చురుగ్గా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా కర్నూలులో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషినల్ డీజీ సురేంద్రబాబు, ఐజీపీ ఆర్‌కే మీనన్, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు శుక్రవారం పటాలంలోని మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.
రూట్ మ్యాప్, ఎలైటింగ్ పాయింట్, శకటాల ప్రదర్శన, హెలిప్యాడ్, వీఐపీ గేట్ల ఏర్పాటు.. ఏ1, ఏ2, ఏ3, ఎఫ్1, ఎఫ్2 పాసుల జారీ తదితర అంశాలపై స్థానిక అధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం పెరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించారు. ఆరు జిల్లాల నుంచి సాయుధ బలగాలు, పెరేడ్ నిర్వహణకు కర్నూలుకు చేరుకున్నాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం వరకు పటాలం మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు.