కర్నూలు(అర్బన్): రాష్ట్ర విభజన ఎవరికి మేలు చేసిందో తెలియదు కానీ.. రెండు రాష్ట్రాల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు(స్కాలర్‌షిప్పులు) ఇప్పటికీ అందకపోవడంతో నానా ఇబ్బంది పడుతున్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ లో చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులు 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈపాస్ వెబ్‌సైట్ ఓపెన్ అయినా, తెలంగాణ లో ఓపెన్ కాకపోవడం కూడా విద్యార్థులను కలచి వేస్తోంది. కర్నూలు జిల్లా సరిహద్దున వున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, మానవపాడు, ఐజ, శాంతినగర్, వడ్డెపల్లి తదితర మండలాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులన్నీ కర్నూలు జిల్లాలోనే అభ్యసిస్తున్నారు. కాగా ఈ విద్యార్థులందరు సమైక్యాంధ్రలోనే 2013 జూన్ 1వ తేదీ నుంచి 2014 మార్చి 31వ తేదీ వరకు మన జిల్లా విద్యార్థులతో పాటే ఉపకార వేతనాలు, ఫీజుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన 2014 జూన్ 2వ తేదీన జరిగింది. అయితే రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసుకున్న రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నేటికి ఉపకార వేతనాలు అందని పరిస్థితి నెలకొంది.
2013-14 విద్యా సంవత్సరానికి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల దరఖాస్తులు ఈ పాస్ వెబ్‌సైట్ నుంచి తీసివేశారు. దీంతో వీరికి ఉపకార వేతనాలు అందడం లేదు. ఇదే పరిస్థితిని హైదరాబాద్, తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని మన విద్యార్థుల దరఖాస్తులు ఆ రాష్ట్ర ఈ పాస్ వెబ్‌సైట్‌లో కనిపించకుండా పోయాయి. అయితే వీరు అక్కడ చదువుతున్నా, మన జిల్లాలోని సంక్షేమ శాఖల జిల్లా అధికారుల లాగిన్‌లో వారి దరఖాస్తులను అప్‌లోడ్ చేద్దామన్నా, ప్రభుత్వం ఇంకా ఆప్షన్స్ పెట్టలేదు.
ఇబ్బందుల్లో 15 వేల మంది విద్యార్థులు
రెండు రాష్ట్రాల్లోని దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెన్యూవల్స్ చేసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాల సమస్య వెంటాడుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు, నెట్ సెంటర్లకు వెళ్తే దరఖాస్తు ఓపెన్ అయినా, ఆధార్‌కార్డు, స్థానికత, తదితర ధృవీకరణ పత్రాలు ఇతర రాష్ట్రానికి చెందినవి కావడంతో వెబ్‌సైట్ అంగీకరించడం లేదు.
దీంతో వేల సంఖ్యలో విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఆయా సంక్షేమ శాఖలకు చెందిన జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. ఒకవేళ తెలంగాణ లో మరికొద్ది రోజుల్లోై వెబ్‌సైట్ ఓపెన్ అయినా, అన్ని కళాశాలల లిస్టును వెబ్‌సైట్‌లో పెడతారో? లేదో? అనే అనుమానాలను మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడే దరఖాస్తు చేసుకునేందుకు బోనోఫైడ్ సర్టిఫికెట్ కూడా అడ్డంకిగా మారుతోంది.
ముంచుకొస్తున్న దరఖాస్తు గడువు
ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజుకు దరఖాస్తు చేసుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో ఇచ్చిన గడువులోగా దరఖాస్తు చేసుకుంటామా? లేదా? అనే సందిగ్ద పరిస్థితిని తెలంగాణలో చదువుతున్న మన విద్యార్థులు, ఇక్కడ చదువుతున్న తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.
సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణలో చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇక్కడకు వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు ఈ పాస్ వెబ్‌సైట్‌లో ఆప్షన్ పెట్టాల్సి వుంది. అలాగే తెలంగాణ లో కూడా వెంటనే ఈపాస్ వెబ్‌సైట్ ఓపెన్ అయితే ఇక్కడ చదువుతున్న అక్కడి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు కూడా స్పందించాల్సి వుంది.
విభజన ఎఫెక్ట్!
Published Sat, Dec 27 2014 3:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement