కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం నిల్
సాక్షి, కర్నూలు : రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన కర్నూలు జిల్లాకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ఎలాంటి వరాల ఊసే కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ యూనివర్సిటీ, ఎయిమ్స్, ఐఐటీలను కేటాయిస్తున్నట్లు ప్రకటించినా అవి ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పలేదు.
దీంతో జిల్లావాసులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కొంతచేయూత ఇచ్చినా.. ఎరువుల సబ్సిడీ నియంత్రణ విషయంపై ఊసెత్తకపోవడంతో రైతులను నిరాశకు గురిచేసింది. కర్నూలు జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్, రబీ కలిపి సాగు భూమి 12 లక్షల హెక్టార్లు. వేరుశెనగ 1.30 లక్షల హెక్టార్లు, వరి 1.20 లక్షల హెక్టార్లు, పత్తి 1.08 లక్షల హెక్టార్లు, కంది 45 వేల హెక్టార్లు, మొక్కజొన్న 25 వేల హెక్టార్లు, ఉల్లి 16 వేల హెక్టార్లు, టమోటా 8 వేల హెక్టార్లలో సాగువుతోంది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయడం రైతులకు కొంత ఊరట నిచ్చినట్లయింది. అయితే ఎరువుల సబ్సిడీపై ఊసెత్తక పోవడంతో రానున్న రోజుల్లో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగులకు నిరాశే..
జిల్లాలో 60-65 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితి రూ. 2 లక్షలు ఉండేది. దాన్ని రూ. 50 వేలు పెంచుతూ రూ. 2.50 లక్షలకు చేశారు. ఇది ఆశించదగ్గది కాదని ఉద్యోగుల వాదన. వీరంతా ఏడాదికి రూ. 5 లక్షలు కోరుకుంటున్నారు. దీని వల్ల కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 10 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే స్వల్ప ప్రయోజనమంటున్నారు. ప్రస్తుతం నెలకు రూ.30 వేలు తీసకున్న ఉద్యోగి కంటే పాతికేళ్ల కిందట రూ. 5 వేలు వేతనం తీసుకున్న వారే నయమని ఉద్యోగులు భావిస్తున్నారు.
ధరల నియంత్రణ అదుపుకానట్టే.. కూరగాయలు, నిత్యావసరాల ధరల స్థిరీకరణకు లేకపోవడంతో ప్రజానీకం అల్లాడుతున్నారు. కొన్ని కుటుంబాలు ఆహారం మెనూ మార్చుకున్నాయి. పాల ధర నుంచి మొదలు రాత్రి పడుకునే ముందు వెలిగించే దోమల మందు వరకు దేన్నీ ముట్టుకున్నా.. హెచ్చింపే కానీ తగ్గింపులేదు. అయితే ధరల స్థిరీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించినా అది సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎన్డీఏ సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజానీకం నిరాశకు గురైంది.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..
పారిశ్రామిక రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. పవన విద్యుత్తుకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించారు. పవన విద్యుత్తు ఉత్పత్తికి జిల్లా అనూకూలం. ఇక్కడ నెడ్‌క్యాప్, ప్రైవేటు సంస్థలు కలిపి రోజుకు 117.5 మెగావాట్ల విద్యుతును ఉత్పత్తి చేస్తున్నాయి. మరిన్ని కేంద్రాలకు అనుమతులు వచ్చాయి. తాజాగా కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడంతో ఇక్కడ మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో రోజుకు 2,500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు మరింత నిధులు కేటాయించి ఉండాల్సింది. ఉపాధిని బాగా పెంచే రంగాలు ఇవి కావడంతో తగిన స్థాయిలో నిధులు కేటాయించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే మన జిల్లాలో సున్నపురాయి, డోలమైట్ల ఖనిజాలు ఎక్కువగా లభ్యమవుతాయి. వీటికి పన్ను రాయితీలు ఇవ్వడంతో సిమెంట్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
పురావస్తు కట్టడాల పరిరక్షణ..
కర్నూలు జిల్లాలో పురావస్తు కట్టడాలు అనేకం ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం దేవాలయం, మహానంది, ఆహోబిలం, కొండారెడ్డి బురుజు.. తదితర కట్టడాలు చాలా పురాతనమైనవి. దేశవ్యాప్తంగా ఇలాంటి కట్టడాలకు పరిరక్షణ బాధ్యత కోసం కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో వీటి మరమ్మతులకు అవకాశం ఏర్పడినట్లైంది.
రోడ్లకు మహర్దశ
బడ్జెట్‌లో గ్రామీణ సడక్ యోజనకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం 44, 18వ నంబరు జాతీయ రహదారులు జిల్లాలో వెళ్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఏర్పాటైతే కర్నూలు-విజయవాడ రహదారిని ఫోర్ లైన్స్‌కు విస్తరించాల్సి ఉంటుంది.