Election Results 2019
-
కొనసాగుతున్న జార్ఖండ్ ఓట్ల లెక్కింపు
-
జార్ఖండ్ ఫలితాలు నేడే
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. రెండు పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి హోరాహోరీగా తలపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒక్కొక్కరు తొమ్మిదేసి ర్యాలీల్లో పాల్గొంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయిదు, ప్రియాంక గాంధీ ఒక్క ర్యాలీలో పాల్గొన్నారు. జేఎంఎం నేత ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పోటీ చేసిన జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది. 1995 నుంచి ఆయన ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే రఘుబర్ దాస్ సహచరుడు, మాజీ మంత్రి సరయూ రాయ్ బీజేపీ రెబెల్ అభ్యర్థిగా ఈ స్థానంలో నిలబడడంతో పోటీ రసవత్తరంగా మారింది. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తుంటే, బీజేపీ తామే తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమాతో ఉంది. ఎవరి అంచనాలు నిజం కానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
చైనాకు హాంకాంగ్ షాక్
జన చేతనను విస్మరిస్తే ఏమవుతుందో చైనా పాలకులకు అర్ధమై ఉండాలి. ఆదివారం హాంకాంగ్ పరిధిలోని 18 జిల్లా పాలకమండళ్ల నుంచి 452 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల ప్రతిని ధులు ఘోర పరాజయం చవిచూశారు. మొత్తం 17 మండళ్లు ప్రజాస్వామ్య అనుకూలవాదుల చేజి క్కించుకోవడంతోపాటు 452 స్థానాల్లో 390వారికి లభించాయి. ఇది దాదాపు 90 శాతం. చైనా అను కూలురకు దక్కినవి కేవలం 59 స్థానాలు మాత్రమే. సహజంగానే ఈ ఫలితాలు బీజింగ్‌ను దిగ్భ్రాంతి పరిచాయి. సాధారణంగా అయితే ఈ ఎన్నికలకు పెద్దగా ప్రాముఖ్యం ఉండేది కాదు. ఎందుకంటే ఈ మండళ్లకు ఉండే అధికారాలు చాలా పరిమితమైనవి. చెత్త తొలగింపు, బస్సు రూట్లు సదుపాయం, పర్యావరణంవంటి పౌరుల అవసరాలను పర్యవేక్షించి చర్యలు తీసుకోవడానికి మాత్రమే వీటికి అధికారాలుంటాయి. కానీ ఆర్నెలక్రితం చిన్నగా మొదలై, చూస్తుండగానే కార్చిచ్చులా వ్యాపించిన ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. హాంకాంగ్ ప్రజల మనో భీష్టం వ్యక్తమయ్యేది కేవలం ఈ ఎన్నికల ద్వారా మాత్రమే. పైగా హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ ఈ ఎన్నికలు తన పాలనకు రిఫరెండం అని ముందే చెప్పారు. ఫలితాలు వెలువడ్డాక సైతం ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని, లోపాలను సవరించుకుంటామని అన్నారు. కానీ ఆమెను ఆ పదవిలో కూర్చోబెట్టిన చైనా పాలకులకు మాత్రం ఈ ఫలితాలు కంటగింపుగా మారాయి. దీన్నుంచి గుణపాఠం నేర్చుకోవడం మాని, ఉద్యమకారులపై నిందలేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా అమెరికా రాజకీయ నాయకులపై ఆరోపణలు చేస్తున్నది. హాంకాంగ్‌లో కల్లోలం సృష్టించడమే వారి ఉద్దేశమని అంటున్నది. బ్రిటన్‌కున్న 150 ఏళ్ల లీజు ముగిసి 1997 జూలై 1న హాంకాంగ్ తిరిగి చైనాకు దఖలు పడినప్పుడు అప్పటి చైనా నాయకుడు డెంగ్ జియావో పెంగ్ ఇచ్చిన హామీ బహుశా చైనా నేతలు మర్చిపోయి ఉండొచ్చు. హాంకాంగ్‌లో ఇప్పుడున్న విధానాలన్నీ యధాతధంగా సాగుతా యని, తాము ‘ఒకే దేశం–రెండు వ్యవస్థలు’ అనే విధానానికి కట్టుబడి ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒప్పందాన్ననుసరించి 2047లో ఆ నగరం పూర్తి స్థాయిలో చైనా పరిధిలోకొస్తుంది. అప్పటి వరకూ హాంకాంగ్ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వచ్చే ముప్పేమీ ఉండబోదని డెంగ్ తెలిపారు. ఆయన కన్నా ముందు 1993లో చైనా కమ్యూనిస్టు పార్టీ ‘పీపుల్స్ డైలీ’లో రాసిన వ్యాసంలో ఉన్నత స్థాయి నాయకుడొకరు హాంకాంగ్ స్వయంప్రతిపత్తిలో తమ జోక్యం ఉండబోదని చెప్పారు. కానీ 1997 నుంచి ఇప్పటివరకూ సాగిన చరిత్రంతా చూస్తే చైనా ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని అర్ధమవు తుంది. అక్కడి ప్రజల హక్కులు ఒక్కొక్కటే మింగేస్తూ, ఆ నగరాన్ని గుప్పెట్లో బంధించడానికి అది పావులు కదుపుతూనే ఉంది. అమెరికా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చైనాది ద్వితీయ స్థానం. అది ఎప్పుడో ఒకప్పుడు తమను మించిపోతుందన్న భయం అమెరికాకు ఉంది. ఈ దశలో బాధ్యతాయుతంగా వ్యవహ రించకపోతే, హాంకాంగ్కిచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ప్రపంచ దేశాల్లో తన విశ్వసనీయత దెబ్బ తింటుందని చైనా గ్రహించడం లేదు. ఆర్నెల్లుగా హాంకాంగ్‌ను ఉక్కుపాదంతో అణిచేస్తూ అక్కడి ప్రజలు తిరిగి తనకే పట్టం కడతారని చైనా ఎలా అనుకుందో అంతుబట్టని విషయం. కేవలం గుప్పె డుమంది విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఉద్యమం సాగుతున్నదని, దీనికి మెజారిటీ ప్రజల మద్దతు లేదని చెబుతూ వస్తున్న చైనాకు తాజా ఫలితాలు చెంపపెట్టు. కనీసం ఇప్పుడైనా పౌరుల ఆగ్రహా వేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అది గుర్తించాలి. నాలుగేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో 14 లక్షలమంది ఓటు హక్కు వినియోగించుకోగా ఈసారి ఆ సంఖ్య 29.5 లక్షలకు చేరుకుంది. మొత్తం 452 స్ధానాల్లో ప్రతి ఒక్కచోటా నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీ పోరు సాగింది. అయితే నగర నిర్వహణ కమిటీలో ఇప్పటికీ చైనా అనుకూల ప్రతినిధులదే పైచేయిగా ఉంటుంది. అందులో ఉండే 1,200 మంది సభ్యుల్లో మండళ్ల నుంచి ఎన్నికైనవారిలో కేవలం 117మందికి మాత్రమే స్థానం లభిస్తుంది. మిగిలినవారంతా రకరకాల కేటగిరీల్లో చైనా ప్రభుత్వం నామినేట్ చేసేవారే ఉంటారు. కనుక 2022లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి జరగబోయే ఎన్నికల్లో చైనాదే పైచేయిగా ఉంటుంది. హాంకాంగ్ నగరంపై యధావిధిగా దాని ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైనప్పుడు సకాలంలో దాన్ని గుర్తించాలి. కానీ చైనా అందుకు భిన్నంగా తనకెదురు లేదన్నట్టు వ్యవహరించింది. ఆ ధోరణే ఇప్పుడు హాంకాంగ్ పౌరులను ఏకం చేసింది. హాంకాంగ్‌లో నేరాలు చేసేవారిని చైనాకు తరలించి, అక్కడి చట్టాల ప్రకారం శిక్షించ డానికి వీలిచ్చే బిల్లు తీసుకురావడం ఇప్పుడు హాంకాంగ్‌లో సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమానికి మూలం. పైగా ఆ బిల్లు వెనకటి తేదీ నుంచి వర్తించేలా రూపొందించారు. నేరస్తుల అప్పగింత చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన ఆ బిల్లు ఆమోదం పొందితే చైనా వ్యతిరేకులందరినీ ఏరిపారేయడం సులభమవు తుంది. అలాంటివారిని చైనా తరలించి అక్కడ అమలవుతున్న చట్టాల కింద కఠిన శిక్షలు విధించడం వీలవుతుంది. కేసుల విచారణ, నేరస్తులకు శిక్షలు వగైరాలన్నీ ఒక తంతుగా సాగే చైనా న్యాయ వ్యవస్థకు ఏమాత్రం విశ్వసనీయత లేదు. కనుకనే ఈ సవరణ బిల్లును అంగీకరించబోమని ఉద్యమ నిర్వాహకులు చెప్పారు. మొదట్లోనే చైనా ఇందుకు అంగీకరించి ఉంటే పరిస్థితి విషమించేది కాదు. కానీ లారీ కామ్ మొండికేయడంతో ఉద్యమం ఉధృతమైంది. చివరకు ఈ బిల్లును వెనక్కి తీసుకుం టున్నామని ఇటీవల ఆమె ప్రకటించినా ఉద్యమం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా అది హింసాత్మకంగా మారుతోంది. అందుకు తగ్గట్టే పోలీసు బలగాలు కూడా తీవ్రంగా విరుచుకుపడు తున్నాయి. ఈ ఎన్నికలకు పాలనాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, దీనిద్వారా వ్యక్తమైన జనాభీష్టాన్ని గ్రహించడం, అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం ముఖ్యమని చైనా గుర్తించాలి. -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు
సాక్షి, ముంబై: తన ప్రియతమ నాయకుడు గెలిచాడని బాపు జావీర్ అనే కార్యకర్త ఏకంగా 18 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేపట్టి మొక్కు తీర్చుకున్నారు. షోలాపూర్ జిల్లా సాంగోలా అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి శహాజీ బాపు పాటిల్ విజయం సాధించారు. పాటిల్ విజయం కోసం సాంగోలా బాపు జావీర్ తనవంతు కృషి చేశారు. పాటిల్ విజయం సాధిస్తే స్వగ్రామం సుపాలే నుంచి పండర్పూర్ వరకు సాష్టాంగ నమస్కారాలు చేసి విఠలేషున్ని దర్శించుకుంటానని జావీర్ మొక్కుకున్నాడు. పాటిల్ గెల్చిన విషయం తెల్సి.. జావీర్ సుపాలి గ్రామం నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న పండర్పూర్ వరకు సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లాడు. ఎండలో తారు రోడ్డుపై, మట్ట రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు పెట్టిన దృశ్యం వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. -
రాసిస్తేనే మద్దతిస్తాం..
సాక్షి ముంబై: మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతోపాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో శనివారం తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, యువసేన చీఫ్, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే(29)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో లిఖిత పూర్వకంగా బీజేపీ హామీ ఇచ్చేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు’అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారన్నారు. బీజేపీ, శివసేన హిందుత్వకు కట్టుబడి ఉన్నాయని, అందుకే ప్రత్యామ్నాయాలున్నా వాటిపై ఆసక్తి లేదని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారని సర్నాయక్ తెలిపారు. సీఎం పదవి మాదే: బీజేపీ ఇన్చార్జి సరోజ్ పాండే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీదేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్చార్జి సరోజ్ పాండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఊహించిన దానికంటే 17 సీట్లు తగ్గినా 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన శివసేనకు కూడా ఏడు సీట్లు తగ్గి, 56 సీట్లు గెలుచుకుందని తెలిపారు. దీపావళి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్‌తో సీఎం ఫడ్నవిస్ చర్చలు జరుపుతారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావుసాహెచ్ దన్వే వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఈ నెల 30న సమావేశమై శాసనసభా పక్షం నేతను ఎన్నుకోనున్నారు. సీఎం ఫడ్నవిస్ స్వతంత్రులు, చిన్న పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేం ప్రతిపక్షంలోనే: పవార్ ప్రభుత్వం ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ మద్దతిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును పాటిస్తాం’అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్షంగా ఉండాలనే ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలనుకుంటే శివసేననే ముందుగా స్పందించాలి’అని కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెత్తివార్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికా రం నుంచి తప్పించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని మాజీ సీఎంలు చవాన్, పృథ్వీరాజ్ తెలిపారు. -
శివసేనతో ‘చేయి’ కలపం: ఎన్సీపీ
ముంబై: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు శివసేనతో చేతులు కలపబోమని శుక్రవారం కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. తమను విపక్షంలో కూర్చోమన్న ప్రజా తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ పేర్కొన్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న ఆలోచన కానీ ప్రతిపాదన కానీ లేదని చెప్పారు. ఒకవేళ మద్దతు కోరుతూ శివసేన తమ వద్దకు వస్తే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. శివసేనతో పొత్తు వార్తను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. అధికార పంపిణీ విషయంలో మిత్రపక్షం శివసేన 50:50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన ముందుకు తెచ్చింది. బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం.. గురువారం వెలువడిన ఎన్నికల పలితాల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ గతంతో పోలిస్తే ఓటుశాతం తగ్గింది. తమ మిత్రపార్టీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా.. ఓటు షేర్ మాత్రం కోల్పోయింది. 2014లో బీజేపీ పోటీ చేసిన 260 సీట్లలో 122 స్థానాల్లో విజయం సాధించగా, పస్తుతం ఆ సంఖ్య 105కు పడిపోయింది. గతంలో 27.8 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేరు రెండు శాతం కోల్పోయి 25.7తో ఆగిపోయింది. శివసేన ప్రస్తుతం 56 సీట్లు సాధించింది. అయితే ఓటు షేరు మాత్రం 2.9 శాతం కోల్పోయింది. ఎన్సీపీ ఓటు షేరు గతంలో 17.2 శాతం ఉండగా ప్రస్తుతం 16.7శాతానికి తగ్గింది. గతంలో 41 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు 54 సీట్లు సాధించింది. కాంగ్రెస్ గతంలో 18 శాతం ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడది 15.9కి పడిపోయింది. అయితే సీట్ల సంఖ్యను మాత్రం 42 నుంచి 44కు పెంచుకుంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన 2.3 శాతం ఓటు షేరును సాధించింది. తొలి ప్రయత్నంలోనే... నాగ్‌పూర్: ఈఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా సత్తా చూపారు. మొత్తం 12 స్థానాల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అందులో కొందరు సీనియర్ నేతలపై విజయం సాధించారు. -
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం
-
బీజేపీకి పదవి... కాంగ్రెస్‌కు పరువు!!
బీజేపీకి ఆశాభంగం. శివసేనకు నిరుత్సాహం. కాంగ్రెస్, ఎన్సీపీల్లో పరువు దక్కిన ఉత్సాహం! స్థూలంగా ఇదీ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చిత్రం. ఈ సారి అధికార బీజేపీ, శివసేనలు కూటమిగా ఎన్నికల బరిలో దిగగా, కాంగ్రెస్, ఎన్సీపీలూ జట్టుకట్టి పోటీ చేశాయి. అయితే 220 స్థానాలు సాధించి దేవేంద్ర ఫడ్నవిస్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ధీమాగా ప్రకటించిన బీజేపీ బొటాబొటీ సీట్లతో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతూండగా... ఉనికిలోనే ఉండదనుకున్న కాంగ్రెస్, ఎన్సీపీ అటు ఇటుగా వంద సీట్లు సాధించి తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. అసంతృప్తులు అధికార కూటమికి చేటు చేయగా.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రచారం ఆ పార్టీతోపాటు భాగస్వామి కాంగ్రెస్‌కూ కలిసొచ్చింది. వలసలతో బలం పెరగలేదు... మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పలువురిని బీజేపీ తమవైపునకు తిప్పుకోగలిగినా పార్టీ బలం పెంచలేకపోయాయి. పైపెచ్చు అసంతృప్తుల రూపంలో కొంత నష్టం చేశాయనే చెప్పాలి. సహకార బ్యాంకు కుంభకోణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును చేర్చడం ద్వారా మరాఠా ఓటును కొల్లగొట్టాలనుకన్న కమలనాథుల ఆశలు నెరవేరకపోగా పశ్చిమ మహారాష్ట్రలో పవార్ వర్గీయులు మరింత బలపడేందుకు అవకాశం ఏర్పడింది. పవార్ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పట్టును చాటుకున్నారు. 2014లో పశ్చిమ మహారాష్ట్రలోని మొత్తం 66 స్థానాలకుగాను ఎన్సీపీ 18 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ సారి ఈ సంఖ్య 30కి చేరువ కావడం విశేషం. బారామతిలో అజిత్ పవార్ సుమారు 1.62 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం.. సతారా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ వారసుడు, ఎన్సీపీ నుంచి బీజేపీకి మారిపోయిన ఉదయన్‌రాజే భోసాలే సైతం ఓటమి పాలు కావడం పవార్ ప్రభ ఇంకా తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లు అనేకం ఈసారి ఎన్సీపీ వశమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ గత ఎన్నికల్లో సాధించిన 11 స్థానాల్లో చాలావాటిని నిలబెట్టుకోగలిగింది. శివసేన పశ్చిమ మహారాష్ట్రలో నాలుగు స్థానాల్లో మాత్రమే కొద్ది ఆధిక్యత కనబరచగలిగింది. రెబెల్స్ కొంప ముంచారా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసి మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 122, శివసేన 62 స్థానాలు గెలుచుకోగలిగాయి. ఈసారి కలిసికట్టుగా బరిలోకి దిగినా గతంలో కంటే తక్కువ సీట్లు సాధించగలిగాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను తమవైపునకు తిప్పుకునే క్రమంలో బీజేపీ, శివసేనల్లో అసంతృప్తులు పెరిగిపోవడం, టికెట్ల పంపిణీలో గందరగోళం విజయావకాశాలను దెబ్బతీశాయని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మెరుగుపడిందా? కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికలు నిరాశ కలిగించేవే. భాగస్వామిపార్టీ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన కనపరచడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గత ఎన్నికలకన్నా రెండు మూడు సీట్లు ఎక్కువ సాధించినా సంతోషపడాల్సినంత విషయం కాదు. 147 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ దాదాపు 45 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 42 సీట్లే దక్కాయి. రాహుల్, సోనియా, ప్రియాంక వంటి అగ్రనేతలెవరూ ప్రచారంలో పెద్దగా పాల్గొనకపోవడం, నాయకత్వ లేమి విజయావకాశాలను దెబ్బతీశాయని అంటున్నారు. కాంగ్రెస్ తన శక్తియుక్తులను వెచ్చింది ఉంటే బీజేపీ మరిన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చేదని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్! మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో అధికార బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మినహాయించి మరెవరూ ఓటరు నాడిని పట్టలేకపోయారు. న్యూస్ 18–ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ మహారాష్ట్రలో బీజేపీ–శివసేనకు 244 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవానికి ఆ కూటమి 161 దగ్గరే నిలిచిపోయింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీకి కలిసి 39 స్థానాలు మాత్రమే వస్తాయని చెబితే అనూహ్యంగా ఆ కూటమి 103 స్థానాలను దక్కించుకుంది. ఇక ఏబీసీ సీ ఓటరు బీజేపీ, శివసేనకి 230, కాంగ్రెస్ కూటమికి 54, రిపబ్లిక్ జన్‌కీ బాత్ బీజేపీ కూటమికి 223, కాంగ్రెస్, ఎన్సీపీకీ 54 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. ఒక్క ఇండియా టుడే మాత్రమే బీజేపీ –శివసేనకు 166 నుంచి 194 వస్తాయని, కాంగ్రెస్, ఎన్సీపీకి 72 నుంచి 90 వస్తాయని అంచనా వేసింది. ఇది మాత్రమే వాస్తవ ఫలితాలకు కాస్తంత దగ్గరగా వచ్చింది. హరియాణా అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని అంచనావేశాయి. ఏ సంస్థ కూడా ఐఎన్ఎల్డీ చీలిక వర్గం దుష్యంత్ చౌతాలా దూసుకుపోతారని, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు స్థానాలను గెలుచుకోగలదని అంచనా వేయలేదు. కేవలం ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రమే హర్యానాలో హంగ్ వస్తుందని అంచనా వేసింది. -
50:50 ఫార్ములా?
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన అధికారాన్ని చెరి సగం పంచుకుంటాయా? ఫడ్నవీస్ రెండున్నరేళ్లు పాలించిన తర్వాత శివసేన తరఫున సీఎం కుర్చీపై ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే కూర్చుంటారా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ 20కి పైగా స్థానాలను కోల్పోయింది. ఇక శివసేన తన స్థానాలను ఇంచుమించుగా నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ స్వరం పెంచింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాల్లో బీజేపీ 103 సీట్లలో, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. సాధించిన సీట్లను బట్టి అవసరమైతే శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావించింది. కానీ సేన తన దారి మార్చుకొని ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన అధికారాన్ని సగం సగం పంచుకోవాలని ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్నప్పుడే నిర్ణయించుకున్నాయని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొనటం ఈ సందర్భంగా గమనార్హం. రొటేషన్ పద్ధతిలో సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మధ్య అవగాహన ఉన్నట్లు సంజయ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్పారు. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50– 50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీకి అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. అయితే ఫడ్నవీస్ మాత్రం దీనికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. 15 మంది రెబెల్స్ తమతో టచ్‌లో ఉన్నారని అందుకే తమ సంఖ్య తగ్గే అవకాశం లేదని అన్నారాయన. వీలుకాకుంటే కాంగ్రెస్‌తో దోస్తీ? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 స్థానాలు గెలుచుకోవడంతో ఎన్నికల అనంతరం శివసేన మద్దతు ఇచ్చినప్పటికీ కమలదళమే పెద్దన్న పాత్రని పోషించింది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. బీజేపీ కాదంటే కాంగ్రెస్ – ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకు ఉంది. అందుకే బీజేపీని అభ్యర్థిస్తున్నట్లు కాకుండా డిమాండ్ చేస్తున్నట్టుగా శివసేన నేతలు మాట్లాడుతున్నారు. -
‘మహా’నేత ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు (49) అసంతృప్తి లేనప్పటికీ... పూర్తి సంతృప్తిగా లేరని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 102 స్థానాలకే పరిమితమైంది. కాకపోతే మిత్రపక్షం శివసేనతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు. మహారాష్ట్రలో రెండోసారి గెలిచిన తొలి కాంగ్రెసేతేర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు. రాష్ట్రంలో పూర్తికాలం పదవిలో కొనసాగిన రెండో ముఖ్యమంత్రి కూడా ఆయనే!!. కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో (ఆర్ఎస్ఎస్) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడ్నవీస్ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చదివారు. 1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్టు స్థానం నుంచి నెగ్గారు. ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు. అనేక సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ దేవేంద్ర ఫడ్నవీస్ సొంతం. ఫడ్నవీస్ భార్య అమృత బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు. -
ఈ కుర్రాళ్లకు కాలం కలిసొస్తే...
బాల్ థాకరే వారసుడిగా వచ్చిన ఆదిత్య... ఓం ప్రకాష్ చౌతాలా మనవడిగా బరిలోకి దిగిన దుష్యంత్... ఇద్దరూ కుర్రాళ్లే. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగినవారే!!. అయితేనేం... శివసేన భారీ విజయాన్ని దక్కించుకుని... సీఎం కుర్చీని రెండున్నరేళ్లు తమకివ్వాలని బేరాలకు దిగింది. బీజేపీ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్– ఎన్సీపీలతో జట్టుకట్టి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అలాగే హరియాణాలో 10 సీట్లు గెలిచి దుష్యంత్ చౌతాలా జేజేపీ కూడా కింగ్ మేకర్‌గా మారింది. దుష్యంత్‌ను సీఎంను చేసినవారికే మద్దతిస్తామని షరతు పెడుతోంది. కాలం గనక కలిసొచ్చి వీళ్లిద్దరూ ముఖ్యమంత్రులయితే... మొదటి బంతికి సిక్స్ కొట్టేసినట్లే. దుష్యంత్... దేవీలాల్ వారసుడు!! హరియాణాలోని హిస్సార్ జిల్లా, దరోలిలో 1988 ఏప్రిల్ 3న దుష్యంత్ జన్మించారు. తల్లి నైనా సింగ్ చౌతాలా, తండ్రి అజయ్ చౌతాలా. తండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు. రాజకీయ దిగ్గజం, తాత ఓం ప్రకాష్ చౌతాలా. నాలుగు సార్లు హరియాణా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు. ముత్తాత దేవీలాల్. మాజీ ఉప ప్రధాని కూడా!!. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన దుష్యంత్ 2014లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నుంచి పోటీ చేసి హిసార్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లు. తక్కువ వయసులోనే లోక్ సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు కూడా. లోక్కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నల్సార్ నుంచి ఎల్ఎల్ఎమ్ చేశారు. మేఘనా చౌతాలాని ఏప్రిల్ 18, 2017న పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ముల పోరు... అన్నదమ్ములు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాల మధ్య తలెత్తిన విభేదాలు ఐఎన్ఎల్డీలో చీలికకు దారితీశాయి. టీచర్ రిక్రూట్ మెంట్లో అవినీతి ఆరోపణలతో ఓం ప్రకాష్ చౌతాలా 2013లో జైలుకెళ్ళాల్సి వచ్చింది. తరువాత ఎంపీగా గెలిచిన దుష్యంత్ చౌతాలా... అభయ్ చౌతాలా నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబ రాజకీయాలు పార్టీని మరింత విచ్ఛిన్నం చేశాయి. 2018 డిసెంబర్లో ఐఎన్ఎల్డీ నుంచి దుష్యంత్‌ని బహిష్కరించారు. దీంతో 2018 డిసెంబర్ 9న జననాయక్ జనతాపార్టీని (జేజేపీ) దుష్యంత్ ఏర్పాటు చేశారు. తన ముత్తాత దేవీలాల్‌తో పాటు దుష్యంత్ చౌతాలా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు. చట్టసభలోకి ‘ఠాక్రే’ ముంబై: బాల్ ఠాక్రే కావచ్చు... ఉద్ధవ్ థాకరమే కావచ్చు. శివసేన అధిపతులుగా వీరు తమ ఇంట్లోంచే పార్టీని నడిపించారు. కార్యకర్తల్ని చట్టసభలకు పంపించారు కానీ... తామెన్నడూ ఎన్నికల బరిలో నిలవలేదు. కానీ వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే (29) మాత్రం ఎన్నికల బరిలో నిలిచి... గెలిచారు. ఆ కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెడుతున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముంబయిలోని వర్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆదిత్య ఠాక్రే బాంబే స్కాటిష్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. సెయింట్ జేవియర్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ చేశారు. తరవాత కేసీ కళాశాలలో న్యాయ విద్య చదివారు. సాహిత్యంపై అభిరుచి కలిగిన ఆదిత్య ఠాక్రే తాను రాసిన కవితలతో 2007లో ‘మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్’అనే పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘ఉమ్మీద్’పేరిట ప్రైవేట్ పాటల ఆల్బమ్నూ వెలువరించారు. ఆదిత్య ఠాక్రే 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కింది స్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ముంబయిలో షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లను రాత్రంతా తెరిచి ఉంచేందుకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జన ఆశీర్వాద్ యాత్ర పేరిట మహారాష్ట్ర మొత్తం చుట్టివచ్చారు. -
కాషాయ కూటమిదే మహారాష్ట్ర
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. అయితే, బీజేపీ నేతలు ఆశించినంత, ఎగ్జిట్ పోల్స్ తేల్చినంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా సొంతంగానే మెజారిటీ సాధిస్తామనుకున్న బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 24 సీట్లలో విజయం సాధించారు. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయి. కాంగ్రెస్ 45, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ 122, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంచలన వ్యాఖ్య చేశారు. ‘ఈ ఫలితాలు ఒక ఆసక్తికర సంకీర్ణ అవకాశానికి తెరతీశాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై ఆయన అలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాత్రం వచ్చే ఐదేళ్లు బీజేపీ, శివసేన కూటమే అధికారంలో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న 50: 50 ఫార్మూలాను శివసేన తెరపైకి తెచ్చింది. ఏ పార్టీ నేత ముఖ్యమంత్రి కానున్నారని గురువారం ఫలితాల అనంతరం సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా.. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50–50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఫడణవీస్ మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 సీట్లు గెలుపొందాం. ఈ సారి ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసి 105 సీట్లు గెలుచుకున్నాం. మా స్ట్రైక్‌రేట్ 2014లో 47% కాగా, ఈ సారి అది 70% అని ఫడణవీస్ వివరించారు. శివసేనతో అధికార పంపిణీకి సంబంధించి ఎన్నికల ముందు చర్చల సందర్భంగా ఏం నిర్ణయించామో.. అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా లాభపడిన పార్టీగా ఎన్సీపీ నిలిచింది. ఆ పార్టీ గతంలో కన్నా దాదాపు 13 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఈ ఎన్నికలతో పాటే జరిగిన సతారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్సీపీ అభ్యర్థి, సిక్కిం మాజీ గవర్నర్ శ్రీనివాస్ పాటిల్ బీజేపీ అభ్యర్థి ఉదయన్‌రాజె భోసాలేపై విజయం సాధించారు. ఉదయన్‌రాజె ఎన్నికల ముందే ఎన్సీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం సతారాలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రముఖుల్లో సీఎం ఫడణవీస్, శివసేన నేత ఆదిత్య ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మండలిలో విపక్ష నేత ధనుంజయ ముండే తదితరులున్నారు. ధనుంజయ తన కజిన్, బీజేపీ అభ్యర్థి, మంత్రి అయిన పంకజ ముండేపై విజయం సాధించారు. ఫడణవీస్ ప్రభుత్వంలోని దాదాపు ఐదుగురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు బీజేపీ, శివసేనల్లో చేరి టికెట్ సంపాదించిన వారిలో 19 మంది ఓడిపోయారు. ఫలితాల అనంతరం ఎన్సీపీ నేత శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార అహంకారాన్ని ప్రజలు సహించరని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు తమను విపక్షంలోనే ఉండమన్నారని, అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనను శివసేన నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా కూడా తప్పింది. -
బీజేపీ గెలిచింది కానీ..!
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ.. ఆశించిన మెజారిటీ రాలేదు. మరోవైపు, గెలుపు సునాయాసమనుకున్న హరియాణాలో బీజేపీ ఊహించని రీతిలో చతికిలపడింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. హంగ్ ఏర్పడటంతో హరియాణాలో 10 స్థానాలు గెలుచుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా మారింది. అక్టోబర్ 21న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి విజయం, హరియాణాలో బీజేపీ గెలుపు అంతా ఖాయమనుకున్నారు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయిలో ఆధిక్యత చూపడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని భావించారు. ప్రచారంలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేదని భావించారు. కానీ అనూహ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి, హరియాణాలో కాంగ్రెస్ పుంజుకున్నాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శివసేన కూటమికి 200కి పైగా సీట్లు వస్తాయని భావించారు. కానీ కాషాయ కూటమి 161 స్థానాల్లో(బీజేపీ 105, శివసేన 56) మాత్రమే విజయం సాధించింది. అయితే, మెజారిటీ రావడంతో రెండో సారి అధికారం చేపట్టనుంది. అనూహ్యంగా పుంజుకున్న ఎన్సీపీ 54 సీట్లలో, కాంగ్రెస్ 45 సీట్లలో విజయం సాధించాయి. హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలుపొంది, మెజారిటీకి 6 స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 15 స్థానాలే గెలుచుకున్న కాంగ్రెస్‌కు ఇది డబుల్ ధమాకానే. 10 స్థానాల్లో విజయం సాధించిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా నిలిచింది. ఐఎన్ఎల్డీ ఒక స్థానంలో ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. జేజేపీని గత సంవత్సరమే దుష్యంత్ చౌతాలా స్థాపించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతివ్వాలా లేక కాంగ్రెస్‌కా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని దుష్యంత్‌చౌతాలా చెప్పారు. కాగా, హరియాణాలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం స్పష్టం చేశారు. మరోవైపు, హరియాణాలో బీజేపీయేతర పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. కాగా, మహారాష్ట్ర, హరియాణా ఫలితాలను బీజేపీ స్వాగతించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌పై ఆయా రాష్ట్రాల ప్రజలు మరోసారి విశ్వాసం చూపారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పార్టీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. బీజేపీపై మళ్లీ విశ్వాసం చూపించారు: మోదీ న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆ పార్టీ ముఖ్యమంత్రులపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చే ఐదేళ్లలో వారు మరింత కష్టపడతారని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, 2014లో పాలనా పగ్గాలు చేపట్టేనాటికి ఎటువంటి అనుభవం లేనప్పటికీ గడచిన ఐదేళ్లలో వారు స్వచ్ఛమైన పరిపాలనను ప్రజలకు అందించి, ప్రజల విశ్వాస్వాన్ని గెలుపొందారని పేర్కొన్నారు. 2014కు ముందు రెండు రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ అటు తర్వాత కీలకస్థానానికి చేరిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫలితాలపై సమీక్ష గురువారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తాజా అసెంబ్లీ ఫలితాలను సమీక్షించారు. మహారాష్ట్రతో పాటు, మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో నిలిచిన హరియాణాలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కారుకే జై హుజూర్!
సాక్షి, హైదరాబాద్ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్నగర్ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ తొలిసారిగా కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్ సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్‌కు 885 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని రౌండ్లలో గులాబీ హవా... కౌంటింగ్ మొదలైన తర్వాత ఒకటో రౌండ్ నుంచి చివరిదైన 22వ రౌండ్ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్‌పై హుజూర్నగర్ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్‌కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ‘చే’జారిన కీలక స్థానం హుజూర్నగర్ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌లు ఉన్నారు. ఇది హుజూర్నగర్ ప్రజల విజయం అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్నగర్ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్‌లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్‌కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి రీపోలింగ్ నిర్వహించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్‌తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్‌ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం. – నలమాద పద్మావతిరెడ్డి -
మహారాష్ట్ర,హర్యానాలో కమలం జోరు
-
గెలుపెవరిదో..?
-
జడ్జిమెంట్ డే
-
ఏకపక్షమేనా..?
మహారాష్ట్ర, హరియాణాలో మళ్లీ కమలమే వికసిస్తుందా, మోదీ షా ద్వయాన్ని ఎదుర్కొనే శక్తి విపక్షాలకు ఉందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరాఠాల ప్రభావం అత్యధికంగా ఉండే మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌కు, జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌కు పగ్గాలు అప్పగించి బీజేపీ చేసిన ప్రయోగాన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదిస్తారో, వరసగా రెండోసారి సీఎంలు అయ్యే చాన్స్ వారికి వస్తుందా అన్నది నేటి ఫలితాలతో తెలిసిపోనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. మహారాష్ట్రలో... మహారాష్ట్ర శాసనసభ 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తే మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి. కేదార్నాథ్ గుడి వద్ద సీఎం ఫడ్నవీస్ దంపతులు కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుని అత్యంత చాకచక్యంగా మోదీ ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఫడ్నవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అన్ని రంగాల సుస్థిరాభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషకుల అంచనా. రైతు సమస్యలు మినహా ఫడ్నవీస్ పాలనపై పెద్దగా విమర్శలేవీ లేకపోవడం వల్ల ఈ సారి ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే అంచనాలున్నాయి. ఠాక్రే కుటుంబ వారసుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో ఉండడం ఈ సారి విశేషంగా చెప్పుకోవాలి. మొత్తం 25 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. ఉప ఎన్నికల ఫలితాలూ ప్రతిష్టాత్మకమే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని రెండు లోక్‌సభ స్థానాలు, 51 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళే ఉంది. ఈ ఫలితాలతో వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ బీజేపీ తన కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉప ఎన్నికల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరియాణా పీఠం ఎవరిది ? హరియాణాలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని, బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా చెబితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా దానికి విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఈ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హరియాణాలో కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికంగా దృష్టి పెడితే కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే హరియాణాలో పోలింగ్ 76.54 నుంచి 68 శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ఐఎన్ఎల్డీ) చీలిక వర్గం, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీకి 32–44, కాంగ్రెస్‌కు 30–42, ఇక జేజేపీకి 6–10 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పోల్స్‌లో వెల్లడైంది. -
వేలూరులో డీఎంకే ఘనవిజయం
చెన్నై : వేలూరు పార్లమెంట్ స్ధానానికి జరిగిన ఎన్నికలో డీఎంకే విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని అన్నాడీఎంకే కాపాడుకోలేక పోయింది. డీఎంకే పార్టీ అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అన్నాడీఎంకే అభ్యర్ధి ఏసీ షణ్ముగంపై 8,142 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆనంద్‌కు 4,85,340 ఓట్లు రాగా, షణ్ముగం 4,77,199 ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య మొదటి నుంచీ విజయం దోబూచులాండింది. తొలుత అన్నాడీఎంకే అభ్యర్ధి షణ్ముగం ఆధిక్యంలో కొనసాగగా డీఎంకే అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అనూహ్యంగా పుంజుకున్నారు. చివరి వరకు ఆయన ఆధిక్యంలో కొనసాగారు. భారీ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ 24 రౌండ్లపాటు సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వేలూరులో గత ఏప్రిల్ 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. డీఎంకే అభ్యర్ధి గోడౌన్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడటంతో ఎన్నిక వాయిదా పడింది. డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈసీ అక్కడి ఎన్నికను వాయిదా వేసింది. ఇక ఆగస్టు 5న ఈ స్థానానికి ఎన్నిక జరిగింది. ఏఐఏడీఎంకే, డీఎంకే అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. -
రాహుల్ పాదయాత్ర.. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత నెలరోజులుగా నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణుల్లో పార్టీ భవితవ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగనని తేల్చి చెప్పేయడం, ఆయన స్థానంలో ఎవరు వస్తారోనన్న గందరగోళం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పదవులకు సీనియర్ నేతల మూకుమ్మడి రాజీనామాలు ఇవన్నీ ఓ రకమైన సంక్షోభానికి దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు దశలవారీగా పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరి ముందు ఇప్పుడు మూడు ఎజెండాలే ఉన్నాయి. అవే కాంగ్రెస్ జెండాని తిరిగి ఎగురవేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. రాహుల్ పాదయాత్ర ఏసీ గదుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నాళ్లు మేధోమథనం జరిపినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లిన వాడే నాయకుడిగా అవతరిస్తాడని, ప్రజా సమస్యలు కళ్లారా చూసినప్పుడే రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలరని చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అందుకే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందని ప్రతిపాదనలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్ ఎంతవరకు జయప్రకాశ్ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్ మాదిరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలరా అన్న అనుమానాలూ ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇక రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఇప్పుడు అందరి కళ్లు రాజస్థాన్పైనే ఉన్నాయి. ఇన్నాళూ అశోక్ గహ్లోత్æ కాంగ్రెస్ పార్టీ కాబోయే అధ్యక్షుడని ప్రచారం సాగింది. ఇప్పుడు హఠాత్తుగా సచిన్ పైలెట్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరికీ అప్పగించినా పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఎన్ని అసమ్మతి జ్వాలలు రేగుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. పార్టీ పగ్గాలను అనుభవజ్ఞుడికి అప్పగించాలా, యువతరం చేతుల్లో పెట్టాలా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి తగాదాను రాహుల్ ఎంతవరకు సమర్థవంతగా ఎదుర్కోగలరో చెప్పలేని స్థితి. తమిళ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఫార్ములా తరహాలో రాహుల్ గాంధీ మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని తలపోసినా అది కూడా సరిగ్గా నడిచేటట్టుగా అనిపించడం లేదు. మే 25న రాహుల్ తన పదవికి రాజీనామా చేసినా అయిదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందుకు సిద్ధంగాలేరు. అందుకే అధ్యక్షుడి విషయంలో పార్టీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. 2024 ప్రధాని ఫేస్‌గా ప్రియాంక ఇక ఆఖరి అంకం అంటే కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రియాంకమే. 2024 ఎన్నికల్ని రాహుల్ పెద్ద దిక్కుగా ఉండి నడిపించి, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఉంది. ఈ అంశంలో ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోంది. అయితే పెద్ద దిక్కుగా రాహుల్, కొత్త అధ్యక్షుడి పనితీరు, ప్రియాంక ఎలా జనాన్ని మెప్పించగలరు అన్న అంశాలపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదనలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై సానుభూతి, విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం కంటే ఈ నిస్తేజ పరిస్థితులే పార్టీకి ఎక్కువ చేటు కలిగిస్తాయని సీనియర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితికి సోనియా, రాహుల్లదే బాధ్యతని, వారి అంగీకారం లేకుండా ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు. లోలోపల ఏదో కుట్ర, డ్రామా నడుస్తోందని నేతల అనుమానం. సిసలైన నాయకుడెవరూ కూడా సంక్షోభ సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోరని తెలుగు రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ ముందుగా సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర శాఖలు, ఏఐసీసీ విభాగాలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్నారు. భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుగా ఏఐసీసీ సమావేవం ఏర్పాటు చేసి రానున్న రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని అన్నారు. ఇలా ఉండగా, రాహుల్ గాంధీయే చీఫ్‌గా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. రాహుల్ వైదొలుగుతున్నట్లు ప్రకటించినందుకు నిరసనగానే పార్టీ నేతలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. రాహుల్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ తీర్మానించిందని గుర్తు చేశారు. -
ప్రత్యామ్నాయం లేకనే బీజేపీకి పట్టం
సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీ లేకనే 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ హంటర్‌రోడ్డులోని మాజీ మంత్రి టి.పురుషోత్తమరావు నివాసంలో ఆదివారం ‘ప్రజా తీర్పు–2019 ఒక అవగాహన’ అనే అంశంపై నిర్వహించిన తెలంగాణ జనవేదిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక కన్వీనర్ తక్కళ్లపల్లి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలను పొత్తుగా కలుపుకున్నా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడకలేకపోయిందని అన్నారు. ఎన్నిక ల ప్రచారంలో అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తెలియక మళ్లీ బీజేపీకే పట్టం కట్టారని చెప్పారు. ఈ ఎన్నికలతోనైనా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రచారంలో అనుకూలమవుతాయని భావించిన నరేంద్ర మోదీ, అమిత్‌షాలు.. వ్యక్తులకు కాదు పార్టీకి పట్టం కట్టాలంటూ ప్రజలను చైతన్య పరచి మరోసారి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించే పార్టీలకు ప్రజలు ఆమోదం తెలుపుతారన్నాని అన్నారు. ఒడిషాలో స్టేటస్ కొనసాగించడంతో పాటు మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారు.. అలాగే ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంల ను ఏర్పాటు చేసి ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నూతన ఒరవడికి నాంది పలికారని పేర్కొన్నారు. పౌరులు సంఘటితమై ప్రశ్నించినప్పుడే మార్పు సాధ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి టి.పురుషోత్తమరావు, డాక్టర్ కొట్టే భాస్కర్, ఆకుతోట శ్రీనివాసులు, అంజన్‌రావు, నర్మెట వీరేశం, నరేంద్ర, చంద్రమౌళి, లక్ష్మీనా రాయణ, ఎడ్ల ప్రభాకర్, రాంకిషోర్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సదస్సులో భాగంగా పలువురి ప్రశ్నలకు దిలీప్‌రెడ్డి సమాధానాలు తెలిపారు. -
కాంగ్రెస్ పగ్గాలు గహ్లోత్‌కు?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినదగ్గర నుంచి కొత్త అధ్యక్షుడెవరన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. దాంతో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గహ్లోత్ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గెహ్లాట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందన్న విపక్షాల విమర్శకు తెరదించవచ్చని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. అందుకు గహ్లోత్‌ను ఒప్పించిందని సీనియర్ నాయకుడొకరు ధ్రువీకరించారు. గహ్లోత్‌కు అధ్యక్ష పదవి ఖరారయిందని నవభారత్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న గహ్లోత్ కొద్దిసేపు రాహుల్‌తో ఏకాంతంగా సమావేశమవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగేలా చూసేందుకు నేతలు విఫలయత్నం చేశారు. రాహుల్ నిర్ణయాన్ని సోనియా వ్యతిరేకించారు. రాజీనామా చేస్తే దక్షిణాదిన పార్టీ దెబ్బతింటుందని చిదంబరం హెచ్చరించారు. అయినా రాహుల్ పట్టు వీడలేదు. పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ప్రియాంక కూడా సుముఖంగా లేరు. దాంతో కొత్త నేత ఎంపిక అనివార్యమయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న 68 ఏళ్ల గహ్లోత్‌కు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు సీఎంగా పని చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గహ్లోత్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసి సీఎం పదవిని సచిన్ పైలట్‌కు ఇవ్వాలని తద్వారా ఆ ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. గహ్లోత్ ఒప్పుకోకపోతే ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, శశి థరూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది. కాగా, ఈ వార్తలను గహ్లోత్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీకి నలుగురు వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. -
నమ్మకంగా ముంచేశారా?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నమ్మకస్తులే మోసం చేశారన్న వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తల బృందం అసలు విషయాన్ని దాచిపెట్టి, అంతా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాహుల్ గాంధీని నమ్మించారని, ఫలితాలు వెలువడ్డాకా వారంతా అందుబాటులో లేకుండాపోయారని జాతీయ వార్తా పత్రిక ‘ద గార్డియన్’లో ఒక కథనం వచ్చింది. దీని ఆధారంగా ఇతర పత్రికలు,వెబ్సైట్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే, ఈ కథనం నిరాధారమని కాంగ్రెస్ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 164 నుంచి 184 సీట్లు కచ్చితంగా వస్తాయని, ప్రధాని పదవి రాహుల్ గాంధీదేనని వారు గట్టిగా చెప్పడంతో రాహుల్ నమ్మేశారని ఆ కథనం పేర్కొంది. వారి మాటలు పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, శరద్‌పవార్ తదితర నేతలకు రాహుల్ ఫోన్లు చేసి మంత్రివర్గంలో వారికి చోటు కల్పించే విషయమై చర్చలు జరిపారని తెలిసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ సీనియర్ న్యాయవాదుల తో రెండు లేఖలు రాయించుకున్నారట. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు దాదాపు పదివేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆ కథనం పేర్కొంది. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో అధికారం చేపట్టే మాట అటుంచి కనీసం ప్రతిపక్షం హోదా దక్కడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో హతాశుడైన రాహుల్ అధ్యక్ష పదవికి రాజనామా చేస్తానని పట్టుబట్టారు. పార్టీ వ్యూహకర్తలు రాహుల్నేకాకుండా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలనూ నమ్మించారని తెలిసింది. దీనికి కారకులైన, ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి, దివ్య స్పందన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరికీ కనబడటం లేదట. దివ్య అయితే తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను మూసేశారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్‌ను నిర్వహించే చక్రవర్తి డేటా విశ్లేషకుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేసి చెబుతానని ఆయన 24 కోట్లు తీసుకున్నారని, అయితే, దానికి సంబంధించి కనీసం ఒక్క నివేదిక ఇవ్వలేదని తెలిసింది. చక్రవర్తి తమ దగ్గర ఉంటూ బీజేపీ ఏజెంటుగా పని చేశాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ తరఫున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని చెప్పి దివ్య రూ.8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అభూత కల్పన ఎన్నికల విషయంలో తమ విభాగం రాహుల్ గాంధీని మోసగించిందంటూ వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ఖండించారు. అవన్నీ అభూతకల్పనలని, నిరాధారమైనవని సోమవారం న్యూఢిల్లీలో ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. -
కుటుంబ కథా చిత్రం!
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే విశేషమే. బిహార్‌లోని లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్జీపీ) నేత రాంవిలాస్ పాశ్వాన్(73) ఈ ఘనత సాధించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే పొత్తుల్లో భాగంగా ఎల్జేపీకి ఆరు సీట్లు దక్కాయి. వాటిలో మూడు చోట్ల.. పాశ్వాన్ కుమారుడు చిరాగ్, సోదరులు పశుపతి, రామచంద్రలు పోటీ చేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. అయితే, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్డీయేలో ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాశ్వాన్‌తో కలిపి ఆయన కుటుంబంలో నలుగురు ఒకేసారి ఎంపీలుగా ఉన్నట్లవుతుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఏకకాలంలో ఎంపీలు కానుండటం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ కెక్కడం సహా పాశ్వాన్ రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు నెగ్గారు. 1977 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
ఒక్కో ఓటుపై రూ.700
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం.. మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది. ఎన్నికల రారాజు బీజేపీ.. ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది. ధనప్రవాహం ఎక్కడిది? సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్ ఫర్ స్టడీస్ తెలిపింది. అంటే భారత్ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది. -
వయనాడ్‌లో రాహుల్ మానియా
మలప్పురం(కేరళ): లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మలప్పురం జిల్లా కలికావుకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోకు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వయనాడ్ నియోజకవర్గం వ్యాపించి ఉన్న వయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో పర్యటనకు రాహుల్ శుక్రవారం కోజికోడ్‌కు చేరుకున్నారు. ముందుగా కలికావు పట్టణంలో ఓపెన్ టాప్ జీపులో చేపట్టిన రోడ్ షోకు భారీ స్పందన లభించింది. జోరువానలోనూ ప్రజలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. యూడీఎఫ్ కూటమికి చెందిన ఐయూఎంఎల్ కార్యకర్తలు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్‌కు భారీగా భద్రత కల్పించారు. రాహుల్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రాహుల్ పర్యటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగిస్తుందని నేతలు అంటున్నారు. బీజేపీ విద్వేషాన్ని ప్రేమతో జయిస్తా ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ..‘వయనాడ్ ఎంపీగా రాష్ట్ర ప్రజలందరి తరఫున పార్లమెంట్లో మాట్లాడతా. రాజకీయాలతో పని లేకుండా ఇక్కడి సమస్యలపై పార్లమెంట్ లోపలా వెలుపలా పోరాడుతా. నియోజక వర్గం కోసం మీ తరఫున పనిచేస్తా. మీ సమస్యలు వింటా. నాపై ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు. దేశంలో బీజేపీ వ్యాపింప జేస్తున్న విద్వేషాన్ని, అసహనాన్ని ప్రేమ, ఆప్యాయతలతో ఎదుర్కొంటానని తెలిపారు. ‘మోదీకి డబ్బు, మీడియా, ధనవంతులైన స్నేహితులు ఉండి ఉండవచ్చు. కానీ, బీజేపీ సృష్టించిన అసహనాన్ని కాంగ్రెస్ ప్రేమతో ఎదిరించి పోరాడుతుంది’ అని తెలిపారు. రాహుల్ వయనాడ్ నుంచి 4.30 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అన్ని మంత్రివర్గ సంఘాల్లోనూ ఆయనకు చోటు
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత స్థానం అమిత్ షాదేనని ‘సాధికారికం’గా నిరూపణ అయింది. ప్రభుత్వంలో ఆయన అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అవుతారన్న రాజకీయ పరిశీలకుల అంచనాలు నిజమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాల్లో (కేబినెట్ కమిటీ)నూ అమిత్ షా ఉండటమే దీనికి నిదర్శనం. నీతి అయోగ్‌లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కూడా షాను నియమించారు. ఈ కమిటీల్లో కొన్నిటికి మోదీ, మరికొన్నిటికి అమిత్‌షా అధ్యక్షులుగా ఉన్నారు. దీన్నిబట్టి హోం మంత్రి అమిత్ షాకు మోదీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందీ తెలుస్తోంది. అయితే బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కేవలం రెండు కమిటీలకు పరిమితం చేసినప్పటికీ గురువారం మరికొన్ని కమిటీల్లో స్థానం కల్పించింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడిగా కూడా కేంద్రం నియమించింది. గత ప్రభుత్వంలో ఆరు కమిటీల్లో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సారి కూడా ఆరు కమిటీల్లో ఉన్నారు. తాజాగా గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏడు కమిటీల్లో చోటు లభించింది. గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. సీనియర్ ప్రభుత్వాధికారుల నియామకాలు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు వ్యవహారాలు చూసే కేబినెట్ కమిటీలో మోదీ, అమిత్ షాలు మాత్రమే ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆర్థిక వ్యవహారాలు, భద్రత వ్యవహారాలు, కీలకమైన రాజకీయ వ్యవహారాలు తదితర కమిటీల్లో ఉన్నారు. ప్రధాని మోదీ అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో భవిష్యత్తులో ఆయనే చక్రం తిప్పుతారన్న వార్తలు వినవచ్చాయి. దానికి అనుగుణంగానే ముడి చమురు విషయమై రెండు రోజుల క్రితం జయశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ సహా వివిధ కేంద్ర మంత్రులు నిర్వహించిన సమావేశాలకు అమిత్ షా అధ్యక్షత వహించారు. రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ జైట్లీ మాదిరిగానే సీతారామన్‌కు.. ఆరు కమిటీల పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వం గతంలో మంత్రిత్వ శాఖలకు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇప్పుడూ ఇచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆరుణ్‌జైట్లీ అన్ని కమిటీల్లోనూ ఉన్నారు. ఇప్పుడా పదవి చేపట్టిన నిర్మల సీతారామన్‌కు కూడా అన్ని కమిటీల్లో స్థానం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెండు కమిటీలకు ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌లకు కూడా పలు కమిటీల్లో స్థానం లభించింది. ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే రాజకీయ వ్యవహారాల కమిటీలో అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధాన మంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి ప్రధాని తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్‌కు అమిత్ షాతో పోలిస్తే ఎక్కువ కమిటీల్లో చోటు దక్కక పోవడం విశేషం. -
మాతో పెట్టుకుంటే మసే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారని హెచ్చరించారు. రంజాన్(ఈద్–ఉల్–ఫితర్) సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ప్రార్థనలకు హాజరైన 25,000 మందికిపైగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మాతో ఎవరైనా పెట్టుకుంటే నాశనమైపోతారు.. ఇకపై ఇదే మా నినాదం. బీజేపీ మతాన్ని రాజకీయం చేస్తోంది. హిందువులు త్యాగానికి ప్రతీకలు. ముస్లింలు ఇమాన్(సత్యప్రియత)కు, క్రైస్తవులు ప్రేమకు, సిక్కులు బలిదానానికి ప్రతీకలు. మనమంతా ప్రేమించే భారతదేశం ఇదే. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటాం’ అని మమత తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ కొంతసేపటికే అది తగ్గిపోతుంది. ఈవీఎంల సాయంతో వాళ్లు(బీజేపీ) ఎంతత్వరగా అధికారంలోకి వచ్చారో, అంతేత్వరగా తెరమరుగైపోతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, సీఎం మమత రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. -
ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ
సాక్షి, విజయవాడ : పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ పార్టీలో చేరే ఉద్దేశంతోనే నాని విప్ పదవిని తిరస్కరించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను నాని వద్దకు పంపించారు. విజయవాడలోని కేశినేని నాని కార్యాలయానికి వచ్చిన గల్లా.. విప్ పదవి తిరస్కరించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విప్ పదవి తిరస్కరించడం వెనుక రాజకీయ దురుద్దేశం లేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడవద్దని ఈ సందర్భంగా నాని తెలిపారు. తనకు విజయవాడ ఎంపీ పదవి కన్నా పెద్ద పదవి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టానని, విభజన హామీలపై పోరాడానని గుర్తు చేశారు. లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా తనను నియమించడంపై కేశినేని నాని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ...తనకు బదులు సమర్థులైనవారిని నియమిస్తే బాగుంటుందన్నారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి అన్న కేశినేని నాని... పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుపొందిన విషయం విదితమే. -
పార్టీ విప్ పదవిని నిరాకరించిన కేశినేని నాని
-
టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్!
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ విప్ పదవిని ఆయన తిరస్కరిస్తూ తన ఫేస్బుక్ అకౌంట్లో చేసిన పోస్ట్ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవిని తాను తీసుకోనంటూ కేశినేని నాని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం గమనార్హం. లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా తనను నియమించడంపై ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ...తనకు బదులు సమర్థులైనవారిని నియమిస్తే బాగుంటుందన్నారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి అన్న కేశినేని నాని... పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుపొందిన విషయం విదితమే. కాగా కేశినేని నాని టీడీపీని వీడతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన... కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ టీడీపీలో చర్చకు తెరతీసింది. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో... ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కమలం చెంతకు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తమ పార్టీతో చాలామంది టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
చీఫ్ విప్‌గా మార్గాని భరత్ రామ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌రామ్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వీరి నియామకాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు వీరి నియామకాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘మహాఘఠ్ బంధన్’ చీలిపోయింది...
న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్ బంధన్’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. బీఎస్పీ చీఫ్ మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉప ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా రావచ్చు. యూపీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. మేం కూడా సిద్ధమే: అఖిలేశ్ మహాగఠ్ బంధన్ లేకుంటే రానున్న ఉప ఎన్నికల్లో మొత్తం 11 చోట్ల నుంచి ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి అంత ముఖ్యం కాదని తెలిపారు. స్వార్థం కోసమే కూటమి ఎస్పీ, బీఎస్పీ నేతలు తమ కుటుంబసభ్యుల ప్రయోజనాలను కాపాడుకునేందుకే కూటమిగా ఒక్కటయ్యారని బీజేపీ విమర్శించింది. కుల సమీకరణాల ఆధారంగానే ఎన్నికల్లో గెలవాలనుకుని ఆశపడిన మాయావతి, అఖిలేశ్ భంగపాటు కలిగిందని పేర్కొంది. -
ఇది శాశ్వతంగా వీడిపోవడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటైన మహాకూటమికి గుడ్‌బై చెప్పినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ తమ సొంత ఓటు బ్యాంకును కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీచేయడమే మంచిదని, సోమవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు పడలేదని ఆమె విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది శాశ్వతంగా విడిపోవడం కాదని, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో రాజకీయాలకు అతీతంగా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని వెల్లడించారు. అఖిలేష్, డింపుల్ దంపతులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావించానని చెప్పారు. -
పరిషత్ ఫలితాలు నేడే
-
అఖిలేశ్ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!
న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని, ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ– ఆర్ఎల్డీ ‘మహా గఠ్ బంధన్’ సీట్లు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాయా వ్యాఖ్యలతో మహాగఠ్‌బంధన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ‘ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కూటమితో పనిలేకుండా ఒంటరిగానే బరిలో నిలుస్తాం. రాష్ట్రంలో బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్న 10 సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. ఎస్పీ ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు’ అని వివరించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 9 మంది, బీఎస్పీ, ఎస్పీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది. ములాయం కుటుంబీకులే గెలవలేదు యూపీలో బీఎస్పీ–ఎస్పీ– ఆర్ఎల్డీతో ఏర్పాటైన మహాగఠ్‌బంధన్ వృథాయేనని మాయావతి అన్నారు. ‘యాదవుల ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు. మన పార్టీ ఓట్లు వాళ్లకు పడ్డాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచింది. యాదవుల ఓట్లు అఖిలేశ్ యాదవ్ కుటుంబీకులకు కూడా పడలేదు’ అని తెలిపారు. కూటమి లేకున్నా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎందుకంటే అతడు తండ్రి(ములాయం సింగ్ యాదవ్)లాంటి వాడు కాదు’ అని మాయ పేర్కొన్నారు. ‘అఖిలేశ్‌తో విభేదించిన అతడి బాబాయి శివ్‌పాల్‌యాదవ్, కాంగ్రెస్ కారణంగానే యాదవుల ఓట్లు చీలాయి. అఖిలేశ్ భార్య డింపుల్‌ను కూడా గెలిపించుకోలేకపోయాడు. అతని ఇద్దరు సోదరులూ ఓడారు. మనం ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం’ అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడతాం: అఖిలేశ్ సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరేగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ఫెరారీ, సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) మధ్య పోటీ. ఫెరారీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. అంశాల ప్రాతిపదికన కాకుండా వేరే రకంగా ఎన్నికలు జరిగాయి. టీవీలు, సెల్ఫోన్ల ద్వారా ప్రజలతో వాళ్లు(బీజేపీ)మైండ్ గేమ్ ఆడారు. అది నాకూ అర్థం కాలేదు’ అని పేర్కొన్నారు. ఆ యుద్ధ తంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామన్నారు. -
ఆర్బీఐ సమీక్ష, ఆర్థికాంశాలే దిక్సూచి..!
ముంబై: గతేడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయికాగా, 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదైంది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు నిరాశపరిచినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు మార్కెట్లను నిలబెట్టే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఎంపీసీ గురువారం ప్రకటనలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. మరోవైపు కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈయన క్యాబినెట్లో కొత్తగా ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్ 2019–20 సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ప్రధాన ఎజెండా ఉద్యోగ కల్పన, ప్రభుత్వ వ్యయం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన.. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహాన్నివ్వడంతోపాటు పన్నుల తగ్గింపుకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వనుం దనే అంచనాలు ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. మొత్తంగా మార్కెట్‌కు ఈవారం కదలికలు అత్యంత కీలకంగా మారనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అన్నారు. ఇక రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు అయినందున ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయాయి. మెక్సికోపై టారిఫ్‌లను అనూహ్యంగా పెంచుతూ అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఒకదశలో క్రూడ్ ధరలు 6% మేర పతనమయ్యాయి. వారాంతాన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 5.57% తగ్గి 61.69 డాలర్లకు పడిపోగా.. నైమెక్స్ క్రూడ్ 5.69% పతనమై 53.37 డాలర్ల వద్ద ముగిసింది. ఈ పతనం ఇలానే కొనసాగి.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కకుండా ఉంటే, దేశీ మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందనే ఆశావాదంతో ఉన్నట్లు బీఎన్పీ పారిబా అడ్వైజరీ విభాగం హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా తయారీ రంగ ఇండెక్స్ మేనెల గణాంకాలు సోమవారం వెల్లడికానున్నాయి. సేవల డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత వారాంతాన వెల్లడైన ఆటో రంగ అమ్మకాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఈ అంశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ నిధుల వెల్లువ భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గవ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మే నెలలో మొదటి 3 వారాలు అమ్మకాలకు పాల్పడినప్పటికీ.. బీజేపీ ఘనవిజయంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. నికరంగా మే 2–31 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ.7,920 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.1,111 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మొత్తంగా మే నెలలో రూ.9,031 కోట్లను వీరు పెట్టుబడిపెట్టారు. -
సంఖ్యే ముఖ్యం... శాతం కాదు
పదిహేడో లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి చర్చనీయాంశమయింది. విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకే ప్రతిపక్ష నేత పదవి దక్కాలని కొందరు అంటోంటే, మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీకే ఆ పదవి దక్కుతుందని, కాంగ్రెస్‌కు పది శాతం సభ్యులు లేరు కాబట్టి ప్రతిపక్ష నేత పదవిని కోరే హక్కు లేదని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, ప్రతిపక్ష నేత పదవి అన్నది చట్టబద్ధమైన హోదా అని, పది శాతం నిబంధన చట్టంలో ఎక్కడా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాతంతో సంబంధం లేకుండా లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్ష సభ్యునికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి తీరాలని వారు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోరే పార్టీకి లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్నారా లేదా అన్నదే స్పీకర్ చూడాలి కాని ఎంత మంది లేదా ఎంత శాతం అన్న లెక్క వేసే అధికారం స్పీకర్‌కు లేదని వివరిస్తున్నారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో అయితే విపక్ష నేతను ‘షాడో ప్రైమ్ మినిస్టర్’గా పేర్కొంటారు. ఒకవేళ అధికార పక్షం పార్లమెంటులో మెజారిటీ కోల్పోతే వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ విపక్ష నేత సిద్ధంగా ఉంటారు. అందుకే విపక్ష నేతను షాడో ప్రధానమంత్రిగా పేర్కొంటారు. స్పీకర్‌దే తుది నిర్ణయం మన పార్లమెంటరీ విధానంలో ఉభయ సభల్లోనూ విపక్ష నేత పదవి చట్టబద్ధమైనది. 1977 నాటి ‘పార్లమెంటులో విపక్ష నేతల జీత, భత్యాల చట్టం’ ఈ పదవిని నిర్వచించింది. లోక్‌సభ/రాజ్యసభలో ప్రతిపక్షాల్లో దేనికి ఎక్కువ మంది సభ్యులుంటే ఆ పార్టీ సభ్యుడు విపక్ష నేత అవుతారని, ఆ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్/రాజ్యసభ చైర్మన్ గుర్తించాలని ఆ చట్టం నిర్దేశించింది. ఎక్కువ మంది అని చెప్పిందే కాని ఎంత శాతం అన్నది చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రతిపక్షాల్లో ఒకటి కంటే ఎక్కువ పార్టీలకు సమాన సంఖ్యలో సభ్యులు ఉన్నట్టయితే, వాటిలో ఏదో ఒక పార్టీ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్ గుర్తించవచ్చని, ఈ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్షం తమ పార్టీ సభ్యుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయాలి. ఆ అభ్యర్థనను పరిశీలించిన స్పీకర్ ఆ పార్టీ పేర్కొన్న వ్యక్తికి విపక్ష నేతగా గుర్తింపు ఇస్తారు. సంఖ్యాపరంగా పెద్ద పార్టీకి విపక్ష నేత హోదా కోరే హక్కుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఏది పార్టీ... ఏది గ్రూప్ చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు విపక్ష నేత హోదా గురించి ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది. 1950 దశకంలో స్పీకరు పార్లమెంటులో ప్రతిపక్షాలను సభ్యుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని పార్టీలుగా, కొన్నింటిని గ్రూపులుగా గుర్తించడం మొదలైంది. సభలో సీట్లు, చర్చల్లో సమయం, పార్టీ లకు గదులు కేటాయించడం కోసం అప్పట్లో ఈ పద్ధతిని అనుసరించారు. మొత్తం సీట్లలో పది శాతం సీట్లు సాధించిన రాజకీయ పక్షాన్ని పార్టీ అని, అంతకంటే తక్కువ శాతం సీట్లు ఉన్నదాన్ని గ్రూప్ అని వర్గీకరించారు. అప్పటి నుంచి పది శాతం అన్నది నిబంధనగా మారిపోయింది. 1977లో జీత భత్యాల చట్టం ఈ విషయంలో సందేహానికి, గందరగోళానికి తెరదించింది. ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురున్నా... రాజ్యాంగంలోని పదో షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనలు తెచ్చింది. దాని ప్రకారం సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా సభలో ఉండే ప్రతి రాజకీయ పక్షాన్ని పార్టీగానే పరిగణిస్తున్నారు. ఒక సభ్యుడున్న పక్షాన్ని కూడా పార్టీగానే గుర్తిస్తున్నారు. ఢిల్లీ శాసనసభలో సభ్యులు 70 మంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి ముగ్గురే సభ్యులున్నారు. పదిశాతం నిబంధన ప్రకారం ఆ పార్టీకి విపక్షనేత హోదా రాకూడదు. అయితే, స్పీకర్ రామ్ నివాస్ గోయల్ బీజేపీకి ఆ గుర్తింపు ఇచ్చారు. -
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్‌లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
మళ్లీ అదే జోడీ
కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా నియామకంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీలో సీనియర్లకు మాత్రం కొన్ని మధుర స్మృతులు కళ్ల ముందు మెదులుతున్నాయి. మోదీ–షా ద్వయాన్ని చూస్తున్న వారందరూ ఒక్కసారిగా రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి అటల్జీ రోజుల్లో విహరిస్తున్నారు. 1998లో ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో లక్నో నియోజకవర్గం నుంచి వాజపేయి ఎన్నికైతే, గుజరాత్లో గాంధీనగర్ నుంచి ఎన్నికైన ఎల్.కె. అడ్వాణీ హోం మంత్రి పదవిని అందుకున్నారు. ఆ తర్వాత ఉప ప్రధాని పదవిని చేపట్టారు. వాజపేయి–అడ్వాణీ జోడీ తమకున్న పరస్పర సహకారంతో బీజేపీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనతో విసిగిపోయిన జనంలో వాజపేయి–అడ్వాణీ జోడీ పట్ల ఎనలేని నమ్మకం ఏర్పడింది. బీజేపీ తొలిసారిగా స్వర్ణయుగం అనుభవించిన రోజులవి. మళ్లీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, హోంమంత్రి అమిత్ షా ఇన్నాళ్లుగా అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచే నెగ్గారు. యూపీ పీఏం, గుజరాత్ హెచ్ఎం ఫార్ములా అప్పట్లో బీజేపీని తారాపథంలోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు హోం మంత్రిగా షా నియామకంతో అదే యూపీ, గుజరాత్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది మోదీ షా ద్వయం ఎదుర్కోనున్న సవాళ్లు అప్పట్లో వాజపేయి అడ్వాణీ జోడి ఎదుర్కొన్న సవాళ్లే ఇప్పుడూ మోదీ, షా ఎదుట ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది. వికాస్ పురుష్‌గా పేరుతెచ్చుకున్న వాజపేయి, లోహ్పురుష్ అని పిలుచుకునే అడ్వాణీ కాంబినేషన్ అందరినీ ముచ్చటగొలిపింది. బీజేపీకి ఒక గుర్తింపు తేవడానికి వారు ఎంతో కృషి చేశారు. వాళ్లిద్దరు వేసిన బాటలోనే నడుస్తున్న మోదీ–షా ద్వయం దృష్టంతా ఇప్పుడు మోదీ తరహా రాజకీయాలను తిరస్కరిస్తున్న రాష్ట్రాల్లో పట్టు బిగించడంపైనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపజేయడమే మోదీ–షా ద్వయం ముందున్న అసలు సిసలు సవాల్. రాష్ట్రాల్లో పట్టుబిగిస్తే తప్ప రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ దక్కదు. కొత్త చట్టాలు చేసి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలన్నా, బూజుపట్టిన పాత చట్టాలకు సవరణలు చేయాలన్నా పెద్దల సభలో బీజేపీకి మెజార్టీ అత్యవసరం. అప్పుడే ఈ జోడీ తాము అనుకున్నది సాధించగలదు. యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే పెద్దల సభలో పట్టు బిగించగలరు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
కొదమసింహాల్లా పోరాడుతాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులోని సెంట్రల్‌హాలులో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియాగాంధీ పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ ప్రతిపాదించగా, మిగతా కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతలు చేతులు పైకెత్తి తమ అంగీకారం తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతను ఎంపికచేసే బాధ్యతను పార్టీ సోనియాకు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ శ్రేణులు దిగులుపడొద్దని సూచించారు. పార్లమెంటులో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, రాజ్యసభలో ఒకేరకమైన భావజాలం ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. ‘ఈ సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న పలు సవాళ్లను మనం గుర్తించాలి. ఇటీవల సమావేశమైన సీడబ్ల్యూసీ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిననిర్ణయాలపై చర్చించాం. యూపీఏ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చరిత్రాత్మక చట్టాలను గత ఐదేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేయకుండా అడ్డుకోగలిగాం. సంస్కరణలు, కీలక అంశాల విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాం. ప్రభుత్వం చేసే విభజన, తిరోగమన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని సోనియా స్పష్టం చేశారు. రాహుల్‌పై ప్రశంసలు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ అద్భుతంగా పోరాడారని సోనియా కితాబిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కోట్లాది మంది ఓటర్లతో పాటు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ప్రేమను, గౌరవాన్ని చూరగొన్నారు. రైతులు, చిరువ్యాపారులు, యువత, మహిళలు, సమాజంలోని బలహీనవర్గాల పట్ల మోదీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడాన్ని ధైర్యంగా నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా, ధైర్యంగా దూసుకుపోయిన రాహుల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. లోక్‌సభలో 44 మంది, రాజ్యసభలో 55 మంది ఎంపీల బలం మాత్రమే ఉన్నప్పటికీ రాహుల్ నాయకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను వెలుగులోకి తీసుకొచ్చింది. నేనిక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది’ అని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గనున్న నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని సోనియా పునరుద్ఘాటించారు. మరోవైపు సీపీపీ నేతగా సోనియా ఎంపికపై రాహుల్ స్పందిస్తూ..‘పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియాకు శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. బీజేపీని ఇష్టానుసారం వ్యవహరించనివ్వం: రాహుల్: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాపాడేందుకు కొదమసింహాల గుంపులా పోరాడుతారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో తమ ఇష్టానుసారం వ్యవహరించనివ్వబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘బ్రిటిష్ హయాంలో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా సహకరించకపోయినా కాంగ్రెస్ పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ పోరాడుతాం. మనమంతా కులం, మతం, రంగు, జాతి, రాష్ట్రం అనే భేదభావం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు, దేశంలోని ప్రతీఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఎన్నికల సందర్భంగా బీజేపీ విద్వేషం, ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రేమ, ఆప్యాయతతో అడ్డుకుంది. అందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముక్తభారత్ అని కలవరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తమకు అడ్డుకునేవారే ఉండరని భావిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసారి పార్లమెంటులో మరింత తక్కువ సమయం లభించే అవకాశముందనీ, కాబట్టి ప్రజావాణిని గట్టిగా వినిపించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కొందరు పాతముఖాలు (మల్లికార్జున ఖర్గే, సునీల్ కుమార్ జాఖడ్, జ్యోతిరాదిత్య సింధియా) ఇక్కడుంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి రేసులో నలుగురు.. సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఉండబోనని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పదవిలో గాంధీయేతర నేతను నియమించి, ఆయనకు సాయంగా సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించవచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. కేరళ పీసీసీ మాజీ చీఫ్, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన కొడికుణ్ణల్ సురేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ హవాను తట్టుకుని ఐదోసారి ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోజ్ తివారీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జూన్ 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోనియా వీలైనంత త్వరగా ఈ నియామకం చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు. -
బీజేపీ ఎంపీల్లో 75 మంది ‘వారసులు’
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల గురించి జరిపిన అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గతంలోకన్నా ఈసారి ఎక్కువ మంది గెలుపొందారు. 2004 నుంచి 2014 వరకు కొనసాగిన ఎంపీల్లో 25 శాతం మంది వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే అయితే, ఇప్పుడు 17వ లోక్‌సభలో వారి సంఖ్య 30 శాతానికి చేరుకున్నట్లు ‘సోషల్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటీవ్స్ ప్రాజెక్ట్’ కోసం సేకరించిన డేటాలో వెల్లడయింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లోనే వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎక్కువ ఉంటారని అనుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోనే ఎక్కువ ఉంటున్నారు. ఈసారి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి 31 శాతం మంది రాజకీయ వారసులు పోటీ చేయగా, బీజేపీ నుంచి 22 శాతం మంది పోటీ చేశారు. బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకోవడంతో ఆ పార్టీ తరఫునే రాజకీయ వారసులు ఎక్కువ మంది గెలిచారు. కాంగ్రెస్ తరఫున తక్కువ మంది గెలిచారు. అయితే శాతం ప్రకారం చూసుకుంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎంపీలే ఎక్కువ మందని తేలుతుంది. 303 బీజేపీ ఎంపీల్లో 75 మంది రాజకీయ వారసులుకాగా 52 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 23 మంది రాజకీయ వారసులు ఉన్నారు. ఆ తర్వాత 23 మంది డీఎంకే ఎంపీల్లో పది మంది, 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీల్లో ఏడుగురు రాజకీయ వారసులు ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారికంటే గెలిచిన ఎంపీల్లో రాజకీయ వారసులు ఎక్కువగా ఉన్నారు. అంటే, రాజకీయ వారసులే ఎక్కువ మంది గెలిచారన్నమాట. ఇక్కడ మరో విశేషముంది. లోక్‌సభకు మొట్టమొదటిసారి 78 మంది (14 శాతం) మహిళా ఎంపీలు ఎన్నికకాగా వారిలో రాజకీయ వారసులే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం మహిళా ఎంపీల్లో సగం మంది ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా...నాలుగు రాష్ట్రాలకు చెందిన వారే. సాధారణంగా రాజకీయ పార్టీలు రిజర్వ్డ్ సీట్లకే మహిళల పేర్లను ప్రతిపాదిస్తాయి. మొత్తం 78 మంది మహాళా ఎంపీల్లో 24 మంది మహిళా ఎంపీలు రిజర్వ్డ్ స్థానాల నుంచి విజయం సాధించిన వారే. బిజూ జనతా దళ్ నుంచి ఏడుగురు మహిళలు పోటీ చేయగా, వారిలో ఆరుగురు రిజర్వ్డ్ స్థానాల నుంచే పోటీ చేశారు. మొత్తం పురుష ఎంపీల్లో 15 శాతం మంది రాజకీయ కుటుంబం వారసులుకాగా, 42 శాతం మంది మహిళలు రాజకీయ కుటుంబం వారసులు. -
తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లే..
పట్నా/మీర్జాపూర్: ఏదో నామమాత్రంగా జేడీ(యూ)కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనడంతోనే తాము కేంద్రంలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గంలో జేడీ(యూ)ను కూడా చేరేలా నితీశ్‌ను ఒప్పించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలుసార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తగినన్ని మంత్రిపదవులు ఇవ్వకపోతుండడంతో నితీశ్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. జేడీ(యూ)కు ఒక మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పగా, తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నితీశ్ పట్టుబట్టినట్లు సమాచారం. లేదంటే ఆ ఒక్క పదవి కూడా వద్దని తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుంచి నితీశ్ శుక్రవారం పట్నా తిరిగొచ్చారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ ఎన్డీయేతో లేదా బీజేపీతో తమకు విభేదాలేమీ లేవనీ, తాము మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మేం మోదీ ప్రభుత్వంతోనే ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మరో సహాయమంత్రి పదవులను జేడీయూ డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్నాదళ్‌దీ అదే దారి.. మంత్రిపదవి విషయంలో అసంతృప్తి కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్ (ఎస్) పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్ గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె కేబినెట్ హోదా పదవి ఆశించారనీ, అయితే సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) కూడా దక్కకపోతుండటంతో ఈసారి మంత్రిపదవిని అనుప్రియ వద్దనుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
జై జవాన్.. జై కిసాన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు, సాయుధ, పారామిలటరీ బలగాలకు పెద్ద పీట వేసింది. రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్ఎస్) పథకం పరిధిలోకి కొత్తగా 2 కోట్ల మంది రైతులను తీసుకురావాలని నిర్ణయించింది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉండే 12.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల కోసం మధ్యంతర బడ్జెట్లో కేంద్రం పీఎంకేఎస్ఎస్ పథకాన్ని ప్రకటించింది. తాజా కేబినెట్ భేటీలో ఈ 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) కేంద్రం ఎత్తివేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం ఏటా రూ.75,000 కోట్ల నుంచి రూ.87,217.50 కోట్లకు చేరుకోనుంది. ఈ విషయమై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ..‘పీఎంకేఎస్ఎస్ పథకంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 14.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3.12 కోట్ల మంది రైతులకు తొలివిడత నగదును, 2.66 కోట్ల మంది రైతన్నలకు రెండో విడత నగదును అందజేశాం’ అని తెలిపారు. చిరువ్యాపారులకు సంబంధించిన పెన్షన్ పథకానికీ కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీనివల్ల దాదాపు 3 కోట్ల మంది చిల్లర వర్తకులకు లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ‘కిసాన్ పెన్షన్’కు ఆమోదం అలాగే రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్(పీఎంకేపీవై) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తోమర్ చెప్పారు. ‘తొలుత 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను కేంద్రం ఈ పథకం పరిధిలోకి తీసుకురానుంది. 18–40 ఏళ్ల మధ్య వయసుండే రైతులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతన్నలు పీఎంకేపీ పథకం కింద ఎంత జమచేస్తారో, కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. వీరి వయసు 60 సంవత్సరాలు దాటాక ప్రతినెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారు. దీనివల్ల ఖజానాపై ఏటా రూ.10,774.5 కోట్ల భారం పడనుంది’ అని తోమర్ తెలిపారు. ఒకవేళ పెన్షన్‌దారుడు చనిపోతే, అతని జీవితభాగస్వామికి మొత్తం పెన్షన్‌లో 50 శాతం అందుతుందని వెల్లడించారు. అయితే సంబంధిత జీవితభాగస్వామి పీఎంకేపీవై పథకంలో సభ్యుడిగా/సభ్యురాలిగా ఉండరాదని పేర్కొన్నారు. ‘సాయుధ’ స్కాలర్షిప్ పెంపు.. శత్రుమూకలతో పోరాడుతూ అమరులైన, పదవీవిరమణ చేసిన సాయుధ, పారామిలటరీ బలగాలు, రైల్వే పోలీసుల కుటుంబసభ్యులకు లబ్ధిచేకూర్చేలా కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అమరుల భార్యలు, పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలను కూడా ఈ జాబితాలో చేర్చింది. ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం(పీఎంఎస్ఎస్) కింద ప్రస్తుతం అమర జవాన్ల కుమారులకు నెలకు రూ.2,000 కుమార్తెలకు రూ.2,250 అందజేస్తున్నారు. తాజాగా కుమారులకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.2,500కు, అమ్మాయిలకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.3,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అమరులైన పోలీస్ కుటుంబాలకు చెందిన దాదాపు 500 మందికి లబ్ధిచేకూరనుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ, మెడికల్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు చదివే అమరుల కుటుంబసభ్యులకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. పీఎంఎస్ఎస్ కింద ఇప్పటివరకూ అ మరులైన సాయుధబలగాల పిల్లలకు 5,500, పారామిలటరీ బలగాల పిల్లలకు 2,000, రైల్వేపోలీసుల పిల్లలకు 150 స్కాలర్‌షిప్పులను అందజేస్తున్నారు. బిమ్స్టెక్ అధినేతలతో భేటీ.. తన ప్రమాణస్వీకారానికి హాజరైన బిమ్స్టెక్(బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్) దేశాల అధినేతలతో ప్రధాని మోదీ శుక్రవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమైన మోదీ, ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచదేశాలకు పెనుసవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా భద్రత, శాంతి, సుస్థిరతల కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోతెయ్ శెరింగ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హామీద్‌లతో వేర్వేరుగా సమావేశమైన మోదీ, అన్నిరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్ సహా ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ జూన్ 9న కొలంబోను సందర్శించే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు సిరిసేన తెలిపారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక జూన్ 7–8 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించాలని మోదీ నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీలంక వెళతారని దౌత్యవర్గాలు తెలిపాయి. చాలా సంతోషంగా ఉంది: మోదీ నూతన కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి 4 కీలక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘కేబినెట్ భేటీలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు, వ్యాపారులు చాలా లాభపడతారు. కార్మికుల ఆత్మగౌరవం పెరుగుతుంది. వారంతా సాధికారతతో జీవించడం వీలవుతుంది. ఇప్పుడు కాదు.. ఎప్పుడైనా సరే ప్రజలే మాకు తొలి ప్రాధాన్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో మహాత్మాగాంధీ, పటేల్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ బాధ్యతలు చేపట్టారు. జూలై 5న బడ్జెట్.. 17వ లోక్‌సభ తొలివిడత సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26 వరకూ జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతామని వెల్లడించారు. లోక్‌సభ సమావేశాల సందర్భంగా మొదటి రెండ్రోజులు ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 19న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి జూన్ 20న ప్రసంగిస్తారని జవదేకర్ చెప్పారు. బడ్జెట్ సమర్పణకు ఒక్కరోజు ముందుగా ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. మొత్తం 30 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై 5న ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్‌కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
కిషన్‌రెడ్డికి కీలక శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి కీలకమైన హోం శాఖను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. సహాయ మంత్రి పదవి అయినప్పటికీ అది హోం శాఖ కావడంతో కిషన్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎల్.కె.అద్వానీ నంబర్ –2 హోదాలో ఉన్నారు. అప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తెలంగాణలోని కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన సీహెచ్ విద్యాసాగర్ రావుకు హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే. నరేంద్ర మోదీ తరువాత నంబర్ –2 స్థానంలో ఉన్న అమిత్‌షా ఇప్పుడు హోం మంత్రి. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించడం విశేషం. అమిత్‌షా వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరిస్తుండడం కిషన్‌రెడ్డికి కలిసిరానుంది. హోం శాఖలో సరిహద్దు నిర్వహణ, దేశ అంతర్గత భద్రత, కశ్మీర్ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యానంద్కూ హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. -
తొలి మహిళా ఆర్థిక మంత్రి
రెండో సారి అధికారం చేపట్టిన మోదీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టి నిర్మలా సీతారామన్ దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. గతంలో ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించినా పూర్తి స్థాయి మంత్రిగా నియమితులయిన మహిళ నిర్మలా సీతారామనే. నిర్మల గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పని చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన నిర్మలా రామన్ సమర్ధురాలిగా నిరూపించుకున్నారు. దేశం వృద్ధిరేటు తిరోగమనంలో ఉండటం,ఉపాధి కల్పన ఆశించిన మేర జరగకపోవడం,ద్రవ్యోల్బణం శృతి మించుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక శాఖను నిర్వహించడం నిర్మలా సీతా రామన్‌కు సవాలేనని పరిశీలకులు అంటున్నారు. వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, ఆర్థి క సౌష్టవం, జీఎస్టీ సరళీకరణ, బ్యాంకుల పునరుజ్జీవం, ఉపాధి కల్పనలపై మంత్రి దృష్టి సారించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు . కొత్త ఆర్థిక మంత్రి జీఎస్టీని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక రంగంలో వీలయినన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేలా నూతన ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలి. బ్యాంకులను కాపాడేందుకు కొత్త విత్త మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రక్షణకి రాజమార్గం రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ కొత్తగా రక్షణ శాఖ బాధ్యతల్ని అప్పగించిన బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర హోంశాఖను పరుగులు పెట్టించిన సామర్థ్యముంది. సాయుధ దళాల ఆధునీకరణ, రక్షణ రంగం పాత్ర, మేకిన్ ఇండియా కార్యక్రమాలు, కశ్మీర్ అంశంలో వ్యూహాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం వంటి సవాళ్లు ఆయన ఎలా ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులోకి రక్షణ శాఖను కూడా తీసుకువచ్చి సరికొత్త సంస్కరణలకు తెరతీసిన సమయమిది. త్రివిధ దళాలకు సమప్రాధాన్యం దక్కేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనే కొత్త పదవిని సృష్టించి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. వీటన్నింటిని ప్రధాని ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించడం రాజ్‌నాథ్ ముందున్న సవాల్. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై అడుగులు ఎటు రక్షణ శాఖలో గేమ్‌ఛేంజర్‌గా భావించే వ్యూహాత్మక భాగస్వామ్య విధానంపై కొత్త ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ప్రైవేటు రంగం డిమాండ్ చేస్తోంది. ఈ విధానం ప్రకారం విదేశీ సాంకేతిక సహకారం అందించే సంస్థతో కలిసి ప్రైవేటు సంస్థలు జలాంతర్గాములు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, తేలికపాటి యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేయాలి. మోదీ ప్రభుత్వం ఎన్నో తర్జనభర్జనలు, చర్చోపచర్చల తర్వాత ఈ మెగా ప్రాజెక్టుల అమలు ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించింది. దీంతో ప్రైవేటు రంగంలో బడా బడా సంస్థలు నిరుత్సాహానికి లోనయ్యాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు సరిగా లేక ఒప్పందాలు ముందుకు కదలడం లేదు. ఈ పరిణామాలతో స్వదేశీ శక్తితో రక్షణ రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించాలంటే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక హోంశాఖ మంత్రిగా ఉన్న అనుభవంతో కశ్మీర్ భద్రతకు దీర్ఘ కాల ప్రణాళికలు రూపొందించడం కూడా రాజ్‌నాథ్ ముందున్న సవాలే. జై జై శంకర్ మళ్లీ సొంత గూటికి జైశంకర్ ఒక అరుదైన వ్యక్తికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పగించారు. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. రాజ్యసభలోనూ సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఆయనలో ఉన్న దౌత్యనీతికి, రాయబారం చేయడంలో నేర్పరితనానికి ప్రధాని ముగ్ధుడై ఏరికోరి కేబినెట్లో చేర్చుకున్నారు. ఆయనే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జైశంకర్. ప్రపంచపటంపై భారత్ హోదాను మరింత పెంచాలంటే, విదేశాంగ విధానంలో దూకుడు ప్రదర్శించాలని దానిని సమర్థవంతంగా నిర్వహించగలిగేది జైశంకరేనన్న నమ్మకంతో మోదీ ఆయనకి ఈ పదవిని అప్పగించారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ ఒకప్పుడు దౌత్యవేత్త. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి, చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టడం ఇదే తొలిసారి. చైనా, అమెరికాలతో దౌత్యవ్యవహారాలను నడపడంలో అందెవేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న జైశంకర్ ఇక ముందు ముందు విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పులు తెస్తారోనన్న అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివేకవంతుడు, హాస్య చతురత గల వ్యక్తిగా జైశంకర్‌కి పేరుంది. సవాళ్లు ఇవే ప్రపంచపటంపై భారత్ హోదాని పెంచడం, జీ–20, బ్రిక్స్ వంటి భాగస్వామ్య కూటముల వ్యవహారాలను చాకచక్యంతో నడపడం, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇతర పొరుగుదేశాలతో వాణిజ్య, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం వంటి సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా డోక్లాం సంక్షోభంతో చైనా, భారత్ మధ్య క్షీణించిన సంబంధాలను బలోపేతం చేయడం జయశంకర్ ముందున్న మరో సవాల్. ఐరాసభద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం, అణు సరఫరా గ్రూప్‌లో భారత్ పాత్ర వంటి అంశాల్లో ఆయన పనితీరును చూడాల్సిందే. రాయబారిగా ఎనలేని ప్రతిభ వివిధ దేశాల్లో రాయబారిగా , విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆయన ఎంతో ప్రతిభ కనబరిచారు. 2015లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులై మోదీ అమెరికా పర్యటనని విజయవంతం చేయించారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత్‌కి స్థానం దక్కాలన్న ప్రచారానికి ఊతమిచ్చారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి దగ్గర అవడం ద్వారా భారత దేశపు సముద్ర ప్రాంత దౌత్య విస్తరణకు కృషి చేశారు. స్ట్రాటజిక్ ఎఫైర్స్ కామంటేటర్ కె. సుబ్రహ్మణ్యం, సులోచన దంపతులకు జనవరి 9, 1955న జన్మించారు. సైకిల్‌పై ప్రయాణం పూరిపాకలో నివాసం, ఒడిశా మోదీకి కలిసొచ్చిన సామాజిక సేవ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రజల మనిషి ప్రతాప్ చంద్ర సారంగిది నిరాడంబర జీవితం.సామాజిక సేవ తప్ప మరోటి తెలీదు. ఆరెస్సెస్‌తో సుదీర్ఘ అనుబంధముంది. బజరంగ్దళ్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. ఇప్పటికీ పూరిపాకలోనే నివసిస్తారు. సైకిల్‌పైనే ప్రయాణం చేస్తారు. ప్రజల కోసం పెళ్లి కూడా మానుకున్న ఆయన్ను నియోజకవర్గం ప్రజలు ప్రేమతో పెద్దన్నా అని పిలుస్తారు. మరికొందరు అభిమానులు ఒడిశా మోదీ అని కీర్తిస్తారు. ఒడిశాలో బాలసోర్ నియోజకవర్గం నుంచి సిటింగ్ బీజేడీ ఎంపీ , పారిశ్రామికవేత్త రబీంద్రకుమార్ జెనాను 13 వేల ఓట్ల తేడాతో ఓడించారు. తనకు వచ్చే ఎమ్మెల్యే పెన్షన్‌లో అత్యధిక భాగం నిరుపేద విద్యార్థులు చదువుకే వినియోగిస్తారు. మొదటిసారి లోక్‌సభకు ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన ఆయన ప్రమాణస్వీకారం చేసినప్పుడు చప్పట్లే చప్పట్లు. నిరాడంబర జీవితం, కష్టపడి పనిచేసే తత్వం, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఆయనకు కేంద్ర మంత్రి పదవిని వరించేలా చేసింది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడైన సారంగి ఒడిశా అసెంబ్లీకి నీలగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బాలసోర్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. క్రియాశీల రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నా మట్టి, వెదురు ఇంట్లోనే ఆయన జీవనం సాగిస్తారు. సంస్కృతంలో దిట్టయిన సారంగి బాలసోర్‌లో ఫకీర్ మోహన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రామకృష్ణ మఠంలో ఒక సన్యాసిగా కొనసాగాలనుకున్నారు. కానీ మత పెద్దలు ఆయనని సామాజిక సేవ వైపు మళ్లమని సలహా ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన తన చుట్టు పక్కల పల్లెల్లో దీనజనోద్ధరణకే నడుం బిగించారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పి విద్యాసుమాలు విరబూయించారు. అప్పట్లోనే ఆరెస్సెస్‌లో చేరి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. సారంగి చేసిన సామాజిక సేవే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. సుష్మా.. వుయ్ మిస్ యూ.. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో మాజీ విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌కి చోటుదక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేత హోదాలోనూ, గత బీజేపీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహించిన సుష్మా స్వరాజ్ అనారోగ్య కారణాల రీత్యా ఎన్నికల్లో పోటీచేయడంలేదని ముందుగానే ప్రకటించారు. ‘ఈ మంత్రివర్గంలో మీరు లేకపోవడంతో భారతీయులంతా మిమ్మల్ని మిస్ అవుతున్న భావం కలుగుతోంది. ఆరోగ్యవంతమైన విలువలనూ, భావోద్వేగాలనూ మీరు మంత్రిత్వ శాఖకు కల్పించారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉంటూ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, శివసేన తీర్థం పుచ్చుకున్న ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు. -
కేంద్ర మంత్రులు.. కేటాయించిన శాఖలు
నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల శాఖ; అణు ఇంధన శాఖ; అంతరిక్ష విభాగం; అన్ని ముఖ్యమైన విధానపర నిర్ణయాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు 1. రాజ్‌నాథ్ సింగ్ : రక్షణ శాఖ 2. అమిత్ షా : హోం శాఖ 3. నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా, రహదారుల శాఖ; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 4. డి.వి.సదానంద గౌడ : రసాయనాలు, ఎరువుల శాఖ 5. నిర్మలా సీతారామన్ : ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు 6. రాంవిలాస్ పాశ్వాన్ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,ప్రజా పంపిణీ 7. నరేంద్ర సింగ్ తోమర్ : వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ 8. రవిశంకర్ ప్రసాద్ : న్యాయ శాఖ; కమ్యూనికేషన్లు; ఎలక్ట్రానిక్స్,ఐటీ 9. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ : ఫుడ్ ప్రాసెసింగ్ 10. థావర్ చంద్ గెహ్లాట్ : సామాజిక న్యాయం, సాధికారత శాఖ 11.సుబ్రమణ్యం జైశంకర్ : విదేశీ వ్యవహారాలశాఖ 12. రమేష్ పోక్రియాల్ : మానవ వనరుల అభివృద్ధి 13. అర్జున్ ముండా : గిరిజన వ్యవహారాల 14. స్మృతీ జుబిన్ ఇరానీ : స్త్రీ, శిశు, జౌళి శాఖ 15. డాక్టర్ హర్షవర్దన్ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; సైన్స్ అండ్ టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్ విభాగం 16. ప్రకాష్ జవ్డేకర్ : పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు; సమాచారం 17. పీయూష్ గోయెల్ : రైల్వే, వాణిజ్యం, పరిశ్రమ 18. ధర్మేంద్ర ప్రధాన్ : చమురు, సహజవాయువు; ఉక్కు 19. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ : మైనారిటీ వ్యవహారాలు 20. ప్రహ్లాద్ జోషి : బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాలు 21. మహేంద్రనాథ్ పాండే : స్కిల్ డెవలప్మెంట్ 22. అర్వింద్ సావంత్ : భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు 23. గిరిరాజ్ సింగ్ : పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ 24. గజేంద్ర సింగ్ షెకావత్ : జల శక్తి శాఖ కేంద్ర సహాయ మంత్రులు ( స్వతంత్ర హోదా) 1. సంతోష్ గంగ్వార్ : కార్మిక, ఉపాధి కల్పన 2. రావ్ ఇంద్రజిత్ సింగ్ : స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్; ప్రణాళిక 3. శ్రీపాద్ యశో నాయక్ : ఆయుష్; రక్షణ 4. డాక్టర్ జితేంద్ర సింగ్ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష విభాగం 5. కిరణ్ రిజిజు : క్రీడలు, యువజన సర్వీసులు, మైనారిటీ వ్యవహారాలు 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ : సాంస్కృతిక,పర్యాటక 7. రాజ్ కుమార్ సింగ్ : విద్యుత్తు,పునరుత్పాదక ఇంధనం, స్కిల్ డెవలప్మెంట్, 8. హర్దీప్ సింగ్ పూరి : గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు; పౌర విమానయానం, వాణిజ్యం,పరిశ్రమలు 9. మన్సుఖ్ ఎల్ మాండవ్యా : నౌకాయానం, రసాయనాలు, ఎరువుల కేంద్ర సహాయ మంత్రులు 1. ఫగణ్‌సింగ్ కులస్తే : ఉక్కు శాఖ 2. అశ్వనీ కుమార్ చౌబే : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 3. అర్జున్ రామ్ మేఘ్వాల్ : పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, పబ్లిక్ రంగ సంస్థలు 4. వీకే సింగ్ : రోడ్డు రవాణా, రహదారులు 5. కృషన్ పాల్ : సామాజిక న్యాయం, సాధికారత 6. రావ్ సాహెబ్ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ 7. జి.కిషన్ రెడ్డి : హోం శాఖ 8. పురుషోత్తం రుపాలా : వ్యవసాయం, రైతు సంక్షేమం 9. రాందాస్ అథవాలే : సామాజిక న్యాయం, సాధికారత 10. సాధ్వి నిరంజన్ జ్యోతి : గ్రామీణాభివృద్ధి 11. బాబుల్ సుప్రియో :పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు 12. సంజీవ్ బాల్యాన్ : పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ 13. ధోత్రే సంజయ్ శ్యామ్ : మానవ వనరుల అభివృద్ధి; కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ 14. అనురాగ్ ఠాకూర్ : ఆర్థిక శాఖ, కార్పొరేట్ ఎఫైర్స్ 15. అంగడి సురేష్ చన్నబసప్ప : రైల్వే 16. నిత్యానంద్ రాయ్ : హోం శాఖ 17. రతన్ కటారియా : జల శక్తి; సామాజిక న్యాయం, 18. వి.మురళీధరన్ : విదేశీ వ్యవహారాలు; పార్లమెంటరీ వ్యవహారాలు 19. రేణుకా సరూతా : గిరిజన వ్యవహారాలు 20. సోమ్ ప్రకాష్ : వాణిజ్యం, పరిశ్రమలు 21. రామేశ్వర్ టేలి : ఫుడ్ ప్రాసెసింగ్ 22. ప్రతాప్ సారంగి : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు; పశుసంవర్థకం, పాడి, మత్స్య 23. కైలాష్ చౌదరి : వ్యవసాయం, రైతు సంక్షేమం 24. దేబశ్రీ చౌదురి : మహిళా, శిశు అభివృద్ధి శాఖ -
మోదీ..ముద్ర!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొత్త కేబినెట్లో శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. అమిత్ షా, రాజ్‌నాథ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్.. తదితర కీలక నేతలకు మోదీ ఏ శాఖలు అప్పగించనున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. తన సన్నిహితులకు, విధేయులకు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా తనదైన ముద్ర వేశారు. ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన హోం శాఖను ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి దారులు పరిచిన సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అప్పగించారు. అదేవిధంగా, సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖను, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, గడ్కారీకి రోడ్డు రవాణా, రహదారుల శాఖతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలను అప్పగించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రధాని మోదీతోపాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్, జైశంకర్ తదితరులు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు. షా రాకతో..తగ్గనున్న ఎన్ఎస్ఏ ప్రాధాన్యం గత ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్కే దోవల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. కానీ, అమిత్ షా రాకతో ఈసారి ఆయన ప్రాధాన్యం తగ్గిపోనుంది. ప్రభుత్వంలో నంబర్–2గా మారనున్న అమిత్ షాయే రక్షణ సంబంధ విషయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. హోం మంత్రిగా అమిత్ షా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35 ఏ అంశాలతోపాటు ఉగ్రవాదం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ముప్పు, అస్సాం పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి వాటిపై ప్రముఖంగా దృష్టిసారించాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానితోపాటు హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఎంతో కీలకమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షా, జై శంకర్ చేరారు. పలువురికి అదనపు బాధ్యతలు గత మంత్రి వర్గంలో రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయెల్‌కు ఈసారి వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనంగా కేటాయించారు. ఆయనే నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖను మాత్రం కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న ప్రహ్లాద్ జోషికి ఇచ్చారు. జోషికి పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖను కూడా కేటాయించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆ పార్టీకి కంచుకోటగా భావించే అమేథీలో ఓడించిన స్మృతీ ఇరానీకి జౌళి శాఖతోపాటు ఈసారి మహిళా శిశు అభివృద్ధి శాఖలను ఇచ్చారు. గత మంత్రి వర్గంలో మాదిరిగానే ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి కూడా పెట్రోలియం శాఖ ఇచ్చారు. దీంతోపాటు ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించారు. రవి శంకర్ ప్రసాద్‌కు ఈసారి కూడా న్యాయ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు టెలికం శాఖను ఇచ్చారు. ప్రకాశ్ జవడేకర్‌కు ఈసారి పర్యావరణ శాఖతోపాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల బాధ్యతలను, నరేంద్ర సింగ్ తోమర్‌కు వ్యవసాయ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ బాధ్యతలు ఇచ్చారు. జైట్లీ బాధ్యతలు నిర్మలకు.. నిర్మలా సీతారామన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అనారోగ్య కారణాలతో కేబినెట్‌కు దూరంగా ఉన్న సీనియర్ నేత, గత కేబినెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బాధ్యతలను ఈసారి నిర్మలకు కేటాయించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న రెండో మహిళా మంత్రిగా> ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో ఇందిరాగాంధీ కొంతకాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. గత కేబినెట్లో ఆమెను రక్షణ మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దౌత్యాధికారులకు అందలం ఊహించని విధంగా కేబినెట్లో చోటు దక్కించుకున్న విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జై శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతలను అప్పగించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను చేపట్టిన మొదటి దౌత్యాధికారి ఈయనే. ఏ సభలోనూ ఆయన సభ్యుడు కాదు. దీంతో నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా ప్రభుత్వం ఆయనకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ చేసిన జై శంకర్..దౌత్యాధికారిగా విశేష అనుభవం గడించారు. రష్యా, చైనా, అమెరికాల్లో భారత్ తరపున వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా సేవలందించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేబినెట్లో చోటు దక్కిన మాజీ దౌత్యాధికారి హర్దీప్ పూరికి పౌర విమానయాన, పట్టణాభివృద్ధి శాఖ(స్వతంత్ర హోదా)తోపాటు, వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలు ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ అప్పగించారు. టార్గెట్ 35ఏ కశ్మీర్‌పై అమిత్ షా గురి బీజేపీలో నంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా దేశానికి కొత్త హోం మంత్రి అయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, అక్రమ వలసలను అరికట్టడం నూతన హోం మంత్రి ప్రా«థమ్యాలు.అలాగే, ఎన్ఆర్సీ(జాతీయ పౌరసత్వ బిల్లు)ని దేశ మంతా అమలు పరచడం, జమ్ము,కశ్మీర్లో 35ఏ అధికరణను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా అమిత్ షా తీసుకునే అవకాశం ఉంది. 35ఎ అధికరణం కశ్మీరీలకు(స్థానికులు) ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తోంది. కశ్మీర్లో మహిళలు, శాశ్వత నివాసులు కానివారి పట్ల వివక్ష చూపుతున్న రాజ్యాంగంలోని 35ఎ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. 35 ఎ అధికరణ రాష్ట్రాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్లో ప్రజలందరి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలిచ్చే 370వ అధికరణను జనసంఘ్‌లో ఉన్నప్పటి నుంచీ అమిత్ షా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టడం కోసం ఎన్ఆర్సిని దేశమంతా అమలు చేస్తామని కూడా షా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా అమిత్ షా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. అపర చాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా మోదీకి అత్యంత విశ్వాస పాత్రుల్లో ఒకరు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారు. దేశంలో మావోయిస్టు హింస పెరుగుతుండటం, కశ్మీర్లో తీవ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించడం షా ముందున్న ప్రధాన సవాళ్లని పరిశీలకులు అంటున్నారు. కశ్మీర్లో తీవ్రవాదాన్ని బలప్రయోగంతో అణచివేయాలా లేక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలా అన్నది నిర్ణయించడం ఆయన ఎదుర్కొనే మరో కీలకాంశం. సుప్రీం కోర్టు విధించిన గడువు జూలై 31 ఎన్ఆర్సి ప్రక్రియను పూర్తి చేయం, ఆంతరంగిక భద్రత పరిరక్షణ షా ముందున్న మరికొన్ని సవాళ్లు. -
లక్ష దీవుల్లో 85 శాతం పోలింగెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపయోగించిన కఠిన పదాలను, పరస్పర దూషణలను మరచిపోదాం. ఇప్పటి నుంచి మనం కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఈ చిన్ని దీవుల్లో మనం పరస్పరం ప్రేమతో జీవించాల్సిన అవసరం ఉంది’ అని లక్షదీవుల నుంచి లోక్‌సభకు ఎన్సీపీ తరఫున ఎన్నికైన పీపీ మొహమ్మద్ ఫైజల్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చిన్న నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుగురు అభ్యర్థులు హోరాహోరీ పోరాటం జరపడం ద్వారా ప్రచారంలో కఠిన పదాలు, పరస్పర దూషణలు చోటు చేసుకున్నాయి. ఇంత తీవ్రంగా ప్రచారం జరగడం వల్లనే దేశంలోనే అత్యధికంగా లక్షదీవుల్లో 85 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 55,057 ఓటర్లలో ఫైజల్‌కు 22,851 (48.6 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హముదుల్లాహ్ సయీద్‌పై 823 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇప్పుడు పునరావృతం అయ్యాయి. నాడు కూడా సయీద్‌పై ఫైజల్ పోటీచేసి 1,535 ఓట్ల మెజారితో విజయం సాధించారు. సయీద్ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా, ఆయనపై ఫైజల్ విజయం సాధించారు. 1957 నుంచి 1967 వరకు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకుడు నల్లా కోయల్ తంగాల్ ప్రాతినిథ్యం వహించారు. ఆయన్ని భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. 1967లో ఈ సీటుకు మొదటిసారి ఎన్నికలు జరగ్గా స్వతంత్ర అభ్యర్థి పీఎం సయీద్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1971లో పోటీ చేయగా మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి పీ పూకున్హీ కోయా చేతుల్లో సయీద్ కేవలం 71 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2005లో సయీద్ మరణంతో ఆయన కుమారుడు హముదుల్లా 2009లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా ఆయన ఓడిపోతూ వచ్చారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉండే. అయితే ఆయన వ్యవహార శైలి నచ్చక కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఫైజల్‌కు ఓటు వేశారు. మహారాష్ట్రలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఇక్కడ విడివిడిగా పోటీ చేశాయి. భారత ఆగ్నేయ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో 78 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 36 దీవుల సమూహమే లక్షదీవులు. వీటిల్లో పది దీవులే జనావాస ప్రాంతాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 65 వేల జనాభా కలిగిన ఈ దీవుల్లో ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 55 వేల మంది ఉన్నారు. వీరిలో 93 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వారు ఇక్కడ సామాజికంగా బాగా వెనకబడిన వారవడంతో వారికి ఈ సీటును రిజర్వ్ చేశారు. -
కేబినెట్లో నంబర్ 2 ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అద్భుత విజయం వైపు నడిపించిన అమిత్ షాను కేబినెట్లోకి తీసుకోవడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వంలో షా కీలక భూమిక పోషించనున్నారన్న సందేశాన్ని మోదీ తన మంత్రులకు పరోక్షంగా సంకేతాలు పంపినట్లేనని భావిస్తున్నారు. అయినప్పటికీ, మోదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రధాని తర్వాత ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అమిత్ షా మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయం(2001–14)లో ఆయన కేబినెట్లో హోం, రవాణా, న్యాయ వంటి పలు కీలక శాఖలను నిర్వర్తించారు. 2014 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ప్రధాని మోదీ తర్వాత పార్టీలో రెండో శక్తివంతమైన నేతగా కొనసాగారు. తాజా ఎన్నికల్లో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సొంత నియోజకవర్గం గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి అమిత్ షా 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
‘కమలా’ధీశుడు ఎవరో..?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఎవరు నియమితులవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉంటూనే అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవిలో ఉండాలనేది బీజేపీ సంప్రదాయం. కాబట్టి షా పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. బీజేపీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా స్థానాన్ని మరొకరు భర్తీ చేసి, ఆయనలా పనిచేయాలంటే చాలా కష్టమైన పనే. అయితే కొత్త చీఫ్‌గా కాస్త తక్కువ వయసు ఉన్న అలాగే పార్టీ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి నియమితులు కావొచ్చనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజస్తాన్ వ్యక్తి భూపేంద్ర యాదవ్, అలాగే కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జేపీ నడ్డాల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడైన నడ్డాను మోదీ ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. గత ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. అలాగే పార్టీ అగ్రనాయకులు, ఆరెస్సెస్ ఆశీస్సులు నడ్డాకు బాగా ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైనందున, తగినంత అనుభవం కూడా నడ్డాకు ఉంది. మరోవైపు పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో అమిత్ షాకు భూపేంద్ర యాదవ్ ఎంతో సాయం చేస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమిత్ షా కూడా భూపేంద్ర యాదవ్‌ను బాగా నమ్ముతారు. గతేడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్ గుజరాత్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్ పేరు కూడా కొత్త చీఫ్ రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుసగా మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. -
‘పీపీపీ’ ఇంకా బలపడాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి భారీ మెజారిటీని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఎజెండా నిర్దేశించింది. ఆయా అంశాలపై రాజీవ్ కుమార్ మీడియాతో పంచుకున్న అంశాలను క్లుప్తంగా చూస్తే... పెట్టుబడిదారు విశ్వాసం పెరగాలి వృద్ధి వేగం పుంజుకోవాలి. ముఖ్యంగా వచ్చే మూడు దశాబ్దాల కాలంలో వృద్ధి రేటు రెండంకెల్లో స్థిరపడాలి. ఇందుకు సంబంధించి గడచిన ఐదేళ్ల కాలంలో పటిష్ట పునాదులే పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, పాలనా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ సేవల విస్తృతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్న తీవ్ర ఆందోళన ఇప్పుడు లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ వంటి అంశాలు వ్యవస్థలో సానుకూల మార్పులకే దోహదపడ్డాయి. ఇదే ఒరవడి కొనసాగాలి. ఇది జరగాలంటే పలు అంశాల పట్ల ప్రైవేటు పెట్టుబడిదారు విశ్వాసం మరింత మెరుగుపడాలి. వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇన్వెస్టర్లో ఏర్పడాలి. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వృద్ధి బాగుంది... స్పీడ్ పెరగాలి... గడచిన ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడింది. స్థిరత్వాన్ని సాధించింది. వరుసగా ఐదు సంవత్సరాలు సగటున 7% వృద్ధి రేటును సాధించిన కాలాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. అదే సమయంలో ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో కేవలం 3 శాతంగా కొనసాగింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం పట్ల నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు పూర్తి నియంత్రణలో ఉంది. ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి ప్రతి అంశమూ అదుపులోనే ఉంది. దేశం వృద్ధి స్పీడ్ మున్ముందు మరింత పెరగడానికి ఈ అంశాలు అన్నీ దోహదపడతాయి. ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇకపై ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి. ప్రతి ఒక్కదానినీ ప్రభుత్వం ఒక్కటే చేయలేదన్న విషయం ఇక్కడ గుర్తెరగాలి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పటిష్ట పునరుద్ధరణ జరగాలి. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాలి. ఉదాహరణకు భూ సేకరణ విషయంలో ప్రైవేటు రంగానికి కొంత ఇబ్బందులు ఎదురవవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఈక్విటీ హోల్డర్‌గా ఈ వెంచర్లో ఉంటే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో మనం చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలో కూడా విశ్వసనీయత ప్రాతిపదికన ప్రభుత్వ–ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి. ఎగుమతులు పెరగాలి ఎగుమతుల విషయంలోనూ గణనీయమైన మార్పులు రావాలి. ఎగుమతుల ఆధారిత విదేశీ పెట్టుబడులు అవసరం. ఎగుమతుల పెరుగుదలకు ఈ తరహా చర్యలు దోహదపడతాయి. వృద్ధికి దోహదపడతాయి. పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట పరోక్ష పన్నుల విషయానికి వస్తే, జీఎస్టీ వసూళ్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో బాగున్నాయి. భవిష్యత్తులోనూ మరింత పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లూ బాగున్నాయి.మౌలికరంగం అభివృద్ధి, పెట్టుబడులు, ద్రవ్యలోటు కట్టడి వంటి విషయాల్లో మరిన్ని నిధులు కేంద్రానికి అవసరం. పెట్టుబడుల ఉపసంహరణ ఇందులో కీలకమైనది. 40 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ ప్రతిపాదనలు చేసింది. దీనికి క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ దిశలో తదుపరి చర్యలు అవసరం. ఎయిర్ ఇండియా వంటి రంగాల్లో మెజారిటీ వాటాల అమ్మకాన్నీ ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. త్వరలో విధానపరమైన చర్యలు ఉంటాయి. వ్యవసాయంలో సాంకేతికత ఇక వ్యవసాయ రంగం విషయంలో తీవ్ర ప్రతికూలత ఉందని భావించకూడదు. అదే నిజమైతే ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఇక తృణ ధాన్యాలు, వరి, గోధుమలకు సంబంధించి వినియోగంకన్నా ఉత్పత్తి అధికమైంది. అందువల్ల మనకు మిగులు ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉన్నందువల్ల ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో వికేంద్రీకరణ జరగాలి. వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయం పెరగాలి. ఆగ్రో పాసెసింగ్ ఇందులో ఒకటి. ఆగ్రో ప్రాసెసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడులు మరింత పెరగాలి. మన ఆహార ఉత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోంది. ఇక వ్యవసాయ రంగంలో సాంకేతికత మరింత పెరగాలి. ఆయా అంశాల ద్వారా వ్యవసాయ రంగంలో వ్యయాలు తగ్గుదల, ఎగుమతులు పెంపు, రైతు ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించవచ్చు. -
కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం..?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శరద్ పవార్‌తో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో ఎన్సీపీని విలీనం చేసే అంశాన్ని ఇద్దరు నేతలు చర్చించి ఉంటారని ఊహాగానాలు వెల్లువెత్తు తున్నాయి. అయితే, ఇరు పార్టీల వర్గాలు అదేం లేదని కొట్టి పారేస్తున్నాయి. శరద్‌పవార్ నివాసానికి వెళ్లిన రాహుల్ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితిపై వారు చర్చించారు. కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను పవార్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కాంగ్రెస్‌కు మరో ఇద్దరు సభ్యుల అవసరం ఉంది. ఎన్సీపీ ఇటీవలి ఎన్నికల్లో మొత్తం ఐదు సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఓట్లు చీలిపోకుండా ఉంటాయి. పార్టీల విలీనం వేరే అంశం. దానిని గురించి నాకు తెలియదు’అని అన్నారు. ఇలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గేతోనూ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. జూన్ 1వ తేదీన జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్త నేతను ఎన్నుకునే విషయమై వీరు చర్చించినట్లు సమాచారం. నేడు ప్రతిపక్షాల సమావేశం లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో నేడు ప్రతిపక్ష పార్టీల నేతలు తొలిసారి సమావేశం కానున్నారు. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు చర్చించనున్నారు. టీవీ చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనబోదు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ విముఖత.. పార్టీలో నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో ఒక నెలపాటు టీవీల్లో జరిగే రాజకీయ చర్చా కార్యక్రమాలకు పిలవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికే పీసీసీ అధ్యక్షుడికి రాజీనామా పత్రాలు సమర్పించినట్లు వీరు చెబుతున్నారు. అయితే, వీరంతా బీజేపీలోకి చేరనున్నారని పుకార్లు వస్తున్నాయి. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. సంకీర్ణం కొనసాగుతుంది: కుమారస్వామి భరోసా కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని సీఎం హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు భరోసా ఇచ్చారు. గురువారం ఆయన రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నేత ఎస్ఎం కృష్ణను కలిశారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ రాహుల్‌ను కోరారు. ప్రభుత్వం కూలిపోనుందనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. -
మోదీకి మిక్కిలి సన్నిహితుడు
బీజేపీలో వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఉత్తేజం చేసి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యేలా చేయడంలో సఫలమైన అనంతరం, ఇక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా (54) సిద్ధమయ్యారు. గురువారం ఆయన కూడా మోదీ మంత్రివర్గంలో చేరారు. మోదీకి షా అత్యంత సన్నిహితుడు. ఏ చిన్న సలహా కోసమైనా మోదీ అమిత్ షాను ఆశ్రయిస్తారని పార్టీ నాయకులు నమ్ముతారు. 2014లో అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడయ్యారు. అంతకుముందు జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 80కి 71 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంలో అమిత్ షా కీలకంగా వ్యవహరించారు. మోదీ తర్వాత బీజేపీలో రెండో శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీ నగర్ స్థానం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 నుంచి 2014 మధ్య 13 ఏళ్లపాటు గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, అమిత్ షా హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే నకిలీ ఎన్కౌంటర్ కేసులో చిక్కుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఆయన ఆ కేసు నుంచి బయటపడ్డారు. గుజరాత్లో పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా షా కీలకంగా వ్యవహరించారు. కరుడుగట్టిన హిందూత్వ, జాతీయవాది అయిన అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలోకి రావడాన్ని బీజేపీ కార్యకర్తలు హర్షిస్తున్నారు. ప్రభుత్వంలోకి వచ్చినా సరే పార్టీ ఎజెండాను నిర్ణయించడంలో అమిత్ షా కీలకపాత్ర పోషిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల కన్నా తాజా ఎన్నికల్లో బీజేపీకి 21 సీట్లు ఎక్కువే సంపాదించిపెట్టిన అమిత్ షా, ఆ పార్టీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడని అంటారు. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అమిత్ షా బీజేపీతో ఉంటూ 40 ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
అజ్ఞాతం నుంచి అత్యున్నత పీఠం దాకా
దామోదర్‌దాస్ మూల్‌చంద్‌దాస్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్నగర్లో నరేంద్ర మోదీ జన్మించారు. బాల్యంలో తండ్రితో కలిసి టీ అమ్మిన మోదీ, ఆ తర్వాత సోదరుడితో కలిసి సొంతంగా టీ షాపును పెట్టారు. 8 ఏళ్ల ప్రాయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) పట్ల మోదీ ఆకర్షితులయ్యారు. 1968లో ఇంట్లోవాళ్లు మోదీకి జశోదాబెన్‌తో వివాహం జరిపించగా, ఇది ఇష్టంలేని మోదీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. తిరిగి 1971లో గుజరాత్‌కు చేరుకున్న మోదీ, ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చేరారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోదీ, మారువేషంలో సంఘ్ కార్యకలాపాలను కొనసాగించారు. సీనియర్ల గుస్సా.. మోదీ క్రమశిక్షణను, వాక్చాతుర్యాన్ని గుర్తించిన ఆరెస్సెస్ నేతలు 1985లో గుజరాత్ బీజేపీ విభాగం నిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో విస్తృతంగా పర్యటించిన మోదీ పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేశారు. అడ్వాణీ ప్రారంభించిన ‘రథయాత్ర’, బీజేపీ నేత మురళీమనోహర్ జోషీ ప్రారంభించిన ‘ఏక్తాయాత్ర’ బాధ్యతలను మోదీ దగ్గరుండి చూసుకున్నారు. పార్టీలో మోదీ ఎదుగుదలపై ఆందోళన చెందిన సీనియర్లు కేశూభాయ్‌పటేల్, శంకర్‌సింఘ్‌వాఘేలా, కాన్షీరామ్ రాణా, మోదీ గుజరాత్లో ఉండేందుకు వీల్లేదని తీర్మానించారు. దీంతో బీజేపీ అధిష్టానం మోదీని జాతీయ కార్యదర్శిగా నియమించగా, దేశంలోని పార్టీ శ్రేణులతో ఆయన సత్సంబంధాలు పెంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు.. సవాళ్లు గుజరాత్ సీఎం కేశూభాయ్‌పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అవినీతి ఆరోపణలతో కేశూభాయ్‌ను తప్పించి మోదీని బీజేపీ గుజరాత్ సీఎంను చేసింది. 2001, అక్టోబర్7న మోదీ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్‌కోట్–2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశ్విన్‌పై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2002, ఫిబ్రవరి 27న గోద్రాలో రైలుదహనం అనంతరం చెలరేగిన మతఘర్షణలను అణచివేయడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఘర్షణల అనంతరం మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, 182 సీట్లకు గానూ 127 చోట్ల విజయదుందుభి మోగించింది. అప్పటి నుంచి గుజరాత్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన మోదీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. 2001 నుంచి 2014 వరకూ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014లో మోదీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 282 సీట్లతో అధికారంలోకి వచ్చింది. -
...అను నేను!
‘మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఈశ్వర్‌కీ శపథ్ లేతా హూ కీ మై విధిద్వారా స్థాపిత్ భారత్‌కే సంవిధాన్ ప్రతి సచ్చీ శ్రద్ధా, ఔర్ నిష్టా రఖూంగా...’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులూ ప్రమాణం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా.. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ...’ అని ప్రమాణం చేశారు. దేశంలోని రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించే నేతలు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం ఈ తరహాలో ప్రమాణంచేయాలి. ఈ ప్రమాణస్వీకార సమయంలోనే అధికారిక రహస్యాలకు సంబంధించి మరో ప్రమాణం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ఆర్టికల్ 75(4) ప్రకారం ఈ రెండు ప్రమాణస్వీకారాలు చేశాకే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బాధ్యతలు చేపట్టాలి. కేంద్ర మంత్రి ప్రమాణం.. ‘...అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. అదే సమయంలో అధికారిక రహస్యాలకు సంబంధించి, ‘...అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని మరో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కుర్తా–పైజామాదే అధిపత్యం రాష్ట్రపతిభవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా హిందీ ఆధిపత్యం నడిచింది. ప్రధాని మోదీ సహా మెజారిటీ మంత్రులు హిందీలో ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక ఈ వేడుకకు హాజరైన ఎంపీల్లో చాలామంది సంప్రదాయ కుర్తా–పైజామాను ధరించి వచ్చారు. కొంతమంది మాత్రం షర్టులు–ఫ్యాంట్లు వేసుకొచ్చారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాగానే సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. -
అమిత్ షాకు ఆర్థిక శాఖ..?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెప్పినట్లు ఇండియా టుడే గురువారం వెల్లడించింది. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోసారి మంత్రిపదవి చేపట్టే ఓపిక తనకు లేదని ఆయన ఇప్పటికే మోదీకి స్పష్టం చేశారు. మోదీ, రాజ్‌నాథ్ తర్వాత మూడో స్థానంలో అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో మోదీ తర్వాత మంత్రివర్గంలో రెండో కీలక వ్యక్తి రాజ్‌నాథేననీ, ఆయన గతంలో చేపట్టిన హోం మంత్రి పదవిలో ఇప్పుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. జైట్లీ అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్ పనిచేశారు. దీంతో ఆర్థిక మంత్రి పదవి గోయల్‌కు దక్కవచ్చని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకు ఆర్థిక మంత్రిగా పనిచేసి, వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరం. అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్‌షా ఇప్పుడు కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను ఆయన పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ కూడా ఆరోగ్య సమస్యల కారణంగానే ఈసారి పదవి చేపట్టబోవడం లేదు. దీంతో విదేశాంగ శాఖకు కూడా కొత్త మంత్రి రానున్నారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ 2018లో ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అమెరికా, చైనాలకు భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో సుష్మ స్థానాన్ని జైశంకర్‌కు ఇవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. అలాగే పియూష్ గోయల్‌కు రైల్వే శాఖను అలాగే ఉంచి, గడ్కరీకి మౌలిక సదుపాయాలు, గజేంద్ర సింగ్ షెకావత్‌కు వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రొటెం స్పీకర్‌గా మేనకా గాంధీ! 17వ లోక్‌సభ ఎన్నికల్లో తాత్కాలిక స్పీకర్‌గా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మేనకాగాంధీ తాజా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి గెలుపోందారు. గత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా ఆమె ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి మాత్రమే స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అధికారం ప్రొటెం స్పీకర్‌కు ఉంటుంది. అలాగే లోక్‌సభకు స్పీకర్, ఉపస్పీకర్‌ను ఎన్నుకునే సమయంలోనూ ప్రొటెం స్పీకరే సభను నడిపిస్తారు. -
మోదీ కేబినెట్ @ 58
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు. కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు. గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. కేబినెట్లో చేరని జేడీ(యూ) బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు. మోదీ సర్కార్ 2.0 ఇదే గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా -
కాంగ్రెస్‌లో సారథ్య సంక్షోభాలు
సాక్షి, న్యూఢిల్లీ : సమర్థుడైన సారథి విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తన మనసును మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడం, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీ కుటుంబం నుంచి మరొకరిని ప్రతిపాదించేందుకు కూడా రాహుల్ సుముఖంగా లేక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ పార్టీకి 16వ అధ్యక్షుడు, నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఆరవ అధ్యక్షుడు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలను కూల్చేసి తాను అధికారపగ్గాలను స్వీకరించగలిగింది. అదే ఒరవడితో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పార్టీ ఆశించింది. అది జరగ్గపోగా నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ గతంలోకన్నా 21 సీట్లను అదనంగా గెలుచుకోవడంతో అందుకు నైతిన బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా సారథ్య సంక్షోభం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. నాడు సుభాస్ చంద్రబోస్ ఎన్నిక, రాజీనామా 1938లో గుజరాత్‌లోని హరిపురలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశంలో సుభాస్ చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఏడాది తిరక్కముందే మహాత్మా గాంధీ, బోస్ మధ్య విభేదాలు తలెత్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్ పాలకులకు సహకరించి తద్వారా దేశ పాలనలో సానుకూల సంస్కరణలు తీసుకరావాలని గాంధీ భావిస్తే, అదే ప్రపంచ యుద్ధ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటుచేసి దేశ స్వాతంత్య్రానికి మార్గం సుగుమం చేసుకోవాలన్నది బోస్ ఎత్తుగడ. 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమేశంలో మహాత్మా గాంధీ వారించినా వినకుండా బోస్ మరోసారి అధ్యక్ష పదవిని నామినేషన్ వేశారు. ఆయనకు పోటీగా పట్టాభి సీతారామయ్య పేరును గాంధీ ప్రతిపాదించారు. 205 ఓట్ల మెజారిటీతో మళ్లీ బోసే గెలిచారు. ‘ఇందులో పట్టాభి ఓటమికన్నా నా ఓటమే ఎక్కువ’ అని తర్వాత ఆయనకు రాసిన లేఖలో గాంధీ పేర్కొన్నారు. బోస్ కాదన్న వినకుండా గాంధీ, కొత్త తరహా ప్రభుత్వ పాలనకోసం బ్రిటీష్ పాలకులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బహిరంగ ప్రకటన చేశారు. అందుకు విరుద్ధంగా బ్రిటీష్ పాలకులతో సహాయ నిరాకరణ ఉద్యమానికి బోస్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎవరి పక్షం వహిస్తారంటూ గాంధీ, పార్టీ నాయకులను నిలదీయడంతో బోస్, ఆయన సోదరుడు శరత్ చంద్ర బోస్ మినహా అందరు పార్టీకి రాజీనామా చేశారు. ఇక చేసేదేమీలేక బోస్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాజేంద్ర ప్రసాద్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1949లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీ. రాజగోపాలచారి (అప్పటికి గవర్నర్ జనరల్ అంటే భారత తొలి రాష్ట్రపతి) పేరును పండిట్ నెహ్రూ ప్రతిపాదించగా, ఆయన డిప్యూటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. పటేల్, రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో అప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్యనే పార్టీ సభ్యులు తిరిగి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకు పురుషోత్తమ దాస్ టాండన్ పేరును పటేల్ ప్రతిపాదించారు. పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకుంటున్న ఛాందస హిందువంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. అయినప్పటికీ నాసిక్‌లో జరిగిన పార్టీ సమావేశంలో టాండన్ ఎన్నికయ్యారు. దాంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ రాజగోపాలచారికి రాసిన లేఖలో నెహ్రూ హెచ్చరించారు. నెహ్రూతో విభేదాల కారణంగా తొమ్మిది నెలల అనంతరం టాండన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈలోగా గుండెపోటుతో పటేల్ మరణించారు. నెహ్రూను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ 1951, సెప్టెంబర్ 8వ తేదీన పార్టీ ఏకగ్రీవగా తీర్మానించింది. అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు (నాలుగేళ్లు) నెహ్రూయే అధ్యక్షుడిగా ఉన్నారు. 1969లో తీవ్ర సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డిని పార్టీ సీనియర్ నాయకులు ప్రతిపాదించగా, స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వీవీ గిరీకి అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మద్దతిచ్చారు. దాంతో ఇందిరాగాంధీని అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చీలిక వచ్చింది. పర్యవసానంగా మైనారిటీలో పడిన తన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ, సీపీఐ మద్దతుతో గట్టెక్కించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిర ప్రభుత్వం పడిపోవడం, మళ్లీ అధికారంలోకి రావడం తెల్సిందే. అప్పటి నుంచి ప్రధానిగా ఉన్న వ్యక్తికే పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆనవాయితీ మళ్లీ వచ్చింది. ఆమె తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహారాలు అలాగే ఎన్నికయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో తప్పించారు. ఆయన తర్వాత సీతారామ్ కేసరి కొద్దికాలం ఉన్నారు. సోనియా గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం కోసం ఆయన్ని తప్పించి ఆమెను ఎన్నుకున్నారు. అందరికన్నా ఎక్కువగా 19 ఏళ్లపాటు సోనియానే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వారసులుగా రాహుల్ వచ్చారు. ఒకప్పుడు సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీలో సారథ్య సంక్షోభం ఏర్పడితే ఆ తర్వాత పదవుల కోసం సంక్షోభాలు వచ్చాయి. సంక్షోభాలను నివారించడం కోసం వారసత్వ రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వారసత్వాన్ని రాహుల్ వద్దంటున్నారు. -
కేంద్ర కేబినెట్లోకి కిషన్‌రెడ్డి; పీఎంఓ నుంచి కాల్!
సాక్షి, న్యూఢిల్లీ : ఊహాగానాలను నిజం చేస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి ఎవరికి చోటు దక్కుతుందన్న అంశంపై చర్చోపచర్చలు సాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని ఆఫీస్ నుంచి కిషన్ రెడ్డికి కాల్ రావడంతో కేంద్ర కేబినెట్లో ఆయన చోటు దక్కించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా కిషన్‌రెడ్డితో పాటు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి బాపూరావు బీజేపీ తరఫున ఎంపీలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా నాలుగు స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడంతో కేంద్ర కేబినెట్లో తెలంగాణ ప్రాతినిథ్యం లాంఛనప్రాయమే అయ్యింది. ఇక నరేంద్ర మోదీతో పాటు ఈరోజే పలువురు కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. కిషన్‌రెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది. ఈ క్రమంలో పార్టీలో అనేక పదవులు అలంకరించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మరోవైపు నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్‌కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితపై విజయం సాధించడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కేంద్ర మంత్రివర్గంలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం, జాతీయ పార్టీ పెద్దలతో సంబంధాలు కలిగి ఉండటం అరవింద్‌కు కలసి వస్తుందన్న చర్చ జరిగింది. మరో బీసీ నేత బండి సంజయ్ కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్‌ను ఓడించారు. ఆయనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనకూ మంత్రి పదవి దక్కే చాన్స్ ఉండొచ్చన్న వాదన కూడా వినిపించింది. ఆదిలాబాద్ నుంచి గెలుపొందిన సోయం బాపురావు దక్షిణ భారత్‌లోనే బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దక్షిణాదిలో పాగావేయాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాబూరావుకు కేంద్రమంత్రి పదవి కట్టబెడుతుందా? అనే ఆసక్తికర చర్చకు పీఎంఓ కార్యాలయం కాల్‌తో నేటితో తెరపడినట్లైంది. -
కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్డీ కుమారస్వామి సర్కార్‌ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్‌ను విస్తరించడం లేదంటే పునర్వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
మోదీ ‘టైమ్’ మారింది
న్యూయార్క్: ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ రెండు వారాల క్రితం (సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు) కథనం ప్రచురించిన ప్రముఖ టైమ్ మేగజీన్.. ఎన్నికల ఫలితాలు రాగానే మాట మార్చింది. గత 5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ మోదీని ప్రశంసిస్తూ తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. పాత కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ఆతీష్ తసీర్ అనే జర్నలిస్టు రాయగా, తాజా కథనాన్ని భారత్‌కు చెందిన మనోజ్ లాద్వా రాశారు. లండన్ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్కార్పొరేషన్ గ్రూప్ అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవోనే ఈ మనోజ్. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ప్రధానిగా మోదీ’ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్ నేతృత్వం వహించారు. మోదీ సమాజంలో మతపరమైన విభజన తీసుకువచ్చారని ఆతీష్ తసీర్ వ్యాసం ద్వారా ఆరోపించిన టైమ్ మేగజీన్.. ఎన్నికల్లో మోదీ భారీ విజయం సాధించడంతో ఆ పత్రిక తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది. మోదీ విభజన వాది కాదు, దేశాన్ని ఏకతాటిపైన నడిపించిన నాయకుడు అంటూ మనోజ్ రాసిన సంపాదకీయంలో టైమ్ ప్రశంసించింది. కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించి మరీ మోదీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, సీట్లు, ఓట్లు పెంచుకున్నారని విశ్లేషించింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో విదేశీ మీడియా విఫలం భారత్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ‘మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని అందరూ భావించారు. వెనుకబాటు కులాలే ఒక్కటై మోదీకి జేజేలు పలికాయి. ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం, ఉద్యోగ వర్గాలకు ప్రతి«నిధిగా ఆయన కనిపించడం, నిరుపేదలు అత్యధికంగా ఉన్న భారత్‌లో మోదీపై ఉన్న వ్యక్తిగత కరీష్మాయే ఆయనను రెండోసారి అధికార అందలాన్ని ఎక్కించింది. పాలనలో మోదీ విధానాలపై ఎన్నో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయనను విపక్ష పార్టీలు విమర్శించాయి. అయినా భారత ఓటర్లు ఏకమై ఆయనకే పట్టంగట్టారు. ఈ స్థాయిలో ఓటర్లు ఒక్కటై ఒక వ్యక్తిని చూసి ఓటు వేయడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి’ అని మేగజీన్ వ్యాసంలో పేర్కొంది. -
వెనక్కు తగ్గని రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనంటూ పట్టుబట్టడంతో ఆ పార్టీలో అనిశ్చితి బుధవారం కొనసాగింది. మరోవైపు రాహుల్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైనందున తాను అధ్యక్ష పదవిలో ఉండనంటూ రాహుల్ రాజీనామా చేస్తాననడం, పార్టీ నేతలు దీనిని వ్యతిరేకించి ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బుధవారం కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కోరారు. ఆమెతోపాటు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రాహుల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ‘మేమంతా రాహుల్ కోసమే ఉన్నాం. ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నందున పార్టీని వీడొద్దని నేను చెప్పాను’ అని షీలా అన్నారు. కర్ణాటక, రాజస్తాన్ పీసీసీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జూన్ 1న సీపీపీ భేటీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ జూన్ 1న జరగనుంది. ప్రస్తుతం సీపీపీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. కొత్త లోక్‌సభకు ఎన్నికైన 52 మంది ఎంపీలు, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై వారు చర్చిస్తారు. -
మోదీ ప్రమాణానికి వెళ్లను
కోల్‌కతా: న్యూఢిల్లీలో గురువారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తృణమూల్ కార్యకర్తల చేతిలో హతమైన బీజేపీ కార్యకర్తల కుటుంబీకులను ప్రమాణస్వీకారోత్సవానికి తీసుకెళుతున్నట్టు బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో తాను ప్రమాణస్వీకారానికి రావట్లేదని మమత ట్వీట్‌చేశారు. మరోవైపు గత ఏడాది కాలంలో తృణమూల్ దాడుల్లో హతులైన 50కి పైగా బీజేపీ కార్యకర్తల కుటుంబాలను అమరుల గౌరవసూచికగా ప్రమాణస్వీకారానికి ఢిల్లీ తీసుకెళుతున్నట్టు బీజేపీ నేత ముకుల్ రాయ్ చెప్పారు. కాగా, బీజేపీ ఆరోపణలను తృణమూల్ ఖండించింది. తమ రాష్ట్రంలో రాజకీయ హత్యలేమీ లేవని టీఎంసీ వ్యాఖ్యానించింది. అమరుల కుటుంబాలను గౌరవించాలని బీజేపీ భావిస్తే ఘర్షణల్లో అమరుడైన తృణమూల్ కార్యకర్తల కుటుంబాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని టీఎంసీ నేత సవాల్ విసిరారు. ప్రమాణానికి వెళ్లొద్దని మరో ఇద్దరు సీఎంలతో మాట్లాడిన తర్వాత మమత ఈ ప్రకటన చేశారు. అయితే, 24 గంటల్లోనే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్టు వారి కార్యకర్తలు తమ కార్యకర్తల దాడుల్లో చనిపోలేదని, కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాల వల్ల మరణించారని మమత తెలిపారు. ప్రజాస్వామ్య ఉత్సవాన్ని బీజేపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందున ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నానని మమత ట్వీట్ చేశారు.‘నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారూ..శుభాకాంక్షలు. మీ ఆహ్వానాన్ని మన్నించి, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలనుకున్నాను. అయితే, బెంగాల్లో తమ కార్యకర్తలు రాజకీయ హత్యకు గురయ్యారని బీజేపీ చెబుతున్నట్టు మీడియాలో చూశాను. ఇది అబద్ధం. వ్యక్తిగతకుటుంబ కలహాలు, ఇతరత్రా కారణాలు వారి మరణానికి కారణం కావచ్చు. ప్రమాణస్వీకారాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కార్యక్రమం విలువను తగ్గించకూడదు. ఈ పరిస్థితుల్లో నేను మీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. క్షమించండి’ అని పేర్కొన్నారు. నేడు తృణమూల్ ధర్నా తృణమూల్ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నైహతి మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో మమత పాల్గొననున్నారు. -
ఆ 4 శాఖలు ఎవరికి?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వరసగా రెండోరోజు బుధవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రివర్గానికి తుది రూపు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం సైజు 60 వరకు ఉండొచ్చనే సమాచారం నేపథ్యంలో నాలుగు కీలక శాఖలు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ మంత్రుల్లో చాలామందికి తిరిగి కేబినెట్లో స్థానం దక్కుతుందని, వారితో పాటు కొన్ని కొత్త ముఖాలు ఉంటాయని తెలుస్తోంది. బీజేపీకి తగిన రాజకీయ వ్యూహాన్ని రచించి భారీ విజయాన్ని చేకూర్చినట్టుగా ప్రశంసలందుకుంటున్న అమిత్ షా తొలిసారిగా కేంద్ర కేబినెట్లో చేరి కీలక శాఖను దక్కించుకుంటారనే ఊహాగానాలు సాగుతున్నా దీనిపై స్పష్టతలేదు. వచ్చే ఏడాదిలోగా పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగు చాన్సుంది. పాత కేబినెట్లోని ప్రధాన సభ్యులందరికీ తిరిగి అవకాశం వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌నాథ్, గడ్కారీ, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు కొనసాగే అవకాశం ఉంది. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు గడించిన స్మృతీ ఇరానీకి మంచి శాఖ దక్కే అవకాశం ఉంది. తోమర్ స్పీకర్‌గా కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న బీజేపీ బలాన్ని కొత్త కేబినెట్ ప్రతిబింబించవచ్చనే సంకేతాలు ఉన్నాయి. అనారోగ్య కారణాల వల్లే ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సుష్మాస్వరాజ్‌కు మోదీ కొత్త కేబినెట్లో చోటు దక్కవచ్చని పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శివసేన, జేడీయూలకు చెరో రెండు ఇక మిత్రపక్షాల విషయానికొస్తే శివసేన, జేడీ(యూ)లకు ఒక కేబినెట్, మరొక సహాయమంత్రి చొప్పున రెండేసి బెర్తులు దక్కే వీలుంది. లోక్ జన్‌శక్తి, శిరోమణి అకాలీ దళ్ పార్టీలకు చెరొక పదవి రావచ్చు. బుధవారం అమిత్ షాతో బిహార్ సీఎం నితీశ్ భేటీ అయ్యారు. కేబినెట్లో జేడీ(యూ) ప్రాతినిధ్యంపై ఉభయులూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వంలో తమ ప్రతినిధిగా పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ పేరును సిఫారసు చేస్తూ ఎల్జేపీ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. గత మంత్రివర్గంలో భాగస్వామి కాని ఏఐఏడీఎంకే ఒక సీటు గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉండటం, కీలక ద్రవిడ మిత్రపక్షం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ నేత ఒకరికి స్థానం కల్పించవచ్చు. కర్ణాటక నుంచి సదానందగౌడ, ప్రహ్లాద్ జోషిల పేర్లు, మహారాష్ట్ర నుంచి గడ్కారి, జవదేకర్, సురేశ్ప్రభులతో పాటురావు సాహెబ్ దాన్వే పేరు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ అధ్యక్ష రేసులో నడ్డా, భూపేందర్ అరుణ్ జైట్లీ కేబినెట్లో చేరలేనని స్పష్టం చేయడంతో.. కీలకమైన ఆర్థిక శాఖపై ఊహాగానాలు మొదలయ్యాయి. జైట్లీ స్థానంలో బాధ్యతలు చేపట్టి ఎన్నికల ముందు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ పదవికి ప్రధాన పోటీదారు కావచ్చని తెలుస్తోంది. ఇక గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమిత్ షా కనుక కేబినెట్లో చేరితే.. జేపీ నడ్డా, భూపేందర్ యాదవ్ బీజేపీ అధ్యక్షుడి రేసులో మొదటిస్థానంలో ఉంటారని తెలుస్తోంది. మంత్రులు, మంత్రుల శాఖలపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
మోదీ రెండోసారి..
