అమిత్ షా, జైశంకర్
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెప్పినట్లు ఇండియా టుడే గురువారం వెల్లడించింది. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోసారి మంత్రిపదవి చేపట్టే ఓపిక తనకు లేదని ఆయన ఇప్పటికే మోదీకి స్పష్టం చేశారు. మోదీ, రాజ్‌నాథ్ తర్వాత మూడో స్థానంలో అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
దీంతో మోదీ తర్వాత మంత్రివర్గంలో రెండో కీలక వ్యక్తి రాజ్‌నాథేననీ, ఆయన గతంలో చేపట్టిన హోం మంత్రి పదవిలో ఇప్పుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. జైట్లీ అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్ పనిచేశారు. దీంతో ఆర్థిక మంత్రి పదవి గోయల్‌కు దక్కవచ్చని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకు ఆర్థిక మంత్రిగా పనిచేసి, వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరం. అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్‌షా ఇప్పుడు కేబినెట్‌లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను ఆయన పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని అంటున్నారు.
గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ కూడా ఆరోగ్య సమస్యల కారణంగానే ఈసారి పదవి చేపట్టబోవడం లేదు. దీంతో విదేశాంగ శాఖకు కూడా కొత్త మంత్రి రానున్నారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ 2018లో ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అమెరికా, చైనాలకు భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో సుష్మ స్థానాన్ని జైశంకర్‌కు ఇవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. అలాగే పియూష్ గోయల్‌కు రైల్వే శాఖను అలాగే ఉంచి, గడ్కరీకి మౌలిక సదుపాయాలు, గజేంద్ర సింగ్ షెకావత్‌కు వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రొటెం స్పీకర్‌గా మేనకా గాంధీ!
17వ లోక్‌సభ ఎన్నికల్లో తాత్కాలిక స్పీకర్‌గా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మేనకాగాంధీ తాజా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి గెలుపోందారు. గత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా ఆమె ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి మాత్రమే స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అధికారం ప్రొటెం స్పీకర్‌కు ఉంటుంది. అలాగే లోక్‌సభకు స్పీకర్, ఉపస్పీకర్‌ను ఎన్నుకునే సమయంలోనూ ప్రొటెం స్పీకరే సభను నడిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment