కార్పొరే ట్లకు జై కొట్టారు
న్యూఢిల్లీ: వృద్ధికి ‘మౌలిక రంగం లోపాలు’ అడ్డుకాకూడదని బడ్జెట్ స్పష్టంచేసింది. ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్టులకు సంబంధించి పలు చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యాన్ని (పీపీపీ) మౌలిక ప్రాజెక్టుల అమలుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ‘ తయారీ, మౌలిక రంగాల అభివృద్ధి అవసరాలకు తగిన నిధులను సమీకరించుకోవాలి. 3పీ ఇండియాగా ‘పీపీపీ’ నిర్వహణకు వెసులుబాటు కల్పించేందుకు రూ.500 కోట్ల మూలధనంతో ఒక సంస్థ ఏర్పాటు కానుంది.
వివిధ దశల్లో ఉన్న దాదాపు 900 ప్రాజెక్టులతో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. అభివృద్ధికి నమూనాగా ఉంటున్న ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల్లో పీపీపీ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక ప్రాజెక్టులకు రుణ సదుపాయాలను కల్పించడానికి పలు బ్యాంకుల భాగస్వామ్యంతో ఉన్న మునిసిపల్ రుణ సౌలభ్యతా సం బంధ మూలధనాన్ని ప్రస్తుత రూ.5,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచుతాం’ అని జైట్లీ చెప్పారు.
రహదారులకు మహర్దశ...
గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జైట్లీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గ్రామీణ మౌలిక రుణ నిధి (ఆర్‌ఐడీఎఫ్)కి రూ.25,000 కోట్లను సమీకరించాలని మధ్యంతర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నిధికి సంబంధించి అదనంగా మరో రూ.5,000 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం అని వెల్లడించారు. వేర్‌హౌసింగ్ ఇన్‌ఫ్రా ఫండ్‌కు రూ.5,000 కోట్ల నిధిని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్షింగ్ మద్దతును అందించడానికి నాబార్డ్‌లో దీర్ఘకాలిక గ్రామీణ రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధికి ప్రాధమికంగా రూ.5,000 కోట్లను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేస్తామని జైట్లీ చెప్పారు. రాష్ర్ట రహదారులు, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాల ప్రాజెక్టుల విషయమై రూ.37,880 పెట్టుబడుల ప్రణాళికలను బడ్జెట్ ప్రకటించింది. ఇండస్ట్రియల్ క్యారిడార్లతోపాటు నిర్దిష్ట ఎక్స్‌ప్రెస్ హైవేలను సైతం అభివృద్ధి చేసే ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టులకు ఎన్‌హెచ్‌ఏఐ రూ.500 కోట్లను కేటాయిస్తుందని తెలిపారు. గుజరాత్ తరహాలో వ్యవసాయ, వ్యవసాయేతర వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా పథకానికి సైతం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. షిప్పింగ్ ఇన్‌ఫ్రాకు సంబంధించి ఈ యేడాది 16 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పౌర విమానయాన రంగం అభివృద్ధి, టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో పీపీపీతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యమని వెల్లడించారు. మైనింగ్ రంగంలో ఇబ్బందులను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రియల్ ఎస్టేట్‌కి ప్రోత్సాహం
ముంబై: నిధుల కొరతతో అల్లాడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఊతమివ్వడంతో పాటు హౌసింగ్‌కి డిమాండ్ పెంచే దిశగా బడ్జెట్‌లో పలు చర్యలు ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రియల్టీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులకు (ఆర్‌ఈఐటీ) కార్పొరేట్ ఆదాయ పన్ను మినహాయింపునిచ్చారు.
అలాగే, సామాన్యులకు అందుబాటు ధరల్లో గృహాలను సమకూర్చే దిశగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు (ఎన్‌హెచ్‌బీ) రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఎఫ్‌డీఐలకు సంబంధించి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కనీస ఏరియా పరిమితిని 50,000 చదరపు మీటర్ల నుంచి 20,000 చదరపు మీటర్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే, కనీస పెట్టుబడి పరిమాణాన్ని కూడా 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించారు.
దీంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కనీసం 30 శాతాన్ని అఫోర్డబుల్ హౌసింగ్ (అందుబాటు ధరల్లో ఇళ్లు)కు కేటాయించే ప్రాజెక్టులకు కనీస బిల్టప్ ఏరియా, మూలధనం నిబంధనల విషయంలో సడలింపునివ్వనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. అటు వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7,060 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయాలతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మధ్య స్థాయి, చిన్న స్థాయి డెవలపర్లు ఎఫ్‌డీఐలను సమకూర్చుకునేందుకు వీలు కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఆర్‌ఈఐటీలతో పరిశ్రమకు ఊతం..
మ్యూచువల్ ఫండ్స్ తరహాకి చెందిన ఆర్‌ఈఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఇన్‌విట్) సాధనాలకు ప్రోత్సాహకాలతో డెవలపర్లు నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు లభించినట్లవుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్‌నర్ నీరజ్ బన్సల్ తెలిపారు. వీటిని కంపెనీ షేర్లలాగానే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయొచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా లావాదేవీలు జరపవచ్చు.
మరోవైపు, రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. తాజా ప్రోత్సాహకాలతో తొలి ఏడాదిలోనే రూ. 90,000 కోట్ల మేర నిధులు ఆర్‌ఈఐటీల్లోకి రాగలవని అంచనా. మరోవైపు, ఎన్‌హెచ్‌బీకి నిధుల కేటాయింపుతో కొనుగోలుదారులకు తక్కువ వడ్డీలపై రుణాలు లభించగలవని, తత్ఫలితంగా హౌసింగ్‌కి డిమాండ్ పెరగగలదని ఈవై ఇండియా పార్ట్‌నర్ గౌరవ్ కార్నిక్ అభిప్రాయపడ్డారు. రియల్టీలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు రాగలవని కార్నిక్ చెప్పారు.