న్యూఢిల్లీ: దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథుల మధ్య కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఆయనతో పాటు 50–60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ వీరితో ప్రమాణంచేయిస్తారు. బిమ్స్టెక్ దేశాధినేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పలువురు స్వపక్ష, విపక్ష నేతలు, సీఎంలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరుకానున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి అశోక్ మాలిక్ చెప్పారు. తరలిరానున్న బిమ్స్టెక్ దేశాల అధినేతలు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ వంటి బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్) నేతలు తమ హాజరును ఇప్పటికే ధ్రువీకరించారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్రాక్ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్ అధ్యక్షుడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ సూరోన్‌బే జీన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కూడా తాము హాజరుకానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మోదీ ఆహ్వానాన్ని వారు అంగీకరించినట్లు తెలిపాయి. వీరితో పాటు విపక్షాలకు చెందిన అనేకమంది నేతలు కూడా హాజరుకానున్నారు. కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద కేజ్రీవాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, షారుక్ ఖాన్, కంగన రనౌత్, ద్రవిడ్, సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, బిల్‌గేట్స్ తదితరులకు ఆహ్వానం అందింది. 8 వేల మంది ఇదే మొదటిసారి 2014లో కూడా మోదీ రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు 3,500 మందికి పైగా అతిథులు అప్పుడు హాజరయ్యారు. సాధారణంగా విదేశీ అతిథులు, ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు వారి సత్కార కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అయితే 1990లో చంద్రశేఖర్, 1999లో వాజ్‌పేయిలు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 8 వేల మంది అతిథులు హాజరుకావడం మాత్రం ఇదే మొదటిసారి. విదేశీ అతిథుల కోసం ‘దాల్ రైసీనా’ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్య అథిథులు అందరికీ ‘పన్నీర్ టిక్కా’ వంటి ఉపాహారం అందజేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు విదేశీ అతిథుల కోసం రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బిమ్స్టెక్ దేశాల అధినేతలు తదితర 40 మంది అతిథులు విందులో పాల్గొంటారు. ఇతర ముఖ్య వంటకాలతో పాటు రాష్ట్రపతి భవన్ వంటశాలలో ప్రత్యేక వంటకమైన ‘దాల్ రైసీనా’ను అతిథులకు వడ్డించనున్నారు. దీని తయారీకి సుమారు 48 గంటల సమయం పడుతుందని, అందువల్ల మంగళవారమే ఇది ప్రారంభమైనట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. కాగా, మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిపి దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఓ అధికారి చెప్పారు. నేను కేబినెట్లో చేరలేను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని తాను కోరుకోవడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అవసరమైతే సలహాలు ఇస్తానని తెలిపారు. మోదీకి రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఐదేళ్ల పాటు మోదీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో నేర్చుకున్నా. గత 18 నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టలేను. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని జైట్లీ తన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిగానే మోదీకి జైట్లీ తన మనసులోని మాటను మౌఖికంగా వెల్లడించారు. 66 ఏళ్ల జైట్లీ బయటకు వెల్లడించని వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స కోసం గత వారం ఎయిమ్స్‌లో చేరారు. జనవరిలో అమెరికాలో సర్జరీ చేయించుకున్న జైట్లీ, గత నెలలో అధికార పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లినప్పుడు చికిత్స పొందారు. అంతకుముందు పలు సర్జరీలు జరిగాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ 47 ఏళ్ల వయస్సులో పార్లమెంటులో అడుగుపెట్టారు. జైట్లీ నివాసానికి మోదీ మంత్రివర్గంలో చేరలేనని లేఖ ద్వారా జైట్లీ తెలిపిన వెంటనే వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీలోని జైట్లీ అధికార నివాసానికి వెళ్లారు. వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జైట్లీ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లేఖ అందినట్టుగా తెలియజేసిన మోదీ.. ఆర్థిక వ్యవస్థకు, జీఎస్టీ అమలుకు జైట్లీ చేసిన కృషిని అభినందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జైట్లీ విజ్ఞప్తిని మోదీ అంగీకరించారా? లేదా? అన్నది తెలియలేదు. -
కమల్ పార్టీకి 3.72% ఓట్లు
చెన్నై: 17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన కొత్త పార్టీల్లో కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పట్టణ ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపినట్లు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. తమిళనాడులోని 11 లోక్‌సభ స్థానాల్లో ఎంఎన్ఎం అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి కమల్ నిరాకరించినప్పటికీ ఎంఎన్ఎం పార్టీకి 3.72 శాతం ఓట్లు లభించాయి. ‘కొన్ని ప్రాంతాల్లో మా అభ్యర్థులు 12 శాతం ఓట్లు సాధించారు. ఇంత తక్కువకాలంలో అన్నిచోట్ల బరిలోకి దిగి ఈ ఫలితాలు సాధించడం మంచి ఆరంభమే’ అని కమల్‌హాసన్ హర్షం వ్యక్తం చేశారు. దేశమంతా నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నప్పటికీ తమిళ ఓటర్లు మాత్రం తమ రాష్ట్ర పార్టీలకే పట్టంకట్టడం గర్వంగా ఉందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, తాము చాలా దూరం ప్రయాణించాల్సివుందని చెప్పారు. అతి తక్కువ సమయం ఉండటంతో ఈ ఎన్నికల్లో అనుకున్నవిధంగా రాణించలేకపోయామని అంగీకరించారు. తమ అంకితభావం చూసి ఏమీ ఆశించకుండా ప్రజలు తమకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అత్యధిక ఓట్లు సాధించిన తమ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో విజేతలుగా నిలుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలతో సమానంగా తమిళనాడును చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి కమల్‌హాసన్ విజ్ఞప్తి చేశారు. -
‘మోదీ విజయ రహస్యం అదే’
తిరువనంతపురం : పాలనలో గాంధీ సిద్ధాంతాలను అవలంబించినందు వల్లే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యారంటూ కేరళ కాంగ్రెస్ నేత ఏపీ అబ్దుల్లాకుట్టి ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఘన విజయానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు బీజేపీకి అనుకూల పవనాలు వీచేలా చేశాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు.. ‘ నరేంద్ర మోదీ విజయం’ పేరిట ఫేస్బుక్ పోస్టులో తన అభిప్రాయాలు పంచుకున్నారు. బీజేపీ ఏకపక్ష విజయం కేవలం విపక్షాలనే కాదు.. ఆ పార్టీ వాళ్లను కూడా విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా నాయకులంతా సార్వత్రిక ఫలితాలను స్వాగతించాలని హితవు పలికారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నరేంద్ర మోదీ విజయ రహస్యమని పేర్కొన్నారు. కాగా ఏపీ అబ్దుల్లాకుట్టి 1999-2004 మధ్య కన్నూరు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ అబ్దుల్లా.. ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీంతో క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద 2009లో సీపీఐ(ఎం) పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి మోదీని ప్రశంసించి చిక్కుల్లో పడ్డారు. ఇక అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందించిన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రన్.. ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
జూన్ 4న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు
-
బాబూ... ఇది స్వయంకృతం!
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సునామీ సృష్టించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ‘‘మనం ప్రజలను ఇంత వేధించామా’’ అని వాపోయారట. సీఎం ఆఫీసు నుంచి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల దాకా గత ఐదేళ్ళు తెలుగుదేశం వారు ప్రజలను ఎంత వేధించారో ఇప్పటికయినా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూప్ గత అయిదేళ్ళలో ఏపీలో విలయ తాండవం చేసిన అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఉద్యమమే నడపాల్సి వచ్చింది. బాబుకు అది రుచించలేదు. సాక్షి దినపత్రికనూ, న్యూస్ చానల్‌ను మూసివేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడానికి పూర్తి కారకుడయిన డాక్టర్ వైఎస్సార్ కుమారుడిని పార్టీ నుంచి బయటికి తరిమేసి ఆయన మరణానంతరం వైఎస్సార్ పేరు నిందితుల జాబితాలో చేర్చిన ఫలితం ఇవ్వాళ కాంగ్రెస్‌కి దక్కిందనాలి. భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో తన సంఖ్యా బలాన్ని మరింత పెంచుకుని రెండవ సారి తిరిగి కేంద్రంలో అధికారం చేపడుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నూతనంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలయిన ప్రియాంక గాంధీలకు ఆత్మవిమర్శ చేసుకోడానికీ, ఓటమి కారణాలను వెతుక్కోడానికి బోలెడంత తీరిక చిక్కింది. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టండి అని లేఖలు ఇచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఏం కావాలో చెప్పకుండానే ఇంకా ఎప్పుడు విడగొడతారు అని పదే పదే కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్ర బాబు నాయుడు అనీ, మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మేం అధి కారంలోకి వచ్చి ఆ పని చేస్తాం అని పొద్దున్న లేచింది మొదలు తమ వెంటపడి సతాయించింది, ఒత్తిడి తెచ్చింది భారతీయ జనతా పార్టీ అనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకుని వారి మద్దతు పొందలేని దీనస్థితిలో, 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మట్టి కొట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో సోదిలోకి లేకుండా పోయిన విషయంలో కూడా తల్లీ పిల్లలు కూర్చుని సమీక్షించుకుంటా రనే ఆశిద్దాం. 2014లో రాష్ట్ర విభజనకు బాధ్యులూ, భాగస్వాములూ అయిన తెలుగుదేశం, బీజేపీల కూటమినే ప్రజలు గెలిపించారు, రాష్ట్రాన్ని సమై క్యంగా ఉంచాల్సిందేనని పట్టుబట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట్రుక వాసి దూరంలో అధికారంలోకి రాకుండా పోయింది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు బాధ్యులయిన మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల అడ్రెస్ గల్లంతు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 175 శాసనసభ స్థానాల్లో 151, 25 లోక్‌సభ స్థానాల్లో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఇచ్చి ప్రజలు ఒక చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ విజయం అనితర సాధ్యం. సమకాలీన రాజకీయ నాయకులలో దేశంలోనే అందరికంటే వయసులో బహుశా జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే కూడా. పదేళ్ళ కఠోర శ్రమ, పట్టుదల, ప్రజా సమస్యల మీద అనునిత్యం ప్రజల్లోనే ఉండి చేసిన పోరాటం, పదహారు మాసాలు అన్యాయంగా జైలులో పెడితే కూడా కుంగిపోకుండా, పార్టీ నాయకులూ శ్రేణులూ ఎటూ వలస పోకుండా మార్గ నిర్దేశనం చేస్తూ, మొక్కవోని ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కోవడం, చివరగా 14 మాసాల పాదయాత్ర ఇవన్నీ కలిసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఆయన సిద్ధం అవుతున్న సమయంలో గత అయి దేళ్ళూ చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం దివాలా తీసిన తీరే ఆయన కళ్ళలో మెదులుతూ ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక తరగతి హోదాతో బాటు ఇచ్చిన హామీలన్నిటినీ కేంద్రం నుండి సాధించుకోవడం, తాను ప్రకటించిన నవరత్నాలతో బాటు పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడంతో బాటు గత అయిదేళ్ళూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చుల వల్ల ఏర్పడిన నష్టాల నుండి రాష్ట్రాన్ని బయటికి తేవడం కోసం విరామం లేని శ్రమ జగన్మోహన్ రెడ్డికి తప్పదు. జగన్ ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలూ ఉంటే అధికా రంలోకి వస్తాం అంటుంటారు, నిజమే వాటితో బాటు ఈ ఫలితాల సునామీ మాత్రం చంద్రబాబు నాయుడు దుష్పరిపాలన కారణంగానే. ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ‘‘మనం ప్రజలను ఇంత వేధించామా’’ అని వాపోయారట. అమరావతి సాక్షిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల దాకా గత అయిదేళ్ళు తెలుగుదేశం వారు ప్రజలను ఎంత వేధించారో ఇప్పటి కయినా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఇవ్వాళ ఫలితం వెలువడ్డాక ఆయనకు ఇవన్నీ అర్థం అవుతున్నాయంటే పొరపాటు. ఆయనకు ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఒక వర్గం మీడియా ఈ అయిదేళ్ళూ రోజూ చెపుతూనే ఉంది, ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూప్ గత అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో విలయ తాండవం చేసిన అవినీతి, ఆశ్రితపక్షపాతానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడపాల్సి వచ్చింది. చంద్రబాబుకు అది రుచించలేదు. సాక్షి దినపత్రికనూ, న్యూస్ చానల్‌ను మూసి వేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి అది సాధ్యం కాక ఆ మీడియా గ్రూప్‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌లను తన పత్రికా గోష్టులలో, సమావేశాల్లో తూలనాడటం, విమర్శించడం సాగిం చారు. తానాతందానా అన్న మీడియాను కాకుండా ఆయన సాక్షి వంటి కొన్ని మీడియా గ్రూప్‌లను సీరియస్‌గా తీసుకుని తన ప్రభుత్వ పనితీరు మీద వస్తున్న విమర్శలను పట్టించుకుని పాలనను మెరుగు పరుచుకుని ఉంటే మరీ 23 స్థానాల దగ్గర ఆగిపోకుండా కొంత గౌరవప్రదమయిన ప్రతిపక్ష స్థానం దక్కి ఉండేదేమో. ఆయన ఆ పని చెయ్యకుండా మీడియా సంస్థలను మూసేయించాలనీ, ప్రతిపక్ష నాయకుడిని శాశ్వ తంగా జైలుకు పంపించాలనీ విఫల ప్రయత్నం చేశారు. తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో స్టేలు తెచ్చుకుని తానూ కాంగ్రెస్ పార్టీ కలిసి బనాయించిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని తెగ ఆరాటపడిపోయారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి ఆయన ప్రధానమంత్రిని అడిగిన కోరికలు రెండే అని బీజేపీ నాయకులే చెపుతుంటారు. మొదటిది జగన్‌ను జైలుకు ఎప్పుడు పంపుతారు? రెండ వది నియోజకవర్గాల సంఖ్య ఎప్పుడు పెంచుతారు? అనే. మంచిపనులు చేసి ప్రజాదరణ పొందితే అధికారంలో ఉంటాం కానీ జగన్‌ను జైలులో పెట్టించి, ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తే అధికారంలోకి రాము అన్న చిన్న లాజిక్ మిస్ అయినందు వల్లనే ఇవ్వాళ చంద్రబాబుకూ ఆయన పార్టీకీ ఈ దుస్థితి ఎదురయింది. అంతేకాదు ఆయన సరఫరా చేసిన అసత్య సమాచారాన్నంతా వందిమాగధ మీడియా అందంగా రంగులద్ది పత్రికల్లో అచ్చేసి, చానళ్లలో వినిపించి అదే నిజం అని ఆయనే తిరిగి నమ్మేట్టు చేసి చంద్రబాబును 2050 సంవత్సరంలోకి తీసుకెళ్ళిపోయాయి. వర్తమానం నుండి చాలా దూరం అంటే ఒక 30 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఆ భ్రమల్లో ఉండిపోయిన కారణంగానే ఈ ఫలితం. చంద్ర బాబు నాయుడు ఇప్పుడు 70వ పడిలో ఉన్నారు. సహజంగానే మును పటి జవసత్వాలు ఉండటం కష్టం. చేతికి అందివచ్చిన కొడుకు రాజ కీయాలకు అంది వస్తాడనే ఆశ లేదు. వచ్చే అయిదేళ్ళూ ప్రతిపక్షంలో ఉండాలి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటీ అన్నది చర్చనీయాంశంగా మారింది. మోదీ మీద వ్యక్తిగత కక్ష పెంచుకుని ఆయన్ను ఓడించాల్సిందే అని దేశమంతా తిరిగి కాంగ్రెస్‌తో దోస్తీ చేసి చతికిలబడ్డ చంద్రబాబును మోదీ అంత సులభంగా వదిలేస్తాడా? ఆయన రోజుకు పదిసార్లు చెప్పుకున్నట్టు నిప్పు వెనక దాగిన కేసుల స్టేలు ఆయన్ని వదులుతాయా? మరో నాయకుడు ఎవరినీ ఎదగనివ్వని చంద్రబాబు పార్టీలో దాన్ని ఒడ్డెక్కించే రెండో నేత ఎవరు? దేశమంతటా 2014కు మించిన ఫలితాలు సాధించి ఉత్తర తెలంగాణలో మూడు, రాజధాని నగరంలో ఒకటి మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు స్థానాలూ పోగొట్టుకోవడానికి కారణాలను విశ్లేషించుకుంటే మంచిది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి ఆర్థిక సహకారం అందించి, పట్టు విడిచి ప్రత్యేక హోదా ఇవ్వడమొక్కటే బీజేపీ ముందున్న మార్గం. ఇక సామంతులూ, బానిసల చేతుల్లో మాత్రమే రాష్ట్రాలు ఉండా లని కోరుకునే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్రెడ్డి విషయంలో చేసిన తప్పులన్నీ ఇవ్వాల్టి తమ దుస్థితికి కారణం అని ఇప్పటికయినా సోనియా గాంధీకి అర్థం అవుతుందా, ఈ ఫలితాల సమీక్షలో పార్టీ కేంద్ర కార్య వర్గంలోనో, వార్ రూమ్‌లోనో బహిరంగంగా కాక పోయినా సోనియా తన మనసులోనయినా జగన్మోహన్రెడ్డిని ఓదార్పు యాత్రకు అనుమ తించకపోవడం, ఆయనను జైలు పాలు చెయ్యడం వంటి పిచ్చి పను లన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఈ గతి పట్టించాయని ఒప్పుకుంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ రెండుసార్లు అధికారం లోకి రావడానికి పూర్తి కారకుడయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమారుడిని పార్టీ నుండి బయటికి తరిమేసి ఆయన మరణానంతరం వైఎస్ఆర్ పేరు నిందితుల జాబితాలో చేర్చిన ఫలితం ఇవ్వాళ కాంగ్రెస్‌కు దక్కిందనే అనుకోవాలి. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
7 విడతల్లో ఎన్నికలు.. 7 విడతల్లో చేరికలు
కోల్‌కతా : ఈ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నడిచిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యరీతిలో పుంజుకొని ఏకంగా 18 స్థానాలు సాధించింది. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఈ క్రమంలో ఫలితాలు వెలువడి వారం రోజులు కూడా గడవకముందే.. మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే మంగళవారం బీజేపీ గూటికి చేరారు. వీరితోపాటు 60మందికి పైగా టీఎంసీ కౌన్సిలర్లూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ పార్టీ ఇన్చార్జి కైలాష్ విజయ్‌వర్గీయ మాట్లాడుతూ.. ‘ఇది ఆరంభం మాత్రమే.. త్వరలోనే మరింత మంది టీఎంసీ నాయకులు బీజేపీలో చేరతారు. బెంగాల్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి.. అలానే 7 విడతల్లో టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతాయ’ని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు మొదటి విడత చేరికలు జరిగాయన్నారు విజయ్‌వర్గీయ. ఏడు విడతల్లో దీదీ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. టీఎంసీలో ఉన్న చాలా మంది నాయకులు అసహనంతో ఉన్నారని త్వరలోనే వారంతా బీజేపీలో చేరతారని ఆయన చెప్పుకోచ్చారు. ఇదంతా దీదీ స్వయంగా చేసుకుందని విజయ్‌వర్గీయ ఆరోపించారు. తాజాగా ఈ రోజు అనగా మంగళవారం బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ తనయుడైన టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రంగ్షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్ రాయ్ (సీపీఎం) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
మోదీ వేవ్‌కు అసలు కారణాలివే!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ అఖండ విజయం సాధించడానికి దారితీసిన కారణాలేమిటీ అనే విషయంలో రాజకీయ శాస్త్రవేత్తలకే ఇంకా స్పష్టత రావడం లేదు. కేవలం నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్ట వల్ల అఖండ విజయం సిద్ధించిందా? దానికి బీజేపీ పట్ల ఉన్న అభిమానం తోడయిందా ? బ్రాహ్మణ్, బనియన్ పార్టీగా ఉన్న ముద్ర కూడా ఆ వర్గాలను ఆకర్షించడం వల్ల విజయం సాధ్యమైందా? పోటీ చేసిన అభ్యర్థుల బలం వల్ల లేదా చేపట్టిన అభివద్ధి కార్యక్రమాల వల్ల విజయం సాధించిందా? హిందూత్వవాదం గెలిపించిందా ? ఈ అన్ని అంశాలు కలియడం వల్లన విజయం అంత సులువైందా? అన్న అంశాలపై రాజకీయ పండితులు తర్జనభర్జన పడుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యక్తిగత ప్రతిష్ట ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదుగానీ, అది 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఇంతకన్నా ఎక్కువ కనిపించిందని, అలాంటప్పుడు అప్పటికన్నా ఇప్పుడు 21 సీట్లు ఎక్కువ రావడం ఏమిటని అమెరికాలోని వండర్బిల్ట్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తారిక్ థాచిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014లో నరేంద్ర మోదీ అనుకూల పవనాలు బలంగా కనిపించినప్పటికీ నాటి విజయం వెనక రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పార్టీ బలోపేతానికి బీజేపీ చేసిన పదేళ్ల కషి కూడా ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, పెరిగిన నిరుద్యోగం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచింది. కానీ అది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కూడా ఆశ్చర్యంగా ఉందని అమెరికా టెంపుల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ఆడమ్ జైగ్‌ఫెల్డ్ వ్యాఖ్యానించారు. పీఎం ఆవాస్ యోజన కింద పెదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కొన్ని పథకాలు మాత్రమే విజయవంతమయ్యాయని, మోదీ ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు విజయవంతం కాలేదని, అలాంటప్పుడు అభివద్ధిని చూసి ఓటేశారని భావించలేమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, పెరిగిన ఆర్థిక ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలు అవుతాయని ‘లోక్‌నీతి’ సంస్థ సర్వేతోపాటు పలు సర్వేలు చెప్పినప్పటికీ వాటి ప్రభావం కూడా కనిపించక పోవడం ఆశ్చర్యమేనని ఇరువురు ప్రొఫెసర్లు వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్టకు ‘హిందూత్వ’ వాదం తోడవడం వల్లనే బీజేపీకి అఖండ విజయం సిద్ధించి ఉంటుందని చివరకు ఇరువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. హిందూత్వవాదం బయటకు కనిపించలేదన్న విషయాన్ని వారి దృష్టికి మీడియా తీసుకెళ్లగా భారత్‌లోని అన్ని హిందూ వర్గాల్లో అది అంతర్లీనంగా ఉందని, మోదీకి ఎందుకు ఓటేశారని అడిగితే ఆయన హిందూత్వ వాదానికే వేశామని ఎవరు చెప్పరని వారన్నారు. అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు ఎందుకు ఓటేశారని శ్వేతజాతీయులను ప్రశ్నిస్తే ఆసియన్లు, ఆఫ్రికన్లు అంటే భయం కనుక ట్రంప్ బెటరనుకున్నామని వారు చెప్పలేదని, జాతి పరమైన చర్చల్లో వారి ఆ విషయాన్ని అంగీకరించారని అన్నారు. భారత్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారత సైనిక సేవల గురించి ప్రస్తావించడం, కొత్త ఓటర్లు తమ తొలి ఓటును సైన్యానికి అంకితమివ్వడంటూ మోదీ పిలుపునివ్వడం కూడా పనిచేసి ఉంటుందని వారన్నారు. ఇలాంటి వాటికి స్పందన మౌనంగానే ఉంటుందని వారు చెప్పారు. -
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దీదీ
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి మమతా మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లానే నాకు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో చర్చించాను. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. West Bengal CM Mamata Banerjee on PM Modi's oath taking ceremony: I have spoken to other Chief Ministers also. Since it is a ceremonial program we thought of attending it.Yes I will go pic.twitter.com/qbgIomrvCL — ANI (@ANI) May 28, 2019 -
‘పార్టీని నడపడానికి ఆయనే సమర్థుడు’
న్యూఢిల్లీ : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లోంచి రాహుల్ గాంధీ మాత్రమే బయట పడేయగలరని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక కాంగ్రెస్ పని అయిపోయింది’ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వారివి చాలా తొందరపాటు వ్యాఖ్యలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఈ ఫలితాలు కూల్చలేవు. ఈ ఓటమిని తల్చుకుని బాధపడటం కన్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవడం చాలా మంచిది. అలాగే పార్టీ కోరితే.. లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ప్రతి పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధమే’ అన్నారు శశి థరూర్. అంతేకాక ప్రస్తుతం దేశంలో బీజేపీకి కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు థరూర్. పార్టీ స్థాపించిన నాటి నుంచి గాంధీ-నెహ్రూ కుటుంబం కాంగ్రెస్‌కి ఎంతో సేవ చేసింది. అలాంటి వారికి పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పార్టీ ఓటమికి ఒక వ్యక్తినే బాధ్యున్ని చేయడం మంచి పద్దతి కాదని థరూర్ అభిప్రాయపడ్డారు. అయినా కుడా రాహుల్ గాంధీ ఒక్కరే అందుకు బాధ్యత వహించడం గొప్ప విషయమన్నారు. కానీ, పార్టీ పరాజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి.. పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాహుల్ పట్ల ఎంతో అభిమానముందని ఈ సందర్భంగా థరూర్ పేర్కొన్నారు. ఒకవేళ అధ్యక్ష పదవికి మరెవరైనా పోటీ పడితే వారిని రాహుల్ భారీ మెజారిటీతో ఓడించడం ఖాయమన్నారు థరూర్. అందరినీ కలుపుకొనిపోయి, పార్టీని ముందుకు నడపడంలో ప్రస్తుతానికి రాహుల్‌కు మించిన నేత కాంగ్రెస్‌లో మరొకరు లేరని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు. దేశంలో రైతాంగ సంక్షోభం, నిరుద్యోగం లాంటి తీవ్ర సమస్యలున్నప్పటికీ ప్రజలు మోదీకే ఓటేశారన్నారు. దీనికి ప్రజల మధ్య బీజేపీ రేపిన మతవిద్వేషాలు ఒక కారణమైతే.. దేశాన్ని నడిపించడానికి మోదీ తప్ప మరో నాయకుడు లేడని చేసిన తప్పుడు ప్రచారం మరో కారణమని థరూర్ ఆరోపించారు. (చదవండి : మోదీని రాహుల్ జయించాలంటే..?) -
‘సీఎంలు, పీఎంలు వస్తూంటారు..పోతూంటారు’
రాంచీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆత్మహత్యా సదృశ్యం వంటిదేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే కాక సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలన్నింటికీ ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్.. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి విపక్షాల మూకుమ్మడి వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు, చర్యల వల్లే బీజేపీని నిలువరించలేకపోయామని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తమ ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించకుండా పెద్ద తప్పు చేశామన్నారు. వరుడు లేకుండానే పెళ్లి బారాత్ నిర్వహించినట్లుగా తమ పరిస్థితి తయారైందన్నారు. రాహులే కరెక్ట్ ‘ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుపట్టడంలో ప్రాంతీయ పార్టీల తప్పేమీ లేదు. అయితే తమకంటూ నాయకుడు లేకుండా ముందుకు వెళ్లడం ద్వారా మహాఘట్బంధన్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాల్సింది. కాంగ్రెస్ అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించింది. ప్రజల సమస్యలను తీర్చేందుకు తగిన పరిష్కారాలు సూచించింది. కానీ కొన్ని తప్పిదాల వల్ల మేనిఫెస్టో ప్రజలకు చేరువకాలేకపోయింది అని లాలూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. సిద్ధాంతాల మధ్య పోరాటమిది.. ‘ ఈ ఎన్నికలు.. నరేంద్ర మోదీతో... మమతా దీదీకో లేదా మాయావతి, అఖిలేశ్, తేజస్వీకో మధ్య యుద్ధం కాదు. ఇది ఫాసిస్టు సిద్ధాంతాలు- నిరుద్యోగ యువత, అసంతృప్త రైతులు, వెనుకబడిన వర్గాల మధ్య యుద్ధం. అయినా ప్రధానులు, ముఖ్యమంత్రులు వస్తూంటారు. పోతూంటారు. అధికారం కాదు..కేవలం ప్రజలు, జాతి మాత్రమే శాశ్వతం. అయితే అన్ని విభాగాల్లో విఫలమైన ప్రభుత్వానికి ఇంతటి మెజారిటీ ఎలా వచ్చిందోనన్న విషయం గురించి నాకు అంతుబట్టడం లేదు అని లాలూ పేర్కొన్నారు. -
మోదీని రాహుల్ జయించాలంటే..?
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాను శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, అయినప్పటికినీ ఆయన రాజీనామా ఉపసంహరణకు తిరస్కరించారని, చివరకు ఆయన రాజీనామాకు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని శనివారం నుంచి నేటి వరకు వరుసగా వస్తున్న వార్తలు. ప్రస్తుతానికి ఇదంతా ఓ రాచ కుటుంబంలో జరుగుతున్న ఓ డ్రామాగా, ఓ ప్రవహసనంలా కనిపిస్తోంది. ప్రజాస్వామిక పార్టీలో గెలుపోటములకు నాయకులు నైతిక బాధ్యత వహించడం, ఓటమి సమయాల్లో పదవులకు రాజీనామా చేయడం పరిపాటిగా మారిన పరిణామమే. కానీ ఇక్కడ రాజీనామా చేసిన వ్యక్తి పట్టాభిషేకం కోసం ఎదురుచూస్తోన్న యువరాజు. ఓ మాజీ ప్రధానికి ముని మనవడు, మరో మాజీ ప్రధానికి మనవడు, మరో మాజీ ప్రధానికి పుత్రరత్నం. అంతటి వాడు రాజీనామా చేశారంటే అలకపాన్పు ఎక్కిన యువరాజే కళ్లముందు కదులుతారు. శనివారం జరగిన సీడబ్ల్యూ సమాశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పార్టీ కీలక సమావేశంలా కనిపించలేదు. రాజదర్బారుగానే కనిపించింది. రత్నకచిత స్వర్ణ సింహాసనం లేకపోయినా, సోనియా గాంధీ ఆసీనులైన మహారాణిలాగే కనిపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ విజయావకాశాల గురించి పట్టించుకోకుండా తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకే ఎక్కువ ప్రయత్నించారని ఆ దర్బారులో రాహుల్ గాంధీ ఆరోపించడం యువరాజు తీరులాగే కనిపించింది. మధ్యప్రదేశ్‌లో సింధియాల నుంచి అస్సాంలో గొగోయ్‌లు, పశ్చిమ బెంగాల్లో ఖాన్ చౌదరీల వరకు వారసత్వ రాజకీయాలు నెరపుతున్న భూస్వాములే. కొడుకులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు తాపత్రయ పడే తండ్రులే. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదని కాదు. ఆయన పార్టీలోకి ప్రవేశించిన వైనాన్ని కూడా ఓ సారి గుర్తు చేసుకోవాలి. వారసత్వ రాచ కుటుంబంలో జరిగినట్లుగానే 2013లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఆయన పదవి కోసం ఎవరు పోటీ పడలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా కూడా అలాగే ఎంపికయ్యారు. ఆ మాటకొస్తే వారసత్వ రాజకీయాలకు మన దేశంలో ఏ పార్టీ అతీతం కాదు. పాలకపక్ష బీజేపీలో వారసత్వ వారసులు ఇతర పార్టీలకన్నా ఎక్కువ ఉన్నారు. అయినా అది ఎప్పుడు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే వారు పార్టీని నడిపించే జాతీయ నాయకత్వంలో లేరు. రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వంలో ఉన్నారు కనుకనే నేడు కాంగ్రెస్ పార్టీ చక్రవర్తి, సామంత రాజుల వ్యవస్థలాగే కనిపిస్తోంది. అలాంటప్పుడు పార్టీలోని నాయకులు పదవుల కోసం ప్రాకులాగుతారు తప్పా, పార్టీ విజయం కోసం ప్రయాస పడరు. రాహుల్ గాంధీ రాజీనామా నాటకం కాకుండా నిజమే అయితే, ఆయన రాజీనామాను ఆమోదించి మరో సమర్థుడైన అధ్యక్షుడిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలి. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అక్కడి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కమిటీలను పునరుద్ధరిస్తూ వాటి అధ్యక్ష కార్యదర్శులను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకుంటూ రావాలి. చిట్ట చివరికి పార్టి అధ్యక్షుడిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నుకోవాలి. అప్పుడుగానీ పార్టీకి కొత్త జవసత్వాలు రావు. ఈ ప్రక్రియను పూర్తి చేసే వరకు పార్టీకి అపద్ధర్మ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగినా ఫర్వాలేదు. ప్రజాస్వామ్య ప్రిక్రియలో కూడా పార్టీ రాహుల్ గాంధీనే కోరుకుంటే ఆయనకు అంతకన్నా అదృష్టం మరోటి ఉండదు. అప్పటికీ నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని ఎదుర్కొనే పరిణతి కచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతటి ఓపిక, శక్తి తనకు లేదనుకుంటే రాజకీయాలకు సెలవు చెప్పి రాహుల్ గాంధీ మాల్దీవులకు వెళ్లిపోవచ్చు! -
నేను పార్టీ మారను : రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారుతానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సోషల్ మీడియాలో వ్యాపారం కోసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం, మినీ భారతదేశంగా పిలువబడే మల్కాజిగిరిలో ప్రజలు తనని ఆశీర్వదించారన్నారు. కొడంగల్‌లో కేసీఆర్, హరీష్ రావు తనపై కుట్రలు చేసి ఓడించారని, కానీ ప్రశ్నించేవారు ఉండాలని రేవంత్ రెండ్డిని మల్కాజిగిరి ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటానని, వారికిచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలను తిప్పి కొడతామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వల్ల గెలిచిన బీజేపీని పార్లమెంట్లో నిలువరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. -
ఎందుకీ ఘోర పరాభవం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎందుకీ పరాభవం. ఎందుచేత ఈ ఘోరపరాజయం..ఐదింటిలో ఒక్కటి కూడా గెలవకపోవడం, ఓట్లశాతం పడిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని భారతీయ జనతా పార్టీ పరేషాన్లో పడిపోయింది. అంతేకాదు, ఓటమి వైఫల్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా నోటీసు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేతో బీజేపీ కూటమిగా ఏర్పడి డీఎంకే-కాంగ్రెస్ కూటమితో తలపడిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి, తూత్తుకూడి, రామనాథపురం, శివగంగై, కోయంబత్తూరు.. ఈ ఐదు స్థానాల్లో పోటీచేసింది. కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, పార్టీ సీనియర్ నేతలు నయినార్ నాగేంద్రన్, హెచ్ రాజా, సీపీ రాధాకృష్ణన్ ఈ ఐదు స్థానాల్లో పోటీచేశారు. అయితే బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. అంతేగాక ఐదు మంది లక్షల పైచిలుకు ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. ఈ ఘోర ఓటమి పార్టీ అధిష్టానంతోపాటూ రాష్ట్ర శాఖను విస్మయానికి గురిచేసింది. తమిళనాడులో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేక గాలి వీచినందునే ఓటమి పాలయ్యామని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినా, ఓట్లశాతం గతంలో కంటే దారుణంగా పడిపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఓటమికి సరైన కారణాలు కనుగొని పార్టీని చక్కదిద్దాలని నిర్ణయానికి వచ్చారు. ఇక మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో 1999లో తమిళనాడులో బీజేపీకి 7.1 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తరువాత అనేక ఎన్నికలు వచ్చినా అంతకు మించి ఓట్లను సాధించలేకపోయింది. 2009లో 2.3 శాతం, 2014లో 5.60 శాతం పొందింది. తాజా ఎన్నికల్లో 3.7 శాతానికి పడిపోయింది. అంటే 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే 2 శాతం ఓట్లను కోల్పోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులోనే బీజేపీకి గట్టి దెబ్బతగలడంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమిత్‌షా కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై ఫోన్ వచ్చినట్లు సమాచారం. తమిళనాడులో పార్టీ పరాజయానికి కారణాలు ఏమిటో సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. కేవలం తమిళిసై నుంచే గాక రాష్ట్రంలోని పలువురు నేతల నుంచి ఓటమి కారణాలపై నివేదిక కోరారు. తమిళనాడులో రెండు లేదా మూడు స్థానాల్లో గెలుపొందాలని మోదీ, అమిత్‌షా రాష్ట్రపార్టీకి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే కాంచీపురం, తిరుప్పూరు, మధురై, కన్యాకుమారి, తేని, ఈరోడ్ నగరాల్లో భారీ ప్రచార సభలు నిర్వహించి మోదీ ప్రసంగించారు. ఇంత చేసినా ఓటమి కారణాలు ఏమిటని అధిష్టానం తీవ్ర ఆలోచనలో పడింది. నేతలు సరిగా పనిచేయక పోవడమే ఓటమి కారణమనే తీరులో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
నాలో మరో కోణం చూస్తారు..జాగ్రత్త!
సాక్షి, చెన్నై : తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదంటూ నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన పార్టీ నిర్వాహకులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మక్కళ్ నీది మయ్యం పార్టీ విజం సాధించకపోయినా, కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మక్కళ్‌నీది మయ్యం పార్టీ 14,74,916 ఓట్లను దక్కించుకుంది. అదే విధంగా కోవై, ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధురై స్థానాల్లో లక్షకు పైగా ఓట్లను రాబట్టుకుంది. కాగా 11 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓట్ల శాతం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను ఉత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జిల్లాల కార్యదర్శులు, నిర్వాహకులకు విందునిచ్చారు. ఈ విందులో సుమారు 400 మంది పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పలు విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. విజయం సాధించామనే భావించాలి. పార్టీని ప్రారంభించిన 14 నెలల్లోనే ఎన్నికలకు వెళ్లిన తాము మంచి ఫలితాలనే పొందామని అన్నారు. అయితే డెల్టా జిల్లాలు, ఉత్తరాది జిల్లాల్లో తక్కువ ఓట్లనే రాబట్టగలిగామని, కాగా ఎన్నికలు ముగిశాయి కదా, తదుపరి ఎన్నికల సమయానికే ప్రజల వద్దకు వెళ్లవచ్చు అని ఎవరూ భావించరాదన్నారు. ప్రతి ఒక్కరు ఆయా ప్రాంతాల్లో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న శాసనసభ ఎన్నికల్లో అవకాశం ఉంటుందని చెప్పారు. కఠిన చర్యలుంటాయి ఈ ఎన్నికల్లో కఠినంగా శ్రమించింది ఎవరూ? విశ్రాంతి పొందింది ఎవరూ? సరిగా పని చేయనివారెవరూ? వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. అలాంటి వారు ఇకపై కూడా ఇలానే పని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనలోని ఒక కోణాన్నే చూశారని, మరో కోణాన్ని మీరు చూడలేదని అన్నారు. ఆ కోణం తన, పర భేదాలను చూడదని అన్నారు. మనకిప్పుడు బాధ్యత పెరిగిందన్నారు. 14 నెలలోనే ప్రజలు మనకు ఇన్ని ఓట్లు వేసి ఆదరించారని, అందుకు తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలన్నారు. లేకుంటే పార్టీ నుంచి తొలగించడానికి కూడా వెనుకాడనని అన్నారు. అందరికీ ఉంటుంది విందు ప్రధాన నిర్వాహకులకే విందా? అని ఎవరూ భావించరాదని, తాను త్వరలోనే అన్ని జిల్లాలకు పర్యటించనున్నాని, అప్పుడు సమావేశాలతో పాటు విందు ఉంటుందని కమలహాసన్ పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండాలన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా తాను వస్తానని కమల్ హాసన్ చెప్పారు. -
రాహుల్ రాజీనామాకు సోనియా అంగీకారం!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సోమవారం కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్లను రాహుల్ వద్దకు పంపగా, ఆయన తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోననీ, ఇందుకోసం మరొకరిని ఎంపిక చేసుకోవాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ తాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తానని రాహుల్ చెప్పారు. తొలుత రాహుల్ రాజీనామాకు ఒప్పుకోని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో వీరిద్దరూ చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించిట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకునేందుకు రాహుల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తా.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను పార్టీ కోసం పనిచేస్తానని కాంగ్రెస్ దూతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, ప్రియాంకలు సీనియర్ నేతలపై మండిపడినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. ‘ఈ విషయంలో తప్పుడు కథనాలు, వదంతులకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. నెహ్రూకు నివాళులు.. భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్లు యమునా నదీతీరన ఉన్న శాంతివన్లో సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటక, రాజస్తాన్‌లో నీలినీడలు పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న వేళ కర్ణాటక, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు రమేశ్ జర్కిహోళీ, డా.సుధాకర్‌లు బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలపై చర్చించారు. మంత్రి పదవులు దక్కక గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం జూన్ 10 వరకే కొనసాగుతుందని కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న బాంబు పేల్చారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ ఘోర ఓటమికి రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో పార్టీలో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ చీఫ్ అజయ్ కుమార్, అస్సాంలో పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా సహా పలువురు నేతలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామాలు సమర్పించారు. -
మోదీ ప్రమాణానికి ‘బిమ్స్టెక్’ నేతలు
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మోదీ ప్రమాణస్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిమ్స్టెక్లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వేడుకకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు ప్రముఖ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్‌లకు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ జూన్ 6న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. అదేరోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారనీ, ఆయన ఇతర ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. జూన్ 10న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ప్రొటెం స్పీకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రొటెం స్పీకర్ కోసం బీజేపీ నేతలు సంతోష్‌కుమార్ గంగ్వార్, మేనకాగాంధీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ సాగనున్నాయి. -
తొలి పది పదిలం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు రెండ్రోజులే ఉండటంతో కేబినెట్ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు పార్టీ సీనియర్ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్థానంలో మరొకరు రావచ్చని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్‌తో పాటు మరికొన్ని కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరి స్థానాలు పదిలం పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్నికైనందున కేబినెట్ కూర్పు కొంత కష్టమేనని, ఒకవేళ సీనియర్లు కొందరికి చోటు దక్కకపోయినా వారు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, తావర్ చంద్ గెహ్లోత్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, మేనకా గాంధీ వంటి పది మంది అగ్రనేతలకు కేబినెట్లో తిరిగి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడి, వారు అంగీకరిస్తే జైట్లీ, సుష్మా స్వరాజ్లను తీసుకోవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు నేతలు రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ (ఇప్పటికే మంత్రులు), పార్టీ అధ్యక్షుడు అమిత్ షా (తొలిసారి మంత్రి అవుతారు)లకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. బెంగాల్‌కు ప్రాధాన్యత పశ్చిమబెంగాల్లో పార్టీ 18 సీట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బాబుల్ సుప్రియో (ప్రస్తుత మంత్రి), లాకెట్ ఛటర్జీ, సుభాష్ సర్కార్, జయంత్ సర్కార్లకు బెంగాల్ నుంచి కేబినెట్లోకి రావొచ్చు. ఎక్కువగా యువతరానికి, కొత్త ముఖాలకు కేబినెట్లో అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ, శివసేనలతో పాటు ఇతర పార్టీలకు చోటు దొరకొచ్చని చెప్పాయి. కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా! గౌబా 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ అధికారి న్యూఢిల్లీ: కొత్త కేబినెట్ కార్యదర్శిగా హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యే చాన్సుంది. ప్రస్తుత కార్యదర్శి పి.కె.సిన్హా నాలుగేళ్ల పదవీ కాలం జూన్ 12తో ముగుస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. కాగా హోం శాఖ కార్యదర్శి పోస్టు కోసం ఇతరులతో పాటు కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. అత్యంత సీనియర్ అధికారి అయిన గౌబా కేంద్రంలో, జార్ఖండ్, బిహార్ ప్రభుత్వాల్లో పనిచేశారు. ఆగస్టు 31తో హోం శాఖ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే దేశంలోనే అత్యున్నతమైన కేబినెట్ కార్యదర్శి పోస్టుకు గౌబా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అధికారి ఒకరు వెల్లడించారు. ఈయన జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన కేబినెట్ కార్యదర్శి అయ్యే పక్షంలో తొలుత రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యే అవకాశం ఉంది. తర్వాత మరో రెండేళ్ల పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. సిన్హా కూడా 2015లో తొలుత రెండేళ్ల పదవీకాలానికి నియమితులై, తర్వాత 2016, 2018లో పొడిగింపు పొందారు. -
ఎన్నికల లెక్కలపై కెమిస్ట్రీ గెలుపు
వారణాసి/ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టేలా ఎన్నికల గణితం (అర్థమెటిక్)పై కెమిస్ట్రీ గెలుపు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గణాంకాలన్నిటినీ మించిన కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ఒకటి ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆ కెమిస్ట్రీయే గణాంకాలపై విజయం సాధించింది’ అని మోదీ వివరించారు. ‘నేను దేశానికి ప్రధానమంత్రిని. కానీ మీకు ఎంపీని. మీ సేవకుడిని’ అని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల పరీక్షను డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణులయ్యారన్నారు. వరసగా రెండో సారి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేసేందుకు సోమవారం ఆయన వారణాసి సందర్శించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలుచేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు రోడ్ షోను తలపిస్తూ నగరంలోని పలు వీధుల గుండా భారీ బందోబస్తు మధ్య ఆయన వాహనశ్రేణి ముందుకుసాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్లపై బారులు తీరి నిలబడ్డారు. దాబాలపై నుంచి గులాబీ రేకులు విసిరారు. అదో దురభిప్రాయం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ అనేది ఒక దురభిప్రాయంగా మోదీ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పండితులు బీజేపీని ఇప్పటికీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా పరిగణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ఆలోచనా విధానం, తార్కికత 20వ శతాబ్దానిదనే విషయం వారికి తెలియదన్నారు. బీజేపీ ఓట్ల శాతం పెరగని ప్రాంతమే దేశంలో లేదన్నారు. ‘అసోంలో మన ప్రభుత్వం ఉంది. లడఖ్‌లో గెలుస్తున్నాం. అయినా రాజకీయ పండితులు మనవి హిందీ ప్రాంత రాజకీయాలంటారు. ఈ విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారు’ అని మోదీ చెప్పారు. అబద్ధాలు, తప్పుడు తార్కికతతో ఈ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారన్నారు. ‘ఇలాంటి తప్పుడు అవగాహన కారణంగానే ప్రజలు మనతో ఉండేందుకు ఇష్టపడరు. కానీ పారదర్శకత, కఠోర శ్రమతో అలాంటి తప్పుడు, చెడు అవగాహన కల్పించేవారిని ఓడించవచ్చు’ అని అన్నారు. రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది.. బీజేపీ రాజకీయ అస్పృశ్యత, రాజకీయ హింస వంటి ముప్పులను ఎలా ఎదుర్కొందో మోదీ చెప్పారు. ‘కేరళ, కశ్మీర్, బెంగాల్ లేదా త్రిపురలకు సంబంధించిన కేసులు చూడండి. త్రిపురలో కార్యకర్తలను ఉరి తీశారు. బెంగాల్లో హత్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కూడా. నాకు తెలిసి దేశంలో ఒకేఒక్క రాజకీయ పార్టీ హత్యలకు గురయ్యింది. హింసను చట్టబద్ధం చేశారు. ఇది మన ముందున్న ఒక ప్రమాదం’ అని చెప్పారు. ‘ అంబేడ్కర్, గాంధీజీ అస్పృశ్యతను రూపుమాపారు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది. బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ నేత హత్య, బెంగాల్లో కార్యకర్త కాల్చివేతలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణంలో కూడా బీజేపీ.. ‘అందిరితో, అందరి వికాసం కోసం..’ అనే నినాదానికే కట్టుబడి ఉందని చెప్పారు. మిగతా పార్టీల్లాగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పోరాడిన తన ప్రత్యర్థులకు కూడా తాను రుణపడి ఉంటానన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రాధాన్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ఇతరులు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష ఛాయలే ఉండవన్నారు. ‘కానీ త్రిపురలో చూడండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అదే సమయంలో మంచి విపక్షం ఉంది. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే, పార్టీ వ్యూహాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ప్రభుత్వం, పార్టీ వ్యవస్థల మధ్య ఉండే సమన్వయం ఒక గొప్ప శక్తిలాంటిదని, బీజేపీ ఈ విషయం తెలుసుకుందని మోదీ అన్నారు. శ్రమ, శ్రామికులు అద్భుతాలు సృష్టిస్తాయన్నారు. తన గెలుపునకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కిందిస్థాయి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల కఠోరశ్రమకు, అంకిత భావానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ అభివృద్ధి అంటే ఏమిటో కొద్దిగానే చూపించారని, వచ్చే ఐదేళ్లలో కాశీ అత్యద్భుతమైన నగరంగా మారుతుందని చెప్పారు. నెహ్రూకి నివాళి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూజీకి నివాళులు. జాతి నిర్మాణానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు బీజేపీ నేతలు నెహ్రూకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. -
ఎన్నికల ఫలితాల షాక్ టీడీపీ మహానాడు రద్దు
-
‘మహా కూటమి’ ఏర్పడితే ఏమయ్యేది ?!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ప్రత్యామ్నాయంగా పటిష్టమైన మహా కూటమిని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవడం వల్లనే మరోమారు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రయ్యారంటూ రాహుల్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమితో జతకట్టి ఉన్నట్లయితే, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాదితో విభేదాలు పరిష్కరించుకున్నట్లయితే, ఢిల్లీలో ఆప్‌తో జతకట్టి ఉన్నట్లయితే ఫలితాలు వేరుగా ఉండేవని కొన్ని రాజకీయ పక్షాలు వాదిస్తున్నాయి. వారి వాదనలో నిజమెంత? వారన్నట్లుగా ఇవన్నీ పక్షాలు కలిసి మహా కూటమిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవి ? ఏడాది క్రితం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు ఏకమైనప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయన్న ఆశలు చిగురించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది కుదిరి, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడం వల్ల 38 సీట్లకుగాను 37 సీట్లను ప్రతిపక్షాలు గెలుచుకోగలిగాయి. బీహార్‌లో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్‌తోనే కాకుండా అన్ని ప్రతిపక్షాలతో కలిసి మహా కూటమిగా పోటీ చేసినా 40 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే దక్కింది. బీజేపీ ప్రభంజనాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా దాన్ని అడ్డుకునేవి కావు. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో 159 సీట్లు ఉండగా, కాంగ్రెస్–మిత్రపక్షాలకు పది సీట్లు రాగా, కూటమిలో చేరే అవకాశం ఉండిన పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి 132 సీట్లు వచ్చేవి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకపక్షాలన్నింటితో కలిసి కాంగ్రెస్ పోటీచేసి ఉన్నట్లయితే ఈ కూటమికి అదనంగా 18 సీట్లు వచ్చేవి. అంటే బీజేపీకి కూటమికి 104, వ్యతిరేక కూటమికి 45 వచ్చి ఉండేవి. ఆయా పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఈ లెక్క తేలింది. పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఒక్క పార్టీకి వచ్చే ఓట్ల శాతం పూర్తిగా ఇతర పార్టీలకు రావు. ఆ లెక్కన ఈ 18 సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అఖిల భారత ఐక్య ప్రజాస్వామిక ఫ్రంట్ (ఏఐయుడిఎఫ్)తో పొత్తు పెట్టుకున్నట్లయితే కరీంగంజ్ నియోజకవర్గంలో గెలవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కృఫాల్నాథ్ మల్లా 44.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. అక్కడ ఫ్రంట్ అభ్యర్థి రాధేశ్వామ్ బిశ్వాస్కన్నా బీజేపీ అభ్యర్థికి కేవలం 3.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్ దాస్‌కు 11.36 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ శాతాన్ని కూడితే ఫ్రంట్ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ముస్లిం అంతా మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా భావిస్తోన్న ఫ్రంట్ అభ్యర్థికి ఓటు వేశారు. ఫ్రంట్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకన్నట్లయితే కొత్త మంది ముస్లింలు ఓటింగ్‌కే వచ్చేవారు కాదు. ఢిల్లీలో ఢిల్లీలో చివరకు ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని ఇరువర్గాలు భావించాయి. ఆ రెండు కలిస్తే బీజేపీకి గట్టిపోటీ అవుతుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అది జరిగి ఉండేది కాదు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో 50 శాతానికిపైగా ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో విజయం సాధించే అవకాశం ఉన్న పార్టీకే సహజంగా ఓటు వేస్తారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ హర్యానాలోని జన్నాయక్ జనతా పార్టీ లేదా బహుజన సమాజ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నట్లయితే ఒక్క రోహతక్ నియోజకవర్గం సీటు మాత్రమే కాంగ్రెస్ కూటమికి వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థికి 21,211, బీఎస్పీకి 38,364 ఓట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క పార్టీతోని పొత్తుపెట్టుకున్నా కాంగ్రెస్ కూటమికి ఈ సీటు వచ్చేది. మహారాష్ట్రలో మహారాష్ట్రలో అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉన్నట్లయితే కాస్త మంచి ఫలితాలే వచ్చేవి. అంటే ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదితో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పొత్తు పెట్టుకున్నట్లయితే బుల్దానా, హాత్కనంగల్, పర్భణి, సోలాపూర్, నాందేడ్, సాంగ్లీ, గడ్చీరోలి చిమూర్...ఏడు సీట్లను గెలుచుకునేది. అంటే కాంగ్రెస్ కూటమికి ఐదు బదులు 12 సీట్లు వచ్చేవి. బీజేపీ–శివసేన కూటమికి 41కి బదులు 34 వచ్చేవి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, తన మిత్రపక్షమైన జన అధికార్ పార్టీతో కలిసి ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో కలిసి పోటీ చేసినట్లయితే దౌరాష్ట్ర, మీరట్, బదౌన్, బారబంకి, బాండా, సుల్తాన్పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, ఛందౌలి...తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చేవి. అంటే రాష్ట్రంలోని 80 సీట్లకుగాను మహా కూటమికి 24 సీట్లు వచ్చేవి. బీజేపీ కూటమికి 64కు బదులు 56 సీట్లు వచ్చేవి. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి 18 సీట్లు పెరిగేవి, బీజేపీ కూటమికి 18 సీట్లు తగ్గేవి. దీనివల్ల ఫలితం ఏమీ ఉండేది కాదు. -
‘ఎంపీ కావడమే గొప్ప.. మంత్రి పదవిపై ఆశ లేదు’
సాక్షి, కరీంనగర్ : కార్పోరేటర్‌గా ఉన్న తనకు ఎంపీగా పనిచేసే అవకాశమే గొప్ప అని, మంత్రి పదవిపై ఆశలేదని బీజేపీ నేత, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కరీంనగర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు వరకే రాజకీయాలు అని ఇకపై అభివృద్ధి కోసం పని చేద్దామని మిగతా పార్టీలను కోరారు. ‘ ఒక సామన్య కార్యకర్త అయిన నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. నర్సరీ పిల్లల నుంచి వందేళ్ల వృద్ధుల వరకు నేను గెలవాలని తపించారు. కార్యకర్తలకు రూపాయి ఖర్చు చేయకపోయినా సొంతంగా పెట్రోల్ పోసుకొని నా కోసం ఇల్లిల్లు తిరిగారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. పార్లమెంట్ సమావేశాలకు, కరీంనగర్ ప్రజల పనుల కోసం తప్ప ఢిల్లీ, హైదరాబాద్‌కు వెళ్లను. ప్రజల మధ్యే ఉంటూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తా. పెండింగ్‌లో ఉన్న స్మార్ట్ సిటీ పనుల కోసం అవసరమైతే మరిన్ని నిధులు తెస్తాం’ అని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తనకు మంత్రి పదవిపై ఆశలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మెద్దని కోరారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్‌పై 87 వేలపైగా ఓట్ల తేడాతో బండి సంజయ్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బండి సంజయ్ కు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల, సానుభూతి పవనాలు వీచాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈ సారి మాత్రం భారీ విజయాన్ని అందిస్తూ కరీంనగర్ ప్రజలు సంచలన తీర్పును ఇచ్చారు. -
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు రెండుసార్లు దురదృష్టకరం
-
మోదీ ‘సబ్ కా విశ్వాస్’ మాటకు అర్థం ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం. ‘సబ్ కా విశ్వాస్’ ఆయన తాజాగా ఇచ్చిన నినాదం. భారతీయ మైనారిటీ వర్గాలను దష్టిలో ఉంచుకొని ఆయన ఈ నినాదం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఆయన మే 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఓటు వేసిన వారంతా మనవారే, ఓటు వేయని వారు కూడా మనవారే. వారి విశ్వాసాన్ని కూడా మనం చూరగొనాల్సిన అవసరం ఉంది’ అంటూ దేశంలోని మైనారిటీలనుద్దేశించి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు తాము వ్యతిరేకమని, వారిలో భయాందోళనలను సష్టించామని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ నరేంద్ర మోదీ మొదటి సారి దేశంలో మైనారిటీల దుస్థితి గురించి మాట్లాడారు. గత బీజేపీ ఐదేళ్ల పాలనలో మైనారిటీలు భయం, భయంగానే బతికారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకు గోరక్షకుల పేరిట జరిగిన దాడులను గుర్తు చేస్తున్నాయి. ఆ దాడుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నిస్తున్నాయి. మైనారిటీలైన ముస్లింలను మినహాయిస్తూ మిగతా హిందూ శరణార్థులందరికి భారతీయ పౌరసత్వం ఇస్తామంటూ 2016లో ముసాయిదా బిల్లు తీసుకరావడం నిజం కాదా? అంటూ నిలదీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మెజారిటీలు, మైనారిటీలు అంటూ మాట్లాడిందీ బీజేపీ నేతలు కాదా? అని అడుగుతున్నాయి. ఏదిఏమైనా ఎన్నికలు ముగిశాయి. 303 సీట్లతో బీజేపీ అఖండ విజయం సాధించింది. మొదటి సారి మైనారిటీల బాగోగుల గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకోవాలి. గతంలో మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ‘సబ్ కా విశ్వాస్’ చూరగొనాలి! -
రెండు రోజుల తర్వాత భోంచేసిన లాలూ
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి లోనై.. భోజనం కూడా మానేశారు. రెండు రోజుల పాటు లాలూ ఆహారం తీసుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. ఇది ఇలానే కొనసాగితే.. ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం చేయాల్పిందిగా లాలూను కోరారు. చివరకు రెండు రోజుల తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం లాలూ భోజనం చేశారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘లాలూకు బీపీ, షూగర్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. అలాంటిది రోజుల తరబడి భోజనం చేయడం మానేస్తే.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. దాంతో ఆయనను కన్వీన్స్ చేసి భోం చేయాల్సిందిగా ఒప్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంద’ని తెలిపారు. పశుగ్రాస కుంభకోణం కేసులో భాగంగా లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమిగా ఏర్పడి.. ఎన్డీఏను ఎదుర్కొని ఘోర పరాజయాన్ని చవి చూశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 39 చోట్ల విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. -
షాకిచ్చిన ఫలితాలు; త్వరలోనే మంత్రివర్గ విస్తరణ?!
బెంగళూరు : సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా సీఎం కుమారస్వామికి ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఆయన తండ్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడతో పాటు.. కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా ఓటమి పాలయ్యారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన నిఖిల్.. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఘోర పరాభవం చవిచూశారు. అదే విధంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ మరోసారి ఆపరేషన్ కమలానికి తెరలేపిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత సిద్ధరామయ్య అత్యవసరంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసే క్రమంలో త్వరలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో గతేడాది ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఫలితాల్లో 105 సీట్లు గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ తమ కన్నా తక్కువ స్థానాలే గెలిచినప్పటికీ జేడీఎస్‌తో కూటమి ఏర్పాటు చేసి.. కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలు ఎవరినీ బీజేపీ కొనలేదంటూ కాంగ్రెస్-జేడీఎస్ నేతలు చెబుతున్నప్పటికీ వారిలో ఆందోళన మాత్రం కొట్టొచ్చినట్లుగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
‘శబరిమల’ ఓటు బీజేపీకి ఎందుకు పడలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఏకంగా 303 సీట్లతో అఖండ విజయం సాధించినప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎందుకు ప్రవేశం దొరకలేదు ? కనీసం మూడు సీట్లు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఎందుకు దక్కలేదు ? శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ వర్గాలు ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుకూలంగా యువతులు శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి ప్రవేశించిన వారిపైనా వారు దాడులు చేశారు. యుక్త వయసు మహిళలెవరూ గుళ్లోకి ప్రవేశించకుండా ఆలయ పరిసరాల్లో ఆరెస్సెస్ తన సేనలను మోహరించింది. ముందుగా సుప్రీం కోర్టు తీర్పను గౌరవిస్తామని చెప్పిన బీజేపీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందచ్చని భావించి మాట మార్చింది. తీర్పుకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌తో కలసి ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగిన ఏప్రిల్–మే కాలం వరకు ఆందోళనను సాగదీశాయి. శబరిమల అంశం బీజేపీకి ఓ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. కానీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన బీజేపీకి కాకుండా బీజేపీ లాగానే సుప్రీం కోర్టు తీర్పును ముందుగా సమర్థించి, తర్వాత వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు పడ్డాయి. మొత్తం 20 సీట్లలో 15 సీట్లు కాంగ్రెస్‌కు రాగా, మిగతా నాలుగు సీట్లు దాని మిత్రపక్షాలకు వచ్చాయి. పాలకపక్ష సీపీఏం పార్టీ ఒకే ఒక్క సీటు దక్కింది. అలప్పూజ నుంచి పోటీ చేసిన సీపీఎం నాయకుడు ఏఎం. ఆరిఫ్ ఒక్కరే విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంట్ నుంచి ఏకంగా 9 మంది అభ్యర్థులు లక్షకుపైగా మెజారిటీతోని విజయం సాధించారు. యూడీఏ ఫ్రంట్‌కు 47. 2 శాతం ఓట్లు రాగా, ఎల్డీయే ఫ్రంVŠ కు 35. 1 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు కేవలం 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 14.9 శాతం ఓట్లతో పోలిస్తే కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 10.8 శాతం ఓట్లతో పోలిస్తే ఎక్కువ పెరిగింది. బీజేపీ తరఫున గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న కుమ్మనం రాజశేఖరన్ మినహా మిగతా మూడవ స్థానంలో నిలిచారు. తిరువనంతపురం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ ఏకంగా 99, 989 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజశేఖరన్‌కు 31.1 శాతం ఓట్లు వచ్చాయి. శబరిమల ఆలయం ఉన్న పట్టణం తిట్టలో బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్ 29 శాతం ఓట్లతో రెండో స్థానంలో వచ్చారు. ఎందుకిలా జరిగిందని వామపక్షాలను, కాంగ్రెస్, బీజేపీ వర్గాలను మీడియా విచారించగా, వామపక్ష సానుభూతిపరులు బీజేపీకి ఓటు వేయడం ఇష్టంలేక కాంగ్రెస్‌కు ఓటు వేశారని, తద్వారా ఆ పార్టీ లబ్ధి పొందిందని వామపక్ష నాయకులు వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు మొదటి నుంచి లౌకిక వాదులని మతతత్వ బీజేపీకి ఓటు వేయడం ఇష్టం లేక తమకే ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శబరిమల ఆలయ వివాదం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లబ్ధి పొందిందని, అయితే తాము గెలవక పోయినా తమ పార్టీ కూడా బలపడిందని బీజేపీ నాయకులు చెప్పారు. భవిష్యత్తులో తాము మరింత బలపడేందుకు ఇప్పుడు సమకూర్చుకున్న బలం ఉపయోగపడుతుందని అన్నారు. -
భారీ మెజారిటీ; కేంద్రమంత్రి పదవిపై కన్ను!
లక్నో : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బీజేపీ సహా మిత్రపక్షాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజ్ కుమార్ చహర్ కేంద్రమంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్‌పై భారీ మెజారిటితో గెలుపొందిన రాజ్ కుమార్ మోదీ కేబినెట్లో కచ్చితంగా చోటు దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ నేత బాబూలాల్ చౌదరి కూడా రాజ్ బబ్బర్‌పై పైచేయి సాధించారు. అయితే అప్పడు ఆయన కేవలం లక్షన్నర ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. 2019 ఎన్నికల్లో ఫతేపూర్ సిక్రీ అభ్యర్థిగా రాజ్ కుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎంపీని కాదని బీజేపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన రాజ్ కుమార్ మొత్తంగా 6.67,147 ఓట్లు సాధించారు. 4, 95, 065 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని మట్టికరిపించారు. వారణాసిలో నరేంద్ర మోదీకి వచ్చిన మెజారిటీ కంటే కూడా ఇదే ఎక్కువ. అదే విధంగా రాజ్ కుమార్ చహర్‌కు 64.32 శాతం ఓట్లు దక్కడంతో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ దారుణ ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ చహర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మోదీ హవాలో కొట్టుకుపోయారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానం(సోనియా గాంధీ- రాయ్‌బరేలీ)లో గెలుపొందిన సంగతి తెలిసిందే. -
నా నిజమైన ఆస్తి మీరే : సోనియా గాంధీ
లక్నో : దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఆమె... బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్‌ను ఓడించారు. ఈ నేపథ్యంలో తన విజయానికి దోహదపడిన పార్టీ కార్యకర్తలు, ఇతర పార్టీలు, నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ లేఖ రాశారు. ‘ నా జీవితం తెరచిన పుస్తకం. మీరే నా కుటుంబం. నాకున్న నిజమైన ఆస్తి మీరే. దేశ ప్రాథమిక విలువలను కాపాడతానని, కాంగ్రెస్ పూర్వపు నేతలు అనుసరించిన విధానాలను కొనసాగిస్తానని మాట ఇస్తున్నాను. ఈ క్రమంలో నా జీవితాన్ని త్యాగం చేయడానికి ఏమాత్రం వెనుకాడను. రాబోయే రోజులు ఎంతో కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. మీ ఆదరణ, మా పట్ల మీరు ప్రదర్శించే విశ్వాసం, మీ అండదండలతో ప్రతీ సవాలును ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రతీ లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా నాపై నమ్మకాన్ని ఉంచి నన్ను ఎన్నుకున్నారు. నా విజయానికి పాటుపడిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు, ఎస్పీ, బీఎస్పీ, స్వాభిమాన్ దళ్ పార్టీ నాయకులు.. అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న ఎస్పీ-బీఎస్పీ చెరో 38 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు ఆమేథీ, రాయ్‌బరేలీల్లో తమ అభ్యర్థులను నిలపకుండా పరోక్ష మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు కూడా సోనియా కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఆమేథీ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో యూపీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ
-
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
-
ఆర్ఎస్ఎల్పీకి భారీ షాక్
పట్నా: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్ విజయకుమార్ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హరూన్ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. -
ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. ఈమేరకు కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కోడ్ ఎత్తివేత వెంటనే అమల్లోకి వస్తుందని ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్‌ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తుంది. -
ఐదోసారి సీఎంగా నవీన్
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్‌ను కలసిన నవీన్ పట్నాయక్.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. నిరాడంబర వ్యక్తిత్వం నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు.. జననం.. విద్యాభ్యాసం.. ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్ నేత బిజు పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతుల కుమారుడైన నవీన్ పట్నాయక్ ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అక్టోబర్ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్హం బాలుర పాఠశాల, డూన్ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్ మూడేళ్ల జూనియర్. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. -
మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులందరూ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒంటరివాడిని చేశారనీ, ఎవ్వరూ ఆయనకు తోడుగా నిలవలేదని రాహుల్ చెల్లెలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించినట్లు సమాచారం. అలాగే రాహుల్ కూడా ముగ్గురు సీనియర్ నేతలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాను వద్దని చెబుతున్న తమ కొడుకులను పోటీలోకి దింపారని ఆరోపించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి.చిదంబరం బెదిరించారనీ, ముఖ్యమంత్రి కొడుక్కే టికెట్ ఇవ్వకపోతే ఎలా అని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడారనీ, ఇక రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తన కొడుక్కి టికెట్ తెప్పించుకుని, ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసి మిగతా ప్రాంతాలను ఆయన విస్మరించా రని రాహుల్ ఆరోపించినట్లు సమాచారం. చిదంబరం, కమల్‌నాథ్ కుమారులు ఎన్నికల్లో గెలవగా, గెహ్లాట్ కొడుకు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీ అపజయాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం జరిగింది. ఎన్నికల్లో తీవ్ర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తాననీ, తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు ఈ పదవి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదించగా, పలువురు నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ప్రియాంకలు నిర్మొహమాటంగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటమికి కారకులంతా ఇక్కడే ఉన్నారు.. సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అగ్రనేతలెవరూ తన అన్నకి మద్దతుగా నిలవలేదనీ, మోదీపై ఆయన ఒంటరిగా పోరాడారని అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె మాట్లాడుతూ ‘పార్టీ ఓటమికి కారణమైన వాళ్లంతా ఈ గదిలో కూర్చున్నారు’ అని అన్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా రాహుల్‌ను కొందరు నేతలు ఒప్పిస్తుండగా ప్రియాంక కలగజేసుకుని, ‘మా అన్న ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. రఫేల్ కుంభకోణం, కాపలాదారుడే దొంగ అన్న నినాదాన్ని రాహుల్ మినహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మీరెవరూ మద్దతు తెలుపలేదు’ అని ప్రియాంక అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
జూన్ 6 నుంచి లోక్‌సభ సమావేశాలు
న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలిసమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. గురువారం ప్రధానిగా మోదీ, ఇతర కేంద్ర మంత్రుల చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ సమావేశాలు 6 రోజుల పాటు కొనసాగుతాయి. సమావేశాల్లో భాగంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లోక్‌సభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. -
స్మృతీ ఇరానీ అనుచరుడి హత్య
అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ కార్యకర్తపై కాల్పులు కలకలం రేపాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. అమేథీ నుంచి ఎంపీగా ఎంపికైన స్మృతీ ఇరానీ అనుచరుడు, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ (50)పై శనివారం అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. సురేంద్ర అతని స్వగృహంలో నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన సురేంద్రను లక్నో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర కన్నుమూశాడని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, రాజకీయ శత్రుత్వం వల్లే హత్య జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. పాడె మోసిన స్మృతీ ఇరానీ సురేంద్ర మృతి విషయం తెలియగానే స్మృతి ఇరానీ హుటాహుటిన అమేథీకి చేరుకున్నారు. సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి.. వారిని ఓదార్చారు. రాష్ట్ర మంత్రి మోసిన్ రజా కూడా సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల్లో భాగంగా స్మృతి, రజాలు సురేంద్ర పాడె మోశారు. సురేంద్ర మృతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య విచారం వ్యక్తం చేశారు. -
కలిసి పనిచేయాలని ఉంది
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. రెండు దేశాల ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఉందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధన కోసం హింస, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పాల్సి ఉందని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలపడంతోపాటు దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధనకు మోదీతో కలిసి పనిచేయాలని ఉందంటూ ప్రధాని ఇమ్రాన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ తెలిపారు. ఇరు దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారన్నారు. అయితే, ప్రధాని ఇమ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ...ఈ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద, హింసా రహిత వాతావరణం నెలకొనాలని, పరస్పరం విశ్వాసం పెంపొందాలని పేర్కొన్నారు. మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల నేతల అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ప్రపంచ శక్తిగా భారత్
అహ్మదాబాద్: భారత్ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు. నన్ను వేళాకోళం చేశారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయని మోదీ అన్నారు. ‘ఆరో విడత ఎన్నికల చ్రారంలో భాగంగా ఎన్డీయేకు 300కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని నేను చెప్పగానే చాలామంది వేళాకోళం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీచేయడం లేదు.. ప్రజలే పోటీ చేస్తున్నారు అని నేను చెప్పాను. బీజేపీని మరోసారి అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు’ అని మోదీ వెల్లడించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సూరత్ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు చనిపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రథయాత్రలకూ ఇబ్బంది పడ్డారు: అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, రాష్ట్రంలో గూండాయిజాన్ని, అవినీతిని అంతమొందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ‘ప్రజలు నరేంద్ర భాయ్‌ను అమితంగా అభిమానించడానికి ఓ కారణం ఉంది. ఆయన చాలాగ్రామాల్లో పర్యటించారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గుజరాత్‌ను బీజేపీకి కంచుకోటగా తీర్చిదిద్దారు’ అని షా ప్రశంసించారు. -
మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), అన్నాడీఎంకే పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తుకు ప్రతిఫలంగా మోదీ మంత్రివర్గంలో జేడీయూకు 1–2 మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మే 30న ప్రధాని మోదీతో కలిసి వీరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దీంతో పాటు పశ్చిమబెంగాల్లో ఈసారి 18 లోక్‌సభ సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడులో పట్టుకోసం బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో ఒకే సీటు దక్కించుకున్న అన్నాడీఎంకేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో 6 స్థానాలు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు మరోసారి మంత్రి పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. గాంధీనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు కీలక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించేందుకు షా నిరాకరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటుతో సరిపుచ్చుకున్న బీజేపీ, ఈసారి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందనీ, కాబట్టి తెలంగాణ నుంచి కేబినెట్లో ఒకరికి చోటు దక్కే అవకాశముందంటున్నారు. -
మే 30, రాత్రి 7 గంటలు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మాల్దీవుల్లో తొలి పర్యటన.. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం. వెంకయ్య ఇంటికి మోదీ కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. -
టార్గెట్ @ 125
లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ తన తదుపరి గురి రాజ్యసభపై పెట్టింది. పెద్దల సభలో మెజార్టీ సాధించడమే ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల ముందున్న లక్ష్యం. గత కొద్ది కాలంలో ఎన్డీయే ప్రతిపాదించిన కీలక బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందకుండా ఆగిపోయాయి. ట్రిపుల్ తలాక్, మోటార్ వాహన చట్టం, పౌర చట్టాలకు సవరణ బిల్లులు ఎన్డీయేకి తగినంత బలం లేని కారణంగా పెద్దల సభలో ఆమోదం పొందలేకపోయాయి. ఇటీవల కాలంలో అదే ఎన్డీయేకి అడ్డంకిగా మారింది. దానిని అధిగమించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం 101 ఎంపీల బలం గత ఏడాది పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని మించి రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకుంది. 245 సీట్లు ఉన్న సభలో ఎన్డీయే ఎంపీల సంఖ్య 101కి చేరుకుంది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు స్వప్న దాస్‌గుప్తా, మేరీకోమ్, నరేంద్ర యాదవ్‌ల మద్దతు కూడా బీజేపీకే ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుతో కలిపి ఎన్డీయే బలం 107కి చేరుకుంది. ఆరేళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సభ్యులందరి ఎన్నికలు ఒకేసారి జరగవు. విడతల వారీగా సభ్యులు పదవీ విరమణ చేసినప్పుడల్లా కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలి. దేశవ్యాప్తంగా ఎన్డీయేకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభకు ఎక్కువ మంది ఎంపీలను పంపగలదు. విపక్షాల ప్రమేయం లేకుండా పెద్దల సభలో బిల్లులు పాస్ కావాలంటే ఎన్డీయేకి 123 మంది ఎంపీలు కావాలి. 2020 నవంబర్ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. అసోం నుంచి మూడు, రాజస్తాన్ నుంచి రెండు, ఒడిశా నుంచి ఒకటి సభ్యులతో ఎన్డీయే బలం వచ్చే ఏడాదికి పెరగనుంది. రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేయగలిగితే రాజ్యసభలో బలం కూడా పెరుగుతుంది. ఇప్పట్నుంచి నవంబర్ 20 మధ్య కాలంలో కొత్తగా పెద్దల సభకు 75 మంది సభ్యులు వెళతారు. ఎన్డీయే తన మార్కు పరిపాలన చూపించాలన్నా, కొత్త సంస్కరణలకు తెరతీయాలన్నా రాజ్యసభలో మెజార్టీ కూడా అత్యంత అవసరం. -
ఇక అసెంబ్లీ వంతు!
17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగను న్నాయి. ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 119 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మిత్రపక్షాలు 108 సీట్లు గెలుచుకున్నాయి హరియాణా, ఢిల్లీలలోని మొత్తం సీట్లను(17) బీజేపీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో కాషాయపక్షం భాగస్వామి శివసేనకు 19 లోక్‌సభ సీట్లు దక్కాయి. బిహార్‌లోని 40 సీట్లలో ఎన్డీఏలోని బీజేపీ, జేడీయూ చెరో 16 స్థానాలు, లోక్‌జన్ శక్తి పార్టీ ఆరు సీట్లు గెలుచుకున్నాయి. ఢిల్లీలో త్రిముఖ పోటీ? వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పాలకపక్షమైన ఆప్, కాంగ్రెస్‌లతో బీజేపీకి త్రిముఖ పోటీ తప్పదు. 2015 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 70 సీట్లలో 67 కైవసం చేసుకోగా బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటూ గెలుచుకోలేక మూడో స్థానానికి దిగజా రింది. గత నవంబర్‌లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా ప్రకటించలేదు. అయిదు నెలల క్రితం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అయితే, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయిం ది. ఛత్తీస్‌లో మొత్తం 11లో రెండు స్థానాలే సాధించగలిగింది. మధ్యప్రదేశ్‌లో సైతం కాంగ్రెస్‌కు ఒక్క సీటే దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీరు గమనించి కొన్ని రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలెవరో అంచనా వేసి చెప్పడం కుదిరేపని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రధానాంశాలు మారడమే కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో పరిగణించే అంశాలకూ, అసెంబ్లీ ఎన్నికల్లో వారిని కదిలించే విషయాలకూ ఉండే తేడాల వల్ల గెలిచే పార్టీలపై జోస్యం చెప్పడం కష్టమని చండీగఢ్ విశ్లేషకుడు ఘనశ్యామ్ దేవ్ అభిప్రాయపడ్డారు. -
మమతకు అసెంబ్లీ గండం
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్ జగన్
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... రాజ్‌దీప్ సర్దేశాయ్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా? జగన్మోహన్రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను. సర్దేశాయ్: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి? జగన్: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి. సర్దేశాయ్: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్ అనుకూల ఓటా? జగన్: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు. సర్దేశాయ్: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా! జగన్ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా! సర్దేశాయ్: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు? మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్ స్టేట్ అంటే ఏంటి? జగన్: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్డన్ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. సర్దేశాయ్: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా? జగన్: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్ గ్లోబల్ టెండర్ల ద్వారా అయితే యూనిట్ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్ యూనిట్ రూ.4.84 ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం. గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్ కమిటీని వేసి, సిట్టింగ్ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం. సర్దేశాయ్: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా? జగన్: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. సర్దేశాయ్: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్ మీ టార్గెట్. మోడల్ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా? జగన్: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా. సర్దేశాయ్: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది? జగన్: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు. సర్దేశాయ్: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: (ఆవేదనగా) కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. సర్దేశాయ్: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు. సర్దేశాయ్: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్ కమాన్.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్. మీ తండ్రి మా కాంగ్రెస్ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి? సర్దేశాయ్: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది. జగన్: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. -
30న ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం
-
30న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి గద్దెనెక్కనున్నారు. మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ఆయన ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్...మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే నరేంద్ర మోదీ ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో నువ్వా నేనా అన్నట్టు సాగిన సార్వత్రిక సమరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అసాధారణ రీతిలో 303 స్థానాలను కైవసం చేసుకుంది. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ముస్లిం చిన్నారికి ‘నరేంద్ర మోదీ’ పేరు
గోండా(యూపీ): ప్రధాని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన ఓ ముస్లిం మహిళ తన నవజాత శిశువుకి ‘నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’అని పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడి పర్సాపూర్ మహరార్ గ్రామానికి చెందిన మైనాజ్ బేగం లోక్‌సభ ఫలితాలు వెల్లడై నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో గెలిచిన రోజే తన బిడ్డకు ఆయన పేరు పెట్టాలనే ఆలోచనకు వచ్చింది. ‘మేమందరం ఆమె అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించాం. కానీ ఆమె తన ఆలోచనను అస్సలు మార్చుకోలేదు. ఇదే విషయాన్ని దుబాయిలో ఉన్న తన భర్త ముస్తాక్ అహ్మద్‌కు తెలుపగా ఆయన కూడా ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఎంతకీ వినకపోవడంతో చివరికి ఆమె కోరిక మేరకే పేరు పెట్టేందుకు ఒప్పుకున్నాడు’అని మైనాజ్ బేగం మామ ఐద్రీస్ తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడి పేరుతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ పొందడానికి ఆ జిల్లా మెజిస్ట్రేట్‌లో అఫిడవిట్ దాఖలు చేసి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (పంచాయతీ) ఘనశ్యామ్ పాండేకు సమర్పించారు. -
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవించాయి. శనివారం జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమావేశం తిరస్కరించింది. అయితే, రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇందుకు సరైన నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు గంటలపాటు భేటీ దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్, ఆజాద్, షీలా దీక్షిత్, ఖర్గే తదితర 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యానికి కారణాలు, ప్రజలను మెప్పించడంలో వైఫల్యానికి దారి తీసిన పరిస్థితులను చర్చించారు. ఆయనే కొనసాగాలన్న సీడబ్ల్యూసీ ‘రాహుల్ నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో తిరస్కరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి నాయకత్వం, మార్గదర్శకత్వం వహించాలని ఆయన్ను కోరింది’అని సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ‘పార్టీని అన్ని స్థాయిల్లోనూ పార్టీ బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టాలని, దేశంలోని యువత, రైతులు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన పనిచేసేందుకు పార్టీకి నేతృత్వం వహించాలని సీడబ్ల్యూసీ కోరింది. పార్టీకి ఓట్లేసిన 12.13 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది’అని ఆయన తెలిపారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా కొనసాగాలన్న సీనియర్ నేత చిదంబరం సమావేశంలో కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. బాధ్యతల నుంచి వైదొలగాలన్న రాహుల్ నిర్ణయం నేపథ్యంలో పార్టీ మద్దతుదారులు, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వారు తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ వైఫల్యానికి కారణాలను వివరిస్తూ సమావేశంలో ప్రియాంక, మన్మోహన్ మాట్లాడారు. తన ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే గెలుచుకున్న ఎంపీ సీట్ల సంఖ్య 44 నుంచి 52కు పెరిగినప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ పరాజయానికి తమదే బాధ్యతంటూ యూపీ, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ బబ్బర్, నిరంజన్ పట్నాయక్ ఇప్పటికే రాజీనామాలు సమర్పించగా మరికొందరూ అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ చీఫ్‌గా ప్రియాంక వద్దు ఈ సమావేశంలో ప్రసంగించిన రాహుల్.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నా పోరాటాన్ని కొనసాగిస్తా. కానీ, పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు. ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు ప్రతిపాదించగా ‘నా సోదరిని ఈ విషయంలోకి లాగకండి’ అంటూ రాహుల్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కంచుకోట వంటి అమేథీ నుంచి ఓటమి చవిచూడటంతో రాహుల్ రాజీనామా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో తల్లి సోనియా, చెల్లి ప్రియాంక ఎంతగా నచ్చజెప్పినా వెనక్కి తగ్గేందుకు ఆయన అంగీకరించలేదు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం మీడియా భేటీలో పాల్గొనకుండానే రాహుల్ వెళ్లిపోయారు. దీంతో వైదొలిగే యోచనలోనే రాహుల్ ఉన్నట్లు భావిస్తున్నామని నేతలు అంటున్నారు. -
జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల, విశ్వాసపరమైన మరే ఇతర వివక్షకు తావులేకుండా పనిచేయాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఆయన కోరారు. ‘జాతీయ ఆశయాలు .. ప్రాంతీయ ఆశలు (నేషనల్ యాంబిషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్– నారా)’ ఎన్డీయే కూటమికి తానిచ్చే నినాదంగా మోదీ చెప్పారు. ఎన్డీయే ఈ రెండు మార్గాల్లో ముందుకు వెళుతోందని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రెండిటి కలయిక అవసరమని పేర్కొన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ (అకాలీదళ్) మోదీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా..నితీశ్ కుమార్ (జేడీయూ), ఉద్ధవ్ థాకరే (శివసేన) తదితర నేతలు బలపరిచారు. మోదీ 353 మంది ఎంపీల పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మోదీ పేరును షా ప్రతిపాదించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీలు మద్దతు పలికారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వాణి, మురళీ మనోహర్ జోషి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన తర్వాత శనివారం రాత్రి మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీని ప్రధానిగా కోవింద్ నియమించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి తమ ఎంపీల జాబితాను అందజేశారు. కేబినెట్ కూర్పుపై మీడియా కథనాలు నమ్మొద్దు ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మోదీ 75 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. వారు ఎప్పుడూ భయంతో బతికేలా చేశారన్నారు. వారి విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1857 నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తుచేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాలూ చేతులు కలిపాయన్నారు. సుపరిపాలన కోసం ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని మోదీ చెప్పారు. తమపై విశ్వాసం ఉంచిన వారితో పాటు, ఎవరి విశ్వాసం చూరగొనాల్సి ఉందో వారితో కూడా తాము ఉంటామన్నారు. ఈ సందర్భంగా మోదీ కొత్త ఎంపీలకు పలు సూచనలు కూడా చేశారు. వీఐపీ సంస్కృతిని విడనాడటంతో పాటు ప్రచారం కోసం మీడియాకు ప్రకటనలివ్వద్దని చెప్పారు. కొత్త మంత్రివర్గ కూర్పుపై మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దన్నారు. అవన్నీ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా,, కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా ఉంటాయని అన్నారు. ఎన్డీయే ఎంపీలందరి వివరాలను తానింకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నియమ, నిబంధనలను అనుసరించి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలను ఏకం చేసిన ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడూ విభజించడంతో పాటు అంతరాన్ని సృష్టిస్తాయని, కానీ 2019 ఎన్నికలు ప్రజలను, సమాజాన్ని ఏకం చేశాయని చెప్పారు. ఈసారి ప్రభుత్వ అనుకూల వాతావరణం ఉండటం గమనార్హమని, దాని ఫలితంగానే సానుకూల తీర్పు వెలువడిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ చేయడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదన్నారు. 2014–19 మధ్య పేదల కోసం ప్రభుత్వాన్ని నడిపామని, ఆ పేదలే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఇప్పుడు లభించిన భారీ విజయం అంతే పెద్ద బాధ్యతను మనపై ఉంచిందని చెప్పారు. దేశాభివృద్ధికి ఎన్డీయే ఎంపీలందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు శనివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు హాజరయ్యారు. ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన తల్లి హీరాబా మోదీ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రధాని ఆదివారం గుజరాత్ వెళ్లనున్నారు. వీఐపీ సంస్కృతిని దేశం అసహ్యించుకుంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ కోసం మీరెందుకు క్యూలో నిలబడలేరు? అందులో తప్పేం లేదు. ‘రెడ్ లైట్’ (ఎర్ర బుగ్గ) సంస్కృతికి మోదీ స్వస్తి చెప్పారని ప్రజలు చెప్పుకుంటారు. మనోహర్ పరీకర్ ఏం చేసేవారో మీరు చూశారు. ఆయన్ను అనుసరించండి. ఎలాంటి వలలోనూ పడకండి. ప్రభుత్వ వ్యతిరేకత హానిచేస్తుంది. కానీ మనం చేసిన పని ప్రభుత్వ అనుకూల గాలి సృష్టించింది. ఫలితంగా సానుకూల ఓటును మనం చూడగలిగాం. 16వ లోక్‌సభ రద్దు కేంద్ర మంత్రివర్గం సిఫారసు నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్ససభను రద్దు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించిన విషయం విదితమే. మోదీ మే 30న నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని, కొత్త మంత్రులుగా నియమించే వారి పేర్లను అందజేయాల్సిందిగా ప్రధానిని రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. మోదీ 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. రాష్ట్రపతిభవన్‌లో మోదీకి ప్రధానిగా నియామక పత్రం ఇస్తున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఎన్డీఏ ఎంపీలు, కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు పార్లమెంటు లోపలికి వస్తూ ఎంపీ సన్నీడియోల్ విజయసంకేతం, పార్లమెంటు ద్వారం వద్ద మోకరిల్లాక నమస్కరిస్తున్న ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ -
‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్
కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో బీజేపీదే పైచేయి అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు మరోసారి నిరూపించాయి. యూపీలోని అమేథీలో స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే బీజేపీ చేతిలో ఓడిపోవడం ఇందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 186 నియోజకవర్గాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడిన వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కేవలం పదిహేను చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. 2014 ఎన్నికల్లో ముఖాముఖి పోరులో 24 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ స్కోరు ఈసారి పదిహేనుకు పడిపోయింది. అలాగే, 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. బీజేపీ 50శాతానికి పైగా ఓట్లు పొందిన రాష్ట్రాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్అధికార పగ్గాలు చేపట్టింది. అయితే, అదే ఊపును లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కొనసాగించలేకపోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. ముఖాముఖి పోరు జరిగిన రాజస్తాన్‌లో మొత్తం 25 సీట్లనూ కమలదళం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాల్లోనూ ముఖాముఖి పోరు జరగ్గా కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు(చింద్వారా)ను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఇలా చతికిల పడుతుందని ఎవరూ ఊహించలేదు. గుజరాత్‌లోని మొత్తం 26 నియోజకవర్గాల్లో, మహారాష్ట్రలో 16 చోట్ల హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. కర్ణాటకలోని 28 స్థానాల్లో 21 చోట్ల బీజేపీతో పోటీపడగా కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్, కమలదళంతో ముఖాముఖి తలపడింది. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ గెలిస్తే, అమేథీని కమలం తన ఖాతాలో వేసుకుంది. రాజధాని ఢిల్లీలో 5 చోట్ల ఈ రెండు పార్టీలు ఢీకొనగా అన్ని సీట్లూ బీజేపీకే వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో మాత్రం ముఖాముఖిలో కాంగ్రెస్‌దే పైచేయి అయింది. ఇక్కడ రెండు సీట్లు గెలుచుకుంది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే, కేరళ, తమిళనాడుల్లో కూడా ముఖాముఖి పోరులో బీజేపీ నెగ్గుకు రాలేకపోయింది. -
80% మోదీ మ్యాజిక్
ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల అధినేతల ర్యాలీలు, సభల నిర్వహణకు నియోజకవర్గాలను ఎంపిక చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఒక ప్రాంతంలో సభని నిర్వహిస్తే, దానికి జన సమీకరణే కాదు, ఆ తర్వాత ఓట్లు రాబట్టుకోగలగాలి. ఎన్నికల ర్యాలీల ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాలకు తిరుగేలేదు. ఉన్న కాస్త సమయంలోనే ఆయన పక్కాగా, ప్రణాళికా బద్ధంగా దేశవ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వాటిలో ఏకంగా 114 స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అంటే సక్సెస్ రేటు 80శాతంగా ఉంది. మోదీ తన ప్రచార సభల్లో మూడోవంతు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ల్లో నిర్వహించి అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. గతేడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ 27 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. అంటే గెలుపు రేటు 48శాతంగా ఉంది. ఏడాది తిరిగే సరికల్లా లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సక్సెస్ రేటు రెట్టింపైంది. హిందీ రాష్ట్రాలైన, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహా ర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల్లో మోదీ 60 ర్యాలీలు నిర్వహిస్తే మొత్తంగా క్లీన్‌స్వీప్ చేసింది. యూపీలో 30 లోక్‌సభ నియోజకవర్గాల్లో మోదీ ర్యాలీల్లో పాల్గొంటే 23 సీట్లలో బీజేపీ నెగ్గింది. ఇక కేరళ, తమిళనాడుల్లో మోదీ అయిదు ర్యాలీల్లో పాల్గొంటే ఎన్డీయే కూటమి కి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాహుల్‌పై మళ్లీ అదే ముద్ర! కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొన్నాళ్ల కిందటి వరకు ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. ఆయన ఎవరికి ప్రచారం చేస్తే వారు ఓడిపోతారన్న భావన అందరిలోనూ నెలకొంది. గతేడాది హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో రాహుల్ తనపై ఉన్న పప్పూ ముద్రను తొలగించుకున్నారని ఆయన అభిమానులు ఆనందించారు. కానీ ఇంతలోనే అది కాస్తా తారుమారైంది. రాహుల్ 115 నియోజకవర్గాల్లో పర్యటిస్తే యూపీఏ 96 సీట్లలో ఓడిపోయింది. ఆయన గెలుపు 17శాతం దగ్గరే నిలిచిపోయింది. తుస్సుమన్న బ్రహ్మాస్త్రం ఇక కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోంచి ఎన్నికలకు మూడు నెలల ముందు తీసిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ 38 నియోజక వర్గాల్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. 44 ర్యాలీల్లో పాల్గొన్నారు. 26 ర్యాలీలు యూపీలో నిర్వహిస్తే, మిగిలినవి మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, హరియాణాల్లో పార్టీ అభ్యర్థులు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. కానీ అన్న రాహుల్ పాటి సక్సెస్‌ను కూడా ఆమె సాధించలేకపోయారు. ప్రియాంక ప్రచారం చేసిన స్థానాల్లో రెండంటే రెండు అదీ అమ్మ, అన్న మాత్రమే గెలిచారు. రాయ్‌బరేలి, వయనాడ్‌ల్లో సోనియా, రాహుల్ మినహా మరెవరూ గెలవలేకపోయారు. వాస్తవానికి ప్రియాంక ప్రచారం పార్టీకి కొత్తగా ఒనగూర్చే ప్రయోజనం ఏమీ లేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
మూడు గెలిచినా జోష్ లేదు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఫలితాలు కొంత సానుకూలంగా వచ్చాయనే భావన తప్ప, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు. బీజేపీకన్నా తక్కువ సంఖ్యలో స్థానాలు వచ్చాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌లో, బీజేపీకి తమకన్నా ఎక్కువ స్థానాలు రావడం అసంతృప్తికి కారణమవుతోంది. మూడు స్థానాల్లో గెలిచినంతవరకు బాగానే ఉంది కానీ, మరింత సానుకూల ఫలితాలు వచ్చి ఉంటే పార్టీ శ్రేణులకు మరింత స్థైర్యం వచ్చేదని, బీజేపీకన్నా ఒక్క స్థానంలో ఎక్కువ గెలిచినా సేఫ్జోన్లో ఉండేవారమనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నిస్తేజం నుంచి కోలుకునిఉంటే.. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి తోడు పార్టీ నేతలంతా వలసల బాట పడుతున్న పరిస్థితుల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కొంత కోలుకుని పనిచేసి ఉంటే బావుండేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. అప్పటికే కార్యకర్తలు ఆత్మన్యూనత భావనతో ఉండడం, కీలక నేతలంతా బరిలోకి దిగి ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీపరంగా ఫోకస్ చేయలేకపోయామని వారు అంగీకరిస్తున్నారు. జహీరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమికి ఇదే కారణమని, ఇంకొంచెం కష్టపడి ఉంటే ఖచ్చితంగా మరో రెండు స్థానాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు రేవంత్, కోమటిరెడ్డి లాంటి నేతలు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉన్నా మిగిలిన కాంగ్రెస్ నేతలంతా కలసికట్టుగా ప్రచారం నిర్వహించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రణాళికతో ప్రచారం చేసి ఉంటే రెండు, మూడు స్థానాల్లో సానుకూల ఫలితం వచ్చేదని, అప్పుడు బీజేపీ తమకు ప్రత్యామ్నాయమనే చర్చ కూడా వచ్చేది కాదని వారంటున్నారు. సమావేశమన్నారు.. వాయిదా వేశారు.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకుగాను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు దాన్ని ఆకస్మికంగా వాయిదా వేసుకున్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం కొందరు నేతలు గాంధీభవన్‌కు చేరుకున్న తర్వాత వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ రేవంత్, కోమటిరెడ్డిలు అభినందనల కార్యక్రమంలో బిజీగా ఉండడంతో సమీక్ష సమావేశానికి రాలేకపోతున్నామని తెలియజేశారు. దీంతో సమావేశంలో భాగంగా గెలిచిన ముగ్గురు ఎంపీలకు సన్మానం ఏర్పాట్లు చేసినా వారు రాకపోవడంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ నేతృత్వంలో కేక్‌కట్ చేసి సంతృప్తి చెందారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. ఆయన ఆదివారం మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు. -
కలిసుంటే మరో 10 సీట్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్ బంధన్)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ పండితుల జోస్యాలు కూడా వమ్మయ్యాయి. రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీ కూటమి 64 సీట్లు గెలిస్తే, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీల మహా కూటమి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటే వచ్చింది. అయితే, మహా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే కూటమి పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదని, కనీసం మరో పది సీట్లయినా వచ్చేవని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి, కాంగ్రెస్‌కు కలిపి 45.20 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 49.56 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజేతకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్ లేదా కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో కాంగ్రెస్ ఉంటే ఫలితం మరోలా.. మహా కూటమిలో కాంగ్రెస్ చేరి ఉంటే అలాంటి చోట్ల కచ్చితంగా కూటమి అభ్యర్థే గెలిచేవారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకున్న బీజేపీ యేతర ఓట్లు పొత్తులో ఉంటే కూటమికి పడేవని వారంటున్నారు. ఉదాహరణకు బదౌన్‌లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య 18,454 ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 51,947 ఓట్లు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ కూటమిలో ఉండి ఉంటే ఈ ఓట్లు ధర్మేంద్రకు పడేవి. దాంతో ఆయన గెలుపు సాధ్యమయ్యేది. అలాగే, బందాలో ఎస్పీ అభ్యర్థి శ్యామ్ చరణ్ 58,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 75,438 ఓట్లు వచ్చాయి. ఇవి కలిస్తే శ్యామ్ సునాయాసంగా గెలిచేవారు. బారాబంకిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రామ్ సాగర్ బీజేపీ చేతిలో 1,10,140 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తనూజ్ పునియాకు 1,59,611 ఓట్లు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్ చేరితే ఈ ఓట్లన్నీ కూటమికి పడి ఆ అభ్యర్థి గెలిచేవారు. ఇక ధరౌహ్రాలో బీఎస్పీ అభ్యర్థి ఇలియాస్ సిద్ధిఖి 1,60,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌కు 1,62,856 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, కూటమిల్లో ఏవరో ఒకరే నిలబడి ఉంటే కచ్చితంగా వాళ్లే గెలిచేవారు. మచిలీషహర్‌లో బీఎస్పీ అభ్యర్థి రామ్ కేవలం 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ మద్దతిచ్చిన జన్ అధికార్‌పార్టీ అభ్యర్థికి 7వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు కూటమికి వస్తే బీఎస్పీ అభ్యర్థే కచ్చితంగా గెలిచేవారు. మీరట్‌లో కూడా బీజేపీ మెజారిటీ(2,379) కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బస్తి, సంత్ కబీర్ నగర్, సుల్తాన్పూర్ వంటి పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మహాకూటమితో కాంగ్రెస్ కలిస్తే ఈ సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు కచ్చితంగా కూటమి ఖాతాలో పడేవని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ కూటమిలో చేరకపోవడం వల్ల బీఎస్పీ లాభపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. షహరన్‌పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఓట్లను చీల్చిందని, దాంతో బీఎస్పీ లాభపడిందనేది పరిశీలకుల మాట. -
జూన్ రెండోవారంలోగా ‘పరిషత్’ కౌంటింగ్!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ను జూన్ రెండోవారంలో నిర్వహించే అవకాశముంది. రంజాన్ పండుగ ముగిశాక 12వ తేదీలోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పూర్తిచేయవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించిన నేపథ్యంలో అప్పటిలోగా కౌంటింగ్ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)యోచిస్తున్నట్టు తెలిసింది. బ్యాలెట్ బాక్సులను ఎక్కువగా పాఠశాలలు, విద్యాసంస్థలలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరచడంతోపాటు ఆయా చోట్ల కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మే 27న కౌంటింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఇదివరకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, పరిషత్ ఫలితాలు వెల్లడయ్యాక, జెడ్పీపీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికను 40 రోజుల తర్వాత నిర్వహిస్తే సభ్యులను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే అవకాశం ఉందని ఎస్ఈసీకి వివిధ రాజకీయపక్షాలు ఫిర్యాదు చేశాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు వాయిదా వేయడం లేదా కౌంటింగ్ కాగానే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని కోరాయి. రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు... రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు సోమవారం నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్ఈసీ వాయిదా వేసింది. ఫలితాలు వెలువడ్డాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని, ఆ తర్వాత ప్రమాణస్వీకారం చేసేలా ప్రస్తుతమున్న పీఆర్ చట్ట నిబంధనలు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూలై మొదటివారంలో ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తవారు ప్రమాణస్వీకారం చేపట్టేలా చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫలితాలు ప్రకటించాక, పరోక్షపద్ధతుల్లో చైర్పర్సన్లు, అధ్యక్షుల ఎన్నికకు ఇంత వ్యవధి ఉండాలన్న నిబంధనను సవరిస్తే సరిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటున్న తరహాలోనే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికను కూడా పూర్తిచేస్తే సమస్యలుండవని పేర్కొంటున్నారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి స్పందన రాగానే జూన్ 12వ తేదీలోగా కౌంటింగ్ ముగించి జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాత సభ్యుల పదవీకాలం ముగియకముందే కొత్త సభ్యుల ఎన్నిక పూర్తిచేసి, ఆ తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా కొత్త పీఆర్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా... ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వ తేదీ వరకు ఉంది. పరిషత్ ఓట్ల లెక్కింపు తర్వాత జూలై 4వ తేదీన కొత్త జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కొనసాగనున్న కోడ్... ఓటింగ్ ముగిసినా కౌంటింగ్, ఫలితాల ప్రకటన, చైర్పర్సన్లు, అధ్యక్షుల ఎన్నిక వంటి ప్రక్రియ పూర్తికానందున స్థానిక ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఎస్ఈసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేయవద్దని చెబుతున్నారు. జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక పూర్తయ్యాకే కోడ్ ముగుస్తుందని తెలిపారు. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్‌కుమార్ శర్మ డిపాజిట్ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్‌కుమార్, బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్‌ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్‌క్రిపాల్ యాదవ్ గెలుపొందారు. రామ్క్రిపాల్కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్‌సభలో పోటీపడిన టాప్ 5 ధనవంతుల్లో రమేశ్‌కుమార్ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని చిన్‌ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్ నాథ్ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్ సింగ్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
లోక్‌సభలో తొలి అడుగులు
ప్రపంచంలోనే భారీ ఎన్నికలుగా నమోదైన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రాజకీయ ఉద్దండులైన ఎంతోమంది సీనియర్లను ఈ ఎన్నికల్లో మట్టికరిపించి ఓ సరికొత్త తరం పార్లమెంట్లో అడుగు పెట్టింది. ఈసారి ఏకంగా 300 మంది కొత్తవారు చట్టసభకు ఎన్నికవ్వడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రత్యేకత. అందులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా మొదలుకుని క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, జర్నలిస్టు ఇంతియాజ్, దళిత ప్రతినిధి రమ్యా హరిదాస్తోపాటుగా గాయకులు, సినీరంగ ప్రముఖులు వంటి వారెందరో ఉన్నారు. అమిత్ షా (బీజేపీ– గుజరాత్) బీజేపీ అధ్యక్షుడు, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) చైర్పర్సన్, అమిత్‌షా లోక్‌సభలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్న అమిత్‌షా గుజరాతీ వ్యాపారవేత్త కుమారుడు. 1986లో బీజేపీలో చేరి 33 ఏళ్ళ వయస్సులో 1997లో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ను గత ఐదేళ్ళుగా భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించేలా చేసింది. 1990 నుంచి ప్రధాని మోదీ తలలో నాలుకలా ఉంటూ, గుజరాత్‌లోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జోతిమణి (కాంగ్రెస్– తమిళనాడు) తమిళనాడులో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా అభ్యర్థి జోతిమణి. కరూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన జోతిమణి, మాజీ డిప్యూటీ స్పీకర్, నాలుగుసార్లు ఎంపీ అయిన ఎం.తంబిదురైని 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతియాజ్ జలీల్ (ఎంఐఎం–ఔరంగాబాద్) ఎంఐఎం నుంచి లోక్‌సభలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయుడు ఇంతియాజ్‌కి లోక్‌సభ సభ్యుడిగా ఇది తొలి అనుభవం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌నుంచి తొలుత ఈయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాదీ పొత్తులో అదృష్టవశాత్తూ ఇంతియాజ్‌కి ఈ సీటు దక్కింది. శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖయిరేని అతితక్కువ ఓట్ల మెజారిటీతో ఓడించారు. పదిహేనేళ్ళ అనంతరం మహారాష్ట్ర నుంచి ఓ ముస్లిం లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిమీ చక్రవర్తి (తృణమూల్– పశ్చిమబెంగాల్) చిత్రపరిశ్రమనుంచి వచ్చి ఈ ఎన్నికల్లో రాణించిన వారిలో పశ్చిమబెంగాల్‌కి చెందిన మిమీ చక్రవర్తి, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ ప్రముఖులు. ప్రముఖ సినీతార మిమీ చక్రవర్తి పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాని దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు మిమీ చక్రవర్తి. బీజేపీ అభ్యర్థిగా గురుదాస్పూర్నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్‌పై 82,459 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగిడుతున్నారు. గౌతమ్ గంభీర్ (బీజేపీ–తూర్పు ఢిల్లీ) రాజకీయవేత్తగా మారిన సుపరిచిత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ కూడా తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గౌతమ్ గంభీర్ ఆప్ అభ్యర్థి అతిషీ మర్లేనాపై గెలుపొందారు. హన్స్‌రాజ్ హన్స్ (బీజేపీ– నార్త్‌వెస్ట్ ఢిల్లీ ) నార్త్‌వెస్ట్ ఢిల్లీనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ కూడా మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్ స్థానంలో చివరి క్షణంలో హన్స్‌రాజ్ హన్స్‌ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలినుంచి రాజకీయాల్లో ఆసక్తి కలిగిన హన్స్‌రాజ్‌హన్స్ పంజాబ్‌లోని జలంధర్ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీతరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2016లో బీజేపీలో చేరారు. ప్రజ్ఞాఠాకూర్ (బీజేపీ–భోపాల్) మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు, సొంతపార్టీ బీజేపీలోనూ, బయటా విమర్శలనెదుర్కొంటున్న ప్రజ్ఞాఠాకూర్ సైతం తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞాఠాకూర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ను మట్టికరిపించారు. రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–బిహార్) బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రవిశంకర్ ప్రసాద్ సమీప ప్రత్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. స్మృతీ ఇరానీ (బీజేపీ–అమేథీ) గాంధీ కుటుంబాన్ని చిరకాలంగా ఆదరిస్తోన్న యూపీలోని అమేథీ నియోజకర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. రమ్యా హరిదాస్ (కాంగ్రెస్– కేరళ) కేరళలోని అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రమ్యాహరిదాస్ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఓ దళిత మహిళ రమ్యాహరిదాస్ పేరు వినిపించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. హేమాహేమీలను వదిలేసి రాజకీయ అక్షరాభ్యాసం చేస్తోన్న పంచాయతీ స్థాయి నాయకురాలు రమ్యని ఎంచుకోవడం కాంగ్రెస్ సీనియర్లకు ససేమిరా మింగుడుపడలేదు. ఎన్ని విమర్శలెదురైనా, ఎంతమంది అగౌరవ పరిచినా మొక్కవోని దీక్షతో పోరాడి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న సీపీఎం నాయకుడు పీకే బిజూని ఓడించి తొలిసారి లోక్‌సభలోకి అడుపెడుతున్నారు రమ్యాహరిదాస్. మహువా మోయిత్రా (తృణమూల్ – పశ్చిమ బెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ «సునామీకి తట్టుకొని నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభలోకి ప్రవేశించబోతున్నారు. కోల్‌కతాలో పుట్టిపెరిగి, అమెరికాలో చదువుకున్న మోయిత్రా 2008లో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత తృణమూల్‌కి మారారు. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అదే జిల్లాలోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేపై 65,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తేజస్వీ సూర్య (బీజేపీ– కర్ణాటక) దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన తేజస్వీ సూర్య అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీగా తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తేజస్వీ సూర్య ఏబీవీపీ నాయకుడిగా, ఆరెస్సెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ బీజేపీ యువమోర్చా నాయకుడిగా ఎదిగారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ‘‘మీరు మోదీతో ఉంటే దేశం పక్షాన ఉన్నట్టు, లేదంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు’’అంటూ తేజస్వీ చేసిన వీడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. -
సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటరీ పక్షనేతగా నరేంద్రమోదీని బీజేపీ ఎంపీలు ఎన్నుకున్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఎన్డీఏ ఎంపీలు మోదీని రెండోసారి ఎన్డీయే నేతగా ఎన్నికున్నారు. పార్లమెంటరీ పక్షనేతగా మోదీ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించగా.. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీయే నేతగా మోదీ పేరును అకాళీదళ్ చీఫ్ ప్రకాశ్‌సింగ్ బాదల్ ప్రతిపాదించగా.. నితీష్ కుమార్, ఉద్దవ్ ఠాక్రే, రాంవిలాస్ పాశ్వాన్ బలపరిచారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన ఎన్డీఏ మిత్రులకు, తొలిపారి ఎంపీలుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఈసీ విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈ ఐదేళ్లలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశామని అందుకే ప్రజలు ఈ మహత్తర విజయం ఇచ్చి గురుతర బాధ్యత అప్పజెప్పారన్నారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత్ ప్రజాస్వామ్యం పరిణతి దిశగా పయనిస్తోంది. ఎంత ఉన్నతస్థితికి చేరినా సేవాభావం మరిచిపోం. సేవాభావం ఉన్నంత వరకు ప్రజాదరణ మనకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఎన్డీఏ విజయాన్ని కాంక్షించారు. మా చిత్తశుద్ధి, సుపరిపాలన చూసే ప్రజలు ఓటేశారు. నేను కూడా మీలో ఒకడినే అని భావించండి. ప్రజలు మనపై మరోసారి భరోసా ఉంచారు. వారి ఆశలకు అనుగుణంగా పని చేద్దాం’ అని మోదీ ఎన్డీయే ఎంపీలకు సూచించారు. -
17వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో కొలువు తీరనున్న 17వ లోక్‌సభకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే సభ్యుల విద్యార్హతలు ఎక్కువ. వయస్సు తక్కువ. మహిళల ప్రాతినిథ్యం ఎక్కువే. కొత్త ముఖాలు ఎక్కువే. 17వ లోక్‌సభకు 300 మంది మొట్టమొదటి సారి ఎన్నికకాగా, 197 మంది రెండోసారి ఎన్నికయినవారు. 45 మంది రెండుసార్లకన్నా ఎక్కువ సార్లు ఎన్నికైనవారు 17వ లోక్‌సభలో కొలువుతీరుతున్నారు. వారిలో 397 మంది జాతీయ పార్టీల నుంచి, అంటే బీజేపీ నుంచి 303, కాంగ్రెస్ నుంచి 52, టీఎంసీ నుంచి 22 మంది ఎన్నికయ్యారు. ఇక ప్రాంతీయ పార్టీలైన డీఎంకే నుంచి 23, వైఎస్ఆర్సీపీ నుంచి 22 మంది ఎన్నికయ్యారు. గతంతో పోలిస్తే 25 నుంచి 40 ఏళ్ల లోపు యువకులు ఎక్కువ మంది ఉండగా, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్కులైన వద్ధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 17వ లోక్‌సభ సభ్యుడి సరాసరి సగటు వయస్సు 54 ఏళ్లు. 40 ఏళ్ల లోపువారు సభలో 12 శాతం ఉన్నారు. గత సభలో వారి సంఖ్య 8 శాతమే. మగవాళ్లతో పోలిస్తే ఆడవారి సరాసరి సగటు వయస్సు ఆరేళ్లు తక్కువ. మొత్తం ఎన్నికలైన 542 ఎంపీల్లో 394 మంది ఎంపీలు విద్యార్హతల్లో డిగ్రీ పూర్తి చేశారు. 12వ తరగతి వరకు పూర్తి చేసిన వారు 27 శాతం కాగా, 16వ లోక్‌సభలో వారి శాతం 20గా ఉండింది. పోస్ట్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన వారు దాదాపు 25 శాతం కాగా, డాక్టరేట్ పూర్తి చేసిన వారు ఐదు శాతం మంది ఉన్నారు. 1996 నాటి నుంచి చూస్తే ప్రతి లోక్సభలోను దాదాపు 75 శాతం మంది డిగ్రీ పూర్తి చేసిన వారే ఉంటున్నారు. మహిళా ప్రాతినిధ్యం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదటి లోక్‌సభలో వారి ప్రాతినిధ్యం కేవలం ఐదు శాతం కాగా, 17వ లోక్‌సభలో 14 శాతం. ఈసారి 716 మంది మహిళలు పోటీ చేయగా 78 మంది విజయం సాధించారు. మొత్తం సభ్యుల్లో 39 శాతం మంది సభ్యులు తమ వృత్తిని రాజకీయం, సామాజిక సేవా అని తెలపగా, 38 శాతం మంది వ్యవసాయమని, 23 శాతం మంది వ్యాపారమని, 4 శాతం మంది లాయర్లని తెలిపారు. -
కొత్త ముఖాలు.. కొన్ని విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. 300 మంది మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం 542 మంది సభ్యులు ఎన్నికకాగా వారిలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం ఎంపీల్లో వారి శాతం 14 శాతం. గత లోక్‌సభలో వారి శాతం 12 శాతం ఉండగా, ఈసారి 14 శాతానికి చేరుకోవడం ఓ విశేషమే. మొదటిసారి ఎన్నికైన వారిలో అమిత్ షా భారతీయ రాజకీయాల్లో ఆరితేరిన వారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కరడుగట్టిన హిందూత్వ వాదిగా సుపరిచితురాలు. ఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీలు గౌతమ్ గంభీర్, హన్స్ రాజ్ హన్స్ సెలబ్రిటీలుగా ముందుగానే సుపరిచితులు. మొట్టమొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల గురించి కొన్ని విశేషాలు. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా, ఎన్డీయే చైర్మన్‌గా గత ఐదేళ్లుగా దేశ క్రియాశీలక రాజకీయాలను నిర్వహిస్తోన్న అమిత్ షా మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుజరాత్ వ్యాపారవేత్త కుమారుడైన అమిత్ షా చిన్నతనంలోనే ఆరెస్సెస్ శాఖలో చేరారు. 1986లో బీజేపీలో చేరారు. 1997లో తన 33వ ఏట మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మోదీ హయాంలో హోం మంత్రిగా పనిచేశారు. 2017లో రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయ్యారు. 1990 నుంచి మోదీకి అత్యంత సన్నిహితంగా ఉన్నాయన అటు గుజరాత్, ఇటు దేశంలో బీజేపీ బలపడేందుకు కృషి చేశారు. సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసుతోపాటు పలు హత్య కేసుల్లో నిందితుడు. వేటిలోను శిక్ష పడలేదు. జ్యోతిమని ఎస్. తమిళనాడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ జ్యోతిమని. అన్నామలైన యూనివర్శిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ చదవిన 43 జ్యోతిమని ప్రముఖ కథా రచయిత్రి. ఆమె రాసిన చిన్న కథలు చాలా పాపులర్. 22వ ఏటనే కాంగ్రెస్ యువజన పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించిన ఆమె, నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబీదురైని ఏకంగా 4, 20,546 ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో తంబిదురై పైనే ఆమె పోటీచేసి ఓడిపోయారు. రమ్య హరిదాస్ 32 ఏళ్ల రమ్య హరిదాస్ దళిత మహిళ. కేరళలోని అలథూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచేవరకు ఆమె పెద్దగా ఎవరికి తెలియదు. లైంగిక వేధింపులు, క్యారెక్టర్ హత్యా ప్రయత్నాలకు ఆమె ఎదురొడ్డి నిలిచారు. ఈసారి కేరళ నుంచి ఎన్నికైన ఏకైక మహిళ కాగా.. ఇంతవరకు కేరళ నుంచి ఎన్నికైన రెండో దళిత మహిళ. మహువా మొహిత్రా బీజేపీకి బాకా ఊదే టెలివిజన్ న్యూస్ యాంకర్ ఆర్నాబ్ గోస్వామికి ‘మధ్య వేలు’ చూపిస్తున్న వీడియో వైరల్ అవడంతో ఆమె గురించి మొదటిసారి ప్రపంచానికి తెలిసింది. కోల్‌కతాలో జన్మించిన మొహిత్రా అమెరికాలో చదువుకుని జేపీ మోర్గాన్ వద్ద పనిచేశారు. బ్యాంకర్‌గా ప్రశంసలు అందుకున్న ఆమె తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి బీజేపీ అభ్యర్థి, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేను 65 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. తేజస్వీ సూర్య బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుడు తేజస్వీ సూర్య (28). వత్తిరీత్యా న్యాయవాది అయిన సూర్య, బీజేపీ నాయకులు బీఎస్ యడ్యూరప్ప, ప్రతాప్ సింహా కేసులను వాదించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీకి కార్యదర్శిగా పనిచేసిన సూర్య, ఆ తర్వాత బీజేపీ యువ మోర్చాలో కూడా పనిచేశారు. కర్ణాటక బీజేపీ ఐటీ సెల్లో కూడా పనిచేశారు. ఇంతియాజ్ జలీల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసీ ఇంతియాజ్ జలీల్ మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ జర్నలిస్ట్ అయిన జలీల్ 2014లో ఔరంగాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన ప్రముఖుడిగా మారిపోయారు. ఏఐఎంఐఎం కూటమి ఒప్పందాల్లో భాగంగా వేరే వ్యక్తిని నిలబెట్టాలనుకున్నారు. అలాగయితే తాను స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తానని హెచ్చరించడంతో జలీల్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయాల్సి వచ్చింది. జలీల్ సీనియర్ శివసేన నాయకుడు చంద్రకాంత్ ఖైరేను ఓడించారు. -
రాహుల్‌ను బుజ్జగించిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)సమావేశం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు శనివారం సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశంలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నాలుగు గంటలపాటు నేతలు చర్చించారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తానని ప్రదిపాదించారు. పార్టీ కోసం పనిచేస్తానని, అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్ వెల్లడించినట్లు సమాచారం. అయితే రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. ఈ ఓటమి బాధ్యత అందరిది అని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాహుల్‌ను బుజ్జగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి రాహుల్ గాంధీ అంగీకరించినట్లు సమాచారం. -
ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మునక..?
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చత్తీస్‌గఢ్‌లో ఒక్క సీటును, మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లను అతి కష్టం మీద దక్కించుకోగలిగింది. ఆ తర్వాత, అంటే 2018లో ఈ మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పాలకపక్ష బీజేపీని ఓడించి అధికారంలోకి రాగలగింది. దాంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి. ఈసారి ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కనీసం సగం సీట్లు దక్కించుకోవచ్చని ఆశపడింది. రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అయినా ఏ మాత్రం మెరుగైన ఫలితాలను సాధించలేక పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిసి 2014లో మూడు సీట్లే రాగా, ఇప్పుడు మూడు సీట్లే వచ్చాయి. గత ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లో కూడా రాజస్థాన్‌లో ఒక్క సీటంటే ఒక్క సీటు రాలేదు. చత్తీస్‌గఢ్‌లో గతంలో ఒక్క సీటు రాగా ఈ సారి రెండు సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో గతంలో రెండు సీట్లు రాగా, ఈ సారి ఒక్క సీటు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులు ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్, అజయ్ సింగ్, వివేక్ టన్ఖా, కాంతిలాల్ భురియా, అరుణ్ యాదవ్‌లు ఓడిపోయారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తన తండ్రి ఎంపీ నియోజకవర్గమైన ఛింద్వారా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అది కూడా తక్కువ మెజారిటీతోనే. ఇక రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ కూడా ఓడి పోయారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియాను, రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రులను చేయాలని గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం యువ కాంగ్రెస్ నాయకుల నుంచి డిమాండ్ వచ్చింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలు ఎంపీ సీట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నందున సీనియర్లకు నాయకత్వం అప్పగించక తప్పడం లేదని నాడు కాంగ్రెస్ అధిష్టానం వాదించింది. మరి ఇప్పుడు ఏమైందీ ? ఎందుకు ఈ ఘోర పరాజయం ఎదురైందీ? కొంప ముంచిన అతి విశ్వాసం ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి మొట్టమొదటి కారణం అతి విశ్వాసం కాగా, రెండో కారణం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేకపోవడం, మూడో కారణం. నరేంద్ర మోదీ ఫ్యాక్టర్. 11 సీట్లలో ఎనిమిది సీట్లలో క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా కచ్చితంగా గెలుస్తామన్న అతి విశ్వాసంతో ఎన్నికల ప్రచారం కూడా సరిగ్గా చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓట్లు వేయక ఏం చేస్తారన్న భరోసా కొంపముంచిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని చత్తీస్ గఢ్ సీనియర్ పార్టీ నాయకుడొకరు తెలిపారు. పైగా అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేసిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎలాగైన సగం సీట్లు గెలుస్తామన్న ధీమానే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. అతి విశ్వాసంతోనే దిగ్విజయ్ సింగ్ తన సొంత నియోజకవర్గమైన రఘోగఢ్ వదిలేసి భోపాల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయన రఘోగఢ్ నుంచి పోటీచేసి ఉంటే ఆ సీటైనా దక్కేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజస్థాన్ విషయంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉన్న వారికి కాకుండా ఎక్కువగా కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. కొత్త ముఖాలు ఎక్కువ ఓట్లు తీసుకరాగలరని ఆశిస్తే ఇది కొత్త, పాత నాయకుల మధ్య కుమ్ములాటకు దారితీసింది. ఏళ్ల తరబడి నియోజక వర్గంలో తిరుగుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పాత నాయకులను వదిలేసి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లకు పరిచయం ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్లన కొంప మునిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నమ్మి రైతులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు. అయితే ఇప్పటికీ సగం మందికి పైగా రైతుల రుణాలు మాఫీ కాలేదట. వారంతా కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఓట వేయలేదట. -
రద్దయిన 16వ లోక్‌సభ
సాక్షి, న్యూఢిల్లీ: 16వ లోక్‌సభను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం రద్దు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాలు సొంతంగా గెలుచుకొన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారపీఠం ఎక్కనుంది. కేంద్ర కేబినెట్ నిన్న సమావేశమై 16వ లోక్ సభను రద్దు చేసేలా సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 17వ లోక్‌సభకు ఎన్నికలు పూర్తి కావడంతో కేబినెట్ తీర్మానంతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రస్తుత లోక్‌సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా లోక్‌సభ రద్దు తరవాత కొత్త లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ పక్ష నేత నరేంద్ర మోదీని రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3 వరకు ఉండగా.. లోక్‌సభను రద్దు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. రెండు రోజుల్లో ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతితో సమావేశమై కొత్తగా ఎన్నికైన లోక్ సభ అభ్యర్థుల జాబితాను అందజేస్తారు. జూన్ 3 లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారు. -
రాహుల్ రాజీనామా.. తిరస్కరించిన సీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, షీలా దీక్షిత్ తదితరులు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల్లో ఓటమికి, మరీ ముఖ్యంగా అమేథీలో ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ప్రకటించారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. దాంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవికి రాజీనామా చేశారు. -
ఓడిన రాజులు.. కూలిన రాజ్యాలు
-
ఫ్యామిలీ ఫ్యాక్స్ ఔట్
-
‘ప్రధాని పదవి కాదు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్ని ఏకమైనప్పటికి ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించింది. ప్రధానిగా మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వన్ ఫలితాలపై స్పందిస్తూ.. ‘2019లో ప్రధాని పీఠం ఖాళీగా ఉండదని గత మూడేళ్ల నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ నా సూచనను పట్టించుకోలేదు. ఈ ఐదేళ్లు వారు ప్రధాని పీఠం కోసం కాకుండా ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కృషి చేస్తే బాగుండేది. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవలేకపోయింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 52 సీట్లకే పరిమితమయ్యింది’ అని ఎద్దేవా చేశారు. అంతేకాక అమేథీలో స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీ మీద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్మృతి ఇరానీకి, రామ్ విలాస్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బిహార్‌లో ఏ పార్టీ లేదని... ఏ నాయకుడు లేడని అన్నారు. అన్ని పార్టీలను ప్రజలు మట్టి కరిపించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, ఉన్నత వర్గం వారు అందరూ బీజేపికే ఓటు వేశారని తెలిపారు. కులతత్వాన్ని బీజేపీ బ్రేక్ చేసిందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలంటే మొత్తం సీట్లలో కనీసం 10 శాతం స్థానాల్లో విజయం సాధించాలి. ఈ లెక్కన 55 స్థానాల్లో గెలుపొందిన పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమయ్యింది. -
ఓడిన చోటే గెలిచారు!
సాక్షి, ఆదిలాబాద్: ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి’ అనేది పెద్దల మాట. ఈ విషయంలో తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేతకు ఈ నానుడి సరితూగుతుంది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోయం బోథ్ నియోజకవర్గం, బొర్లకుంట చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఒక్క అవకాశం చేజారితే మరో అవకాశం కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఇరువురికి డిసెంబర్ పోయిన వెంటనే ఏప్రిల్ కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగిన ఇరువురు గెలుపొందారు. పార్టీ మారి.. శాసనసభ ఎన్నికల్లో సోయం బాపురావు బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన టీడీపీలో కొనసాగుతుండగా, రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఇరువురు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు వీరిద్దరికి కలిసిరాక ఓడిపోయారు. ఈ పరిస్థితిలో కొద్ది నెలలు గడిచిపోయాయి. లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్‌ను సోయం ఆశించారు. అయి తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్‌ను ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీని వీడి హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో కమలం గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పెద్దపల్లి అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్‌ను ముందుగా ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ నుంచి జి.వివేకానంద పేరు వినిపించినా అనూహ్యంగా నామినేషన్ల చివరి రోజు బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోథ్ నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్ నియోజకవర్గాలు ఉండగా, ఈ ఇరువురు నేతలకు డిసెంబర్లో మూసుకుపోయిన విజయం ఏప్రిల్‌లో మళ్లీ అదృష్టం తట్టింది. పార్టీ మారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం దక్కించుకున్నారు. సారుప్యత.. ఈ ఇద్దరు ఎంపీలకు సారుప్యత ఉంది. ఇరువురు డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కాగా సోయం బాపురావు 2004లో బోథ్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌కు సంబంధించి అప్పట్లో కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐటీడీఏలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన పదవి విరమణ తీసుకొని ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బోథ్ ఎమ్మెల్యేగా అప్పట్లో గెలుపొందారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2008లో ఆయన తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి బోథ్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో నిరాశ చెందారు. 2014లో మరోసారి బోథ్ నుంచే కాంగ్రెస్ టికెట్ ఆశించినా రాకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత రవాణా శాఖలో పనిచేస్తూ పదవి విరమణ తీసుకొని డిసెంబర్లో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్‌లో సోయం బీజేపీ నుంచి, బొర్లకుంట టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందారు. గతం కంటే ఎక్కువే.. ఈ ఇరువురు లోక్‌సభ బరిలో నిలవగా, డిసెంబర్లో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అధికంగా రావడం గమనార్హం. సోయం బాపురావుకు బోథ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 54,639 ఓట్లు రాగా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 61,003 ఓట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో 6వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకున్నా ఆయనకు అప్పట్లోనే విజయం దక్కే పరిస్థితి ఉండేది. ఇక వెంకటేశ్ నేతకు చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 43,848 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు చెన్నూర్ నియోజకవర్గంలో 67,219 ఓట్లు రావడం గమనార్హం. -
ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరింది
-
రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైంది
-
జిల్లా అభివృద్ధికి నిధులు తెస్తా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందన్నారు. పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను ఆశీర్వదించి ఖమ్మం ప్రజలకు అప్పగిస్తే.. వారు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని, ఈ విజయం అపూర్వమైందని అన్నారు. తన విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజా సేవకుడిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తీసుకుంటానన్నారు. తాను కేసీఆర్ అడుగు జాడల్లో నడిచే వ్యక్తినని, నాయకత్వం మాటే తన మాట అని, పార్టీ నిర్దేశించిన పనులు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. గతంలో టీడీపీ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఉన్న అనుభవం ఉన్నందున.. దానిని జిల్లా అభివృద్ధికి వినియోగిస్తానన్నారు. టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నాయకుడిగా ఎవరికి అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీ అధినేత అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, అది వ్యక్తులు నిర్ణయించేది కాదని, పార్టీ తీసుకునే నిర్ణయమని అన్నారు. జిల్లా ప్రజలు తనను ఎంపీగానే చూడాలనుకున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్నారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, తిరుమలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదం.. ఖేదం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్ బూత్‌లలో వచ్చి న ఓట్ల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి మోదం కలిగించగా.. కాంగ్రెస్ పార్టీకి ఖేదం మిగిల్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించి.. పార్టీ టికెట్‌పై పోటీ చేసిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి ఆరు నెలలైనా గడవకముందే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి. ఇందులో కాంగ్రెస్.. మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. భాగస్వామ్య పక్షమైన సీపీఐ వైరాలో.. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వీటిలో వైరా, ఖమ్మం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు రాజకీయంగా తిరుగు లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరమైనా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ విజయానికి కృషి చేసినా ఫలితం మాత్రం పార్టీ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహాకూటమి మిత్రపక్షాల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా అత్యంత తక్కువగా రావడమే కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రావడానికి గల కారణాలపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ విజయానికి ఏ నియోజకవర్గంలో.. ఏ స్థాయిలో కృషి జరిగింది.. ఆయా ప్రాంతాల్లో ఓట్ల శాతం తగ్గడానికి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఏడింట్లో మెజార్టీ రాదాయె.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మెజార్టీ సాధించలేకపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెండో స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పాలేరు, మిత్రపక్షమైన టీడీపీ గెలుపొందిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ మెజార్టీ సాధించడం, మధిర నియోజకవర్గంలోనూ ఆ పార్టీయే మెజార్టీ సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన కొత్తగూడెం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ది రెండో స్థానమే అయింది. ఇక వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా.. మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే స్వల్పమే కావడం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలున్నా కొన్నిచోట్ల వారిని పూర్తిస్థాయిలో పార్టీకి పనిచేసే విధంగా నాయకులు చేయలేకపోయారని, నాయకుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తన ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలవారీగా వివరాలు వచ్చాక లోపం ఎక్కడ జరిగింది? పార్టీ గెలుపునకు అడ్డు పడింది ఎవరో తెలుస్తుందని.. దాని ఆధారంగా పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తామన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య రీతిలో పెరిగిన మెజార్టీతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో టీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయం పాలు కావడంతో ఆ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. -
నేలకొరిగిన హేమాహేమీలు..
‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానమే లభించలేదు. మహాకూటమిగా పోటీచేసి మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించాలనీ, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చాలాచోట్ల బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. దీనికితోడు ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లో సయోధ్య విషయంలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం, పలుచోట్ల త్రిముఖ పోరు ఏర్పడ టంతో ఎన్డీయే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 352 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పనిచేయని ‘చౌకీదార్’ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆరోపించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌకీదార్ చోర్ హై(కాపలాదారు దొంగగా మారాడు) అని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనివల్లే బీసీలు, ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్న చాలాప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్స్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి ఈసారి రాహుల్ పోటీచేశారు. ఒకవేళ రెండుచోట్ల రాహుల్ విజయం సాధిస్తే ఆయన వయనాడ్‌ను ఎంచుకుంటారని అమేథీలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. అదే సమయంలో మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక బరిలోకి దిగుతారని కవ్వించి, చివరికి అజయ్‌రాయ్‌ను అభ్యర్థిగా నిలపడం కూడా పార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు ఢిల్లీలో ఆప్, యూపీలో ఎస్పీ–బీఎస్పీ, పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఆ పార్టీ పాలిట శరాఘాతంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బెంగాల్లో 2 సీట్లకు పరిమితమైంది. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన సోనియాగాంధీ పార్టీ పరువును నిలిపారు. నేలకొరిగిన హేమాహేమీలు.. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ సునామీకి పలువురు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలకు ఓటమి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, మహారాష్ట్రలో అశోక్ చవాన్, మిలింద్దేవ్రా, సుశీల్‌కుమార్ షిండే, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, ఢిల్లీలో షీలా దీక్షిత్ వంటి హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మోదీని సాగనంపుతామని బీరాలు పలికిన మమతా బెనర్జీకి పశ్చిమబెంగాల్లో షాక్ తగిలింది. 2014లో 36 సీట్లను దక్కించుకున్న మమత.. ఈసారి 22 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ ఏకంగా 18 చోట్ల విజయం సాధించింది. ఇక యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నెహ్రూ బాటలో నడిస్తేనే.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దివంగత జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతోంది. వాస్తవానికి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్ బలహీనపడటం మొదలుపెట్టింది. 2004లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, 2009లో మరోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చాక భజనపరులు చుట్టూ చేరారు. పార్టీని సైద్ధాంతికంగా బలపర్చడం పక్కనపెట్టి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమై 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓటమిని చవిచూసింది. ఇప్పటికైనా పార్టీలో భజనపరులను పక్కనపెట్టి, సైద్ధాంతికంగా నెహ్రూ బాటలో నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా మళ్లీ పాయే.. 130 ఏళ్ల చరిత్ర.. ఎందరో ప్రధానమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం. కానీ, కాలం కలిసిరాకపోతే ఏమవుతుందో పదేళ్లుగా ప్రత్యక్షంగా అనుభవిస్తోంది ఆ పార్టీ. 2014 ఎన్నికల్లో మోదీ హవాలో చచ్చీచెడీ 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది తెలిసిందే. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నా... ఆయనకు ప్రతిపక్ష నేత హోదా మాత్రం దక్కలేదు. అయితే ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో ఖర్గే లోక్‌సభ, సీబీఐ డైరెక్టర్, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లలో సత్తువ కూడగట్టుకుని ఈ హోదాకు కావాల్సిన పదింట ఒకవంతు స్థాయి సీట్లయినా గెలుస్తుందని చాలామంది ఆశించారు. అయితే, తాజా ఎన్నికల్లో 50 సీట్లకు అటూఇటుగా పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు ఈసారీ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండాపోయాయి. -
ఐదు నెలల్లో మారిన హస్తవాసి
న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు నెలల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో పాతుకుపోయిన బీజేపీని మట్టి కరిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధిస్తుందని ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు. అయితే కేవలం 5 నెలల కాలంలోనే ఈ అంచనాలు తారుమారయ్యాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 లోక్‌సభ స్థానాలుంటే బీజేపీ ఏకంగా 61 సీట్లను కైవసం చేసుకుని మళ్లీ పుంజుకుంది. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లో 28 చోట్ల, రాజస్తాన్‌లోని 25 స్థానాల్లో 25 చోట్ల, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో 9 చోట్ల విజయదుందుభి మోగించింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యువనాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ భావించారు. అయితే యూపీఏ చైర్పర్సన్ రాహుల్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ పోల్ మేనేజ్మెంట్కు సీనియర్ల అనుభవం అవసరమనీ, వారిని కాదని ఇతరులను నియమిస్తే సహాయనిరాకరణ ఎదురుకావొచ్చని సూచించారు. అందులో భాగంగానే రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లోత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించారు. ఎన్ని వ్యూహాలు రచించినా మోదీ హవా ముందు కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు బెడిసికొట్టాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ పోటీచేసిన ఛింద్వారాతో పాటు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్, కొబ్రా స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లోని గుణా నుంచి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఓటమి చవిచూశారు. రాజస్తాన్‌లో కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 24, ఆర్ఎల్టీపీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సిట్టింగ్ ఎంపీలు కాకుండా కొత్త వారిని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 11 స్థానాల్లో 9 సీట్లను ఖాతాలో వేసుకోగలింది. -
కొనసాగుతున్న ర్యాలీ 2.0
నరేంద్ర మోదీ ఘన విజయ సంబరాలు స్టాక్మార్కెట్లో శుక్రవారం కూడా కొనసాగాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,800 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ కారణంగా గురువారం నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొనుగోళ్లతో కళకళలాడింది. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 623 పాయింట్లు లాభపడి 39,435 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో ఈ నెల 20న నెలకొల్పిన క్లోజింగ్ రికార్డ్లను సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం బ్రేక్ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెంటిమెంట్‌కు జోష్... ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఘన విజయం దక్కిన కారణంగా కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మక నిర్ణయాలు తీసుకోగలదనే అంచనాలు పెరిగాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. ఇది బిజినెస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో పెట్టుబడులకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు.. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని నిపుణులంటున్నారు. అంతకంతకూ పెరిగిన లాభాలు... ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఉదయం పదిగంటల సమయంలో లాభాలు తగ్గాయి. ఆ తర్వాత అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు... ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. వచ్చే నెల మొదటి వారంలో జరిగే మోనేటరీ పాలసీలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించనున్నదని, కొత్త ప్రభుత్వం మరిన్ని మూలధన నిధులను అందించనున్నదని, బలహీన బ్యాంక్‌లను బలమైన బ్యాంక్‌ల్లో విలీనం చేసే ప్రక్రియ మరింత వేగవంతం కాగలదన్న అంచనాలు బ్యాంక్ షేర్లను లాభాల బాట నడిపిస్తున్నాయి. మరిన్ని విశేషాలు.... ► 31 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభపడగా, 4 షేర్లు–ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్ నష్టపోయాయి. నిఫ్టీ 50లో 44 షేర్లు లాభాల్లో, 6 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం లాభంతో రూ.432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.434ను తాకింది. ఈ షేర్‌తో పాలు 20కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆర్తి ఇండస్ట్రీస్, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, కల్పతరు పవర్, మణప్పురం ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వాటా కొనుగోళ్ల విషయమై హిందుజా గ్రూప్, ఇతిహాద్ ఎయిర్‌వేస్‌ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 5 శాతం నష్టంతో రూ.148 వద్ద ముగిసింది. ► రూ.616 కోట్ల ఆర్డర్లు రావడంతో జేఎమ్‌సీ ప్రాజెక్ట్స్ షేర్ 14 శాతం లాభంతో రూ.135 వద్దకు చేరింది. ► గతంలోలాగానే ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక రంగంపై మరిన్ని నిధులు ఖర్చు చేయగలదనే అంచనాలతో సిమెంట్ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో హెడెల్‌బర్గ్ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, జేకే సిమెంట్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 3–11 శాతం రేంజ్లో ఎగిశాయి. ► 170కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. దిలిప్ బిల్డ్‌కాన్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, అమృతాంజన్ హెల్త్‌కేర్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, జేఎమ్‌టీ ఆటో షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 5 రోజుల్లో.. రూ. 6 లక్షల కోట్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.2.54 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,53,830 కోట్లు పెరిగి రూ.1,52,71,407 కోట్లకు చేరింది. ఇక ఈ వారం 5 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది. చరిత్రాత్మక వారం... వారంపరంగా చూస్తే, సెన్సెక్స్ 1,503 పాయిం ట్లు, నిఫ్టీ 437 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇరు సూచీలు దాదాపు 4% ఎగిశాయి. ఈ ఏడాది ఈ సూచీలు అత్యధికంగా లాభపడింది ఈ వారమే. ఈ వారంలోనే సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం ఆల్‌టైమ్ హై వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా జీవిత కాల గరిష్టానికి ఎగసింది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 6% లాభపడింది. మరోవైపు ఇన్వెస్టర్ల భయా న్ని ప్రతిబింబించే ఇండియా ఓలటాలిటీ ఇం డెక్స్ ఈ వారంలో 41 శాతం క్షీణించింది. ఈ వారంలో ఈ సూచీ 44 నెలల గరిష్ట స్థాయి, 30.18కు ఎగసినా, ఎన్నికల ఫలితాల కారణంగా 16.54 స్థాయికి దిగివచ్చింది. -
వికటించిన గట్బంధన్
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించాలనుకున్న ప్రతిపక్షాలకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి 64 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీకి చెక్ పెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన మహాకూటమి(గట్బంధన్) కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ కూటమి వేర్వేరుగా పోటీచేయడంతో కమలనాధుల విజయం సులువైందని విశ్లేషకులు చెబుతున్నారు. సోనియా ప్రయత్నాలకు చెక్.. యూపీలో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడం ద్వారా ప్రధాని మోదీని నిలువరించాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ భావించారు. ఇందుకు అనుగుణంగానే మహాకూటమిలో చేరేందుకు ముందుకొచ్చారు. యూపీలో తమకు కేవలం 15 లోక్‌సభ స్థానాలు ఇస్తే చాలన్నారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే విజయావకాశాలు దెబ్బతింటాయన్న అనుమానంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. # కంచుకోట అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఓటమి చవిచూడగా, సోనియా రాయ్‌బరేలీలో గెలిచి పరువు కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలో లాభపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది బీఎస్పీ చీఫ్ మాయావతియే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి మొత్తం 15 సీట్లురాగా, వీటిలో బీఎస్పీనే 10 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీకి 5 లోక్‌సభ సీట్లు దక్కగా, మరో మిత్రపక్షం ఆర్ఎల్డీ ఖాతానే తెరవలేదు. సమాజ్‌వాదీ పార్టీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగలింది. -
మహిళా ఎంపీలు 78 మంది
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 78గా ఉంది. అంటే మొత్తం లోక్‌సభ ఎంపీల్లో మహిళల సంఖ్య దాదాపు 14 శాతం. 16వ లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 62 మాత్రమే కాగా, ప్రస్తుతం అది 78కి పెరిగింది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఇది అతి స్వల్పం. రువాండా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏకంగా 61 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో చట్టసభల్లో 43 శాతం మంది, యూకేలో పార్లమెంటులోనూ 32 శాతం మంది మహిళలు ఉన్నారు. అమెరికాలో 24 శాతం, బంగ్లాదేశ్‌లో 21 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కొత్త ంపీలపై పీఆర్ఎస్ ఇండియా సంస్థ ఒక విశ్లేషణను విడుదల చేసింది. ఆ వివరాలు.. 300 మంది తొలిసారి ఎన్నికైన వారే తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన వారు కొత్త సభలో 300 మంది ఉన్నారు. 16వ లోక్‌సభలో ఈ సంఖ్య 314. 16వ లోక్‌సభలో సభ్యులుగా ఉండి, మళ్లీ 17వ లోక్‌సభకు కూడా ఎన్నికైన వారి సంఖ్య 197 కాగా, మరో 45 మంది 16వ లోక్‌సభలో కాకుండా, అంతకు ముందు సభల్లో సభ్యులుగా ఉన్నవారే. -
కమలం @ 303
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే (44) ఈసారి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచాయి. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు 22 చొప్పున, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. యూపీలో బీజేపీ దాని మిత్రపక్షం మొత్తం 80కి గాను 64 సీట్లలో గెలుపొందగా ఎస్పీ, బీఎస్పీల కూటమి దాదాపుగా చతికిలబడిపోయింది. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. 2014లో ఈ పార్టీలు 10 సీట్లు దక్కించుకున్నాయి. కమలదళం జోరు ఇతర రాష్ట్రాల్లో ప్రభావాన్ని పెంచుకున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో మొత్తం 65 సీట్లకు గాను ఏకంగా 61 సీట్లలో విజయదుందుభి మోగించింది. ఆరు నెలల క్రితం ఈ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 28 లోక్‌సభా స్థానాలకు గాను 25 సీట్లలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ ప్రభంజనంలో తుముకూరు నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ కూడా ఓటమి చవిచూశారు. ఒడిశాలో గత ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ ఈసారి 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాళీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణ వంటి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అరుణాచల్‌ప్రదేశ్, దాదర్ అండ్ నాగర్‌హవేలీ, డామన్ అండ్ డయు, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూక శ్మీర్, లక్షద్వీప్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం చెప్పారు. బెంగాల్లో కమల వికాసం 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ పశ్చిమబెంగాల్లో పాగా వేయాలన్న ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ప్రయత్నాలు ఫలించాయి. సై అంటే సై అంటూ సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ తొలి సారి సత్తా చాటింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 చోట్ల ఘనవిజయం సాధించింది. మరో 22 చోట్ల రెండోస్థానంలో నిలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు గుబులు పుట్టించింది. మరోవైపు టీఎంసీ 22 స్థానాలతో తొలిస్థానంలో నిలిచింది. కాగా, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్షాలు ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి 43.3 శాతం ఓట్లు పోల్‌కాగా, బీజేపీకి 40.25 శాతం ఓట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిసారించిన బీజేపీ ఉత్తరబెంగాల్లోని జంగల్ మహల్ ప్రాంతంలో క్లీన్‌స్వీప్ చేసింది. జాఘ్రామ్, మేదినిపురి, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ సీట్లను గెలుచుకుంది. అయితే దక్షిణబెంగాల్‌లో మమత పట్టును నిలుపుకున్నారు. -
రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!
బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశమై సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపింది. ‘కుమారస్వామి నాయకత్వంపై మేం విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేశాం. ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సాగనీయబోమని పరమేశ్వర ప్రకటించారు. మీడియాను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సీఎం కుమారస్వామి పరమేశ్వరతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఓటమికి కారణం జేడీఎస్‌తో పొత్తేనంటూ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు రావడంతో రాజీనామాకు సిద్ధమంటూ సీఎం కుమారస్వామి గురువారం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఆయనకు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గారని సమాచారం. గురువారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎంపీ సీటును దేవెగౌడకు త్యాగం చేస్తా ఎంపీ, మనవడు ప్రజ్వల్ ప్రకటన సాక్షి బెంగళూరు: తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ సంచలన ప్రకటన చేశారు. హసన్ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ విషయమై ఇంకా తాతయ్యతో చర్చించలేదు. కానీ హసన్ నుంచి పోటీచేసే విషయమై ఆయన్ను ఒప్పిస్తా’ అని బెంగళూరులో మీడియాతో అన్నారు. -
ఫలితాలపై నేడు కాంగ్రెస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ శనివారం సమీక్షించనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. -
మోదీకి ట్రంప్ ఫోన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జూన్‌లో జపాన్‌లో జరిగే జీ–20 సమావేశంలో ప్రత్యేకంగా భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీలు శుక్రవారం నిర్ణయించుకున్నారు. అమెరికా, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మోదీని అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. జపాన్‌లో ఇండియా, అమెరికా, జపాన్ల మధ్య త్రైపాక్షిక భేటీ ఉంటుందని శ్వేతసౌధం అధికారులు చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే అంశంపై వారు ప్రధానంగా చర్చిస్తారంది. జూన్ 28, 29 తేదీల్లో ఈ జీ–20 సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల నేతల అభినందనలు ఎన్నికల్లో ఘనవిజయానికి అభినందిస్తూ మోదీకి పలువురు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్లు చేశారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, సౌదీ అరేబియా రాజు సల్మాన్‌బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్, నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడొ, నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ సహా పలువురు నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు.