చంద్రబాబు పాలనలో ప్రశాంతత ఎక్కడిది? | Ksr Comments On The Difference In The Governance Of YS Jaganmohan Reddy And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో ప్రశాంతత ఎక్కడిది?

Published Sat, May 11 2024 12:29 PM | Last Updated on Sun, May 12 2024 2:06 PM

Ksr Comments On The Difference In The Governance Of YS Jaganmohan Reddy And Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌మోహన్‌ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.

⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్‌మెంట్‌ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్‌లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.

⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.

⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.

⇒ ఆయన టైమ్‌లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్‌నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్‌లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్‌లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.

⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్‌మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన,  బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement