సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ను జూన్ రెండోవారంలో నిర్వహించే అవకాశముంది. రంజాన్ పండుగ ముగిశాక 12వ తేదీలోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పూర్తిచేయవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించిన నేపథ్యంలో అప్పటిలోగా కౌంటింగ్ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ)యోచిస్తున్నట్టు తెలిసింది. బ్యాలెట్ బాక్సులను ఎక్కువగా పాఠశాలలు, విద్యాసంస్థలలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరచడంతోపాటు ఆయా చోట్ల కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మే 27న కౌంటింగ్ నిర్వహణకు ఎస్‌ఈసీ ఇదివరకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, పరిషత్ ఫలితాలు వెల్లడయ్యాక, జెడ్పీపీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికను 40 రోజుల తర్వాత నిర్వహిస్తే సభ్యులను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే అవకాశం ఉందని ఎస్‌ఈసీకి వివిధ రాజకీయపక్షాలు ఫిర్యాదు చేశాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు వాయిదా వేయడం లేదా కౌంటింగ్ కాగానే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని కోరాయి.
రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు...
రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు సోమవారం నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. ఫలితాలు వెలువడ్డాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని, ఆ తర్వాత ప్రమాణస్వీకారం చేసేలా ప్రస్తుతమున్న పీఆర్ చట్ట నిబంధనలు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూలై మొదటివారంలో ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తవారు ప్రమాణస్వీకారం చేపట్టేలా చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫలితాలు ప్రకటించాక, పరోక్షపద్ధతుల్లో చైర్‌పర్సన్లు, అధ్యక్షుల ఎన్నికకు ఇంత వ్యవధి ఉండాలన్న నిబంధనను సవరిస్తే సరిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటున్న తరహాలోనే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికను కూడా పూర్తిచేస్తే సమస్యలుండవని పేర్కొంటున్నారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి స్పందన రాగానే జూన్ 12వ తేదీలోగా కౌంటింగ్ ముగించి జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాత సభ్యుల పదవీకాలం ముగియకముందే కొత్త సభ్యుల ఎన్నిక పూర్తిచేసి, ఆ తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా కొత్త పీఆర్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా...
ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వ తేదీ వరకు ఉంది. పరిషత్ ఓట్ల లెక్కింపు తర్వాత జూలై 4వ తేదీన కొత్త జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
కొనసాగనున్న కోడ్...
ఓటింగ్ ముగిసినా కౌంటింగ్, ఫలితాల ప్రకటన, చైర్‌పర్సన్లు, అధ్యక్షుల ఎన్నిక వంటి ప్రక్రియ పూర్తికానందున స్థానిక ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఎస్‌ఈసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేయవద్దని చెబుతున్నారు. జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక పూర్తయ్యాకే కోడ్ ముగుస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment