టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యూహకర్తలు రోజుకొక డైలాగు నేర్పి జనంమీదకు వదలుతున్నట్లు ఉన్నారు. వారు ఆ డైలాగును సరిగా చూసుకుంటున్నట్లు లేరు. దాంతో అవి ఒక్కోసారి ఎదురు తగులుతున్నాయి. తాజాగా రాతియుగం కావాలా? స్వర్ణయుగం కావాలా అని జనాన్ని ప్రశ్నించారు. నిజంగానే ఇది చాలా మంచి ప్రశ్న. చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనను, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను బెరీజు వేసుకుంటే ఎవరిది రాతియుగపు పాలనో, ఎవరిది స్వర్ణయుగపు పాలనో ఇట్టే తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు తన నలభైఐదేళ్ల రాజకీయంలో ఎన్నివందల సార్లు మాట మార్చారన్నదానిపై విశ్లేషిస్తే ఒక పెద్ద పరిశోధన గ్రంధం అవుతుంది. అదే జగన్ చెప్పారంటే చేస్తారంతే అన్నది జనం మాట.
దీనికి పూర్తి ఆధారాలు కూడా కనిపిస్తాయి. అందువల్లే ఏపీలో ప్రజలకు ఇది నిజంగానే స్వర్ణయుగ పాలనే అని చెప్పాలి. ఎన్నడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజల అవసరాలు తీర్చడం కోసం వారి ఇళ్ల వద్దకు వెళ్లినట్లు చూశామా! అది ప్రస్తుతం జగన్ పాలనలోనే కదా జరుగుతోంది ! వృద్దులకు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇతరులకు వివిధ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా వలంటీర్లే వెళ్లి ప్రజలకు అందించడం ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో అయినా జరుగుతోందా! అంతదాకా ఎందుకు చంద్రబాబు శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఏలుబడిలో ఇప్పుడు ఏమి జరిగింది? లక్షలాది మంది జనం కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలు వస్తాయో, రావో కాని, దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూలలో నిలబడి ఉండవలసి వచ్చిందే.
తీరా చూస్తే ఆ దరఖాస్తులు కొన్ని రోడ్డు మీద దొరికాయట. ఆ పరిస్థితి ఏపీలో జగన్ పాలనలో ఉందా? చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఎన్నడైనా వృద్దుల గురించి ఆలోచించారా? ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, రేషన్ వంటివి ఇళ్లకే ఇవ్వాలన్న ఆలోచన చేశారా? కాని జగన్ చెప్పారు. చేసి చూపించారు. అందుకే చంద్రబాబుది రాతియుగపు పాలన, జగన్‌ది స్వర్ణయుగపు పాలన అని వేరే చెప్పనవసరం లేదు. తానో విజనరీ అంటూ పిచ్చి పుస్తకాలు అచ్చేసి ప్రజలను మోసం చేయడం స్వర్ణయుగపు పాలన అని చంద్రబాబు చెప్పదలిస్తే చెప్పవచ్చు.
కాని ప్రజలు ఆయన టైమ్‌లో పడిన అవస్థల నేపధ్యంలోనే టీడీపీకి 23 సీట్లే వచ్చాయన్న సంగతి మర్చిపోయి ఎవరో రాసిచ్చిన డైలాగులు చెబితే సరిపోతుందా? ప్రజలు అంత పిచ్చివారా! జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద పేదల పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి గాను పదిహేనువేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే, దానిని కాపీ కొట్టిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఒక ఇంటిలో ఇద్దరు, ముగ్గురు పిల్లలకు ఇస్తానని ఎందుకు అంటున్నారు. జగన్ రాతియుగపు పాలన అయితే దానిని మరింత ఎక్కువగా ఇస్తానని చంద్రబాబు ఎందుకు చెబుతున్నారు? అంటే దీని అర్ధం.. జగన్‌ది స్వర్ణయుగం పాలన అని ఆయన కూడా ఒప్పుకున్నట్లే కదా! పైగా పిల్లలను ఎక్కువ మందిని కని రాతియుగంలోకి వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నారంటే అది ఆయన విజన్ అనుకోవాలి.
పోనీ ఆయన కాని, ఆయన కుమారుడు కాని ఎక్కువ మంది పిల్లలను కన్నారా అంటే లేదు. వేల కోట్ల అదిపతి ఒక్క పిల్లవాడితో సరిపెట్టుకుంటారట. పేదలు మాత్రం ఎక్కువ మంది పిల్లలను కని నానా పాట్లు పడాలట. అది ఆయన స్వర్ణయుగమా! ప్రభుత్వ స్కూళ్లలో జగన్ ఆంగ్ల మీడియం పెట్టి పేదలకు ఇంగ్లీష్ విద్య నేర్పడం చంద్రబాబు దృష్టిలో రాతియుగం అన్నమాట. అదే తన టైమ్లో అసలు ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదలివేస్తే అది స్వర్ణయుగపు పాలన అట. నాది ఒక సలహా.. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద అభివృద్ది చేసిన స్కూళ్లను చంద్రబాబు చూసి రావాలి. అక్కడ క్లాస్ రూమ్లలో ఉన్న టివిలు, డిజిటల్ క్లాస్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడిప్పుడే ఆంగ్లంలో మాట్లాడుతున్న పేద విద్యార్ధులను చూసి ఇది స్వర్ణయుగమో కాదో చంద్రబాబు చెప్పాలి.
చంద్రబాబు తన టైమ్లో అసలు ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోగా విద్య అన్నది ప్రైవేటు బాధ్యత అని చెప్పారే. మరి జగనేమన్నారు. 'విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత. పేదలందరికి చదువు అందాలి' అని చెప్పారు. దీనిని బట్టి అర్ధం కావడం లేదూ.. చంద్రబాబు పాలన ఎంత అద్వాన్నంగా సాగిందో! చంద్రబాబు టైమ్లో ఎన్నడైనా ఆరోగ్య సురక్షక్యాంపులు పెట్టి ప్రజలకు వైద్యసేవలు అందించారా? అలా ఎందుకు చేయలేదు అంటే ఆయనది రాతియుగపుపాలన కాబట్టి. జగన్ మొదటి నుంచి విద్యతో పాటు వైద్య రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నది వాస్తవం కాదా! అందుకే ఇది ప్రజలు మెచ్చిన పాలన అయింది.
కాకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా మాఫియా దీని మొత్తాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు కూడా రాతియుగం, స్వర్ణయుగం అంటూ పోలిక తెచ్చి సెల్ఫో గోల్ వేసుకున్నారు. జగన్ తనపాలనలో చేయూత కింద అర్హులైన మహిళలకు 18500 రూపాయలు ఇస్తున్నారు. వారికి కార్పొరేట్ కంపెనీలతో టై అప్ పెట్టి స్వయంఉపాధిని ప్రోత్సహిస్తున్నారు.
అప్పట్లో ఈ స్కీమును విమర్శించిన టీడీపీ నేతలు, ఇప్పుడు తాము నెలకు 1500 చొప్పున ఇస్తామని, మహిళలందరికి ఇస్తామని ఎలా చెబుతున్నారు? అంటే జగన్ స్వర్ణయుగాన్ని కాపీ కొట్టడమే కదా! 'పాలన వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రాతియుగం అవుతుందా? లేక కిలోమీటర్ల కొద్ది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం రాతి యుగం అవుతుందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలందిస్తే స్వర్ణయుగం అవుతుందా? లేక చంద్రబాబు టైమ్లో మాదిరి రుణమాపీ హామీ ఇచ్చి రైతులను గాలికి వదలివేయడం స్వర్ణయుగం అవుతుందా!' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
స్థూలంగా చూస్తే జగన్ టైమ్ నిజంగానే ప్రలకు, ముఖ్యంగా పేదలకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. చంద్రబాబు పాలన మాత్రం కచ్చితంగా స్టోన్ పీరియడే అవుతుంది. అభివృద్ది గురించి చూద్దాం. ఎక్కడి దాకా ఎందుకు! విజయవాడ తీసుకోండి.. కనకదుర్గమ్మ గుడి వద్ద, బెంజ్ సెంటర్ వద్ద భారీ వంతెనలను పూర్తి చేసింది జగనే కదా! చంద్రబాబు కనీసం పట్టించుకోని కృష్ణలంక ప్రాంతంలో చైనా గోడ మాదిరి ఎంత పెద్ద రక్షణ గోడ నిర్మిస్తున్నారు! దీంతో ఆ ప్రాంతంలోని వేలాది మందికి ముంపు బాధను తీర్చింది ఐదేళ్ల జగన్ పాలనా? లేక పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనా? అందుకే జగనది స్వర్ణయుగం అని విజయవాడ వాసులు భావిస్తారు.
