ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో, అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన గెలుస్తారా?ఓడతారా అన్నది పక్కన పెడితే, ఈ ఎన్నికలలో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడలేదని కొందరు చెబుతున్నారు. వివిద నియోజకవర్గాలలో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా, కుప్పంలో చంద్రబాబు తరపున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుప్పంలో వరసగా ఏడుసార్లు గెలిచి ఎనిమిదో సారి పోటీచేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే, వెనుకబడిన ప్రాంతం అయిన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలం అవుతున్నారు. అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ది విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారు.
సరిహద్దులోని తమిళనాడు, కర్నాటక గ్రామాలకు చెందినవారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ది పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్ధిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపి ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్సార్‌సీపీ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఈయనను ఢీకొట్టడానికి సిద్ధం అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17 వేల దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగానని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు.
తదుపరి ఆయన కుమారుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి భరత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, కుప్పం అభివృద్దిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైఎస్సార్‌సీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి ఒకటి, రెండుసార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెల, నెల రావడం ఆరంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు.
అదే టైమ్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి ఆడని పరిస్థితి కల్పించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప, గడపకు వెళ్లడం చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్‌లోనో, ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి, ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది.
తనకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని అప్పుడప్పుడు డైలాగులు చెప్పినా, ఆయనకు ఎప్పుడూ అంత ఆధిక్యత రాలేదు సరికదా! క్రమేపి తగ్గుతూ వచ్చింది. 2014లో నలభై ఎనిమిదివేల మెజార్టీ వస్తే 2019లో అది 30 వేలకు తగ్గింది. ఇప్పుడు దొంగ ఓట్లను మరింత తగ్గించగలగడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. స్థానిక ఎన్నికలలో టీడీపీ కన్నా వైఎస్సార్‌సీపీకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కొనసాగినా, ఆ ఓట్లను ప్రామాణికంగా తీసుకున్నా చంద్రబాబు ఓటమికి గురికాక తప్పదు. స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆయన శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది.
ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన. అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలికగా పోదని, ఆయా వర్గాలవారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు పదివేల రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తి అయ్యాక కొన్ని సర్వేలలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం కూడా ఉందని వార్తలు రావడం ఆయనకు, టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే.
స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్కు ఉందని తెలిసినా అక్కడే పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా? లేదా? అనే చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యూహం కానీ, వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలు కానీ సఫలం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు.
జగన్ అమలు చేసిన వివిద సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలు అయ్యాయి. దానివల్ల సుమారు రెండువేల కోట్ల మేర అక్కడి ప్రజలు లబ్దిపొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీనవర్గాలను వైఎస్సార్‌సీపీ బాగానే ఆకట్టుకుంది. దానికితోడు బీసీలలో రెండు బలమైన వర్గాలను వైఎస్సార్‌సీపీ తనవైపు తిప్పుకోగలిగింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుండడం ఆయనకు ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎన్నికలలో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు దొంగ ఓట్లు కూడా చాలావరకు వైదొలగడం గడ్డుగా మారింది. అయినప్పటికీ ఆయనకు ఉండే క్లౌట్ ఆయనకు ఉండవచ్చు. అందువల్లే చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా, మెజార్టీ బాగా తగ్గిపోతుందని అంచనాలు ఉన్నాయి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment