నూతన ప్రధాని కోసం 7 రేస్ కోర్స్ రోడ్ సిద్ధం
న్యూఢిల్లీ: భారత నూతన ప్రధానమంత్రిని స్వాగతించేందుకు ఆయన అధికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ సర్వ సిద్ధంగా ఉంది. భవనాలకు కొత్తగా రంగులు వేశారు. పూల కుండీలకు కూడా తాజాగా రంగులు వేయడంతో పాటు పచ్చికను పొట్టిగా కత్తిరించి లాన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆవరణలోని రకరకాల పుష్పాలు మోడీ మనసు దోచుకునేందుకు ఎదురుతెన్నులు చూస్తున్నారుు. సోమవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గానీ ఆ మరుసటి రోజుగానీ ఆయన తన అధికార నివాసానికి మారే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. మొత్తం 12 ఎకరాల విశాలమైన ఆవరణలో ఐదు బంగళాలు ఉండగా.. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మారాలని మోడీ భావించినట్టైతే..
అతిథిగృహంగా వినియోగించే బంగళా నంబర్.3లో మోడీ నివసించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు గెస్ట్‌హౌస్ సిద్ధంగా ఉందని అధికారి ఒకరు చెప్పారు. ప్రమాణ స్వీకారం జరిగే రాష్ట్రపతి భవన్‌కు రేస్‌కోర్స్ రోడ్ సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటివరకు భవనాల బయటి ప్రాంతంలో పునరుద్ధరణ పనులు జరిగాయని, లోపలి భాగాలను మోడీ వచ్చిన తర్వాత అభీష్టానికి, సూచనలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని అధికారవర్గాలు వివరించా రుు. ఈ ఆవరణ మొత్తాన్ని ఎస్పీజీ కమాండోలు పహారా కాస్తుంటారు. చుట్టుపక్కల పరిసరాల భద్రతా ఏర్పాట్లను పోలీసులు చూసుకుంటారు.