‘పీపీపీ’ ఇంకా బలపడాలి | Govt needs to share project risk with private sector | Sakshi
Sakshi News home page

‘పీపీపీ’ ఇంకా బలపడాలి

Published Fri, May 31 2019 5:43 AM | Last Updated on Fri, May 31 2019 5:43 AM

Govt needs to share project risk with private sector - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తిరిగి భారీ మెజారిటీని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి  నీతి ఆయోగ్‌ ఎజెండా నిర్దేశించింది. ఆయా అంశాలపై రాజీవ్‌ కుమార్‌ మీడియాతో పంచుకున్న అంశాలను క్లుప్తంగా చూస్తే...

పెట్టుబడిదారు విశ్వాసం పెరగాలి
వృద్ధి వేగం పుంజుకోవాలి. ముఖ్యంగా వచ్చే మూడు దశాబ్దాల కాలంలో వృద్ధి రేటు రెండంకెల్లో స్థిరపడాలి. ఇందుకు సంబంధించి గడచిన ఐదేళ్ల కాలంలో పటిష్ట పునాదులే పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, పాలనా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ సేవల విస్తృతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్న తీవ్ర ఆందోళన ఇప్పుడు లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దు, ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ వంటి అంశాలు వ్యవస్థలో సానుకూల మార్పులకే దోహదపడ్డాయి. ఇదే ఒరవడి కొనసాగాలి.  ఇది జరగాలంటే పలు అంశాల పట్ల ప్రైవేటు పెట్టుబడిదారు విశ్వాసం మరింత మెరుగుపడాలి. వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇన్వెస్టర్‌లో ఏర్పడాలి. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

వృద్ధి బాగుంది... స్పీడ్‌ పెరగాలి...
గడచిన ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడింది. స్థిరత్వాన్ని సాధించింది. వరుసగా ఐదు సంవత్సరాలు సగటున 7% వృద్ధి రేటును సాధించిన కాలాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. అదే సమయంలో ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో కేవలం 3 శాతంగా కొనసాగింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం పట్ల నికర వ్యత్యాసం కరెంట్‌ అకౌంట్‌ లోటు పూర్తి నియంత్రణలో ఉంది. ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి ప్రతి అంశమూ అదుపులోనే ఉంది. దేశం వృద్ధి స్పీడ్‌ మున్ముందు మరింత పెరగడానికి ఈ అంశాలు అన్నీ దోహదపడతాయి.  

ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యత
ఇకపై ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి. ప్రతి ఒక్కదానినీ ప్రభుత్వం ఒక్కటే చేయలేదన్న విషయం ఇక్కడ గుర్తెరగాలి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పటిష్ట పునరుద్ధరణ జరగాలి. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాలి. ఉదాహరణకు భూ సేకరణ విషయంలో ప్రైవేటు రంగానికి కొంత ఇబ్బందులు ఎదురవవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఈక్విటీ హోల్డర్‌గా ఈ వెంచర్‌లో ఉంటే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో మనం చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలో కూడా విశ్వసనీయత ప్రాతిపదికన ప్రభుత్వ–ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి.  

ఎగుమతులు పెరగాలి
ఎగుమతుల విషయంలోనూ గణనీయమైన మార్పులు రావాలి. ఎగుమతుల ఆధారిత విదేశీ పెట్టుబడులు అవసరం. ఎగుమతుల పెరుగుదలకు ఈ తరహా చర్యలు దోహదపడతాయి. వృద్ధికి దోహదపడతాయి.

పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట
పరోక్ష పన్నుల విషయానికి వస్తే, జీఎస్‌టీ వసూళ్లు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బాగున్నాయి. భవిష్యత్తులోనూ మరింత పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లూ బాగున్నాయి.మౌలికరంగం అభివృద్ధి, పెట్టుబడులు, ద్రవ్యలోటు కట్టడి వంటి విషయాల్లో మరిన్ని నిధులు కేంద్రానికి అవసరం. పెట్టుబడుల ఉపసంహరణ ఇందులో కీలకమైనది. 40 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్‌ ప్రతిపాదనలు చేసింది. దీనికి క్యాబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ దిశలో తదుపరి చర్యలు అవసరం. ఎయిర్‌ ఇండియా వంటి రంగాల్లో మెజారిటీ వాటాల అమ్మకాన్నీ ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. త్వరలో విధానపరమైన చర్యలు ఉంటాయి.

వ్యవసాయంలో సాంకేతికత
ఇక వ్యవసాయ రంగం విషయంలో తీవ్ర ప్రతికూలత ఉందని భావించకూడదు. అదే నిజమైతే ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఇక తృణ ధాన్యాలు, వరి, గోధుమలకు సంబంధించి వినియోగంకన్నా ఉత్పత్తి అధికమైంది. అందువల్ల మనకు మిగులు ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉన్నందువల్ల ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో వికేంద్రీకరణ జరగాలి. వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయం పెరగాలి. ఆగ్రో పాసెసింగ్‌ ఇందులో ఒకటి. ఆగ్రో ప్రాసెసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడులు మరింత పెరగాలి. మన ఆహార ఉత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్‌ జరుగుతోంది. ఇక వ్యవసాయ రంగంలో సాంకేతికత మరింత పెరగాలి. ఆయా అంశాల ద్వారా వ్యవసాయ రంగంలో వ్యయాలు తగ్గుదల, ఎగుమతులు పెంపు, రైతు ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement