Public-Private Partnership
-
‘హౌసింగ్ బోర్డు’ రిజిస్ట్రేషన్లకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) స్థలాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన జాయింట్ వెంచర్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందింది. వారు కొన్న ఇళ్లు, వాణిజ్య స్థలాల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమమైంది. జూలై ఒకటి నుంచి రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనితో దాదాపు 15 ఏళ్ల పాటు కొనసాగిన వివాదానికి తెరపడింది. విలువైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినా.. రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆగిపోవటంతో కొనుగోలుదారుల్లో నెలకొన్న ఆందోళన సమసిపోయింది. ఏమిటీ వివాదం? హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి వంటి విలువైన ప్రాంతాల్లో గృహనిర్మాణ మండలికి ఖాళీ స్థలాలున్నాయి. వాటిలో ప్రైవేటు సంస్థలతో కలిసి పీపీపీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలు, నివాస గృహ సముదాయాలను అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. 2007లో అప్పటి ప్రభుత్వం 19 ప్రాజెక్టుల కోసం ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయించింది. ఆయా సంస్థలు వివిధ దఫాల్లో కొంతమొత్తం సొమ్ము చెల్లించాయి. అయితే సదరు స్థలాల్లో కొన్ని సంస్థలు పనులు ప్రారంభించినా, మిగతావి జాప్యం చేశారు. సుమారు 12 ప్రాజెక్టుల్లో ఆశించినమేర ప్రాజెక్టులు ముందుకు పడలేదు. ఇలా దశాబ్దానికిపైగా గడిచింది. వాటిని చేపట్టిన సంస్థలు కమర్షియల్ స్పేస్ నిబంధనలు మార్చాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ వంటి ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలోనే ఆయా స్థలాల్లో చేపట్టిన నిర్మాణాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వం 2016లో కేబినెట్ సబ్‌కమిటీని నియమించింది. ఆ కమిటీ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు స్థలాలను పరిశీలించి, సంస్థల ప్రతినిధులతో చర్చించి 2018లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా నిర్ణయం వెలువడలేదు. ఈలోగా అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తయి, నిర్మాణాలు అమ్ముడయ్యాయి. కానీ నిషేధం ఉండ టంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. తాజాగా రిజిస్ట్రేష న్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహనిర్మాణశాఖ ఇచ్చిన భూములకు సదరు సంస్థల నుంచి ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు అందనున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా కూడా సర్కారుకు ఆదాయం రానుంది. -
కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్టైల్ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టెక్స్టైల్ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్ ఫండ్ సైతం అందజేయనుంది. టెక్స్టైల్ పార్కులో వర్కర్స్ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు. నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది. -
అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలియజేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకున్న ఆరు విమానాశ్రయాలు ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ తొలుత ఆమోదం తెలిపిన లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, అభివృద్ధి కి సంబంధించి రాయితీ ఒప్పందాన్ని ఈ ఏడాది ఫి బ్రవరి 14న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకుంది. వాస్తవానికి వీటిని ఆగస్ట్ 12 నాటికే అదానీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 12 వరకు గడువును ఏఏఐ పొడిగించింది. తాజాగా లీజునకు ఆమోదం తెలియజేసిన వాటిల్లో గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా, కోర్టు నుంచి ఎటువంటి స్టే ఆదేశాలు లేనందున, వీటి లీజు విషయంలో ముందుకు వెళ్లొచ్చని కేంద్రం భావించింది. ‘‘ఈ విమానాశ్రయాలను పీపీపీ కిందకు బదిలీ చేయ డం అంటే సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు వీలు కల్పించడం. ఏఏఐ ఆదా యం పెరగడమే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరిన్ని విమానాశ్రయాల అభివద్ధిపై ఏఏఐ దృష్టిసారించేందుకు అవకాశం లభిస్తుంది’’ అంటూ పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. ‘‘జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను శాశ్వతం గా ప్రైవేటు ఆపరేటర్‌కు ఇవ్వడం లేదు. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలి. ఈ లీజు వల్ల ఏఏఐకి ప్రారంభంలోనే రూ.1,070 కోట్లు లభిస్తాయి. ప్రయాణికులకు మంచి సేవలు లభిస్తాయి‘‘అని ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. -
‘పీపీపీ’ ఇంకా బలపడాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి భారీ మెజారిటీని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఎజెండా నిర్దేశించింది. ఆయా అంశాలపై రాజీవ్ కుమార్ మీడియాతో పంచుకున్న అంశాలను క్లుప్తంగా చూస్తే... పెట్టుబడిదారు విశ్వాసం పెరగాలి వృద్ధి వేగం పుంజుకోవాలి. ముఖ్యంగా వచ్చే మూడు దశాబ్దాల కాలంలో వృద్ధి రేటు రెండంకెల్లో స్థిరపడాలి. ఇందుకు సంబంధించి గడచిన ఐదేళ్ల కాలంలో పటిష్ట పునాదులే పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, పాలనా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ సేవల విస్తృతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్న తీవ్ర ఆందోళన ఇప్పుడు లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ వంటి అంశాలు వ్యవస్థలో సానుకూల మార్పులకే దోహదపడ్డాయి. ఇదే ఒరవడి కొనసాగాలి. ఇది జరగాలంటే పలు అంశాల పట్ల ప్రైవేటు పెట్టుబడిదారు విశ్వాసం మరింత మెరుగుపడాలి. వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇన్వెస్టర్లో ఏర్పడాలి. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వృద్ధి బాగుంది... స్పీడ్ పెరగాలి... గడచిన ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడింది. స్థిరత్వాన్ని సాధించింది. వరుసగా ఐదు సంవత్సరాలు సగటున 7% వృద్ధి రేటును సాధించిన కాలాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. అదే సమయంలో ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో కేవలం 3 శాతంగా కొనసాగింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం పట్ల నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు పూర్తి నియంత్రణలో ఉంది. ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి ప్రతి అంశమూ అదుపులోనే ఉంది. దేశం వృద్ధి స్పీడ్ మున్ముందు మరింత పెరగడానికి ఈ అంశాలు అన్నీ దోహదపడతాయి. ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇకపై ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి. ప్రతి ఒక్కదానినీ ప్రభుత్వం ఒక్కటే చేయలేదన్న విషయం ఇక్కడ గుర్తెరగాలి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పటిష్ట పునరుద్ధరణ జరగాలి. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాలి. ఉదాహరణకు భూ సేకరణ విషయంలో ప్రైవేటు రంగానికి కొంత ఇబ్బందులు ఎదురవవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఈక్విటీ హోల్డర్‌గా ఈ వెంచర్లో ఉంటే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో మనం చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలో కూడా విశ్వసనీయత ప్రాతిపదికన ప్రభుత్వ–ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి. ఎగుమతులు పెరగాలి ఎగుమతుల విషయంలోనూ గణనీయమైన మార్పులు రావాలి. ఎగుమతుల ఆధారిత విదేశీ పెట్టుబడులు అవసరం. ఎగుమతుల పెరుగుదలకు ఈ తరహా చర్యలు దోహదపడతాయి. వృద్ధికి దోహదపడతాయి. పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట పరోక్ష పన్నుల విషయానికి వస్తే, జీఎస్టీ వసూళ్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో బాగున్నాయి. భవిష్యత్తులోనూ మరింత పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లూ బాగున్నాయి.మౌలికరంగం అభివృద్ధి, పెట్టుబడులు, ద్రవ్యలోటు కట్టడి వంటి విషయాల్లో మరిన్ని నిధులు కేంద్రానికి అవసరం. పెట్టుబడుల ఉపసంహరణ ఇందులో కీలకమైనది. 40 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ ప్రతిపాదనలు చేసింది. దీనికి క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ దిశలో తదుపరి చర్యలు అవసరం. ఎయిర్ ఇండియా వంటి రంగాల్లో మెజారిటీ వాటాల అమ్మకాన్నీ ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. త్వరలో విధానపరమైన చర్యలు ఉంటాయి. వ్యవసాయంలో సాంకేతికత ఇక వ్యవసాయ రంగం విషయంలో తీవ్ర ప్రతికూలత ఉందని భావించకూడదు. అదే నిజమైతే ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఇక తృణ ధాన్యాలు, వరి, గోధుమలకు సంబంధించి వినియోగంకన్నా ఉత్పత్తి అధికమైంది. అందువల్ల మనకు మిగులు ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉన్నందువల్ల ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో వికేంద్రీకరణ జరగాలి. వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయం పెరగాలి. ఆగ్రో పాసెసింగ్ ఇందులో ఒకటి. ఆగ్రో ప్రాసెసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడులు మరింత పెరగాలి. మన ఆహార ఉత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోంది. ఇక వ్యవసాయ రంగంలో సాంకేతికత మరింత పెరగాలి. ఆయా అంశాల ద్వారా వ్యవసాయ రంగంలో వ్యయాలు తగ్గుదల, ఎగుమతులు పెంపు, రైతు ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించవచ్చు. -
గానుగాడేనా?
రెక్కలు ముక్కలు చేసుకుని తీపిని పంచిన చెరకు రైతు బతుకు చేదెక్కుతోంది. పంట చేతికొచ్చే సమయం దగ్గర పడుతున్నా నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యం తేలక అగమ్యగోచరంగా మారింది. నేటివరకు ఫ్యాక్టరీ మరమ్మతులు ప్రారంభం కాక... పంట అగ్రిమెంటుకు నోచుకోక... బకాయిలు చేతికి రాక.. గానుగాడే సమయం ముంచుకొస్తుంటే.. చెరకు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. అసలే కరువు కాలం.. ఆపై కాస్తోకూస్తో పండిన పంటకు తగిన ప్రతిఫలం ప్రశ్నార్థకంగా మారింది. ఒకరో ఇద్దరో కాదు... రెండువేల మంది రైతుల వేదన ఇది. - ఎన్డీఎస్ఎల్ భవితవ్యం తేలేనా? - సమయం దగ్గర పడుతున్నా కదలిక కరువు - ఆందోళనలో చెరకు రైతులు - సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూపులు - రూ.6.64 కోట్ల బాకాయిలపై సందిగ్ధం మెదక్: మెదక్ మంబోజిపల్లి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ(ఎన్డీఎస్ఎల్) పరిధిలోని 12 మండలాల్లో 2,400 చెరకు రైతులున్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా ఫ్యాక్టరీ... ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. నిర్వహణ లోపంతో అంతంత మాత్రంగా నడుస్తున్న ఫ్యాక్టరీ... రైతులకు కోట్ల రూపాయల బకాయిలు పడింది. ఫలితంగా... మంజీరా తీరంలో చెరకు పంట గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఏ ఏడు గానుగకు కేవలం 90 వేల టన్నుల చెరకు పంట మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. నిర్వహణ కష్టంగా మారిన ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని కొంత కాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సహకార విధానంలో ఫ్యాక్టరీ నడిపితే సత్ఫలితాలొస్తాయన్న నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే... ప్రైవేటు యాజ మాన్యం నుంచి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయమై ఆస్తుల మదింపు ప్రక్రియ చేపట్టింది. ఈ బాధ్యతను ఎఫ్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్టు తెలిసింది. గానుగాడే సమయం... చెరకు పంట గానుగాడే సమయం దగ్గర పడుతున్నా ఇంత వరకు ఫ్యాక్టరీ భవితవ్యంపై తుది నిర్ణయం ఖరారు కాలేదు. సాధారణంగా పంట గానుగాడటానికి ఆరు నెలల ముందే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులతో పంట కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలి. కానీ మంభోజిపల్లి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న ప్రచారంతో ఫ్యాక్టరీ ప్రైవేట్ యాజమాన్యం ఎలాంటి కార్యకలాపాలూ చేయడం లేదు. పైగా ఫ్యాక్టరీలో గానుగాడాలంటే కనీసం మూడు నెలల ముందే మరమ్మతులు ప్రారంభించి యంత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మరో రెండు నెలల్లో చెరకు నరికే సమయం వస్తున్నా... ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గతేడాది చెరకు రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్లో సీఎం చొరవతో కొన్ని విడుదలైనప్పటికీ... ఇంకా రూ.6.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. అటు ఫ్యాక్టరీ సరిగ్గా నడవక... ఇటు బకాయిలూ రాకపోవడంతో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలకు చెరకు తరలిద్దామనుకున్నా... వారు అనుమతించే అవకాశాలు తక్కువేనంటున్నారు రైతులు. మంభోజిపల్లి ఫ్యాక్టరీలో ఒకప్పడు మూడు లక్షల టన్నుల చెరకు గానుగాడేవారు. ఈ ఏడు ఇది 90 వేల టన్నులకే పరిమితమైంది. కాగా ఇటీవల ఎన్డీఎస్ఎల్ పరిధిలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన చెరకు రైతులు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ మూతపడటానికి వీలు లేదని, ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆ స్కూళ్లూ ‘ప్రైవేటుకే’
పీపీపీ విధానంలో ఇంటర్నేషనల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపనికి ప్రైవేట్ సంస్థల్నే ఆశ్రయిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు బాధ్యతను వారికే కట్టబెట్టనుంది. పేరుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు నిర్ణయించినా, వాటిల్లో ప్రైవేట్ భాగస్వామ్యమే ఎక్కువగా ఉండనుంది. నర్సరీ నుంచి డిగ్రీ వరకూ ఉండే ఈ స్కూళ్లను తొలిదశలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ జిల్లా అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 15 ఎకరాల్లో, నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెంలో 16.45 ఎకరాల్లో స్కూళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పీపీపీ విధానంలో స్కూళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భారీ స్థాయిలో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ జిల్లాలో భూమిని 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వనున్నారు. ఎకరానికి తొలుత రూ. లక్ష లీజుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆరు సంవత్సరాలకోసారి పది శాతం చొప్పున లీజు పెంపు నిబంధన విధించింది. ఈ ఒప్పందంలో ప్రభుత్వ వాటా, ఆదాయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే స్కూలు ఫీజులన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్ణయిస్తాయనే నిబంధనను చూస్తే.. ప్రైవేటుకే అధిక లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు, పలు రకాలైన క్రీడా మైదానాలు ప్రైవేటు సంస్థలే ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన కూడా ఉంది. పర్యాటకంలోనూ ‘పీపీపీ’ ఇక పర్యాటక ప్రాజెక్టులను కూడా పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ. 6,000 కోట్ల వ్యయం తో పలు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వివిధ టూరిజం ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. అలాగే రూ. 781 కోట్లతో టెంపుల్ టూరిజం, రూ. 1,026 కోట్లతో బుద్ధిస్ట్ థీమ్ ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదం తెలిపేందుకే ఇటీవల ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌కేప్) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కార్పొరే ట్లకు జై కొట్టారు
న్యూఢిల్లీ: వృద్ధికి ‘మౌలిక రంగం లోపాలు’ అడ్డుకాకూడదని బడ్జెట్ స్పష్టంచేసింది. ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్టులకు సంబంధించి పలు చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్లో ప్రకటించారు. ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యాన్ని (పీపీపీ) మౌలిక ప్రాజెక్టుల అమలుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ‘ తయారీ, మౌలిక రంగాల అభివృద్ధి అవసరాలకు తగిన నిధులను సమీకరించుకోవాలి. 3పీ ఇండియాగా ‘పీపీపీ’ నిర్వహణకు వెసులుబాటు కల్పించేందుకు రూ.500 కోట్ల మూలధనంతో ఒక సంస్థ ఏర్పాటు కానుంది. వివిధ దశల్లో ఉన్న దాదాపు 900 ప్రాజెక్టులతో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. అభివృద్ధికి నమూనాగా ఉంటున్న ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల్లో పీపీపీ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక ప్రాజెక్టులకు రుణ సదుపాయాలను కల్పించడానికి పలు బ్యాంకుల భాగస్వామ్యంతో ఉన్న మునిసిపల్ రుణ సౌలభ్యతా సం బంధ మూలధనాన్ని ప్రస్తుత రూ.5,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచుతాం’ అని జైట్లీ చెప్పారు. రహదారులకు మహర్దశ... గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జైట్లీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గ్రామీణ మౌలిక రుణ నిధి (ఆర్ఐడీఎఫ్)కి రూ.25,000 కోట్లను సమీకరించాలని మధ్యంతర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నిధికి సంబంధించి అదనంగా మరో రూ.5,000 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం అని వెల్లడించారు. వేర్‌హౌసింగ్ ఇన్ఫ్రా ఫండ్‌కు రూ.5,000 కోట్ల నిధిని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్షింగ్ మద్దతును అందించడానికి నాబార్డ్‌లో దీర్ఘకాలిక గ్రామీణ రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధికి ప్రాధమికంగా రూ.5,000 కోట్లను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేస్తామని జైట్లీ చెప్పారు. రాష్ర్ట రహదారులు, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాల ప్రాజెక్టుల విషయమై రూ.37,880 పెట్టుబడుల ప్రణాళికలను బడ్జెట్ ప్రకటించింది. ఇండస్ట్రియల్ క్యారిడార్లతోపాటు నిర్దిష్ట ఎక్స్‌ప్రెస్ హైవేలను సైతం అభివృద్ధి చేసే ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఎన్హెచ్ఏఐ రూ.500 కోట్లను కేటాయిస్తుందని తెలిపారు. గుజరాత్ తరహాలో వ్యవసాయ, వ్యవసాయేతర వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా పథకానికి సైతం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. షిప్పింగ్ ఇన్ఫ్రాకు సంబంధించి ఈ యేడాది 16 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పౌర విమానయాన రంగం అభివృద్ధి, టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో పీపీపీతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యమని వెల్లడించారు. మైనింగ్ రంగంలో ఇబ్బందులను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రియల్ ఎస్టేట్‌కి ప్రోత్సాహం ముంబై: నిధుల కొరతతో అల్లాడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఊతమివ్వడంతో పాటు హౌసింగ్‌కి డిమాండ్ పెంచే దిశగా బడ్జెట్లో పలు చర్యలు ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రియల్టీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులకు (ఆర్ఈఐటీ) కార్పొరేట్ ఆదాయ పన్ను మినహాయింపునిచ్చారు. అలాగే, సామాన్యులకు అందుబాటు ధరల్లో గృహాలను సమకూర్చే దిశగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు (ఎన్‌హెచ్‌బీ) రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఎఫ్‌డీఐలకు సంబంధించి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కనీస ఏరియా పరిమితిని 50,000 చదరపు మీటర్ల నుంచి 20,000 చదరపు మీటర్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే, కనీస పెట్టుబడి పరిమాణాన్ని కూడా 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించారు. దీంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కనీసం 30 శాతాన్ని అఫోర్డబుల్ హౌసింగ్ (అందుబాటు ధరల్లో ఇళ్లు)కు కేటాయించే ప్రాజెక్టులకు కనీస బిల్టప్ ఏరియా, మూలధనం నిబంధనల విషయంలో సడలింపునివ్వనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. అటు వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7,060 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయాలతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మధ్య స్థాయి, చిన్న స్థాయి డెవలపర్లు ఎఫ్‌డీఐలను సమకూర్చుకునేందుకు వీలు కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్ఈఐటీలతో పరిశ్రమకు ఊతం.. మ్యూచువల్ ఫండ్స్ తరహాకి చెందిన ఆర్ఈఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్) సాధనాలకు ప్రోత్సాహకాలతో డెవలపర్లు నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు లభించినట్లవుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్నర్ నీరజ్ బన్సల్ తెలిపారు. వీటిని కంపెనీ షేర్లలాగానే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయొచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా లావాదేవీలు జరపవచ్చు. మరోవైపు, రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. తాజా ప్రోత్సాహకాలతో తొలి ఏడాదిలోనే రూ. 90,000 కోట్ల మేర నిధులు ఆర్ఈఐటీల్లోకి రాగలవని అంచనా. మరోవైపు, ఎన్‌హెచ్‌బీకి నిధుల కేటాయింపుతో కొనుగోలుదారులకు తక్కువ వడ్డీలపై రుణాలు లభించగలవని, తత్ఫలితంగా హౌసింగ్‌కి డిమాండ్ పెరగగలదని ఈవై ఇండియా పార్ట్నర్ గౌరవ్ కార్నిక్ అభిప్రాయపడ్డారు. రియల్టీలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు రాగలవని కార్నిక్ చెప్పారు. -
హార్ట్ ఆఫ్ ది సిటీ
=అందమైన మురికి కూపం! =జాడ లేని మల్టీ లెవల్ కాంప్లెక్స్ =ఫైళ్లలో మూలుగుతున్న కార్ పార్కింగ్ జోన్ = అడుగు ముందుకేయని టెండర్లు గ్రేటర్ సిటీకి గుండెకాయ లాంటి స్థలం. నగరం నడిబొడ్డున హన్మకొండ చౌరస్తాకు వెళ్లే మెయిన్ రోడ్డుపై, డీసీసీ భవన్‌ను ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉంటోంది. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ను తలపించే ఖరీదైన సెంటర్లో ఇదో మురికి కూపంగా నగరానికి వచ్చి వెళ్లే వారందరినీ వెక్కిరిస్తోంది. ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న ఈ స్థలాన్ని... ఉపయోగించుకునే ఆలోచన లేకపోవడం అధికారుల ప్రణాళికాలోపానికి అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: థియేటర్లు, హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు... ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కిక్కిరిసిన చోట ఉన్న వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్థిరాస్తి... పాత మునిసిపల్ కార్యాలయ ఖాళీ స్థలం వైపు కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. 2004లో అప్పటి పాలకవర్గం ఇక్కడ మల్టీ లెవల్ కమర్షియల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని తీర్మానించింది. రెండు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2005లో రాజీవ్ నగరబాటలో భాగంగా జిల్లాకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూ. 13 కోట్లతో ఇక్కడ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ లేకపోవడంతో కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. దీంతో ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిన పూర్తి చేయాలని టెండర్లను ఆహ్వానించింది. అప్పట్లో ఐదు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా.. చివరకు రెండు సంస్థలు నిర్మాణానికి ముందుకొచ్చాయి. కానీ... అప్పటి పాలకవర్గంలో పెద్దల ఆధిపత్య పోరుతో ఈ నిర్మాణం పెండింగ్‌లో పడింది. కమర్షియల్ కాంప్లెక్స్ టు కార్ పార్కింగ్ జోన్ గత ఏడాది ఈ ప్రాజెక్టుపై ఇటీవల బదిలీపై వెళ్లిన బల్దియూ కమిషనర్ వివేక్‌యాదవ్, ఎస్ఈ శ్రీధర్ దృష్టి సారించారు. ఐదంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. కార్పొరేషన్ వద్ద ప్రాజెక్టుకు సరిపడే నిధులు లేనందున పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఫైళ్లు కదిపారు. అండర్ గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో వాహనాల పార్కింగ్, మూడు, నాలుగో అంతస్తులో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. వరంగల్ గ్రేటర్ సిటీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయూల్సి ఉంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు ఐదో అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. హన్మకొండ చౌరస్తా సమీపంలో ఉండడంతో.. షాపింగ్ కాంప్లెక్స్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా నిట్ ప్రొఫెసర్లతో అధ్యయనం చేయించారు. చివరకు కాంప్లెక్స్‌కు బదులుగా 750 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా ‘కంప్యూటర్ కంట్రోల్డ్ మల్టీ టైర్ కార్ పార్కింగ్ జోన్’ నిర్మించాలని నిర్ణయించారు. ఒప్పందం దశలో మూలకుపడ్డ ఫైళ్లు కార్ పార్కింగ్ జోన్ డిజైన్ మొదలు నిర్మాణం, నిధులు, నిర్వహణ బాధ్యతలన్నీ టోల్గేట్ తరహాలో పీపీపీ పద్ధతిన అప్పగించేందుకు కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచారు. నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా... పూణేకు చెందిన ఇక్రా(ఐసీఆర్ఏ), హైదరాబాద్‌కు చెందిన నావోలిన్, ఇగిస్ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీలు సాంకేతికంగా అర్హత సాధించాయి. సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలు, అర్హతల ఆధారంగా ఈ ప్రాజెక్టును వీటికి కట్టబెట్టాలి. తీరా.. నిర్ణయం తీసుకునే సమయంలో అధికారులు ఫైళ్లు పక్కన పడేశారు. దీంతో ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ఒప్పందం దశకు చేరుకోలేదు. దీంతో కోట్లాది రూపాయలు విలువ చేసే ఖాళీ స్థలం మళ్లీ ఫైళ్లలోనే మూలనపడింది. పెద్ద గుంత తవ్వి ఉండడంతో నీళ్లు నిలిచి ఈ ప్రాంతం మురికికూపంలా తయూరైంది. రోడ్డు వైపు కచోరి బండ్లు, చలికాలంలో నేపాలీల స్వెటర్ల వ్యాపారం ఇక్కడ వర్ధిల్లుతోంది. కానీ.. తొమ్మిదేళ్ల కిందట తలపెట్టిన ప్రాజెక్టుకు ఇప్పటికీ మోక్షం లేకపోవడం కార్పొరేషన్ పనితీరుకు అద్దం పడుతోంది.