International Leaders
-
మోదీ ప్రమాణానికి ‘బిమ్స్టెక్’ నేతలు
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మోదీ ప్రమాణస్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిమ్స్టెక్లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వేడుకకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు ప్రముఖ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్‌లకు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ జూన్ 6న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. అదేరోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారనీ, ఆయన ఇతర ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. జూన్ 10న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ప్రొటెం స్పీకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రొటెం స్పీకర్ కోసం బీజేపీ నేతలు సంతోష్‌కుమార్ గంగ్వార్, మేనకాగాంధీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ సాగనున్నాయి. -
విదేశీ నేతలకు ఆహ్వానంపై క్లారిటీ ఇచ్చిన ఇమ్రాన్!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధిపతి, లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్(65) పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పలు కథనాలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ఆగస్టు 11న జరగనున్న ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహతులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. అటు వేడుకలకు హాజరు కాబోయే అంతర్జాతీయ నాయకులు, ఉన్నతాధికారుల గురించి మీడియా ఊహాగానాలు సరైనవి కావు అని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ వెల్లడించారు. ఇవాన్-ఇ-సదర్ లేదా ప్రెసిడెంట్ హౌస్‌లో సాధారణంగా ఈ ప్రమాణ స్వీకరణ వేడుకను నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్టు చెప్పారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డాయి. తాజా వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది. అలాగే బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్, భారత మాజీ క్రికెటర్లు సునీల్గవాస్కర్, కపిల్‌దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూలకు ఆహ్వానం అందినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై సిద్ధూ సానుకూలంగా స్పందించగా ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాను హాజరుకానున్నానని వచ్చిన వార్తలను ఆమీర్ ఖాన్ కొట్టిపాశారు. ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే. -
సార్క్ దేశాధినేతలతో మోడీ చర్చలు
అఫ్ఘాన్ అధ్యక్షుడితో తొలి భేటీ ఆ దేశ పునర్నిర్మాణం, ఉగ్రవాదంపై చర్చ న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ద్వైపాక్షిక చర్చలను అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో జరిపారు. తన ప్రమాణస్వీకారానికి హాజరైన అంతర్జాతీయ నేతలతో చర్చల్లో భాగంగా ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో కర్జాయ్‌తో మోడీ అరగంట పాటు భేటీ అయ్యారు. అఫ్ఘాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడంపైనే ప్రధానంగా చర్చించారు. అలాగే హెరాత్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అంశం కూడా చర్చకు వచ్చింది. అది నిషేధిత లష్కరే తోయిబా సంస్థ పనేనని కర్జాయ్ వెల్లడించినట్లు సమాచారం. అయితే దాడిని ఎదుర్కొనడంలో అఫ్ఘాన్ దళాలు సహకరించినందుకు కర్జాయ్‌కి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణం, అభివృద్ధికి భారత్ పాటుపడుతుందని మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూం, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరిన్ శర్మిన్తోనూ మోడీ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పలు రంగాల్లో సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.‘ప్రతి సమావేశంలోనూ సార్క్ స్వరూపం, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపైనే మోడీ మాట్లాడారు. సార్క్‌లోని ప్రతి సభ్య దేశానికీ తనదైన ప్రత్యేక బలాలు, అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలని మోడీ సూచించారు’ అని సుజాతా సింగ్ పేర్కొన్నారు. ఇందుకు సార్క్ దేశాధినేతల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి హాజరైనందుకు విదేశీ అతిథులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.