ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధిపతి, లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్(65) పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పలు కథనాలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ఆగస్టు 11న జరగనున్న ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహతులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. అటు వేడుకలకు హాజరు కాబోయే అంతర్జాతీయ నాయకులు, ఉన్నతాధికారుల గురించి మీడియా ఊహాగానాలు సరైనవి కావు అని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ వెల్లడించారు. ఇవాన్-ఇ-సదర్ లేదా ప్రెసిడెంట్ హౌస్‌లో సాధారణంగా ఈ ప్రమాణ స్వీకరణ వేడుకను నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్టు చెప్పారు.
సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డాయి. తాజా వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది. అలాగే బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్, భారత మాజీ క్రికెటర్లు సునీల్‌గవాస్కర్, కపిల్‌దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూలకు ఆహ్వానం అందినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై సిద్ధూ సానుకూలంగా స్పందించగా ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాను హాజరుకానున్నానని వచ్చిన వార్తలను ఆమీర్ ఖాన్ కొట్టిపాశారు. ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment