కర్నూలు(అర్బన్): ఈ ఏడాది జూన్ 25.. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సమీపంలోని గడెంతిప్ప వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో రక్తం చిందింది. జిల్లాలో అత్యున్నత విద్యా సంస్థ ఏర్పాటుకు సంబంధించిన స్థల పరిశీలనలో ఈ ఘోరం జరిగింది. విద్యా పరంగా జిల్లా ఖ్యాతి రాష్ట్రమంతటా వ్యాపించడంతో పాటు జిల్లాకు చెందిన విద్యార్థుల ఉన్నత సాంకేతిక విద్యకు మార్గం సుగమం అవుతుందని అందరు భావించారు. అయితే ఊహించని ఈ దుర్ఘటనలో ఐదు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రక్తం చిందింది కానీ... జిల్లా వాసుల కోరిక నెరవేరలేదు. జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో వున్నా, ఐఐఐటీ (ట్రిపుల్ ఐటీ) పశ్చిమగోదావరి జిల్లాకు తరలిపోతున్నా పట్టించుకోని మాటటుంచి... ఐఐఐటీ ఏర్పాటుకు సంబంధించి మేమేమైనా శిలా ఫలకం వేశామా? అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు, మృతుల ఆత్మలను మరింత క్షోభకు గురి చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నాడు జరిగిన సంఘటనలో విధి నిర్వహణలో వున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటన మనసున్న ప్రతి మనిషిని కలచివేసింది.ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తహశీల్దార్ సునీతాబాయి నేటికీ కోలుకోలేని దీన స్థితిలో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఈమె... కదల్లేక మంచంలోనే తన దురదృష్టానికి కుంగిపోతోంది.
అయితే ఈ సంఘటన జరిగేందుకు కారణాలేవైనా... జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? తహశీల్దారు సునీతాబాయికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది...? వారందరు ఎందుకు ఆ సమయంలో గడెంతిప్ప వద్ద ఉన్నారు? అనే ప్రశ్నలను ఒకసారి మననం చేసుకుంటే... అయ్యో పాపం అనిపించడంతో పాటు, ప్రభుత్వ చర్యలను, పాలకుల మౌనాన్ని ఎండగట్టక మానరు.
వారెందుకు అక్కడున్నారంటే...
రాష్ట్ర విభజన జరిగిపోవడం.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం... జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ శివారుల్లో ఐఐఐటీ ఏర్పాటు కానుందనే అధికారుల ఆదేశాలు వారినక్కడకు తీసుకువచ్చాయి. అప్పటికే కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐఐఐటీ ఏర్పాటుకు సంబంధించి అక్కడ వున్న 300 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించి వెళ్లాయి.
మరో దఫా ఆ భూములను పరిశీలించేందుకు 25వ తేదీన ఉదయం అప్పటి జిల్లా కలెక్టర్ సి సుదర్శన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం మేరకు కలెక్టర్‌కు ఆయా భూములను చూపించేందుకు ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్‌ఐ పీ శ్రీనివాసులుతో పాటు ఆయా గ్రామ తలార్లు గడెంతిప్ప వద్ద ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలోనే సిలికాన్ లోడ్‌తో వస్తున్న లారీ వీరిపైకి దూసుకురావడంతో తహశీల్దారు సునీతాబాయి కొన ఊపిరితో బయటపడగా, ఆర్‌ఐ శ్రీనివాసులు, తలార్లు వెంకటేశ్వర్లు, శివరాముడు, రామక్రిష్ణతో పాటు హుసేనాపురంకు చెందిన గోపాల్ అనే వ్యక్తి మృతి చెందారు.
ఐదుగురు మృతి చెందినా...
ఐఐఐటీ స్థల పరిశీలనలో భాగంగానే ఐదుగురు మృతి చెందినా, ఐఐఐటీని సాధించండలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారు. ఈ సంఘటన జరిగిన అనంతరం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ భూములను పలుమార్లు పరిశీలించారు. కానీ ఫలితం దక్కలేదు.
ఈ భూముల పరిశీలనలోనే నలుగురు రెవెన్యూ సిబ్బందితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర వేడుకల్లో జెండాను ఎగురవేసేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఐఐఐటీ విషయంలో జిల్లా ప్రజలను మోసం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాల్లో పాలకులు మౌనాన్ని వీడి గళాన్ని విప్పకుంటే రాబోవు తరాలు క్షమించవనే విషయాన్ని గుర్తించుకోవాల్సి వుంది.
అమాత్యులదో మాట... కలెక్టర్‌ది మరో మాట...
నన్నూరు గ్రామ శివారుల్లో ఏర్పాటు కావాల్సిన ఐఐఐటీని ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించింది. ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వాదనలు ఒక రకంగా ఉంటే... జిల్లా కలెక్టర్ సీ హెచ్ విజయమోహన్ వ్యాఖ్యలు మరో విధంగా ఉన్నాయి. సోమవారం కర్నూలులో విలేకరుల సమావేశంలో ఐఐఐటీ పశ్చిమ గోదావరి జిల్లాకు తరలిపోయిందని అమాత్యులు చెబుతున్నా. నన్నూరు దగ్గర గుర్తించిన భూముల్లోనే ఐఐఐటీ ఏర్పాటు అవుతుందని, వచ్చే ఏడాది క్లాసులు కూడా ప్రారంభం అవుతాయని కలెక్టర్ విజయమోహన్ చెప్పడం గమనార్హం. ఎవరి మాట వాస్తవమో తెలియాల్సి ఉంది.
ఈ నెత్తుటి చారికలు.. దేని గురుతులు?
Published Wed, Dec 17 2014 2:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement