Budget -2014
-
ఈ బడ్జెట్‌కు విలువే లేదు: సోమయాజులు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక పనికిరాని డాక్యుమెంట్ అని, దానికి ఏమాత్రం విలువే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు వ్యాఖ్యానించారు. గత ఏడాది వాస్తవిక లెక్కల వివరాలుగానీ, వచ్చే కొద్ది నెలల కాలానికి అంచనా వివరాలుగానీ ఈ బడ్జెట్లో ఇవ్వలేకపోయారని చెప్పారు. కనీసం గత నాలుగు నెలల వాస్తవిక రాబడి వివరాలనైనా వెల్లడించలేదని అన్నారు. అతి ముఖ్యమైన రెవెన్యూ రాబడుల్లో పన్నుల రూపేణా వచ్చేది ఎంత, పన్నేతర వనరుల నుంచి వచ్చేది ఎంత అనే విషయాలేమీ బడ్జెట్లో వెల్లడించలేదన్నారు. ప్రణాళిక వ్యయం, పెట్టుబడి వ్యయం కేటాయింపులు సమృద్ధిగా ఉంటే ఆ బడ్జెట్ బాగున్నట్లేనని, కానీ ప్రస్తుత బడ్జెట్లో ఈ రెండు కేటాయింపులూ తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రం విడిపోయాక అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, వాహనాల పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయమెంతో తెలియజేయలేదన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల 2, 3, 4 సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ కేటాయింపులు కూడా ఈసారి బడ్జెట్లో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎరుుడ్ వస్తుందనడం అసంబద్ధం కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని బడ్జెట్లో చెప్పడం అసంబద్ధంగా ఉందన్నారు. ప్రణాళిక వ్యయం ఎంత పెరిగితే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంత పెరుగుతుందన్నారు. అరుుతే, ఈ బడ్జెట్లో ప్రణాళిక వ్యయూన్ని 24 శాతానికే పరిమితం చేశారని, ఇప్పుడు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా పెరుగుతుందో కూడా చెప్పడం కష్టమని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం నుంచి రూ. 14,500 కోట్లు రావడానికి అవకాశముందని, ఒకవేళ ఆ నిధులు రాకుంటే తాము వేస్తున్న ఈ అంచనాలన్నీ తారుమారవుతాయని పేర్కొన్నారని వివరించారు. అలా జరిగితే రూ. 6 వేల కోట్ల రెవెన్యూ లోటు రూ. 25 వేల కోట్లకు, రూ. 12 వేల కోట్ల ద్రవ్య లోటు రూ. 35 వేల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. అప్పుడు పరిస్థితి భయానకంగా ఉంటుందన్నారు.లోటు పూడ్చడంపైనా ఆర్డినెన్స్ ఇవ్వాల్సింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారని, అరుుతే తొలి ఏడాది ఆ లోటును కేంద్రం ఎలా భర్తీ చేస్తుందో అందులో పేర్కొనలేదని సోమయాజులు తెలిపారు. ఈ హామీ అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రసంగంలో మాత్రమే ఉందని, చట్టంలో చేర్చలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే కేంద్రం దీనిపైన కూడా ఆర్డినెన్స్ ఇచ్చి ఉంటే చట్టబద్ధత ఉండేదన్నారు. అందువల్ల ఆర్థిక లోటును కేంద్రం పూడుస్తుందో లేదో తెలియకుండా ఉందన్నారు. రాజధాని ఎక్కడో నిర్ధారణ కాకుండానే 5 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మిస్తామని చెప్పడం కూడా మోసపూరితమేనన్నారు. రాజధాని ఎక్కడో తేల్చకుండా దానిని ఎలా కట్టాలో అధ్యయనం చేయడానికి మంత్రులు విదేశాలకు వెళ్లడం దండగని చెప్పారు. -
‘యమున’ను మరిచారు..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యమునా నదిని శుద్ధి చేయడానికి నిధులు కేటాయించకపోవడంపై స్థానిక పర్యావరణవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గం గానది కోసం బడ్జెట్లో సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం యమునా నదిని మాత్రం మరచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యమునా నదిని శుద్ధి చేయడానికి రూ. 1,000 కోట్లు కేటాయించాలని గతంలో కేంద్రాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. కానీ బడ్జెట్లో నదీతీరాన్ని అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు కేటాయించిన కేంద్రం నదీ జలాల శుద్ధి గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యమునా నదికి కూడా మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయం స్థానికుల్లో కలిగింది. నరేంద్ర మోడీ సలహా మేరకు యమునా నదీ తీరాన్ని కూడా గుజరాత్‌లోని సబర్మతీ నది తరహాలో అభివృద్ధి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వాధికారుల ఉన్నత స్థాయి బందం ఒకటి ఇటీవల అహ్మదాబాద్ ఇటీవల వెళ్లి అధ్యయనం కూడా చేసి వచ్చింది. అంతేకాక యమునా నదిని శుద్ధి చేయడానికి కూడా ఓ ప్రాజెక్టును రూపొందించారు. కానీ బడ్జెట్లో యమునాన దీ తీరాన్ని అభివృద్ధి చేయడానికి మాత్ర మే నిధులు కేటాయించి, నదీజలాల శుద్ధిని వదిలేశారు. దీంతో ఇప్పటివరకు ఢిల్లీ ప్రభుత్వం యమునానది శుద్ధీకరణకు చేపట్టిన కార్యక్రమాలన్నీ అటకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘నదీతీరాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే దాని అర్థం నదిని శుద్ధి చేయడం కాదు కదా.. ’యమునా జియే అభియాన్‌కు చెందిన పర్యావరణవేత్త మనోజ్‌మిశ్రా అన్నారు. యమునా నది ప్రస్తుతం మురికి కాలు వ మాదిరిగా ఉంది. జలచరాలు, బ్యాక్టీరియా కూడా ఈ నీటిలో బతకలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నదిలో ప్రతిరోజూ 5 మిలియన్ గ్యాలన్ల పారిశ్రామిక కాలుష్యాలు, 1,25,000 గ్యాలన్ల డీడీటీ నీరు కలుస్తోందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, గత పాతికేళ్లలో కేంద్ర ప్రభుత్వాలు దేశంలోని నదులను శుద్ధి చేయడానికి సుమారు రూ. 2,000 కోట్లకు పైగా ఖర్చుపెట్టా యి. అయినప్పటికీ గంగా, యమునా నదీజలాలు ఏమాత్రం శుభ్రపడిన దాఖలాలు కనిపించడంలేదు. ఈ నదులను శుద్ధి చేసేదాని కంటే కొన్ని రెట్లు ఎక్కువగా మలినాలు ప్రతిరోజూ వాటిలో చేరుతుండటంతో ఆయా ప్రభుత్వాల చర్యలు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదు. ఈ రెండు నదులను శుభ్రంగా ఉంచడానికిసీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పారిశుధ్య సదుపాయాలను ఏర్పాటుచేసినప్పటికీ మొత్తం మీద పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. ఢిల్లీ చేరేవరకు పరిశుభ్రంగా ఉండే యమునా జలాలు ఢిల్లీలోనే కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ఢిల్లీలో యమున 48 కిమీల పొడవునా ప్రవహిస్తుంది. ప్రతిరోజూ నదిలో పారిశ్రామిక కాలుష్యా లు, విషపదార్థాలతో పాటు 225 మిలియన్ గ్యాలన్ల శుద్ధి చేయని సీవేజ్ కలుస్తుంది. ఆ తర్వాత ఫరీదాబాద్, బల్లభ్‌ఘడ్, పల్వల్, మధురలోని పరిశ్రమ లు యమునా నదీజలాలను మరింత కాలుష్యమ యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో యమునానది జలాలను శుద్ధి చేసేందుకు తగినన్ని నిధులను కేంద్రం కేటాయించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. -
బడ్జెట్లో తెలంగాణపై వివక్ష
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ఈ బడ్టెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్రం ఆదుకుంటుందేమోన్న ఆశలు నీరుగారిపోయాయన్నారు. గ్రామీణాభివృద్ధి , వ్యవసాయ, ఉపాధి హామీ పథకాలకు నిధుల కేటాయింపును కేంద్రం విస్మరించిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గింగచలేదన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. -
కేంద్ర బడ్జెట్లో జిల్లాకు ప్రాధాన్యం నిల్
సాక్షి, కర్నూలు : రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన కర్నూలు జిల్లాకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి వరాల ఊసే కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ యూనివర్సిటీ, ఎయిమ్స్, ఐఐటీలను కేటాయిస్తున్నట్లు ప్రకటించినా అవి ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పలేదు. దీంతో జిల్లావాసులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కొంతచేయూత ఇచ్చినా.. ఎరువుల సబ్సిడీ నియంత్రణ విషయంపై ఊసెత్తకపోవడంతో రైతులను నిరాశకు గురిచేసింది. కర్నూలు జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్, రబీ కలిపి సాగు భూమి 12 లక్షల హెక్టార్లు. వేరుశెనగ 1.30 లక్షల హెక్టార్లు, వరి 1.20 లక్షల హెక్టార్లు, పత్తి 1.08 లక్షల హెక్టార్లు, కంది 45 వేల హెక్టార్లు, మొక్కజొన్న 25 వేల హెక్టార్లు, ఉల్లి 16 వేల హెక్టార్లు, టమోటా 8 వేల హెక్టార్లలో సాగువుతోంది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయడం రైతులకు కొంత ఊరట నిచ్చినట్లయింది. అయితే ఎరువుల సబ్సిడీపై ఊసెత్తక పోవడంతో రానున్న రోజుల్లో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు నిరాశే.. జిల్లాలో 60-65 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. దాన్ని రూ. 50 వేలు పెంచుతూ రూ. 2.50 లక్షలకు చేశారు. ఇది ఆశించదగ్గది కాదని ఉద్యోగుల వాదన. వీరంతా ఏడాదికి రూ. 5 లక్షలు కోరుకుంటున్నారు. దీని వల్ల కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 10 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే స్వల్ప ప్రయోజనమంటున్నారు. ప్రస్తుతం నెలకు రూ.30 వేలు తీసకున్న ఉద్యోగి కంటే పాతికేళ్ల కిందట రూ. 5 వేలు వేతనం తీసుకున్న వారే నయమని ఉద్యోగులు భావిస్తున్నారు. ధరల నియంత్రణ అదుపుకానట్టే.. కూరగాయలు, నిత్యావసరాల ధరల స్థిరీకరణకు లేకపోవడంతో ప్రజానీకం అల్లాడుతున్నారు. కొన్ని కుటుంబాలు ఆహారం మెనూ మార్చుకున్నాయి. పాల ధర నుంచి మొదలు రాత్రి పడుకునే ముందు వెలిగించే దోమల మందు వరకు దేన్నీ ముట్టుకున్నా.. హెచ్చింపే కానీ తగ్గింపులేదు. అయితే ధరల స్థిరీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించినా అది సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎన్డీఏ సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజానీకం నిరాశకు గురైంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. పారిశ్రామిక రంగాలకు కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు. పవన విద్యుత్తుకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించారు. పవన విద్యుత్తు ఉత్పత్తికి జిల్లా అనూకూలం. ఇక్కడ నెడ్‌క్యాప్, ప్రైవేటు సంస్థలు కలిపి రోజుకు 117.5 మెగావాట్ల విద్యుతును ఉత్పత్తి చేస్తున్నాయి. మరిన్ని కేంద్రాలకు అనుమతులు వచ్చాయి. తాజాగా కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడంతో ఇక్కడ మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 2,500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు మరింత నిధులు కేటాయించి ఉండాల్సింది. ఉపాధిని బాగా పెంచే రంగాలు ఇవి కావడంతో తగిన స్థాయిలో నిధులు కేటాయించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే మన జిల్లాలో సున్నపురాయి, డోలమైట్ల ఖనిజాలు ఎక్కువగా లభ్యమవుతాయి. వీటికి పన్ను రాయితీలు ఇవ్వడంతో సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉంది. పురావస్తు కట్టడాల పరిరక్షణ.. కర్నూలు జిల్లాలో పురావస్తు కట్టడాలు అనేకం ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం దేవాలయం, మహానంది, ఆహోబిలం, కొండారెడ్డి బురుజు.. తదితర కట్టడాలు చాలా పురాతనమైనవి. దేశవ్యాప్తంగా ఇలాంటి కట్టడాలకు పరిరక్షణ బాధ్యత కోసం కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో వీటి మరమ్మతులకు అవకాశం ఏర్పడినట్లైంది. రోడ్లకు మహర్దశ బడ్జెట్లో గ్రామీణ సడక్ యోజనకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం 44, 18వ నంబరు జాతీయ రహదారులు జిల్లాలో వెళ్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఏర్పాటైతే కర్నూలు-విజయవాడ రహదారిని ఫోర్ లైన్స్‌కు విస్తరించాల్సి ఉంటుంది. -
బడ్జెట్.. ప్చ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన మేరకు సంతృప్తినివ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందన్న హామీ తప్ప తెలంగాణకు బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృ ద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖ లు, అధికార యంత్రాంగం సకాలం లో చేపడుతాయంటూనే, పునర్విభజన బిల్లులోని ఉద్యానవన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్లు ప్రకటించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణకు బడ్జెట్లో ద క్కని ప్రాధాన్యం జిల్లాలోని వివిధ రంగాలపై ప్రభావం చూపే అవకా శం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య, మధ్యతరగతిపై పన్నుల భారం కేంద్ర బడ్జెట్లో దూరదృష్టి పేరిట, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిత్యావసరంగా మారిన అనేక వస్తువులు, పరికరాలపై పెంచిన సుంకం ప్రభావం చూపనుంది. పాన్‌మసాలా, గుట్కాల ధరలు ప్రియం కానున్నాయి. సిగరెట్, బీడీ తదితర ధూమపాన ప్రియులు, పొగాకు విని యోగదారులపై ఏటా రూ.10.50 కోట్ల అదనపు భారం పడనున్నట్లు చెప్తున్నారు. రేడియో టాక్సీలపై సేవా పన్ను విధించడంతో మధ్యతరగ తి ప్రజలపై భారం పడనుంది. మ్యూచువల్ ఫండ్స్ బదలాయింపుపై పన్ను పెంపు, శీతల పానీయాలు, పాన్‌మసాలాలు ధరల పెంపు తది తర అంశాలు ప్రజలకు అదనపు భారం కానున్నాయి. కంప్యూటర్లు, ఎ లక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నా, గ్రామీణ రైతులు, సా మాన్య ప్రజలకు అంతగా ఉపయోగం ఉండదు. బ్రాండెడ్ దుస్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించినా, విదేశీ కంపెనీలకే కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల లేకుండా ప్రజలకు బడ్జెట్ భరోసా ఇవ్వలేకపోయింది. ఉపశమనం ఇవ్వని మినహాయింపులు గ్రామీణ ప్రాంతాలు, ఆ ప్రాంతాల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కల్గించకుండా, మినహాయింపులు, ప్రోత్సాహకాల పేరిట చేర్చిన అంశాలు ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలకు పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు బడా సంస్థల కే ప్రయోజనం కల్గించే అంశాలు. గాలిమరల విద్యు త్‌కు పన్ను ప్రోత్సాహాకం, సున్నపురాయి, డోలమైట్‌లపై పన్ను రాయితీలు పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉన్నా.. ఇప్పటికే ఖాయిలా పడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల పునరుద్ధరణ మాటే ఎత్తలేదు. అయితే, కొద్దిగా తగ్గనున్న ఇనుము ధరలు, పాదరక్షలపై 12 నుంచి 6 శాతానికి తగ్గిన ఎక్సై జ్ సుంకాలు సామాన్యులను సంతృప్తిపరిచే అంశాలే. స్టెయిన్లెస్ స్టీల్ పై దిగుమతి సుంకం తగ్గింపు కూడా అనుకూలాంశం. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలకు ప్రోత్సాహం నిరుద్యోగులకు ప్రోత్సాహాన్నిస్తుండగా, అ న్ని గ్రామాలను బ్రాడ్బ్రాండ్తో అనుసంధానం, ఉపాధిహామీకి వ్యవసాయంతో అనుసంధానం చేయడం సంతోషకరం కాగా.. ప్రథమ, ద్వి తీయశ్రేణి నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు నిర్ణయంతో ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి ఆలస్యంగానైనా మోక్షం కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
అన్ని జాగ్రత్తలతో రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్..
న్యూఢిల్లీ: పన్ను చట్టాలకు గతం నుంచి అమల్లోకి వచ్చే (రెట్రాస్పెక్టివ్) సవరణలు చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటామని ఇన్వెస్టర్లకు జైట్లీ భరోసా ఇచ్చారు. ఐటీ చట్టం సవరణ(2012)కు సంబంధించిన తాజా కేసులన్నిటినీ ఉన్నత స్థాయి సీబీడీటీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. అయితే, ఆదాయ పన్ను చట్టం -1961కు రెట్రాస్పెక్టివ్ సవరణతో ఇప్పటికే ఉత్పన్నమై, కోర్టుల్లో పెండింగులో ఉన్న వివాదాలు హేతుబద్ధంగా పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు. ఆర్బిట్రేషన్ కొనసాగిస్తాం : జైట్లీ ప్రకటన నేపథ్యంలో రూ.20 వేల కోట్ల పన్ను వివాదానికి సంబంధించి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) ప్రక్రియను కొనసాగించాలని వొడాఫోన్ నిర్ణయించింది. రెండేళ్లలో కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు...: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన కొత్త అకౌంటింగ్ ప్రమాణాలను 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని జైట్లీ చెప్పారు. నూతన భారతీయ అకౌంటింగ్ ప్రమాణాల(ఇండ్ ఏఎస్)ను 2015-16 నుంచి స్వచ్ఛందంగా, 2016-17 నుంచి తప్పనిసరిగా పాటించాల్సిందేనని అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలతో సహా ద్రవ్య సేవల రంగంలోని సంస్థలకు గడువును ఆయా రంగాల రెగ్యులేటర్లు ప్రకటిస్తారని చెప్పారు. -
కార్పొరే ట్లకు జై కొట్టారు
న్యూఢిల్లీ: వృద్ధికి ‘మౌలిక రంగం లోపాలు’ అడ్డుకాకూడదని బడ్జెట్ స్పష్టంచేసింది. ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్టులకు సంబంధించి పలు చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్లో ప్రకటించారు. ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యాన్ని (పీపీపీ) మౌలిక ప్రాజెక్టుల అమలుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ‘ తయారీ, మౌలిక రంగాల అభివృద్ధి అవసరాలకు తగిన నిధులను సమీకరించుకోవాలి. 3పీ ఇండియాగా ‘పీపీపీ’ నిర్వహణకు వెసులుబాటు కల్పించేందుకు రూ.500 కోట్ల మూలధనంతో ఒక సంస్థ ఏర్పాటు కానుంది. వివిధ దశల్లో ఉన్న దాదాపు 900 ప్రాజెక్టులతో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. అభివృద్ధికి నమూనాగా ఉంటున్న ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రహదారుల వంటి మౌలిక ప్రాజెక్టుల్లో పీపీపీ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక ప్రాజెక్టులకు రుణ సదుపాయాలను కల్పించడానికి పలు బ్యాంకుల భాగస్వామ్యంతో ఉన్న మునిసిపల్ రుణ సౌలభ్యతా సం బంధ మూలధనాన్ని ప్రస్తుత రూ.5,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచుతాం’ అని జైట్లీ చెప్పారు. రహదారులకు మహర్దశ... గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జైట్లీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గ్రామీణ మౌలిక రుణ నిధి (ఆర్ఐడీఎఫ్)కి రూ.25,000 కోట్లను సమీకరించాలని మధ్యంతర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నిధికి సంబంధించి అదనంగా మరో రూ.5,000 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం అని వెల్లడించారు. వేర్‌హౌసింగ్ ఇన్ఫ్రా ఫండ్‌కు రూ.5,000 కోట్ల నిధిని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్షింగ్ మద్దతును అందించడానికి నాబార్డ్‌లో దీర్ఘకాలిక గ్రామీణ రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధికి ప్రాధమికంగా రూ.5,000 కోట్లను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేస్తామని జైట్లీ చెప్పారు. రాష్ర్ట రహదారులు, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాల ప్రాజెక్టుల విషయమై రూ.37,880 పెట్టుబడుల ప్రణాళికలను బడ్జెట్ ప్రకటించింది. ఇండస్ట్రియల్ క్యారిడార్లతోపాటు నిర్దిష్ట ఎక్స్‌ప్రెస్ హైవేలను సైతం అభివృద్ధి చేసే ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు ఎన్హెచ్ఏఐ రూ.500 కోట్లను కేటాయిస్తుందని తెలిపారు. గుజరాత్ తరహాలో వ్యవసాయ, వ్యవసాయేతర వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా పథకానికి సైతం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. షిప్పింగ్ ఇన్ఫ్రాకు సంబంధించి ఈ యేడాది 16 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పౌర విమానయాన రంగం అభివృద్ధి, టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో పీపీపీతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యమని వెల్లడించారు. మైనింగ్ రంగంలో ఇబ్బందులను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రియల్ ఎస్టేట్‌కి ప్రోత్సాహం ముంబై: నిధుల కొరతతో అల్లాడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఊతమివ్వడంతో పాటు హౌసింగ్‌కి డిమాండ్ పెంచే దిశగా బడ్జెట్లో పలు చర్యలు ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రియల్టీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులకు (ఆర్ఈఐటీ) కార్పొరేట్ ఆదాయ పన్ను మినహాయింపునిచ్చారు. అలాగే, సామాన్యులకు అందుబాటు ధరల్లో గృహాలను సమకూర్చే దిశగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు (ఎన్‌హెచ్‌బీ) రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఎఫ్‌డీఐలకు సంబంధించి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కనీస ఏరియా పరిమితిని 50,000 చదరపు మీటర్ల నుంచి 20,000 చదరపు మీటర్లకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే, కనీస పెట్టుబడి పరిమాణాన్ని కూడా 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించారు. దీంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కనీసం 30 శాతాన్ని అఫోర్డబుల్ హౌసింగ్ (అందుబాటు ధరల్లో ఇళ్లు)కు కేటాయించే ప్రాజెక్టులకు కనీస బిల్టప్ ఏరియా, మూలధనం నిబంధనల విషయంలో సడలింపునివ్వనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. అటు వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7,060 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయాలతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మధ్య స్థాయి, చిన్న స్థాయి డెవలపర్లు ఎఫ్‌డీఐలను సమకూర్చుకునేందుకు వీలు కాగలదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్ఈఐటీలతో పరిశ్రమకు ఊతం.. మ్యూచువల్ ఫండ్స్ తరహాకి చెందిన ఆర్ఈఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్) సాధనాలకు ప్రోత్సాహకాలతో డెవలపర్లు నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు లభించినట్లవుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్నర్ నీరజ్ బన్సల్ తెలిపారు. వీటిని కంపెనీ షేర్లలాగానే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయొచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా లావాదేవీలు జరపవచ్చు. మరోవైపు, రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. తాజా ప్రోత్సాహకాలతో తొలి ఏడాదిలోనే రూ. 90,000 కోట్ల మేర నిధులు ఆర్ఈఐటీల్లోకి రాగలవని అంచనా. మరోవైపు, ఎన్‌హెచ్‌బీకి నిధుల కేటాయింపుతో కొనుగోలుదారులకు తక్కువ వడ్డీలపై రుణాలు లభించగలవని, తత్ఫలితంగా హౌసింగ్‌కి డిమాండ్ పెరగగలదని ఈవై ఇండియా పార్ట్నర్ గౌరవ్ కార్నిక్ అభిప్రాయపడ్డారు. రియల్టీలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు రాగలవని కార్నిక్ చెప్పారు.