
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మోదీ ప్రమాణస్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్స్‌టెక్ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిమ్స్‌టెక్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వేడుకకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు సమాచారం.
వీరితో పాటు ప్రముఖ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌లకు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ జూన్ 6న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. అదేరోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారనీ, ఆయన ఇతర ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. జూన్ 10న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ప్రొటెం స్పీకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రొటెం స్పీకర్ కోసం బీజేపీ నేతలు సంతోష్‌కుమార్ గంగ్వార్, మేనకాగాంధీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ సాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment