట్లు కైవసం చేసుకొని ఆధిక్యం నిలబెట్టుకుంది. రెండేళ్ల క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రాజకీయ అనుభవం ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పనితీరుతోపాటు అకాలీదళ్‌–బీజేపీ కూటమిని చాకచక్యంగా ఎదుర్కొంది. 2017 ఎన్నికలకు ముందు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఈ కూటమికి ఉన్న చెడ్డపేరు కూడా కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడింది. కిందటిసారి 4 సీట్లు గెలుచుకున్న ‘ఆప్‌’.. ఈసారి ఒక సీటే గెలుచుకోగా అకాలీదళ్, బీజేపీలు చెరో రెండు సీట్లు సాధించాయి. పాక్‌ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో బీజేపీ జాతీయవాదం పనిచేయలేదు.
హరియాణాలో
క్లీన్‌స్వీప్‌

కిందటి సారి బీజేపీకి ఏడు సీట్లు అందించిన హరియాణాలోని మొత్తం పది లోక్‌సభ సీట్లనూ కాషాయపక్షం కైవసం చేసుకుంది. బీజేపీ తొలి సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో జాట్ల ఆధిపత్యం ఎక్కువ. పంజాబీ ఖత్రీ అయిన ఖట్టర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన బీజేపీ ఈసారి లోక్‌సభ టికెట్ల కేటాయింపులో కులాలవారీ పద్ధతికి స్వస్తి చెప్పింది. కొత్త ప్రయోగాలతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కొన్ని దశాబ్దాలపాటు బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్‌ కుటుంబాల ఆధిపత్యంలో మగ్గిన హరియాణాలో బీజేపీ పది లోక్‌సభ సీట్లు దక్కించుకోవడం అసాధారణ విజయంగా భావించవచ్చు. మాజీ సీఎం భూపిందర్‌సింగ్‌ హూడా, ఆయన కొడుకు దీపేందర్‌ ఓడిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ ‘షాక్‌’
కిందటి డిసెంబర్‌లో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల పాలన తర్వాత ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆరు నెలలు తిరగకుండానే మొత్తం 11 సీట్లలో 9 కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. మిగిలిన రెండు సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్‌ పరువు కాపాడుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో సైతం బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతోందని తేలింది. ఛత్తీస్‌గఢ్‌ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదం, హిందుత్వ ప్రభావం లేని కారణంగా బీజేపీకి మూడు నాలుగు సీట్లొస్తే గొప్పేనన్న రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి.

కశ్మీర్‌.. నిలబడిన బీజేపీ బలం
జమ్మూ కశ్మీర్‌లో 2014 ఎన్నికల్లో జమ్మూ,, లద్దాఖ్‌లోని మూడు సీట్లు మొదటిసారి గెలిచిన బీజేపీ ఈసారి ఈ స్థానాలు నిలబెట్టుకుంది. కిందటిసారి మిగిలిన మూడు సీట్లు సాధించిన జేకే పీడీపీ ఈసారి కశ్మీర్‌ లోయలోని ఆ సీట్లను కోల్పోయింది. ఈ స్థానాలను ఫరూఖ్‌ అబ్దుల్లా కుటుంబం ఆధిపత్యంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కైవసం చేసుకుంది. పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కిందటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కారు కొన్నాళ్లు నడిపింది. చివరికి బీజేపీ వైదొలగడంతో ఆమె ప్రభుత్వం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పీడీపీకి జనాదరణ తగ్గి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మళ్లీ పుంజుకోగలిగింది.

ఉత్తరాఖండ్‌లో మళ్లీ ఐదూ బీజేపీకే
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ మొత్తం ఐదు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక త్రివేంద్రసింగ్‌ రావత్‌ సీఎం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో ఈసారి హిందుత్వ, జాతీయవాదం ప్రభావం పనిచేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చండీగఢ్‌లో కిరణ్‌ ఖేర్‌ రెండో విజయం
కిందటి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన సినీ నటి కిరణ్‌ ఖేర్‌ రెండోసారి గెలిచారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించినా ఆమె టికెట్‌ సాధించి మరీ విజయం సాధించారు.

హిమాచల్‌.. పాత ఫలితాలే పునరావృతం..
బీజేపీకి బలమైన పునాదులున్న మరో హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా కాషాయపక్షం వరుసగా రెండోసారి మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంది. 2017 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జైరాం ఠాకూర్‌ సీఎం అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రాం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వస్తాయన్న అంచనా తప్పయింది.

ఢిల్లీలో బీజేపీకి మళ్లీ ఏడు
జాతీయ రాజధాని
ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. 2014 మోదీ ప్రభంజనంలో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఆప్, కాంగ్రెస్‌ మొదట పొత్తుకు ప్రయత్నించి విఫలంకావడం బీజేపీ విజయానికి ఒక కారణం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement