new Prime Minister of India
-
అజ్ఞాతం నుంచి అత్యున్నత పీఠం దాకా
దామోదర్‌దాస్ మూల్‌చంద్‌దాస్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్నగర్లో నరేంద్ర మోదీ జన్మించారు. బాల్యంలో తండ్రితో కలిసి టీ అమ్మిన మోదీ, ఆ తర్వాత సోదరుడితో కలిసి సొంతంగా టీ షాపును పెట్టారు. 8 ఏళ్ల ప్రాయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) పట్ల మోదీ ఆకర్షితులయ్యారు. 1968లో ఇంట్లోవాళ్లు మోదీకి జశోదాబెన్‌తో వివాహం జరిపించగా, ఇది ఇష్టంలేని మోదీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. తిరిగి 1971లో గుజరాత్‌కు చేరుకున్న మోదీ, ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చేరారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోదీ, మారువేషంలో సంఘ్ కార్యకలాపాలను కొనసాగించారు. సీనియర్ల గుస్సా.. మోదీ క్రమశిక్షణను, వాక్చాతుర్యాన్ని గుర్తించిన ఆరెస్సెస్ నేతలు 1985లో గుజరాత్ బీజేపీ విభాగం నిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో విస్తృతంగా పర్యటించిన మోదీ పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేశారు. అడ్వాణీ ప్రారంభించిన ‘రథయాత్ర’, బీజేపీ నేత మురళీమనోహర్ జోషీ ప్రారంభించిన ‘ఏక్తాయాత్ర’ బాధ్యతలను మోదీ దగ్గరుండి చూసుకున్నారు. పార్టీలో మోదీ ఎదుగుదలపై ఆందోళన చెందిన సీనియర్లు కేశూభాయ్‌పటేల్, శంకర్‌సింఘ్‌వాఘేలా, కాన్షీరామ్ రాణా, మోదీ గుజరాత్లో ఉండేందుకు వీల్లేదని తీర్మానించారు. దీంతో బీజేపీ అధిష్టానం మోదీని జాతీయ కార్యదర్శిగా నియమించగా, దేశంలోని పార్టీ శ్రేణులతో ఆయన సత్సంబంధాలు పెంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు.. సవాళ్లు గుజరాత్ సీఎం కేశూభాయ్‌పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అవినీతి ఆరోపణలతో కేశూభాయ్‌ను తప్పించి మోదీని బీజేపీ గుజరాత్ సీఎంను చేసింది. 2001, అక్టోబర్7న మోదీ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్‌కోట్–2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశ్విన్‌పై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2002, ఫిబ్రవరి 27న గోద్రాలో రైలుదహనం అనంతరం చెలరేగిన మతఘర్షణలను అణచివేయడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఘర్షణల అనంతరం మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, 182 సీట్లకు గానూ 127 చోట్ల విజయదుందుభి మోగించింది. అప్పటి నుంచి గుజరాత్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన మోదీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. 2001 నుంచి 2014 వరకూ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014లో మోదీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 282 సీట్లతో అధికారంలోకి వచ్చింది. -
...అను నేను!
‘మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఈశ్వర్‌కీ శపథ్ లేతా హూ కీ మై విధిద్వారా స్థాపిత్ భారత్‌కే సంవిధాన్ ప్రతి సచ్చీ శ్రద్ధా, ఔర్ నిష్టా రఖూంగా...’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులూ ప్రమాణం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా.. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ...’ అని ప్రమాణం చేశారు. దేశంలోని రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించే నేతలు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం ఈ తరహాలో ప్రమాణంచేయాలి. ఈ ప్రమాణస్వీకార సమయంలోనే అధికారిక రహస్యాలకు సంబంధించి మరో ప్రమాణం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ఆర్టికల్ 75(4) ప్రకారం ఈ రెండు ప్రమాణస్వీకారాలు చేశాకే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బాధ్యతలు చేపట్టాలి. కేంద్ర మంత్రి ప్రమాణం.. ‘...అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. అదే సమయంలో అధికారిక రహస్యాలకు సంబంధించి, ‘...అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని మరో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కుర్తా–పైజామాదే అధిపత్యం రాష్ట్రపతిభవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా హిందీ ఆధిపత్యం నడిచింది. ప్రధాని మోదీ సహా మెజారిటీ మంత్రులు హిందీలో ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక ఈ వేడుకకు హాజరైన ఎంపీల్లో చాలామంది సంప్రదాయ కుర్తా–పైజామాను ధరించి వచ్చారు. కొంతమంది మాత్రం షర్టులు–ఫ్యాంట్లు వేసుకొచ్చారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాగానే సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. -
మోదీ కేబినెట్ @ 58
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు. కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు. గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. కేబినెట్లో చేరని జేడీ(యూ) బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు. మోదీ సర్కార్ 2.0 ఇదే గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా -
నూతన ప్రధాని కోసం 7 రేస్ కోర్స్ రోడ్ సిద్ధం
న్యూఢిల్లీ: భారత నూతన ప్రధానమంత్రిని స్వాగతించేందుకు ఆయన అధికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ సర్వ సిద్ధంగా ఉంది. భవనాలకు కొత్తగా రంగులు వేశారు. పూల కుండీలకు కూడా తాజాగా రంగులు వేయడంతో పాటు పచ్చికను పొట్టిగా కత్తిరించి లాన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆవరణలోని రకరకాల పుష్పాలు మోడీ మనసు దోచుకునేందుకు ఎదురుతెన్నులు చూస్తున్నారుు. సోమవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గానీ ఆ మరుసటి రోజుగానీ ఆయన తన అధికార నివాసానికి మారే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. మొత్తం 12 ఎకరాల విశాలమైన ఆవరణలో ఐదు బంగళాలు ఉండగా.. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మారాలని మోడీ భావించినట్టైతే.. అతిథిగృహంగా వినియోగించే బంగళా నంబర్.3లో మోడీ నివసించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు గెస్ట్‌హౌస్ సిద్ధంగా ఉందని అధికారి ఒకరు చెప్పారు. ప్రమాణ స్వీకారం జరిగే రాష్ట్రపతి భవన్‌కు రేస్‌కోర్స్ రోడ్ సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటివరకు భవనాల బయటి ప్రాంతంలో పునరుద్ధరణ పనులు జరిగాయని, లోపలి భాగాలను మోడీ వచ్చిన తర్వాత అభీష్టానికి, సూచనలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని అధికారవర్గాలు వివరించా రుు. ఈ ఆవరణ మొత్తాన్ని ఎస్పీజీ కమాండోలు పహారా కాస్తుంటారు. చుట్టుపక్కల పరిసరాల భద్రతా ఏర్పాట్లను పోలీసులు చూసుకుంటారు.