సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన అనంతరం కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలని రాయలసీమ ప్రజలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విజయవాడ- గుంటూరు మధ్యే ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు తన ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కర్నూలును రాజధాని చేయాలని గట్టిగా డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో వివిధ వర్గాల వారు కర్నూలును రాజధానిని చేయాలని ఆందోళనలు చేస్తున్నా వారికి మద్దతు కూడా ప్రకటించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కర్నూలు రాజధాని ఉద్యమానికి ఊపిరిపోశారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసి రాజధాని ఉద్యమాన్ని ముందుకు నడిపారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియక ముఖం చాటేస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం ఇటీవల అసెంబ్లీలో విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని నిర్మాణానికి అనుకూలంగా లేదని, ప్రభుత్వ భూములు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత మళ్లీ ఎక్కడా మాట్లాడలేదు. ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రులు కూడా ఎక్కడా నోరు తెరవలేదు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాజధానిని పోగొట్టుకుని, ఇప్పుడు రాజధాని చేసే అవకాశం ఉన్నా టీడీపీ నేతలు పట్టుబట్టకపోవటంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
సీమ పౌరుషాన్ని అధినేతకు
తాకట్టుపెడుతారా?
రాజకీయ కురువృద్ధుడిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో పలు విషయాల్లో గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి కర్నూలును రాజధాని చేయాలని పట్టుబడుతారా? అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన రాజధాని తొలి కమిటీలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చోటు కల్పించలేదు. దీంతో సబ్‌కమిటీ నుంచి కేఈ వైదొలిగినట్లు విశ్వసనీయ సమాచారం.
కేఈని కమిటీలోకి తీసుకుంటే తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతారనే అనుమానంతో ఆయనకు చోటు ఇవ్వలేదని తెలిసింది. అయితే పథకం ప్రకారమే చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కర్నూలును రాజధానిని చేయాలనే విషయంలో ‘టీడీపీ నేతలు రాయలసీమ పౌరుషాన్ని చూపి ప్రాంతీయ అభిమానాన్ని చాటుకుంటారా? లేదంటే సీఎం చంద్రబాబుకు తాకట్టుపెడతారా?’ ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
తమ్ముళ్ల దారెటు?
Published Wed, Sep 3 2014 1:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement