ప్రధానిగా ప్రమాణం చేశాక అధికార పత్రంపై సంతకం చేస్తున్న మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్‌లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది.
రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్‌సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్‌జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి.
తెలంగాణకు ప్రాతినిధ్యం
సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్‌లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి కేబినెట్‌లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు.
కేబినెట్‌లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్‌లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు.
గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు
గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు.
ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్‌జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.
కేబినెట్‌లో చేరని జేడీ(యూ)
బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్‌లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు.
ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు.
మోదీ సర్కార్ 2.0 ఇదే
గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా
Comments
Please login to add a commentAdd a comment