విజయవాడ స్వరాజ్ మైదానాన్ని చైనా మాల్‌కు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటే, అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహంతో పాటు బ్రహ్మాండమైనరీతిలో టూరిస్టు కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. దీనిని కదా స్వర్ణయుగం అనాల్సింది. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, మూడు నియోజకవర్గాలలోని వందలాది గ్రామాలకు సురక్షిత నీరు ఇచ్చిన జగన్ది స్వర్ణయుగం అవుతుంది కాని, అసలు వారి సమస్యలనే పట్టించుకోని చంద్రబాబుది స్వర్ణయుగం అని చెప్పుకుంటే సిగ్గుచేటు.
చంద్రబాబు అంత కాలం పాలించి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాకపోతే, జగన్ పదిహేడు కాలేజీలు తేవడం, ఐదింటిని నిర్మించడం, మరో ఐదింటిని తయారు చేయడం.. దీనిని కదా స్వర్ణయుగం అని అనాల్సింది. నాలుగు పోర్టులు, తొమ్మిది షిఫింగ్ హార్బర్లు నిర్మాణం చేసిన జగన్ని కదా స్వర్ణయుగ కధనాయకుడు అని అనాల్సింది.
'నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ తెచ్చింది ఎవరు? లక్ష మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేసిందెవరు? అవుకు రెండో టన్నెల్ను పూర్తి చేసింది ఎవరు? పోలవరంలోని నలభై ఎనిమిది గేట్లను ఏర్పాటు చేసింది ఎవరు? వెలిగొండ మొదటి టన్నెల్ను పూర్తి చేసి, రెండో టన్నెల్ను దాదాపు పూర్తి చేసింది ఎవరు? కొప్పర్తి పారిశ్రామికవాడను తెస్తున్నదెవరు? రామాయంపట్నం ఇండోసోల్ ఇండస్ట్రీని తేవడానికి సంకల్పించింది ఎవరు? ఈనాడు వంటి మీడియా మాఫియాగా మారి వీటిని ఎంత చెడగొట్టాలని చూసినా, వాటిని ఎదుర్కుంటూ ముందుకు తీసుకువెళుతున్న జగన్ది స్వర్ణపాలన అవుతుంది.
కేవలం ఎల్లోమీడియాతో పిచ్చ ప్రచారం చేసుకుంటూ జనం రాతియుగంలో ఉన్నారులే అని భ్రమించి ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోబట్టే వారు చంద్రబాబు పాలనకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇంత జరిగినా మళ్లీ రాతియుగం, స్వర్ణయుగం అంటూ పోలికలతో స్పీచ్‌లు, ఇలా ఉపన్యాసాలు ఇవ్వడానికి కాస్త అయినా ఇంగితం ఉండాలి. అసలు నలభైదేళ్ల సీనియర్ అయిన చంద్రబాబు ఎవరో రాసిచ్చిన డైలాగులు చదివే దుస్థితిలో ఉన్నారంటేనే అర్ధం ఆయన రాతియుగతం మనస్తత్వంలో ఉన్నారన్నమాట.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment