నారా లోకేష్ పాదం మోపుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలో గ్రూపులు బయటపడుతున్నాయి. ఒకచోట ఫ్లెక్సీల గొడవ, మరోచోట ఆధిపత్య పోరు.. ఇలా ప్రతీ చోటా ఏదో ఒక తలనొప్పి లోకేష్‌ను ఇబ్బంది పెడుతోంది. కర్నూల్ జిల్లాలో సాగుతున్న పాదయాత్ర అక్కడి టీడీపీని మరింత బలహీనపరుస్తోందని చెబుతున్నారు. ఇంతకీ కర్నూల్ పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది..?
పాతాళంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొద్దామని నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ గ్రూపులు బయటపడి పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయట. ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నేతల్లో ఉత్సాహం ఏమాత్రం కనిపించడంలేదు. ఏ నియోజకవర్గంలో లోకేష్ కాలు పెడుతున్నాడో ఆ నియోజకవర్గంలో నాయకుల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ని మార్చాలంటూ కరపత్రాలను పంచగా.. ఆలూరు నియోజకవర్గంలో తమకు ఈ ఇన్‌ఛార్జ్ వద్దంటూ ప్లెక్సీల ద్వారా నారా లోకేష్‌కు అక్కడి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.
ఆలూరు నియోజకవర్గంలో మొదటి నుండి నాలుగు వర్గాలుగా కొనసాగుతున్న నాయకులు ఎవరి ఇష్టం మేరకు వారు నడుచుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ కోట్ల సుజాతమ్మ మాత్రం అందర్నీ కలుపుకునిపోతేనే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అసమ్మతి వర్గం మాత్రం సుజాతమ్మకు వ్యతిరేకంగా మహాకూటమిగా ఏర్పడి సుజాతమ్మకు టికెట్ ఇవ్వద్దని ఎలుగెత్తి చాటుతున్నారు. సుజాతమ్మను వ్యతిరేకిస్తున్న ఆ మూడు గ్రూపుల్లో మాలో ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు.. కలిసి పనిచేసి గెలిపించుకుంటాం.. సుజాతమ్మకు మాత్రం టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని లోకేష్‌కు తేల్చి చెప్పారట. నారా లోకేష్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అసమ్మతి వర్గం మాత్రం తమ బలాన్ని నిరూపించుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. కోట్ల సుజాతమ్మ సీటు తనకే ఇస్తారని ధీమాగా ఉన్నారు.
ఒక పార్టీ ముఖ్య నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే.. ప్రజల సమస్యలు వింటాడని, పార్టీలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతాడని అందరూ ఆశిస్తారు. అయితే, ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం ఎక్కడ పాదం మోపితే అక్కడ పార్టీ మరింత వీక్ అవుతోందనే టాక్ నడుస్తోంది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న గ్రూపులు లోకేష్ కనిపించగానే బయటికొస్తున్నాయి. ఒకవైపు పొగడ్తలు.. మరోవైపు నిరసనలతో యువగళం కాస్తా నిరసనగళంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment