మోదీ రెండోసారి.. | PM Narendra Modi Swearing-in Ceremony | Sakshi
Sakshi News home page

మోదీ రెండోసారి..

Published Thu, May 30 2019 3:48 AM | Last Updated on Thu, May 30 2019 4:20 AM

PM Narendra Modi Swearing-in Ceremony - Sakshi

న్యూఢిల్లీ: దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్‌ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథుల మధ్య కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఆయనతో పాటు 50–60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. రాష్ట్రపతి భవన్‌ ఎదుటి ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్‌ వీరితో ప్రమాణంచేయిస్తారు. బిమ్స్‌టెక్‌ దేశాధినేతలు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పలువురు స్వపక్ష, విపక్ష నేతలు, సీఎంలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరుకానున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుందని రాష్ట్రపతి భవన్‌ అధికార ప్రతినిధి అశోక్‌ మాలిక్‌ చెప్పారు.

తరలిరానున్న బిమ్స్‌టెక్‌ దేశాల అధినేతలు
బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యు విన్‌ మియంట్, భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌ వంటి బిమ్స్‌టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌) నేతలు తమ హాజరును ఇప్పటికే ధ్రువీకరించారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్‌రాక్‌ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్‌ అధ్యక్షుడు, షాంఘై  కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ ప్రస్తుత చైర్మన్‌ సూరోన్‌బే జీన్‌బెకోవ్, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్నాథ్‌ కూడా తాము హాజరుకానున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మోదీ ఆహ్వానాన్ని వారు అంగీకరించినట్లు తెలిపాయి. వీరితో పాటు విపక్షాలకు చెందిన అనేకమంది నేతలు కూడా హాజరుకానున్నారు. కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద కేజ్రీవాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు  పాల్గొనున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, షారుక్‌ ఖాన్, కంగన రనౌత్, ద్రవిడ్, సైనా నెహ్వాల్, అనిల్‌ కుంబ్లే, పుల్లెల గోపీచంద్,  ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, బిల్‌గేట్స్‌ తదితరులకు ఆహ్వానం అందింది.  

8 వేల మంది ఇదే మొదటిసారి
2014లో కూడా మోదీ రాష్ట్రపతి భవన్‌ ఎదుటి ఆవరణలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సార్క్‌ దేశాల అధినేతలతో పాటు 3,500 మందికి పైగా అతిథులు అప్పుడు హాజరయ్యారు. సాధారణంగా విదేశీ అతిథులు, ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు వారి సత్కార కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అయితే 1990లో చంద్రశేఖర్, 1999లో వాజ్‌పేయిలు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 8 వేల మంది అతిథులు హాజరుకావడం మాత్రం ఇదే మొదటిసారి.

విదేశీ అతిథుల కోసం ‘దాల్‌ రైసీనా’
మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్య అథిథులు అందరికీ ‘పన్నీర్‌ టిక్కా’ వంటి ఉపాహారం అందజేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు విదేశీ అతిథుల కోసం రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బిమ్స్‌టెక్‌ దేశాల అధినేతలు తదితర 40 మంది అతిథులు విందులో పాల్గొంటారు. ఇతర ముఖ్య వంటకాలతో పాటు రాష్ట్రపతి భవన్‌ వంటశాలలో ప్రత్యేక వంటకమైన ‘దాల్‌ రైసీనా’ను అతిథులకు వడ్డించనున్నారు. దీని తయారీకి సుమారు 48 గంటల సమయం పడుతుందని, అందువల్ల మంగళవారమే ఇది ప్రారంభమైనట్లు రాష్ట్రపతి భవన్‌ ప్రతినిధి తెలిపారు. కాగా, మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిపి దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఓ అధికారి చెప్పారు.

నేను కేబినెట్‌లో చేరలేను
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని తాను కోరుకోవడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అవసరమైతే సలహాలు ఇస్తానని తెలిపారు. మోదీకి రాసిన లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఐదేళ్ల పాటు మోదీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో నేర్చుకున్నా. గత 18 నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టలేను.

ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని జైట్లీ తన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిగానే మోదీకి జైట్లీ తన మనసులోని మాటను మౌఖికంగా వెల్లడించారు. 66 ఏళ్ల జైట్లీ బయటకు వెల్లడించని వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స కోసం గత వారం ఎయిమ్స్‌లో చేరారు. జనవరిలో అమెరికాలో సర్జరీ చేయించుకున్న జైట్లీ, గత నెలలో అధికార పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లినప్పుడు చికిత్స పొందారు. అంతకుముందు పలు సర్జరీలు జరిగాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ  47 ఏళ్ల వయస్సులో పార్లమెంటులో అడుగుపెట్టారు.  

జైట్లీ నివాసానికి మోదీ
మంత్రివర్గంలో చేరలేనని లేఖ ద్వారా జైట్లీ తెలిపిన వెంటనే వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీలోని జైట్లీ అధికార నివాసానికి వెళ్లారు. వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జైట్లీ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లేఖ అందినట్టుగా తెలియజేసిన మోదీ.. ఆర్థిక వ్యవస్థకు, జీఎస్టీ అమలుకు జైట్లీ చేసిన కృషిని అభినందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జైట్లీ విజ్ఞప్తిని మోదీ అంగీకరించారా? లేదా? అన్నది తెలియలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement