సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అద్భుత విజయం వైపు నడిపించిన అమిత్ షాను కేబినెట్‌లోకి తీసుకోవడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వంలో షా కీలక భూమిక పోషించనున్నారన్న సందేశాన్ని మోదీ తన మంత్రులకు పరోక్షంగా సంకేతాలు పంపినట్లేనని భావిస్తున్నారు. అయినప్పటికీ, మోదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రధాని తర్వాత ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉంటారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా అమిత్ షా మోదీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయం(2001–14)లో ఆయన కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయ వంటి పలు కీలక శాఖలను నిర్వర్తించారు. 2014 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ప్రధాని మోదీ తర్వాత పార్టీలో రెండో శక్తివంతమైన నేతగా కొనసాగారు. తాజా ఎన్నికల్లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ సొంత నియోజకవర్గం గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి అమిత్ షా 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment