హోదాను తాకట్టుపెట్టి.. రాయలసీమకు బాబు తీరని ద్రోహం
బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ అమలులోనూ మోసం
రూ.22,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఏడాదికి రూ.50 కోట్లు కేటాయింపు
ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ సీమ, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన బాబు
‘ప్యాకేజీ’ అంటూ మాటమార్చి రాయలసీమ అభివృద్ధిని బలిచేసిన వైనం
ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రతనాల ‘సీమ’గా మారేదంటున్న ఆర్థికవేత్తలు
ఇవన్నీ మరిచి ఇప్పుడు మళ్లీ జట్టు కట్టిన బాబు, మోదీ
హోదాపై ఒక్క మాట మాట్లాడకుండా ప్రధాని రాష్ట్ర పర్యటన
హోదా ఇవ్వక పోవడం వల్ల సీమకు నష్టంపై మోదీని ప్రశ్నించని బాబు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.
ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్‌ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.
సీమకు తీరని అన్యాయం..
రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.
1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి.
2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్‌పోర్టులు ఉన్నాయి.
3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి.
4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.
పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్‌కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.
ప్రత్యేక హోదా వచ్చుంటే..
1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు.
2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది.
3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్‌చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు.
5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.
పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి.
బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే..
విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్‌ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్‌ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు.
అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!
రాయలసీమలో డోలమైట్, ఐరన్‌ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్‌స్టోన్, క్వారŠట్జ్‌తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది.
హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..
‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్‌కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
మానవ వనరులు పుష్కలం!
రాయలసీమలో జేఎన్‌టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్‌వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
రాయలసీమకు బాబు ద్రోహం!
2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment